ఏకాంతి 

ఒకే ఒక్క రహస్య సఖి
నా అంతర్‌ నేత్రం
ఏకాంతం !

 

క్కో ఊచా తెంచి నింగిలోకి ఎగిరినట్లు

గాలం నుంచి విదుల్చుకొని

చెరువులోకి చేరినట్లు

ఎన్నో సౌఖ్యాలను భవబంధాలను తప్పించుకొని

కూడబెట్టుకుంటుంటాను

ఏకాంతాన్ని

 

ఇష్టం లేకున్నా అబద్ధాలాడుతుంటా

అక్కరకు రాని కష్టం పడుతుంటా

పస్తులుంటా పరేషాన్లు కొనితెచ్చుకుంటా

అవసరం లేనిచోట్లకి పయనిస్తుంటా

నిద్దర రాకున్నా పడుకునుంటా

ఏరి కోరి కూర్చుకుంటాను

ఏకాంతాన్ని

ఈతి బాధలు ముక్కలు చేసినప్పుడల్లా

ఏకాంతాన్ని ఆశ్రయించి

నన్ను నేను కూడగట్టుకుంటుంటాను

 

ఏకాంతం నాకు

అష్ట దేవతల ఏకరూపం

జడలు విప్పుకున్న నెత్తి

విడిపోయిన పాయల డెల్టా

మనసు పురివిప్పి ఆడే నెమలి

పెద్దపులి దెబ్బలతో అడుగులేసే డప్పు

కొండ శిఖరం నుంచి శూన్యంలోకి గొంతెత్తే పాట

-ఒక్కోసారి ఊళ

 

పొట్టలోకి ముడుచుకుని పడుకునే కుక్కపిల్ల

సోమరిగా కదులుతుండే సముద్రం

మబ్బుల్ని విద్చుకోడం ఇష్టపడని చందమామ

 

నా దేహాన్ని వాడుకోనీ..

నా ఉద్యోగం ఊడపీకెయ్‌ నీ..

ఆస్తిపాస్తుల్‌ లాక్కోనీ..

అష్టైశ్వర్యాల్‌ ఉడిగిపోనీ..

బస్‌

నాకు ఏకాంతం చాలు !

 

నాలో నీకు విలువైందనిపించే దేదైనా లాక్కో

నీకు పైసా విలువ చేయని ఏకాంతాన్ని నాకు వదులు

 

అసందర్భ ప్రసంగాలో ప్రగల్భాలో వద్దు

వింటున్నట్టు నటించలేను

నన్ను ఏకాంతానికి వదిలెయ్‌ !

 

ఏకాంతం నా ప్రియసఖి

నన్ను నడిపించే దార్శనిక

నన్ను ఉరకలెత్తించే జీవనాడి

 

అమ్మ గర్భం ఉమ్మ నీటిలో

నాతో నేను

ఏకాంతంగా కొనసాగించిన సంభాషణ

నాలోలోన ఇంకా నడుస్తూనే ఉంది

నాలో కథలుగా నవలలుగా

గొలుసుకట్టేదో కొనసాగుతూనే వుంది

 

బడికి కాలిబాటన నడిచినప్పుడల్లా

సైకిల్‌ మీదో బండి మీదో ఒంటరిగా పోతున్నప్పుడల్లా

ఏకాంత సంభాషణ నడుస్తూనే వుంటుంది నాలో

 

నా గరీబీని అవమానించి నప్పుడల్లా..

ఎదుటివాడిలో అహంకారం పొరలినప్పుడల్లా

నేను ‘సభ్యసామాజికుడిని’ కానని తేల్చినప్పుడల్లా

చుట్టాలు నన్నొక పనికిమాలిన వాడిగా గుసగుసలాడినప్పుడల్లా

నాలో వెలిగేది ఏకాంతం !

 

ఏకాంతం

నాలో నన్ను గిరగిరా తిప్పి వదిలే ఉండేలు

నాతో నన్నే రాచి నిప్పంటించే జెకముక

నాకు మాత్రమే నచ్చే రజనుని లాగి పెట్టే అయస్కాంతం

నన్ను నన్నుగా నిలబెట్టే గురుత్వాకర్షిణి

 

పట్నంల దిగి ఒంటరిగా

ఊరికి నడుస్తున్నప్పటి ఏకాంతం

లోకమంతా నిద్దరోతున్న అద్దరాతిరి

వెల్లకిలా బోర్లా అటు మళ్ళి ఇటు మళ్ళి

ఓహ్..

నన్ను నేను ఖుపస్‌ కునే.. జాడించే ఏకాంతం

 

ఏకాంతం కోసం ఎందరిని వొదులుకున్నానో

ఎన్నింటిని కాదన్నుకున్నానో

‘ఈ లోకానిక్కావలసిన క్వాలిఫికేషన్స్‌ ఎన్నింటిని తగలబెట్టుకున్నానో..’

 

కంటిలో ఊరే అమ్మో చెల్లో బిడ్డో

కారిపోకుండా అలా ఇంకిపోవడం..

 

భగ్న ప్రేయసి యాది

గుండెల్లో ఏ మందుకూ లొంగని నొప్పి అవడం..

 

ఎవరి పరిష్వంగమైనా ఏదో కోరుతుంది

నా నుంచి ఏమీ ఆశించనిది ఏకాంతమే !

 

నా పసి పాదాల నుంచీ

శాశ్వత నిద్ర దాకా

వంద రకాలుగా నేను ఛిద్రమై ఉన్నప్పుడల్లా

నన్ను లాలించే విరామ మెరుగని జోలపాట

 

నన్ను సర్వాంగంగా సమర్పించుకునే ఇష్టదేవత

నేనెలా ఉన్నా సరే

చంకనెత్తుకుని లోకాలన్నీ తిప్పుకొచ్చే మూలపుటమ్మ

 

నన్ను ఏకరూపుగా మలిచే బహురూపి

మహా కార్యంగా మిగుల్చుకుంటున్న

ఒకే ఒక్క రహస్య సఖి

నా అంతర్‌ నేత్రం

ఏకాంతం !

 

*

 

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

 

స్కైబాబ

22 comments

Leave a Reply to స్కైబాబ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎవరి పరిష్వంగమైనా ఏదో కోరుతుంది

    నా నుంచి ఏమీ ఆశించనిది ఏకాంతమే !…. నన్ను నేను గా గుర్తించుకునే ఏకైక స్థితి…ఏకాంతమే <3

  • మీ ఏకాంత సంపదను దోచుకొని నా అసందర్భవ్యాఖ్య చేసే సాహసం నేను చేయను మీ అంతర్నేత్రంతో ఆనందిచండి

  • కవితా చాలా బాగుంది.

    అసలు మనిషిని ఆవిష్కరించేది ఏకాంతం మాత్రమే.

  • గొప్ప వ్యక్తీకరణ… ఏకాంతాన్ని ఎత్తి గుండెల మీద కూర్చోబెట్టారు.

  • ఒకే ఒక్క రహస్య సఖి

    నా అంతర్‌ నేత్రం

    ఏకాంతం !…బావుంది స్కై..నీ ఏకాంతం. ఒక్కసారిగా గుండెను విదిల్చినప్పుడు ఇలాగే టపటపా రాలిపడతాయి వాక్యాలు. గుడ్..

  • “అసందర్భ ప్రసంగాలో ప్రగల్భాలో వద్దు
    వింటున్నట్టు నటించలేను
    నన్ను ఏకాంతానికి వదిలెయ్‌!”

    Absolutely! వినీ, వింటున్నట్టు నటించీ అలసి పోయిన. బోరు కొట్టింది. ఇగ సాలు, ప్రపంచమా, నన్నొదిలెయ్! 🙏🏼

  • ఏకాంతంలో సాంత్వన పొందిన కవిత. స్కైబాబ గారు, అభినందనలు

    • అవును కదా మౌళి!
      కాకపోతే ఎన్ని ఆత్మగీతాలో నాలో అనిపించింది నీ కామెంట్ చూశాక!
      ఏకాంతి.. జిగ్రీదోస్త్ (చీకటి).. నిద్రించిన తావునే మరోమారు నిద్రించకు.. నమ్మకం కనుపాపపై మొలిచే పువ్వు.. ఐ.. అంటర్నేత్ర నిఘా.. ఇలా ఎన్నో నా కవితలు !!!

  • మనకు మనమేందో తెలుసుకోవాలంటే ఏకాంతం అవసరం….చక్కగా చెప్పారు అన్నా…

  • ఏకాంతం బాగుంది ….నన్ను లాలించే విరామ మెరుగని జోలపాట అద్భుతం

  • ఏకాంతం ఆనందమే
    ఏకాంతమే అనివార్యమైతే
    ఆనందం ఆశృవులై
    పలకరింస్తాయి…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు