ఏకగ్రీవం అనే ఒక కుట్ర కథ

“ రాజకీయం అంటే అంతే తమ్ముడా. అనేక కుట్రలు ఉంటయి. వెన్నుపోట్లు ఉంటయి. నమ్మక ద్రోహాలు ఉంటాయి. అన్నిటిని తట్టుకుని నిలబడి పోరాడితేనే మన బహుజనులం అధికారానికి చేరుకుంటం.”

 “ఇగో పరమేశా. మన ఊరు సర్పంచ్ కోసం జరగబోయే  ఎలక్షన్ లో…..ఈ సారి జనరల్ అని వచ్చింది. రిజర్వేషన్ అంటే మీలాంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు… మరి జనరల్ అంటే  ఎవరూ.. మాలాంటి  పై కులపోళ్లే కదా. మీ రిజర్వేషన్ వచ్చినపుడు మీరు తీస్కుంటున్నరు. మళ్ల మధ్యలో పొరపాటున లేడీస్ రిజర్వేషన్ వస్తే ఛాన్స్ వాళ్లకు పోతుండె. ఇన్నాళ్లకు రాక రాక మా జనరల్ వాళ్లకు వచ్చింది. ఈ సారి మాకు వదిలిపెట్టండి. ఇదంతా మీ అంబేద్కర్ రాసిన ప్రకారమే జరుగుతోంది కదా…మీరే కాదంటే ఎలా..?”

వెంకటాపురం గ్రామ పెద్ద అనే పటేల్ నర్సిరెడ్డి చెప్పుతున్న ఆ మాటలు వింటే అక్కడే ఉన్న చాకలోళ్ల ఉప్పలయ్యకు నవ్వాలనో, ఏడవాలనో అర్థం కాలేదు. జనరల్ అంటే అందరు అని కాకుండా….కేవలం అగ్రకులాలం అని చెప్పుకునే కొన్ని ఆధిపత్య కులాల కోసమే అనుకుంటున్నడు పటేల్ నర్సిరెడ్డి. ఆ అభిప్రాయం ఒక్కనర్సిరెడ్డిదే కాదు….వెంకటాపురం లాంటి చిన్న పల్లెటూరి నుంచి… ఢిల్లీలో పార్లమెంటు దాకా చాలామంది అదే అనుకుంటున్నరు.

వాస్తవానికి ఎప్పుడో మూడేళ్ల క్రితం జరగాల్సిన గ్రామ సర్పంచ్ ఎన్నికలు. ఇన్నేళ్ల తర్వాత ఆలస్యంగా నోటిఫికేషన్ వచ్చింది. ఆ సర్పంచి రిజర్వేషన్ రొటేషన్ ప్రకారం ఈసారి జనరల్ కోటాకి వచ్చింది. అందుకే సర్పంచ్ గా ఎవరు పోటీ చేయాలి అనే విషయం మీద ఆ ఊరి జనమంత ఊరి గ్రామ పంచాయతీ ఆఫీసు దగ్గర కూచోని మాట్లాడుకుంటున్నరు.

అన్ని ఊళ్లలాగే ఆ ఊళ్లోనూ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ…ఇలా అన్ని పార్టీల మనుషులూ ఉన్నారు. ఎంపీ ఎలక్షన్ లో, ఎమ్మేల్యే ఎలక్షన్ లో ఐతే….ఎవరి ప్రచారం వాళ్లు చేసుకుంటారు. కానీ సర్పంచి ఎలక్షన్ విషయంలో మాత్రం పటేల్ నర్సిరెడ్డి ఎంత చెపితే అంత.

“అట్ల ఎట్లా పటేలా… ఈ ఊళ్లో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు.  ఎస్సీలు ఉన్నారు. పది కుటుంబాల దాకా ఎరకలోళ్లు, యానాదోళ్లు అంటే ఎస్టీలు ఉన్నరు. మరి మీ పై కులపోళ్లవి అన్ని కలిపితే పది ఇండ్లు లేవు. న్యాయం ప్రకారమైతే సర్పంచి పదవి…. ఎక్కువ మంది ఉన్నోళ్లకి కదా. ఇయ్యాలె. మీరే న్యాయం చెప్పాలె..” అడిగిండు మంగలోళ్ల పరమేశం.

“అట్లైతే మరి ఎస్సీలు వచ్చినపుడు మీరే, బీసీలు వచ్చినపుడు మీరే పోటీ చేసి జనరల్ వచ్చినపుడు కూడా మీరే పోటీ చేస్తే మరి మేం ఎప్పుడు పోటీ చేయాలెరా. మాకు వద్దా అధికారం. మీకు వచ్చినపుడు మేం అడ్డురాట్లేదు కదా. అలాగే జనరల్ వచ్చినపుడు మీరు మాకు అడ్డురాకూడదు….” తనకు నచ్చిన  కొత్త పోలిటికల్  సిద్దాంతం చెప్పాడు పటేల్ నర్సిరెడ్డి.

పటేల్ నర్సిరెడ్డి అంటే ఆ ఊరిలో పటేల్ పేరుతో ఏ పదవీ లేదు. ఆయన గతంలో కూడా ఎన్నడూ పటేల్ తనమూ చేయలేదు. పోనీ వల్లభాయ్ పటేల్ కు బంధువా అంటే అదీ కాదు. ఐనా ఊరివాళ్లు పటేల్ అని పిలుస్తారు. ఆయన భార్యను పటేలమ్మ అని పిలుస్తారు. అంతే కాదు ఆయన కొడుకును కూడా చిన్న పటేల్ పిలుస్తారు. అసలు పటేల్ అంటే అర్థమేమిటో…. ఆయన ఎట్లా పటేలో పిలిచేటోళ్లకు తెలియదు. పిలిపించుకునే నర్సిరెడ్డి పటేల్ కూ తెలియదు.

“అట్ల కాదు పటేలా. ఆ చాకలోళ్ల ఉప్పలయ్య ఉస్మానియా క్యాంపస్ ల సదువుకున్న పిల్లగాడు. చాలా రోజుల నుంచీ జనం కోసం పని చేస్తున్నడు. అందుకని ఈ సారి మన ఊరికి సదువుకున్న పిలగాన్ని, మంచోన్ని సర్పంచ్ చేద్దాం అని నేను అడుగుతున్న. మీరు కూడా సపోట్ చేయాలె….” తన ఉద్దేశం బయట పెట్టినడు మంగలోళ్ల పరమేశం.

మంగలోళ్ల పరమేశం అంటే ఆ ఊరిలో చిన్నపాటి లీడర్. బతుకు తెరువు కోసం  ఆ ఊరి గ్రామ పంచాయతీ పక్కన ఉన్న రావి చెట్టు కింద కటింగ్ షాప్ పెట్టుకున్నడు. ఊరి జనమంతా పొద్దున్నే పరమేశం షాపు దగ్గరకి వస్తరు. జుట్టు కటింగ్ కోసం వచ్చేది ఇద్దరు ముగ్గురైతే న్యూస్ పేపర్ సదవడానికి వచ్చే వాళ్లు చాలామంది.  పరమేశానికి ఊరి  రాజకీయాలు అన్నా, ప్రపంచంలో జరిగే విషయాలు అన్నా చాలా ఆసక్తి. అందుకే తన షాపు కోసం రెండు తెలుగు న్యూస్ పేపర్లు తెప్పిస్తాడు. అలాగే తన షాపులో ఉన్న టీవీలో ఎప్పుడూ న్యూస్ ఛానెళ్లు పెడతడు. కటింగ్ కి వచ్చిన వాళ్లతో ఏదో ఒక రాజకీయం గురించి మాట్లాడుతూనే ఉంటాడు. బీసీలు, ఎస్సీలు,ఎస్సీలు, మైనారిటీలు అందరినీ కలిపి బహుజనులు అంటారు అని…అలా బహుజనులు అంతా ఒక్కమాట మీద ఉండాలని, కలిసి పోరాడాలని చెపుతుంటడు. మారోజు వీరన్న గురించి చెపుతడు. వీరన్న, సిద్దాంతాలు పాటలు పాడుతుంటడు. ఒక రకంగా పరమేశం కటింగ్ షాపు అంటే ఆ ఊళ్లో పార్లమెంట్ లాంటిది. ఆ షాపు దగ్గర గంట సేపు కూచుంటే చాలు.  ఊళ్లో జరిగే విషయాలన్ని తెలిసిపోతయి.

మన ఊరు బాగుపడాలంటే సదువుకున్న సర్పంచి ఉండాలే. అందుకని ఈ సారి మన ఊళ్లో పీజీ చదివిన చాకలోళ్ల ఉప్పలయ్యని సర్పంచిగా పెడదాం అని షాపు దగ్గరికి వచ్చిన వాళ్లందరికీ ఆరు నెల్ల ముందునుంచే చెపుతున్నాడు పరమేశం. ఎవరైనా తనకు సర్పంచి పదవి కావాలని అంటరు. కానీ పరమేశం ఉప్పలయ్య కోసం ఎందుకు అడుగుతున్నడు అంటే…ఉప్పలయ్య సదువుకున్నడు, ఊరికోసం పని చేస్తున్నడు  అని పరమేశానికి నమ్మకం కుదిరింది. సదువుకున్న యువకులు ఊరి కోసం పనిచేస్తే ఊరు బాగుపడుతుంది అని పరమేశం మొదటి నుంచీ నమ్ముతడు.

***

ఉప్పలయ్య చాకలోళ్ల పిలగాడు. ఊరి వాళ్ల బట్టలు ఉతికి పొట్ట పోసుకునే కుటుంబం వాళ్లది. ఉప్పలయ్యకు పదేళ్ల వయసులో  తండ్రి…బట్టలు ఉతకడానికి బాయిలోకి దిగుతూ జారి… బండమీద పడి చనిపోయాడు. ఉప్పలయ్యను తల్లే ఊరి వాళ్ల బట్టలు ఉతుకుతూ…నానా కష్టాలు పడి చదివించింది. అట్ల ఉస్మానియా యూనివర్శిటిలో ఎమ్మే పొలిటికల్ సైన్స్ చదివిండు ఉప్పలయ్య. తన లాంటి వారి జీవితాలు బాగుపడాలంటే….ఎస్. ఆర్. శంకరన్ సార్ ఆదర్శంగా తీసుకుని మంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అనుకున్నడు. కానీ సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీకి పొయ్యి చదివేంత స్తోమత తనకు లేదు. అందుకని గ్రూప్ వన్ పరీక్ష రాసినా మంచి ఆఫీసర్ కావచ్చని , భవిష్యత్ లో  ప్రమోషన్ తోని ఐఎఎస్ కూడా కావచ్చని తెలుసుకున్నడు. అందుకే  గ్రూప్ వన్ పరీక్ష కోసం పగలూ, రాత్రి కష్టపడి చదివి ప్రిపేరయ్యాడు.

హైదరాబాద్ లో పేద ప్రజల కోసం గవర్నమెంట్ … రోడ్డు పక్కన  క్యాంటీన్ లో పెట్టే ఐదు రూపాయల భోజనం తింటూ…యూనివర్శిటీ పార్కులోనో,  చిక్కడపల్లి లైబ్రరీలోనో చదువుకునేవాడు. రాత్రి ఫ్రెండ్స్ రూంలో పడుకునేవాడు.

జాబ్ నోటిఫికేషన్ లో ఉన్న లొసుగులు, ఎగ్జామ్ పెట్టడంలో నిర్లక్ష్యం, హాల్ టికెట్లలో తప్పులు…..ఇట్లా అనేక కారణాలతోని  ఒకటి కాదు రెండు కాదు….నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్ష పెట్టడానికే ఆరేళ్లు పట్టింది.  రెండు గవర్నమెంట్లు మారిపోయి… పాత ఎమ్మేల్యేల స్థానంలో కొత్త ఎమ్మేల్యేలు వచ్చారు కానీ ఉద్యోగాలు మాత్రం భర్తీ కాలేదు.

అలా గ్రూప్ వన్ పరీక్ష ఏళ్లకు ఏళ్లు…ఎంతకాలమైనా హనుమంతుడి తోకలా సాగిపోతుందే తప్ప ఒక ముగింపుకు రాలేదు. కోర్టులో కేసు కూడా వేశారు.  కింది కోర్టు నుంచి హై కోర్టుకు, హై కోర్టు నుంచి సుప్రీం కోర్టుకు..వాయిదాల మీద వాయిదాలు. ఇలా ఏండ్లు గడుస్తున్నా ఆ కేసు తెగడం లేదు. కేసు పరిష్కారమై ఉద్యోగాలు రావడానికి ఇంకెన్నాళ్లు అవుతుందో ఎవరికీ తెలియదు. ఇక సిటీలో ఎన్ని రోజులు ఉంటామని ఊరికి వచ్చాడు ఉప్పలయ్య.

ఇంతకాలం ఉద్యోగానికి చదవడం కోసం, హైదరాబాద్ లోనే ఉంటూ ఊరి గురించి పట్టించుకోలేదు. అట్ల చాలాకాలం తర్వాత ఊరికి వచ్చి చూస్తే… ఎక్కడ చూసినా సమస్యలే.

ఏ వాడలో చూసినా మురికి కాల్వలు జీవనదుల్లా పొంగిపొర్లుతున్నయి. రాత్రి పూట లైట్లు వెలగవు. ఊరి స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడానికి పంతుళ్లు లేరు.  అసలు ఊరిని పట్టించుకున్న నాథుడే లేడు. చూడబోతే దేశం కంటే ఊరులోనే ఎక్కువగా సమస్యలు ఉన్నాయా అనిపించింది.  ఊరు  ఎందుకు ఇలా ఉందీ అని ఆరాతీస్తే…. ఊరిలో సర్పంచి ఎన్నికలు జరగక రెండు సంవత్సరాలు దాటింది. ఎన్నికలు ఎందుకు జరగడం లేదూ అంటే… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  తమ పార్టీకి అనుకూలంగా పరిస్థితులు లేవని అధికార పార్టీ అనుకుంటోంది. అందుకే తమకు అనుకూల పరిస్థితులు వచ్చేదాకా ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చారు. అలా వాయిదాలు వేస్తూ, వేస్తూ….సంవత్సరాలు గడిసిపోతున్నాయి. అలాగని ఊళ్లలో బొత్తిగా పరిపాలన లేకపోతే కష్టం కాబట్టి, ఇంటి పన్నులూ అవి వసూలు చేయడం కోసం మాత్రం…. తాత్కాలికంగా ఆఫీసర్లకు ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించారు. మొత్తానికి  సర్పంచులు లేని ఊళ్లు …ఊరి బయట బస్సులు ఆగని బస్టాపుల్లా…. పట్టించుకునే నాథుడు లేకుండా పోయాయి.

గ్రామంలో పరిస్థితులు చూసి  చూసీ….ఓ రోజు ఆవేశం తట్టుకోలేక “కనీసం ఊరి నల్లాలైనా రిపేరి చేయించండి”… అని స్పెషల్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి అడిగాడు ఉప్పలయ్య.

“నిన్ను చూస్తే సంతోషంగా ఉంది తమ్ముడూ. ఇప్పటి వరకూ నా దగ్గరకు వచ్చిన వాళ్లంతా…. నాకు పెన్షన్ కావాలనో… నాకు ఇల్లు కావాలనో  సొంత పని కోసం వచ్చిన వాళ్లే తప్ప,  ఊరి కోసం ఫలానా పని చేయండి అంటూ ఎవడూ రాలేదు. నీలాంటి వాడిని చూస్తే సంతోషంగా ఉంది. ఐతే బాధాకరమైన సంగతి ఏమిటంటే గౌరవనీయ గవర్మెంట్ నాకు ఇంఛార్జి పదవి ఇచ్చింది ఒక్క మీ ఊరికే కాదు. ఇంకో ఐదు ఊర్లు కూడా  నాకు కట్టబెట్టారు.. పేరుకే ఇంచార్జి అని రాసి ఇచ్చారు తప్ప….ఆ ఊరి కోసం నేను ఏఏ పనులు చేయాలో, ఆ ఊరికి నాకూ అసలు  సంబంధమేమిటో మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

అసలు  ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో, ఎలా ఉన్నాయో అని ఒకసారి చూసి రావడానికి…. బండిలో పెట్రోల్ కి నా జీతం సరిపోదు.  పైగా నాకు వచ్చే జీతమూ నెలనెలా రాదు. ఇప్పుడు ఉద్యోగస్తులకు నెలనెలా జీతాలు ఇయ్యడానికే గవర్మెంట్ దగ్గర డబ్బులు లేవంట.  ఇంగ డెవలప్ మెంట్ కోసం డబ్బులు యాడికెల్లి ఇస్తది.

ఆగస్టు పదిహేనుకు, జనవరి ఇరవయ్యారు జెండా పండుగలకు, పై ఆఫీసర్లు విజిటింగ్ కి వచ్చినపుడు పెట్టే భోజనాలకి, మీటింగ్  మైక్ సెట్లకోసం నా సొంత డబ్బులు నేను ఖర్సు పెడుతున్నా. ఇంగ ఐదు ఊర్లకు మురికి కాల్వలు ఏడ తీయిస్త. పంట కాలువలు తవ్విస్త.  నాకు గిట్ల పెండ్లం పిల్లలు ఉంటరు కద తమ్మీ….” గ్రామాల్లో జరుగుతున్న ప్రజాపరిపాలన మొత్తం ఐదు నిమిషాల్లో సినిమాలాగా చూపించాడు  స్పెషల్ ఆఫీసర్. ఉప్పలయ్యకు అంతా అర్థమైంది.

“మళ్ల ఈ ఊర్లు ఎట్ల బాగుపడాలె సార్”… ఆవేదనగా అడిగాడు ఉప్పలయ్య.

“అధికార పార్టికి అనుకూల పరిస్థితులు రావాలి. మేమే గెలుస్తాం అనే నమ్మకం కలుగాలె. అప్పుడే ఎన్నికలు జరుగుతయి. కొత్తగా సర్పంచులు వస్తరు. గ్రామాలకు  ఫండ్ వస్తది. అవి వస్తెనే….ఊళ్లల్ల పనులు అయితయి.  అప్పటిదాకా…జనాలు బోనాల పండుగ, బొడ్రాయి పండుగలు చేసుకోవాల్సిందే” అని చేతులెత్తేశాడు స్పెషల్ ఆఫీసర్.

“ఐనా మీ అసోంటోళ్లు ఐద్రాబాదుల క్యాంపస్ ల కూసోని …..ఏడాదికి ఒకపాలి వచ్చి మస్తు ముచ్చట్లు చెపుతరు. పుస్తకాలల్ల ఉన్నది సదివి అదే బయట ప్రపంచంల జరుగుతంది అనుకుంటరు. పుస్తకాలకు, బయట ప్రపంచానికి చాలా తేడా ఉంటది తమ్మీ. నీలాంటోళ్లు ఉద్యోగాల పేరుతోని పదేండ్లు పదిహేనేండ్లు కోచింగ్ పేరుతోని టైం అంత వేస్ట్ చేస్తుంటే…. ఊళ్లు ఎట్ల బాగుపడతయి. సదువుకున్నోళ్లు సిటీకి పోతుంటే… సదువురానోళ్లు, పనికిరానోండ్లు సర్పంచులు, ఎంపీటీసీలు అవుతున్నరు. అందుకే నీలాంటోళ్లు ఊరి గురించి కూడా పట్టించుకోవాలె….” హితబోధ చేసిండు స్పెషల్ ఆఫీసర్.

ఆ రోజు స్పెషల్ ఆఫీసర్ చెప్పిన మాటలు చాలా ప్రభావం చేసినయి ఉప్పలయ్యను. హైద్రాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ గానీ, వరంగల్ కాకతీయ యూనివర్శిటీల కానీ….ఇంక చాలా యూనివర్శిటీల్లో, కోచింగ్ సెంటర్లల్లో…. వేలమంది ఉంటున్నరు. గవుర్మెంటుదో, ప్రైవేటుదో ఉద్యోగం కోసం సిటీల్లోనే ఉండిపోతున్నరు. ఊళ్లె ఏం జరుగుతున్నదో పట్టించుకోవడం లేదు. అందుకనే  ఊళ్లు పడావుబడిన శివాలయాల్లా మారిపోయినయి. శివరాత్రినాడు తప్ప శివాలయానికి ఎవడూ పోడు. అట్లనే చదువుకున్న యువకులు కూడా  ఏ పండగకో, కార్యానికో తప్ప ఊరికి పోవడం లేదు. పోయినా ఊరి గురించి పట్టించుకోవడం లేదు.

అందుకే కలెక్టరయ్యి దేశాన్ని బాగు చేయలేక పోయినా… కనీసం సర్పంచి అయ్యి తన ఊరినైనా బాగుచెయ్యాలి  అనుకున్నడు ఉప్పలయ్య. ఎన్నికలు జరిగితే సర్పంచిగ పోటీ చెయ్యడానికి సిద్ధమైనడు. ఊళ్లో జనాలకు ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు ఇయ్యాలన్నా, ఫించన్ కోసం తిరగాలన్నా వాళ్ల పని ఉప్పలయ్యే చేసేటోడు. ఊరి బడిలో రోజూ ఒక పూట స్కూలుకు పోయి పిల్లలకు లెక్కలు చెప్పేటోడు.

ఉప్పలయ్య పని తీరు చూసి ఊరి జనం వచ్చే ఎన్నికల్లో తప్పకుండా సర్పంచిని చేయాలి అనుకున్నరు. అట్లనే కటింగ్ షాపు పరమేశం కూడా ఉప్పలయ్యకు సపోర్టుగా నిలబడ్డడు.

మొత్తానికి ఎదురు చూడగా, చూడగా….. రెండేళ్ల తర్వాత సర్పంచి ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చింది కానీ…సర్పంచి పదవికి రిజర్వేషన్ మాత్రం జనరల్ గా వచ్చింది. అట్ల జనరల్ కి రావడంతో పై కులాల వాళ్లు….జనరల్ అంటే మేం మాత్రమే పోటీ చేస్తాం వాదన మొదలు పెట్టిండ్రు. ఇట్ల కాదు కానీ….ఊరంత కలిసి ఒక దగ్గర కూచొని మాట్లాడుకుందాం అని ఆ రోజు పంచాయతీ ఆఫీసు దగ్గర మీటింగ్ పెట్టినరు.

***

“అందరూ పల్లకిలో కూచుంటం అంటే మరి మోసేది ఎవరు….అట్ల అందరూ సర్పంచి  కావాలి అంటే కుదురతదా. అట్ల కాదు గానీ….అందరూ నా మాట మీద ఒక మనిషిని ఎన్నుకుందాం.  ఒక్కమాట మీద ఏకగ్రీవంగా సర్పంచిని చేద్దాం.”

“ఎవల్నో సర్పంచిని చేస్తే మాకేమొస్తది పటేలా…” ఆరి పోయిన చుట్టను మళ్లీ ముట్టిస్తూ అడిగిండు ఒక పెద్దమనిషి.

“అదే చెపుతున్నా. ముందుగా మీకు ఏం కావాలో చెప్పండి. వాటికి ఎంత ఖర్చు అవుతుందో లెక్క వేద్దాం. బహిరంగంగా వేలంపాట పాడదాం. ఎవలు ఎక్కువ డబ్బుకు వేలం పాడితే వాళ్లను ఏకగ్రీవంగా సర్పంచిని చేద్దాం…..” కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు పటేల్ నర్సిరెడ్డి. అలా ఏకగ్రీవం పేరుతో సర్పంచి పదవిని బహిరంగంగా అమ్మకానికి పెట్టాడు.

“ఎవరికేమి కావాలో మాకు తెలియదు కానీ….మా గౌండ్ల కులం వాళ్లకు మాత్రం కాఠమయ్య సామి గుడి కట్టించాలి” అని డిమాండ్ పెట్టాడు ….కాశయ్య గౌడ్.

“దేవుడు మీకే ఉన్నాడే. మా గొల్లోళ్లకు కూడా గంగదేవర గుడి కట్టించాల్సిందే” అడిగిండు పెద్ద గొల్ల లింగయ్య.

“మాకోసం ఫంక్షన్ హాల్ కట్టించాలె” తన డిమాండ్ చెప్పిండు పెద్ద మేతరి మైసయ్య.  మాకోసం చర్చి…తన కోరిక బయట పెట్టిండు మాలోళ్ల కుల పెద్ద ఏసోబు.

“మా సాయెబులకు మసీదు కావాలె” అని దూదేకుల మంజూర్ అడిగితే….

“ఈ చిల్లర దేవళ్ల సంగతి కాదు. ఊరి మధ్యలో ఉన్న హనుమంతుల వారి గుడి కూడా పాడుబడింది. అందరూ పూజించే గుడి కాబట్టి ముందు దాని సంగతి చూడాలే” అని  లేవనెత్తిండు పూజారి గారు.

మా అందరి కోసం స్కూలు కావాలి, లేదా మంచి హాస్పటల్ కావాలి, హాస్పటల్లో డాక్టర్ కావాలి అని కాకుండా….గుడి కావాలి, మసీదు కావాలి అని అడుగుతున్న జనాలను చూసి బాధగా అనిపించిది ఉప్పలయ్యకు. అలా ఎందుకు అడుగుతున్నారో కాసేపు ఆలోచించాక అర్థమైంది. వెంటనే భయమైంది.

“ఇయ్యన్ని పనులు చేయాలంటే డబ్బులున్నోడు సర్పంచి కావాలె. అందుకనే ఊరందరి తరుపున ఒక నిర్ణయం చెపుతున్న. ఊరి సర్పంచి పదవిని వేలంపాట వేద్దాం. ఎవలు ఎక్కువకు పాడుకుంటే వాళ్లే ఏకగ్రీవంగా సర్పంచి.  ఆ వేలంపాట డబ్బులు ఊళ్లో ఉన్న కులాలు అన్నీ కలిసి ఎవల వాటా ప్రకారం వాళ్లు పంచుకుందాం. ఏమంటరు.” ఊరి జనాన్ని ఉద్దేశించి చెప్పిండు పటేల్ నర్సిరెడ్డి.

డబ్బులు వస్తాయి అనే సరికి అన్ని కులాల పెద్దలకు ఏకగ్రీవం వేలంపాట బాగుంది అనిపించింది.

ఓటుకు రెండు వేల చొప్పున డబ్బులు పంచితే ఎవరి డబ్బులు వాళ్లకు పోతాయి తప్ప…కులాల పెద్దలకు మిగిలేది ఏమీ ఉండదు. అదే గుడి పేరుతో ఐతే తమకు చాలా డబ్బులు మిగులుతయి.

గవర్మెంట్ పాట ముప్పై లక్షలు….అని పాట మొదలు పెట్టిండు  నర్సిరెడ్డి.

ముప్పై ఒక్క లక్షలు అన్నడు….కాపోళ్ల రమేష్ నాయుడు.

రెండు ఎకరాలు అమ్మైనా సరే….ఊరి సర్పంచి పదవి కావాలని మనసులో అనుకున్నడు వెలమోళ్ల వెంకట్రావు. అందుకనే ముప్పై ఐదు లక్షలు అని తన పాట పెంచిండు.

ముప్పై ఆరు….ముప్పై ఏడు….ముప్పై ఎనిమిది…  వేలం పాట  రేటు మెల్లగా పెరుగుతోంది.

దూరంగా అంబేద్కర్ బొమ్మ మీద కూచున్న కాకి ఒకటి కావ్, కావ్ అని అరుస్తోంది.

కొత్తగా జిల్లాలు ఏర్పాటు ఐనంక….గ్రామాల్లో భూములకు రేట్లు పెరిగినయి. హైదరాబాద్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అమెరికాలో ఉండే  ఎన్.ఆర్.ఐ లు రోడ్డు పక్కన ఉండే భూములు ఎకరం కోటి రూపాయలు కూడా పెట్టి కొంటున్నరు. అట్ల  చిన్న చిన్న ఊళ్లళ్లో కూడా వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేస్తున్నరు. వ్యవసాయ భూములు వెంచర్లు వేయాలంటే పవర్ అంత సర్పంచి చేతిలో ఉంటుంది. లక్షల కొద్దీ ఆదాయం ఉంటది. రోడ్ల  కాంట్రాక్టులు, కాలువల పనులు….ఇలా ఆదాయం ఉంటదన్న సంగతి సర్పంచి కోసం పోటీ పడే వాళ్లకు తెలుసు. అందుకనే వేలంపాటలో రేటు పెంచుకుంటూ పోతున్నారు.

అరెకరం, పావు ఎకరం తప్ప….ఎకరాల కొద్ది భూమి వెనుకపడ్డ కులాల దగ్గర ఉండే అవకాశం లేదు కాబట్టి….వాళ్లు ఎవరూ వేలం పాట పాడడం లేదు. మొత్తానికి యాభై లక్షలకు పటేల్ నర్సిరెడ్డి కొడుకు సర్పంచి పదవిని ఏకగ్రీవంగా గెల్చుకున్నాడు.

ఊళ్లో జనాభా ఎక్కువ ఉన్న ఐదు కులాలకు కులానికి ఐదు లక్షలు, తక్కువ జనం ఉన్న కులాలకు రెండు లక్షల చొప్పున పంచాలని నిర్ణయించారు.

సదువుకున్నోళ్లు పట్నంలో ఉండి ఏదో అనుకుంటరు. పుస్తకాలు చదివి ఆ పుస్తకాల్లో ఉన్నదే బయట ఉంటది అనుకుంటరు. పుస్తకాల్లో రాసింది వేరు. బయట జరిగేది వేరు తమ్ముడూ అని…స్పెషల్ ఆఫీసర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఉప్పలయ్యకు.

ఏకగ్రీవం పేరుతో డబ్బులు ఉన్న కొంతమంది ఊరు మొత్తాన్ని కొంటున్న కుట్ర అర్థమైంది. ఏకగ్రీవం అని పైకి చెపుతున్నా….ఏక గ్రీవం అనేది ఒక దొంగ నాటకమని కళ్లముందు కనిపించింది ఉప్పలయ్యకు. కడుపు మండింది.

“మీరు ఏకగ్రీవం పేరుతో జనాలను మోసం చేస్తున్నరు. చట్టప్రకారం పదవులు వేలంపాట వేయడం నేరం. బలవంతంగా ఏకగ్రీవం పేరుతో జనాలను మోసం చేస్తున్నరు. మీ ఆటలు చదువుకున్న నా దగ్గర చెల్లవు. మీరు ఎంతకైనా పాడుకోండ్రి. నేనైతే నామినేషన్ వేస్త. ఎవడు ఆపుతడో ఆపుకోండి….”అని అందరి ముందు సవాల్ చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయిండు. ఉప్పలయ్యకు సపోర్ట్ గా నిలిచిండు పరమేశ్.

“మారోజు వీరన్న ఏనాడో చెప్పిండు తమ్మీ. మన కులాలన్నీ ఏకమై పోరాడితే తప్ప మన జాతులకు విముక్తి దొరకదు. కానీ మన కింది కులాల వాళ్లకు ఇంకా రాజకీయ చైతన్యం కలగడం లేదు. అప్పటిదాకా మనం మనవాళ్లతో కూడా పోరాడక తప్పదు. నువ్వేం భయపడకు. నీకు సపోర్ట్ గా నేను ఉంట” అని వెంట వచ్చిండు. ఊరంతా వ్యతిరేకించినా కూడా తనకు తోడబుట్టిన అన్నలెక్కన సపోర్ట్ గ నిలిచిన పరమేశ్ ని గట్టిగ కావలించుకున్నడు ఉప్పలయ్య.

అన్నప్రకారమే మరునాడు సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి మండలాఫీసుకు పోయిండు ఉప్పలయ్య. సర్పంచి నామినేషన్  వేయాలంటే ఆ తన నామినేషన్ ని ఇంకో ఓటర్ మద్దతు తెలుపుతూ సంతకం పెట్టాలి. అందుకే  పరమేశ్ కూడా మండలాఫీసుకు వచ్చిండు. ఊరంతా కలిసి ఏకగ్రీవం అని చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా వాళ్లిద్దరే పోరాడాలని నిర్ణయించుకున్నరు.

***

ఉప్పలయ్య నామినేషన్ వేయడం పటేల్ నర్సిరెడ్డికే కాదు. కులపెద్దలందరికీ పట్టరాని కోపం కలిగించింది. ఏకగ్రీవం ఐతే ఒక్కో కుల పెద్దకు ఐదు లక్షలు వచ్చేవి. ఉప్పలయ్య నామినేషన్ వల్ల నోటి కాడ కూడు ఎవరో లాక్కున్నట్టు అయింది కుల పెద్దలకు.

పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని….పట్నంల నాలుగు అక్షరాలు సదవంగనే సరిపోయిందా. ఊరు మొత్తం ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తరా అని పండ్లు పటపట కొరికిండ్లు కులం పెద్దలు. మాటలతోని చెబితే వింటరా. గ్రామపంచాతీ ఆఫీసు దగ్గర గుంజకు కట్టేసి నాలుగు తంతే…అప్పుడు దారిలోకి వస్తరు అని మండిపడ్డరు.

ఆవేశంతోని పనులు కావు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి…అని చిన్నగా నవ్వుకుంటూ చెప్పిండు పటేల్ నర్సిరెడ్డి.

అంటే వాని కాళ్లు పట్టుకుని బతిమాలమంటరా పటేలా అని అడిగిండు ఒక కులపెద్ద.

వ్యవసాయంలో ఇసోంటివి ఎన్ని చూసి ఉంటం. దున్నడానికి కోడె దూడల్ని సాగదోలెటపుడు ఒక కోడెదూడ మాట ఇంటది. ఇంకో కోడె తిరగపడతది. అందుకని దాన్ని అట్లనే వదిలేస్తమా. ముక్కులోంచి తాడు బయటకి తీసి మూతికి చిక్కెం వేస్తం. మన దారికి తెచ్చుకుంటం. రాజకీయం కూడా అంతే. ఉప్పలయ్య లాంటి లేత కోడెదూడను ఎట్ల దారికి తెచ్చుకోవాల్నో నాకు తెలుసు. వాని సంగతి నేను చూసుకుంట. నాక వదిలెయ్యి అన్నడు పటేల్.

అసలు వాడ్ని కాదు. ఈ మంగలి షాపు పరమేశ్ గాడి సపోర్ట్ చూసి ఆ ఉప్పలి గాడు ఎగిరిపడుతుండు. ఈ పరమేశ్ గాడ్ని నాలుగు తంతె వాడు దారిలోకి వస్తడు….కోపంతో బసలు కొట్టిండు పటేల్ కొడుకు సుధాకర్ రెడ్డి.

రాజకీయంలో సామదాన బేధ దండోపాయాలు ఉంటాయి. ఒక్కో మనిషికి ఒక్కో మంత్రం వేయాలి. నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఇంకా మూడురోజుల టైం ఉంది కదా. అప్పటి వరకూ ఆగండి….అందరికీ అభయమిచ్చాడు పటేల్.

***

ఉప్పలయ్య తల్లి ఎల్లమ్మని  గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరకు పిలిపించారు కులపెద్దలు. కొడుక్కి నామినేషన్ ఉపసంహరించుకోమని చెప్పాలని బెదిరించారు.

చదువుకున్న పోరడు. ఊరంతా చెబితేనే వినలేదు. నేను చెబితే ఇంటడా అయ్యా… దండం పెట్టి అడిగింది పంచాయతీ పెద్దలను.

ఎల్లమ్మా. నీ కొడుక్కి ఏం చెప్పుకుంటావో. వాడ్ని నామినేషన్ ఉపసంహరించకోమని చెప్పు. లేదంటే మీ కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేస్తామని భయపెట్టారు చాకలోళ్ల కుల పెద్దలు.

***

ఉప్పలయ్యా  ఊళ్లోకి ఎంపీడీఓ గారు వచ్చారు. గ్రామపంచాయతీ ఆఫీస్ దగ్గరకు నిన్ను రమ్మంటున్నారు అని ఫోన్ చేసి చెప్పాడు విలేజ్ సెక్రటరీ. ఉప్పలయ్య వచ్చేసరికి అప్పడికే అక్కడ చాలామంది ఊరిపెద్దలు వచ్చారు.

ఉప్పలయ్యా. నీకు తెలుసు. ప్రభుత్వం గ్రామాల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి అనుకుంటోంది. అలా ఏకగ్రీవంగా సర్పంచిని ఎన్నుకున్న గ్రామాలకు పదిహేను లక్షల దాకా గ్రాంట్ కూడా ఇస్తోంది. ఇప్పుడు నీ నామినేషన్ వలన ఆ పదిహేను లక్షలు రాకుండా పోతాయి. ఆలోచించు….ఎలాగైనా నామినేషన్ విరమించుకో అన్నట్టు చెప్పిండు ఎంపీడీఓ.

ఏకగ్రీవమైతే పదిహేను లక్షలు వస్తాయి అనేసరికి ఆశగా కళ్లు మెరిసాయి కులపెద్దలవి. మళ్లీ తలా ఓలక్ష రూపాయలు పంచుకోవచ్చు అని.

సార్… ఏకగ్రీవం కావాలంటే వాళ్లే విరమించుకోవచ్చు కదా. అందరికీ సమ్మతమై, ఊరంతా  కలిసి తీసుకునే నిర్ణయాన్ని ఏకగ్రీవం అంటారు. ఇలా బహిరంగంగా వేలం వేసి….సర్పంచి పదవి అమ్ముకోవడం నేరం కదా సార్. మీలాంటి ప్రభుత్వ అధికారులు దాన్ని సమర్థించకూడదు. అవసరమైతే నేను కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తాను అని తేల్చి చెప్పాడు ఉప్పలయ్య. ఇదేదో తన మెడకు చుట్టుకునేలా ఉందని అర్థమైన ఎంపీడీఓ గారు అక్కడ నుంచి….మీరూ మీరూ తేల్చుకోండి అని చెప్పి మెల్లగా జారుకున్నాడు.

చూశారా ఈ పిల్లకాకి పొగరు. చిన్నంతరం, పెద్దంతరం లేకుండా ఏకంగా  ఎంపీడీఓకి కూడా ఎదురుమాట్లాడుతున్నాడు…గుడ్లు ఉరిమి చూశారు కులపెద్దలు.  ఇక వీడితో నామినేషన్ వెనక్కి తీసుకునేలా చేయడం ఎవరి వల్లా అయ్యేపని కాదని….కు వచ్చే లక్షల రూపాయలు వీడి వలన కాకులు, గద్దలు తన్నుకుపోయినట్టు అయిందని గుండెలు బాదుకున్నారు.

ఊరి గ్రామపెద్దలంతా కలిసి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని…..ఎదిరిస్తున్నాడు ఒక్కడు. వాడి ధైర్యం ఏమిటో, అంత పొగరు ఏమిటో వాళ్లకు అర్థం కాలేదు.

***

వెంకటాపురం గ్రామ పంచాయతీ నుంచి పటేల్ సుధాకర్ …..ను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని ప్రకటన చేశాడు ఎంపీడీఓ. ఆ వార్త విన్న ఉప్పలయ్య షాక్ తిన్నాడు. తను నామినేషన్ వేసినా కూడా… ఏకగ్రీవంగా ఎలా ప్రకటించారో అర్థం కాలేదు. వెంటనే మండలాఫీసుకు పోయి అడిగాడు. ఎంపీడీఓ చెప్పింది విని ఉలిక్కిపడ్డాడు ఉప్పలయ్య.

తన నామినేషన్ కి మద్దతు తెలుపుతూ మొదట సంతకం పెట్టిన పరమేశ్…

“ఆ సంతకం నాది కాదు, నేను మద్దతు తెలపలేదు ,అసలు నాకు సంబంధం లేదు” అని లెటర్ రాసి ఇచ్చాడట.  అందుకే సాంకేతిక కారణాలతో తన నామినేషన్ ను తిరస్కరించాడట ఎంపీడీఓ. అలా పటేల్ కొడుకుని ఏకగ్రీవంగా సర్పంచిగా ప్రకటించారట.

నిన్నటిదాకా తనతో ఉన్న పరమేశ్ అన్న ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.  నేరు గా పరమేశ్ కటింగ్ షాప్ దగ్గరకు పోయి నిలదీయాలి అనుకున్నడు ఉప్పలయ్య.

***

“రాత్రి….పటేల్ నన్ను వాళ్లింటికి పిలిపించిండు తమ్మీ. వాళ్లు చెప్పినట్టు…నీ నామినేషన్ మీద సంతకం పెట్టలేదని లెటర్ ఇవ్వమని బెదిరించిండ్రు. అట్ల ఇయ్యక పోతే నా కటింగ్ షాపులో ఎవరూ కటింగ్ చేసుకోకుండా…..వెలి వేస్తామని భయపెట్టిండు. నీకు తెలుసు కద తమ్మీ. నాకు ఇద్దరు చిన్న పోరగాళ్లు. ఆళ్లని బతికించుకోవాలె కద తమ్మీ.నిన్ను మోసం చేసిన.నన్ను క్షమించు తమ్ముడూ..” పరమేశ్ కి దుఃఖం ఆగడం లేదు.

తన ఏకగ్రీవాన్ని నెగ్గించుకోవడం కోసం…పటేల్ నర్సిరెడ్డి చేసిన కుట్ర అర్థమైంది ఉప్పలయ్యకు. ఒక్క తమ ఊరే కాదు. అనేక ఊళ్లలో జరుగుతున్న ఏకగ్రీవం కుట్ర ఇది.  డబ్బులున్న వాళ్లు, లక్షల రూపాయలు ఎగజల్లి….ఏకగ్రీవం పేరుతో సర్పంచి పదవిని అంగడి సరుకు చేస్తున్న కుట్ర.  పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని చేస్తున్న ఖూనీకి మారుపేరు ఏకగ్రీవం.

గ్రామ పంచాయతీ బిల్డింగ్ పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం  ఉన్న గద్దె మీద కూలబడ్డడు ఉప్పలయ్య.

“ రాజకీయం అంటే అంతే తమ్ముడా. అనేక కుట్రలు ఉంటయి. వెన్నుపోట్లు ఉంటయి. నమ్మక ద్రోహాలు ఉంటాయి. అన్నిటిని తట్టుకుని నిలబడి పోరాడితేనే మన బహుజనులం అధికారానికి చేరుకుంటం. మనది ఒకరోజుతో అయిపోయే పోరాటం కాదు. మనది ఒక సర్పంచి పదవి కోసమో, ఒక ఎంపీటీసీ పదవి కోసమో కాదు. మన జనాలకు రాజ్యాధికారం విలువ తెలిసే దాకా….బహుజన రాజ్యం వస్తే తప్ప… మన సమస్యలకు పరిష్కారం దొరకదు అన్న చైతన్యం కలిగే దాకా…..మనం ఇలా పోరాడాల్సిందే. ” ఉప్పలయ్యను దగ్గరగా తీసుకుని ఓదార్చిండు పరమేశ్.

అంబేద్కర్ విగ్రహం మీద వాలిన కాకి….కావ్ కావ్ మని అరుస్తూనే ఉంది.

                                    ***

చందు తులసి

15 comments

Leave a Reply to D.Subrahmanyam Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • కాలంతో పాటు దొరలు గ్రామాల్లో దోపిడీ రూపం మార్చుకుంటున్నారు. మీ స్పందనకు ధన్యవాదాలు

      • ఇది ఒక ఊరి సర్పంచ్ కథ కాదు…

        ఇది ‘ఏకగ్రీవం’ అనే ముసుగులో ప్రజాస్వామ్యాన్ని

        వేలం వేసే వ్యవస్థ కథ.

        జనరల్ అంటే అందరూ కాదు,

        ఏకగ్రీవం అంటే ఏకాభిప్రాయం కాదు,

        అధికారం అంటే సేవ కాదు.. లాభం అనే

        నిజాలు చాలా నిజాయితీగా చూపించారు.

        ఉప్పలయ్య ఓడిపోయాడేమో…

        కానీ ఈ కథ చదివిన ప్రతి మనిషి లోపల

        ఒక ప్రశ్నను గెలిపించాడు.

        ఇది కథ కాదు.. గ్రామీణ ప్రజాస్వామ్యానికి పెట్టిన

        చార్జ్‌షీట్.

        ఆలోచింపజేసే కథ ఇచ్చినందుకు ధన్యవాదాలు

        తులసిచందు గారు.

  • నేటి వ్యవస్థకి దర్పణం
    సమకాలీన సామాజిక అంశాల నేపథ్యంలో కథను మలిచిన విధానం శ్లాఘనీయం
    ముగింపు కావ్ కావ్ అని అరుచుకుంటూ..బావుంది

    • థాంక్యూ సర్. గ్రామాల్లో ప్రస్తుతం జరుగుతున్న వాస్తవం ఇదే

  • గ్రామ రాజకీయాలను చిత్రిక పట్టిన కథ. పైకి ఏకగ్రీవమే కానీ లోపల కులం, దోపిడీ ఉన్నాయి. చదువుకున్నవారు రాజకీయాల్లోకి వస్తే మంచి మార్పులొస్తాయనే ఆశాభావాన్ని కలిగించింది. కులం, మతం, రాజకీయాల ప్రస్తావన లేని కథలు కావాలని కొన్ని ప్రకటనలు చూస్తే నవ్వొస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూడు అంశాలే దేశాన్ని నాశనం చేస్తున్నాయి. వాటి గురించి ఇలా సాహిత్యంలో చర్చ జరగాలి. మార్పు రావాలి. ఎప్పటిలానే మరో మంచి కథ రాసిన చందు తులసికి అభినందనలు.

    • మనిషి జీవితాన్ని కులం, మతమే ప్రభావితం చేస్తున్నపుడు కులం, మతం కథలు రాకుండా ఎలా ఉంటాయి. కథ చదివినందుకు, స్పందించినందుకు థాంక్యూ భయ్యా

  • ఏకగ్రీవం అనే ఒక కుట్ర కథ – పేరుతోనే ఆసక్తిని రేకెత్తించిన కథ కూడా చాలా బాగుంది. ఇటీవల తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చాలా ఊళ్ళల్లో జరిగిన గమ్మత్తైన విషయాలెన్నో స్పృశిస్తూ సాగిన కథ – టెక్నాలజీలో రోజురోజుకీ ఎన్నో ఎత్తుల్ని అందుకుంటున్న మనిషి, ఊళ్ళలో కనీస సౌకర్యాల కల్పన న్యాయమైన హక్కుల కోసం మాత్రం రోజురోజుకీ మరింత లోతులకు పోతూనే ఉన్నాడు – ఆ అంతరం తీర్చడం ఎవరి తరం కాదు అంటూ మనందరి అనుభవ పాఠంతో ముక్తాయించడం వల్ల కథ మరింత నచ్చింది.

    • థాంక్యూ అరుణ్. ఇది మనందరి అనుభవం. ఓ వైపు AI లాంటి కొత్త టెక్నాలజీ వస్తుంటే, ఊళ్లలో మాత్రం… అనేక జాఢ్యాలు పీడిస్తున్నాయి.

  • సమాజానికీ వ్యక్తికీ మధ్యన సంబంధాలు తెగిపోతున్న సంధికాలమిది.

    నగరాలకీ పట్నాలకీ
    పట్నాలకీ గ్రామాలకీ
    గ్రామాలకీ మనుషులకీ
    మనుషులకీ మనుషులకీ
    సంబంధాలు తెగిపోతున్నాయి.

    ఉప్పలయ్యని ఊరంతా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే,

    సమాజాన్ని పుస్తకాల్లో చదువుకునేవాళ్ళు ఆనందిస్తారేమోగానీ

    పుస్తకాలే చదవని సమాజం పరమేశాన్ని తప్పు పట్టదు.

    పుస్తకాల గురించి పట్టింపే లేని సమాజంలో ఏకగ్రీవాలు సహజం

    ఒకవేళ ఉప్పలయ్యకి కలెక్టరు ఉద్యోగం వచ్చినా

    తనని కలెక్టరుగానే ఉండనిస్తారనే నమ్మకం సడలిపోతున్న సంధికాలంలో…

    ఇంకా అక్కడక్కడా ఉప్పలయ్యలు ఉండటమే ఉసూరుమంటున్న గ్రామ స్వరాజ్యానికి ఊపిరి పొసే ఉపశమనం.

    వర్తమాన గ్రామ రాజకీయ సజీవ చిత్రపటం
    ఏకగ్రీవం అనే ఒక కుట్ర కథ.

    • థాంక్యూ జొన్నవిత్తుల గారు. మీ లాంటి పెద్దల మాటలు ఎప్పుడూ ఉత్సాహం ఇస్తుంది. కథ చదివి స్పందించినందుకు ధన్యవాదాలు

  • చందు తులసి గారు ఏకగ్రీవం అనే ఒక కుట్ర కథ చాలా బాగా రాసారు. దేశ రాజకీయ పరిస్తితి బాగా చెప్పారు.

  • గ్రామ రాజకీయం మొత్తాన్నీ.. అక్కడ నేటికీ అణగదొక్కబడుతున్న బహుజనులనీ, వారికి కుట్రపూరితంగా చూపుతున్న తాయిలాలనీ.. బహు చక్కగా వివరించిన కథ. నిజానికి ఇది కథ కాదు… ఎన్నికల వెనుక సాగే రాజకీయాలను ఎండగట్టిన వాస్తవ చిత్రణ. రచయిత చందు తులసికి అభినందనలు.

    • ధన్యవాదాలు గోపాల్ గారూ. ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, చివరికి గ్రామ సర్పంచ్ పదవి దగ్కూగర కూడా బహుజనులకు అన్యాయం జరుగుతోంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు