ఏం చేద్దాం ఈ బూతు తిట్లను?

ఆంతరంగిక స్నేహితుల మాటల్లో దొర్లుతూ రాతలకు దొరక్కుండా వుండే బూతులన్నీ ఇప్పుడు సోషల్ మీడియా చర్చావేదికల మీద రికార్డ్ అయిపోతున్నాయి.

ఏ విషయాన్నైనా జనం అర్థం చేసుకుంటున్న తీరును మార్చేయాలంటే, ఆ విషయాన్ని సూచించే భాష వాడకాన్నే మార్చటం ఒక పద్ధతి – అంటారు టొరంటో యూనివర్సిటీ భాషాశాస్త్రవేత్త శాలీ టాగ్లియామోంటే. భాషలో మార్పులను చేసేపని ఆడవాళ్లే చేపడితే సాధికారత త్రాసు స్త్రీల వైపుగా మొగ్గు చూపుతుందని అంటున్నదీమె. భాషలో మార్పు చేసుకోవటం వరకూ సరే, దానిని ఎక్కువమందికి ఆమోదయోగ్యంగా చేయటం అంత సులభం కాదు. ఆడవాళ్లు  బయటి ప్రపంచంలో ఇంచుమించు మగవాళ్లతో సమానంగా తిరగటం, అన్ని రకాల పనులూ చెయ్యటం మొదలయ్యాక, చెయిర్మన్, స్పోక్స్ మన్, స్పోర్ట్స్ మన్ లాంటి మాటల్లోంచి ‘మాన్’ మొనోపలీ పోయి ‘పర్సన్’ అనే మాట రావటం క్రమేపీ జరిగినా  సులువుగానే జరిగింది. ఇరవయ్యో శతాబ్దం వరకూ వేశ్య, ప్రాస్టిట్యూట్ అనబడే మనిషి సెక్స్ వర్కర్ అయింది. ఇవన్నీ పత్రికా ప్రపంచపు భాషలో మార్పులు.

కానీ వాడుకభాషలో మనకు ఎంతకీ కొరుకుడు పడనిదీ, తరతరాలుగా ఆడవాళ్ల మానసిక హింసకు కారణం అవుతున్నదీ, పిప్పిపంటి బాధలా సలుపుతున్నదీ ఒక మాట వుంది. ఆడవాళ్ల మీద అలవోకగా విసిరేసే ఆ మాట ‘లంజ’. కూరలో ఉప్పెక్కువ వేసిన భార్య మీదికి పళ్లెం విసిరినంత తేలిగ్గా ఈ మాటను విసిరేస్తారు. ఈ తిట్టు తిట్టటానికి అంత చిన్న విషయం దగ్గర్నుంచీ స్త్రీలు పురుషాధిక్యతనూ రాజ్యాన్నీ మతాన్నీ దేవుళ్లనీ అధికార పార్టీలనూ విమర్శించటం లాంటి పెద్ద విషయాల వరకూ ఏదైనా కారణం కావచ్చు. ఈ తిట్టు/పదం ఎంతగా జాతిలోకి ఇంకిపోయిందంటే మగా ఆడా, పిల్లా పెద్దా అంతా నిత్యజీవితంలో దీన్ని అతి సులువుగా వాడుతూనే ఉంటారు. కోపమొచ్చినప్పుడే కాదు, ముద్దొచ్చినా ఇదే మాట. అంటే వాడే తీరును బట్టి ఈ మాటకు అర్థం కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. రండీ, ఛినాల్ లాంటి పేర్లతో హిందీలోనూ, ఇంకా రకరకాల ప్రాంతీయ భాషల్లో మరెన్నో పేర్లతోనూ దేశమంతటా ఉన్న ఈ తిట్టు అసలైన అర్థంలో స్త్రీల లైంగికతను కించపరిచేదే. అలా కించపరుస్తూ స్త్రీలను బాధ పెట్టాలని చూసేదే.  

స్థిరనివాసాలూ సొంత ఆస్తి భావనలూ ఏర్పడిన కాలం నుంచీ ఆస్తులను అప్పచెప్పటం కోసం తమకు పుట్టిన పిల్లలు ఎవరో ఖచ్చితంగా తెలుసుకునే అవసరం మగ మనిషికి ఏర్పడింది. దానితో స్త్రీల లైంగికతకు కళ్లెం పడింది. ఒకే వ్యక్తికి భార్యగా ఉండటం మేరకు ఆమె లైంగికతను నియంత్రించారు. పాతివ్రత్యం అనే భావనను పెంచి పోషించి, కీర్తించి, స్త్రీలను అదుపులో ఉంచారు. ఎక్కువ ఆస్తిని సంపాదించగలిగే వాడికి ఎక్కువమంది భార్యలూ పిల్లలూ ఉండొచ్చునన్నారు. మత విస్తరణ కోసం స్త్రీల గర్భాలను వాడుకున్నారు. బానిసల సంఖ్యను పెంచటం కోసం నల్లజాతి స్త్రీల గర్భాలను వాడుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీని భూమితో, ఆస్తితో సమానంగా చూశారు. యుద్ధం చేసి గెలిచిన భూముల్లోని స్త్రీలను ఉంపుడుగత్తెలుగా మార్చారు. వాళ్లనుంచి సుఖాన్ని పొంది, వాళ్లను ‘లంజలు’ అన్నారు. తమకోసం ఒక సుస్థిరమైన లంజ (వేశ్య) వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, భార్యల వ్యవస్థలో ఉన్న స్త్రీలను అటువైపు చూడవద్దని శాసించారు. తెలివైన వేశ్యలు తమనుంచి డబ్బునంతా లాగేస్తే, పీడితుల్లా అయిపోయి పద్యాలు రాశారు. వేశ్యకు హృదయం ఉండదని తీర్మానాలు చేశారు. స్త్రీలను ఇలా అణగగొట్టి, విజయగర్వంతో వాళ్లను ఒకే ఒక్క అవయవంగా చూసి, ఆ అవయవాన్ని కలిగివుండే వెర్రివాళ్లన్నారు. తెలివితక్కువవాడిని ఆ పదానికి అర్హుడిని చేశారు. ఆ మాటలకు స్త్రీలు అవమానభారంతో తల వంచుకునేలా చేశారు. పాతివ్రత్యంతో తమను తాము బిగించుకుంటే ఆ తిట్లు తమను తాకవుగదా అనే తాపత్రయంలోనే చాలాకాలం ఉండిపోయారు స్త్రీలు.  

స్త్రీలను అణచివేసి తయారుచేసిన ఈ తిట్ల చట్రంలో మగవాళ్లు మాత్రం ఇరుక్కోకుండా ఉంటారా! అతడి పుట్టుకను శంకిస్తూ తిట్టటం ఉంది. ఒక అమ్మకీ అబ్బకీ పుట్టిన పుట్టుక కాదనే తిట్టు వాళ్ల మగతనానికి సవాలు. ఆడదాన్ని అదుపులో పెట్టలేకపోతే మగతనం కాదని రెచ్చగొడతారు. తల్లిద్వారా అక్కద్వారా మగవాళ్లను తిడతారు. ఇలా చారిత్రాత్మకంగా గట్టి పడిపోయి, స్త్రీవాదులకు, అభ్యుదయవాదులకు ఒక సవాలుగా మిగిలిపోయిన ఇటువంటి తిట్లను ఎలా ఎదుర్కోవాలన్నది సోషల్ మీడియా యుగంలో మరింత పెద్ద తలనొప్పిగా మారింది.

చైర్ మన్ లోనుంచి మాన్ ను తొలగించటం లాంటి సులువైన పని కాదిది. జాతి DNA లో ఇంకిన ఈ తిట్లకున్న సైకలాజికల్ కోణాన్ని చూడకుండా ఉండలేము. విసురుగా బలంగా ఏదైనా చెప్పాలంటే ఒక తిట్టుపదాన్ని ఆసరాగా తీసుకోవటం మనిషి నైజంలో భాగం కూడా. చదువుకున్నవాళ్లు దీనికేమీ మినహాయింపు కాదు. ‘నీ యమ్మ’ అని ఊతపదం లాగా వాడటంలో ఆ తిట్టు వెనకున్న అసలు అర్థమే అసలు ఉద్దేశ్యం కాకపోవచ్చు. అదొక అలవాటుగా మారి ఉండవచ్చు. అలా ఏ ఉద్దేశ్యమూ లేకుండా అలవాటుగా అలవోకగా ఉపయోగించేవాడికి వాటి అర్థాలు చెప్పి, మాన్పించటం అంత సులువేమీ కాదు. అలాగే ఇప్పటికీ ఈ బూతు మాటలను అసహ్యించుకుంటూ, అవి తమను తాకకుండా దూరంగా ఉండాలనుకునే స్త్రీలకు, మర్యాదాపురుషులకు వీటిగురించి చర్చించవలసిన అవసరం ఉందని చెప్పి ఒప్పించటం కూడా కష్టమే. పెరిగిన వాతావరణాన్ని బట్టే చాలామట్టుకు తిట్లు వంటబట్టించుకోవటంగానీ, తిట్లను అసహ్యించుకోవటంగానీ జరుగుతుంది. పెద్దయ్యాక అలవరచుకున్న సంస్కారంతో ఆధునిక భావజాలం సాయంతో బూతుమాటలను బుర్రలో ఓ పక్కకు తోసేసినా, ఆవేశపూరితమైన సంభాషణల్లో అవి అప్రయత్నంగా దొర్లుకుంటూ వచ్చేస్తాయి కొందరికి.   

బూతులు మాట్లాడటం అంటే ఆడవాళ్లను కించపరచటమేనా అనే ప్రశ్నకు Quora అనే ఒక వేదికలో ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి. ఆడవాళ్లను పెట్టెల్లో పెట్టి దాచుకునే సున్నితమైన పువ్వుల్లాగా చూసి, బూతుమాటలు వింటే వాళ్లు మూర్ఛ వచ్చి పడిపోతారేమో అనుకుంటే కుదరదని ఒక మహిళ అంటోంది. ఇంగ్లాండ్ లో స్కాట్లాండ్ లో ‘Fuck me’ అంటే ఆశ్చర్యపోవటం. ఆ పదం వాడితేనే ఆశ్చర్యపు లెవెల్ అర్థమౌతుందని అంటోంది. వాదనలో సరైన మాట స్ఫురించకపోతే కూడా మనిషి నోట్లోంచి బూతు మాట వచ్చేస్తుందని మరొకరు చెప్తున్నారు. బూతులు వాడటం అంటే ఆడవాళ్లనూ మగవాళ్లనూ ఎవరినీ కించపరచటం కాదనీ, బూతులు వినటం ఇష్టంలేని సున్నిత మనస్కులు అవి వింటే గాయపడతారనీ మరొకరి అభిప్రాయం. స్త్రీలు కూడా బూతులు తిడతారనీ, మగవాళ్లతో సమానంగా బూతులు తిట్టే పనిని ఫెమినిస్టులు చేయటంలో తప్పేమీ లేదనీ వాదిస్తున్నారు. Cunt అనే తిట్టుతో పాటు Dick అనే తిట్టుకూడా బూతుల డిక్షనరీలో సమాన గౌరవాన్ని పొందిన ఈ రోజుల్లో బూతుల తీవ్రతను అవి వాడబడుతున్న సందర్భంలోనే అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.  మనదేశంలో కొంతమంది స్త్రీలు, రోజువారీ పనుల్లో మగవాళ్లతో కలిసి పనిచేసే స్త్రీలూ కల్తీలేని బూతులు మాట్లాడుతూనే మగవాళ్లను అదుపులో ఉంచటం, నవ్వుతూ బూతులు మాట్లాడుతూ రిలాక్స్ కావటం, మధ్యతరగతి స్త్రీలు అవి విని నవ్వుకుంటూనే చెవులు మూసుకోవటం మామూలే. స్నేహితురాళ్ల ఆంతరంగిక సంభాషణల్లో కూడా బూతులు దొర్లటం అరుదేమీ కాదు. ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక మగవాడిగా (అంతటి శక్తివంతమైన వ్యక్తిత్వం స్త్రీకి ఉంటుందని గుర్తించటానికి కూడా నిరాకరించి, ఆమెకు పురుషత్వాన్ని కట్టబెట్టటం) అప్పట్లో కీర్తించిన మగ ప్రపంచం ఆవిడ సెక్సువాలిటీ మీద కూడా బూతుజోకులు వేసింది. హాస్యంగానైనా సరే, బూతులదాడిని తప్పించుకున్న వివాదాస్పద మహిళలు చరిత్రలో ఎక్కడా లేరు. పాశ్చాత్య ప్రపంచంలోనూ, అమెరికాను అన్నివిధాలా అనుసరిస్తున్న మనదేశంలో కూడా ఆడామగా తేడా లేకుండా F పదం ఇప్పటి తరంలోని మధ్య, ఉన్నతవర్గాల్లో చాలామంది వాడుతున్నారు. మన సినిమాల్లో కూడా సహజత్వం కోసం పాత్రల సామాజిక స్థాయిని బట్టి ఎవరు ఎలా మాట్లాడతారో వాళ్లను అలాగే మాట్లాడించటం చాలా మామూలైపోయింది. భాషకు అర్థాలు జోరుగా మారిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి మాటలను ఎప్పుడు ఎలా ఏ ఉద్దేశ్యంతో ఏ సందర్భంలో వాడుతున్నారు అన్నదే కీలకం.

ఇప్పుడు రకరకాల బూతులకు కొత్త స్థావరం సోషల్ మీడియా. ఆంతరంగిక స్నేహితుల మాటల్లో దొర్లుతూ రాతలకు దొరక్కుండా వుండే బూతులన్నీ ఇప్పుడు సోషల్ మీడియా చర్చావేదికల మీద రికార్డ్ అయిపోతున్నాయి. ఈ వేదికలమీద ఆడవాళ్ల అభిప్రాయాలతో విభేదించేటప్పుడు పెరిగే వాదనల మధ్య ఆడవాళ్ల ధైర్యాన్నీ మొండితనాన్నీ దెబ్బతీయాలంటే ఆమె లైంగికతను అవమానిస్తూ తీవ్రమైన బూతులను ఆశ్రయిస్తే సరిపోతుందని అహంకారులైన మగవాళ్లు అనుకుంటున్నప్పుడు, ఈ రికార్డెడ్ వ్యవహారాన్ని చర్చించకుండా వదిలేయటం కుదరదు. సమస్య మరింత పెద్దదైపోతోంది. సంయమనం అందరికీ అవసరమే. ఎటువంటి విరుద్ధ భావాలున్నవాళ్లయినా, వాళ్లు ప్రతిపాదించిన విషయం మీద చర్చలు చెయ్యాలి తప్ప వ్యక్తిగత దూషణకు దిగకూడదు నిజమే. కానీ ఇలాంటి సంయమనం చాలామందిలో అతితక్కువగా ఉంటోంది. వెంటవెంటనే జవాబులు ఇచ్చేసే వీలు ఉండటంతో ఆవేశాలు, వాగ్వాదాలు పెరిగి, చివరకు అవి స్త్రీలమీద బూతుల వర్షంగా ముగుస్తున్నాయని సులువుగానే అర్థం అవుతోంది. బర్ఖాదత్, అరుంధతీ రాయ్, పీఓడబ్ల్యూ సంధ్యలాంటి హై ప్రొఫైల్ స్త్రీలూ, సామాజిక కార్యకర్తలూ కవులూ కార్టూనిస్టులతో పాటు, వ్యక్తిగత స్థాయిలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎందరో స్త్రీలు కూడా ఈ ట్రోలింగ్ తో సతమతం అవుతున్నారు.

థర్డ్ వేవ్ ఫెమినిస్టులు తమ లైంగికతను గౌరవించి తీరాలంటున్నారు. తన బెడ్ రూమ్ ఇక ఎంతమాత్రమూ పబ్లిక్  చర్చావేదిక కాదని చెప్తోంది ఈ నాటి మహిళ. ‘స్లట్’, ‘బిచ్’ అనే మాటలను సొంతం చేసేసుకుంటే అవి ఇక తిట్లుగా మిగలవని, వాటి అర్థం మారిపోతుందని అర్బన్ ఫెమినిస్టుల ఆలోచన. Sluts వేసుకునేలాంటి బట్టలు వేసుకు తిరగకుండా ఉంటే రేప్ లు జరగవని పోలీసులు చేసిన కామెంట్ కు మండిపడ్డ పాశ్చాత్య దేశపు అమ్మాయిలు ‘Slut Walk’ పేరుతో రాలీలు తీసి, ‘నేను స్లట్ ను’ అని ప్రకటించుకుంటూ తిరిగారు. కానీ ఇది స్లట్ కున్న అర్థాన్ని ఎంతవరకూ మార్చిందీ అంటే చెప్పటం కష్టమే. వాళ్లు కలిసి తిరిగే సమూహాల వరకూ వాళ్లకు సమర్ధన దొరికి వుండొచ్చుగానీ, ఆ పదానికి ఉన్న విస్తృతార్థం మారలేదు. నల్లజాతి మహిళలు తమ పరిస్థితి తెల్లజాతి స్త్రీలవంటిది కాదు కాబట్టి ‘స్లట్’ అని ప్రకటించుకోలేమని చెప్పారు. రెండవ తరగతి పౌరులుగా బ్రతుకుతూ, తరాలపాటు గర్భాలలో బానిసలను మోస్తూ, తమ శరీరపు రంగును కూడా పోగొట్టుకున్న దుస్థితి వారిది. నల్లజాతి సాంస్కృతిక అస్తిత్వంలో ‘స్లట్’ అనే మాటను మోసి, నిభాయించగల పరిస్థితి ఆ స్త్రీలకు ఇంకా రాలేదు.

మరి ఈ లంజ/స్లట్/బిచ్/.. కుల మత వర్గాలకతీతంగా స్త్రీలను వదలకుండా వేధిస్తున్న ఈ బూతులను ఆఖరుకు సొంతం చేసుకున్నాకకూడా వాటి అర్థాన్ని మార్చనూలేక, వాటిని విసిరికొట్టనూ లేక, ఇంకేం చెయ్యాలి? సైబర్ క్రైమ్ సెల్ కు రిపోర్ట్ చెయ్యాలి. బూతులు మాట్లాడేవాళ్ళను బయటపెడుతూ స్క్రీన్ షాట్లను షేర్ చెయ్యాలి. అల్లరి మూకలను బ్లాక్ చెయ్యాలి. సరే చేస్తున్నారు. చేస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి నేరస్తులు మళ్లీ కొత్తరూపాల్లో పుట్టుకు వస్తూనే ఉంటున్నారు. సైబర్ చట్టాలూ వాటి అమలూ నత్తనడకలతో పోతుంటే, స్త్రీలు మాత్రం బూతుల గాయాలతో బాధ పడుతున్నారు. ఇప్పుడే, సరిగ్గా ఇప్పుడే, ఒక ధిక్కార ప్రకటన చేసి, మమ్మల్ని తిడుతున్న బూతులేవీ మాకు తగలవని, వాటిని మేం పట్టించుకోవటం లేదని చెప్తోంది స్వాతి వడ్లమూడి తన కవితలో. Slut అనే మాటను సొంతం చేసుకుని దానికున్న చెడు అర్థాన్ని పోగొడదామని ప్రయత్నించే ఫెమినిస్టుల్లాగా కాకుండా స్వాతి మరొక ముందడుగు వేసింది.

“మా శరీరాలు మీ పెరట్లో ముర్రా జాతి గేదలైనప్పుడే

మా గర్భాలు మీ వంశాలకు ఇంక్యుబేటర్లైనప్పుడే

మా బిడ్డలు మీ మగతనాలకు అడ్రసులైనప్పుడే

మా నిషిద్ధ శృంగారాలు మీ విల్లులో అమ్ములైనప్పుడే

అవేవీ మావి కాకుండా పోయాయి

వాటికి జరిగే అవమానాలు మావెలా అవుతాయి?

జండాకు జరిగే అవమానం జండాది కాదు.

గుడిలో బొమ్మను తంతే బొమ్మ తిరగబడదు

శత్రువు దురాక్రమిస్తే సరిహద్దుకేం నొప్పి?

ఎవడి పాదాలైతేనేం తన్నులు తినడానికి !

లంజలమైనా పూకులమైనా మీకే, మాకు కాదు

మాదికాని యుద్ధానికి మేము రాము”

మా శరీరాలూ గర్భాలూ బిడ్డలూ శృంగారాలూ .. ఏవీ మావి కానప్పుడు ఈ తిట్లూ బూతులూ మాత్రం మావెలా అవుతాయి? అవీ మీవే. ఇక్కడ తిట్లను లెక్కించటం గొంగడిలో తింటూ వెంట్రుకలు లెక్కపెట్టటమే కదా! ఇది సామాన్యమైన తిరస్కారం కాదు. ఆడవాళ్లను మానసికంగా బాధపెట్టటానికి కనిపెట్టిన శక్తివంతమైన మాట ‘లంజ’ అయితే, పెద్ద పెద్ద రాజకీయ తంత్రాలూ, మతాల సినేరియోల మధ్య ఆ బూతు మాటలకు ఏ విలువా లేదని మేము గ్రహిస్తున్నామని చెప్పిమరీ తీసిపారేసింది. 

ముల్లును ముల్లుతోనే తీసిన స్వాతి, తన కవితలోని ఆ మాటలను ఎంత సీరియస్ గా, ఎంతటి సందర్భశుద్ధితో  వాడిందో అర్థం చేసుకోకుండా ఆడవాళ్లు కూడా ఇలా మాట్లాడితే ఇదేమి సంస్కారం? అని సాగదీసేవాళ్లు, సోషల్ మీడియాలో మగ మద మత ఉన్మత్తుల పోకడలను గమనించాలి. స్త్రీలను తాము ఎన్ని విధాలుగా ఎంత దారుణంగా రేప్ చేసి చంపటానికి ప్లాన్లు వేస్తున్నారో వివరిస్తూ స్త్రీలను భయభ్రాంతులను చేసేలా కొంతమంది రాసే వాంతి రాతల స్క్రీన్ షాట్లను చదివి తీరాలి. సోషల్ మీడియాలో పెట్టే పబ్లిక్ పోస్టులంటే అర్థం, చాలా తీవ్ర విరోధ భావాలున్న ట్రోల్ సైన్యాల మధ్యలో నిలబడి భావప్రకటన చేయటమే. ఏది మాట్లాడితే ఎవరినుంచి ఎటువంటి బూతుల బాణాలు వచ్చి తగులుతాయో తెలియదు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కే అంతోకొంతో ట్రోలింగ్ బాధ తప్పలేదంటే, మిగతా ఆడవాళ్ల పరిస్థితి ఏమిటి? జర్నలిస్టులుగా మానవ హక్కుల కార్యకర్తలుగా లాయర్లుగా చురుగ్గా పనిచేసే స్త్రీలకు ఆన్లైన్ వేధింపులు సర్వసామాన్యం. సమాజంలో తమలాంటి భావాలే ఉన్న గ్రూపులు సహాయంగా ఉన్నట్టే ఉన్నా, ఎవరి టైం లైన్ ను, కామెంట్స్ ను, ఇన్బాక్స్ ను, మెయిల్ ను వాళ్లే ఒంటరిగా చూసుకోకా తప్పదు. కాచుకోకా తప్పదు. మనుషులు అవసరాలను బట్టి కలుస్తూ విడిపోతూ ఉండే చీలికల ఆన్లైన్ సమాజపు ఒక భాగంలో ట్రోల్ సైన్యాల నరంలేని నాలుకల్లోంచి ప్రవహించే బూతు తిట్లను స్వాతి చెప్పినట్టుగా మనకు సంబంధించని యుద్ధపు ఆనవాళ్లుగా భావించటం తప్పిస్తే, ఇప్పటి సోషల్ మీడియా బెదిరింపుల మధ్య స్త్రీలకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే ఆయుధం ఇంకేముంది?

ల.లి.త

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సంస్కారవంతమైన సమాజం ఎదరుదాడితోనే సాధ్యమవుతుందని మీరు అ.కృ .గారు మాత్రమే నమ్ముతున్నారు. మొత్తానికి ఆమె మృతభాషను భుజానికెత్తుకొని ఆధునిక విక్రమార్కులయ్యారు.ఎడతెగని
    ప్రశ్న ఈ భాషాభూతం.

  • Great presentation, thanks for your inspirational writing. I changed my way thinking after reading this.

  • ఉన్మాదం + మగమద0 = ట్రోలింగ్ . చక్కగా అందరికీ అర్ధమయ్యేలా విషయాన్ని విడమరిచి చెప్పిన లలిత గారికి ధన్యవాదాలు!

  • lanja ane maatani pallem visiresinattu gaa annaru chusaaru really nenu andulo okkadini i will try change my way

  • ఆలోచన కలిగించి మానవత్వం వెలిగించాల్సిన చోట కావాల్సింది పదిమందిని కలుపుకు పోవాల్సిన అవసరం మరిచి ఒక వ్యక్తిపూజకో లేక జాతి పూజకో దిగజారే ఆత్మ న్యూనత అస్తిత్వ వ్యక్తీకరణతో సాధించింది ఏదీ లేదని పైటను తగలెయ్యాలని పిలుపునించ్చిన అహంభావి పైటలు వేసుకుని తన మూర్ఖత్వాన్ని ఇంకా వప్పుకోలేక మగ వారిని పగ వారిగా పిలుపునివ్వడం ఒక అస్తిత్వ గుర్తింపుకోసం ఆరాట పడే మరో వ్యక్తి అదే బాటలో నడవడం. ఇన్నాళ్ళుగా ఆడ వారి కోసం చేస్తున్న పోరాటల్లో ఈ నిందా హింస కి సంబంధించి ఎటువంటి పురోగతి కనిపించటం లేదని చరిత్ర చెప్తున్న పాఠాలు మరిచి..మళ్ళీ మావోయిస్ట్లు వ్యవస్థలని మార్చాలంటూ కాకుండా కూలచాలనే వినాదంతోనే నినదిస్తూ చావుకి బాట వేసే హింసా విధానంలోనే కొన సాగుతున్నట్లు..ఈ స్త్రీ (ఉగ్ర)వాదం కూడా కొత్త పుంతలు తొక్కి బూతులు వీనుల విందుగా వినిపించే వీధి చివర మునిసిపల్ కుళాయి దగ్గర పాత బస్తీ స్త్రీలు కొట్టుకుంటూ నీటి కోసం చేసే పోరాటంలో నోటికి చేప్పే పనే ఇది. ఇది ఖచ్చితంగా పురోగతే..తప్పా ఎటువంటి అభ్యుదయ బావాన్ని చూపించటం లేదు లేదా ప్రగతి సాధన దిశగా పడిన అడుగు కానే కాదు..కేవలం గుర్తింపు అనుకుంటే…అది మాత్రం పుష్కలంగా లభించిందనే చెప్పాలి..

  • చాలా మంచి ఆర్టికల్. ఎంతో లోతుగా విశ్లేషించారు. స్వాతి బూతులు తిట్టలేదని, స్త్రీలను అవమానించటానికి వాడే బూతు పదాల్ని పాయింట్ అవుట్ చేసిందని మెదడు వుండాల్సిన చోట వున్న వారందరికీ అర్ధమౌతుంది. ఆమె కవితలోని అసలు పాయింట్ ఒక క్రూరమైన స్త్రీ వ్యతిరేక సమాజంలో స్త్రీలు తమ దేహాల్నుండి, మనసుల నుండి వేరు పడి పరాయీకరణ చెందారని చెప్పటం. సూర్యుడిని చూడమంటే మూర్ఖులు వేలు చూస్తారనే ఒక గొప్ప సామెతని నిజం చేసిన గొప్ప వారు ఆ కవితని వ్యతిరేకించే వారందరూ!

  • Excellent analysis. Unfortunately in this same issue of Saranga there is utterly feudal man’s reaction. I wish your article is read more.

  • చాలా బాగా రాసారం ఈ ఆర్టికల్.
    అసలు తల్లి ను, చెల్లిని “ఆడదాని” గా మాత్రమే చూసే ఈ ఉన్మత్త సమాజం లో బూతుకు ,తిట్టుకు, తేడా తేడా తెలియకుండా పోయింది. ఇంకా ఈ బూతు ఉండాలను కొనే వారు సంస్కారం గురించి మాట్లాడుతారు. ఏది సంస్కారం, ఏది తిరస్కరామో తేడా తెలియదు వీళ్లకు. బూతు ను తిరస్కరించడానికి వారన్న బూతు ను ఎత్తి చూపితే దాన్నే మళ్ళీ బూతు అనడం విడ్డురంగా లేదు. ఒక తాగు బోతు వాడిన బూతుకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టి న కవిత ఇధి.

  • “ఇది సామాన్యమైన తిరస్కారం కాదు. ఆడవాళ్లను మానసికంగా బాధపెట్టటానికి కనిపెట్టిన శక్తివంతమైన మాట ‘లంజ’ అయితే, పెద్ద పెద్ద రాజకీయ తంత్రాలూ, మతాల సినేరియోల మధ్య ఆ బూతు మాటలకు ఏ విలువా లేదని మేము గ్రహిస్తున్నామని చెప్పిమరీ తీసిపారేసింది. ” – very well said LALITA garu.

  • పురుషుణ్ణి తీవ్రంగా తిట్టాలంటే తిట్లే ఉండవు.వె ధ వ అంటే వెయ్యేళ్లు ధనముతో వర్ధిల్లు అని కల్పించారు. సచ్చినోడా, అప్రాచ్యపు మొహమా,దరిద్రగొట్టు మొహమా -ఇలాంటివి అసలు తిట్లే అనిపించవు. వాళ్ళల్లో వాళ్ళకి ఒకని మీద ఇంకొకరికి కోపమొస్తే ఈ తీవ్రమైన పదాన్నే ఆసరాగా తీసుకుని అతని తల్లిని తిడతారు. ఎన్నో అవమానాలను అధిగమిస్తూ వస్తున్నారు స్త్రీలు. దిగమింగుకుంటూ కాదు, ధీరల్లాగా ధైర్యంగా తలెత్తి నిలబడి.అవి మనకి వర్తించవు.పట్టించుకోవద్దని వాళ్ళ భాషలోనే బలంగా చెప్పింది స్వాతి. చక్కగా వివరించారు లలితా!థాంక్ యూ!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు