“ముత్యాలు , పని ఐపోగానే ,ఆఫీసు గదిలోకి రమ్మని చెప్పమన్నారు అమ్మగారు”
‘ అదేంటి ఇంకా పదకొండో తారీఖు ! ఏమన్నా మళ్ళీ కొత్తగా పనులు పెంచుతారా? మొన్న విరిగిపోయిన, గాజుగ్లాసు కి జీతంలో పట్టుకుంటానని చెప్తారా ? పది రోజుల క్రితం ఎవరో హైదరాబాద్ నుంచి వస్తున్నారంటే ఎనిమిదింటికి రమ్మంటే పదింటికి వచ్చాను : రెండో కూతురు చిట్టికి కుక్క కరిచిందంటే ఇంజక్షన్ చేయించడానికి పెద్దాసుపత్రి కి వెళ్ళాల్సొచ్చింది ఆ తప్పుకి ఏవన్నా పంచాయితీ పెడతారేమో!’
క్షణంలో , జోరీగల్లా మోగుతున్న ఆలోచనలన్నీ విదిలించుకుంటూ ‘సరే’ అంది పైకి ముత్యాలు.
పని ముగించుకుని ,ఆఫీసు గది బయట వరసగా వేసున్న ప్లాస్టిక్ కుర్చీల మధ్యలో నిలబడింది ముత్యాలు .
ఆఫీసు గదిలో చాలా హడావిడిగా ఉంది .బయటికి ఏం మాటలు వినిపించడం లేదు .ఏసీ గది కదా ! గాజు అద్దంలోంచి సత్తెమ్మ గారు అంటే పెద్దమ్మ గారు, పెద్ద కుర్చీలో కూర్చుని ,ఇంకో పెద్ద బల్ల వెనకాల , కనబడ్డారు .
అదేంటో !ఈసారి బల్ల మీద ఏమీ లేవు ఇదివరకైతే బోలెడు కాయితాలు, ఫైళ్ళు ఉండేవి.మరిప్పుడు ఏమున్నాయి ?ముందు కాళ్ళ మీద నుంచుని, గాజు తలుపు దగ్గర గా ఆనుకుని తల పైకెత్తి , కొంగలా కొంచెం మెడ ఒంచి, బాగా దగ్గరిగా చూసే లోపున ,బోలెడు మంది మనుషులు, ఎదురుగా ఉన్న కుర్చీలలో నుంచి ఒక్కొక్కరు, లేచి వెళ్ళి, ఆవిడకి అందించి ఏదో మాట్లాడి, మళ్ళీ వెనక్కి వెళ్లి కుర్చీ లో కూర్చుంటున్నారు.
ఇదిలా ఉండగా వెంకన్న బయటకు వచ్చాడు . “రాయే! ముత్యాలు “ అంటూ లోపలికి తీసుకుపోయాడు .ఎదురుగా నిల్చుంది ముత్యాలు.
“ ఆ ! ముత్యాలూ! ఆ మధ్య …..”
‘అయ్యింది రా ! మావో !వారం క్రితంవిరిగిపోయిన పింగాణీ బొమ్మగురించే… , ఇంక దేని గురించీ కాదు .!దేవుడా!! ఇంకా ఏం గుర్తొస్తాయో ?ఏమో ? అమ్మగారికి …’అని ముత్యాలు కాళ్ళలో వణుకు పుట్టింది . “ముత్యాలూ! నీతో పాటు నీ చుట్టాలు , పక్కింటోళ్ళూ… అందరూ ఉంటారు కదా! ఓ మాట చెప్పు! అందరికీ తలా ఒకటి….ఆరణి పట్టు చీర , సిద్ధంగా ఉంచాను …అప్పుడెప్పుడో నా పాత పట్టు చీర గురించి , పోయిందని నిన్నడిగి కాస్త హడావుడి పడ్డాను కదే
!!”అమ్మగారు ఎదో చెప్తున్నారు.ఇదేంటి కొత్తగా!
‘ ఐనా, నాకెందుకు గుర్తులేదు ? చీర మీద ఏదో ఒలికిందని, పెళ్ళి భోజనంనుంచి రాగానే, దాన్ని అనుకోకుండా చిన్నమ్మాయి గారి చున్నీతో కలిపి నీటిలో నానబెట్టి , ఆ రంగు అంటుకుపోయిందని నానా యాగీ చేసి , ఉదయం తొమ్మిది గంటలకే డ్రై కీనింగు షాపులకు వెంకన్నని పరుగెత్తించి, మర్చిపోయి , తర్వాత ‘చీర పోయిందం’టూ ఇంట్లో పని వాళ్లందరినీ నిలబెట్టి , అరగంట సేపు తిట్టి , ఇళ్లకి కూడా , మనిషిని పంపి, సోదా చేయించారు….! ఎలా మర్చిపోతుంది? …. వీలైనంత నవ్వు ముఖం పెట్టింది ముత్యాలు .
పక్కనున్న ఖద్దరు చొక్కా ఆయన చేతితో సౌంజ్ఞ చేశాడు . అంతే 10 అట్టపెట్టెలు వచ్చాయి ..!
“జాగ్రత్తగా తీసుకెళ్లండి .మీ వాళ్లందరికీ ఇవ్వాలి . నేనిచ్చానని చెప్పు .”అంది యజమానురాలు .
ఒకటీ- రెండు అయితే పట్టుకోగలం గానీ పది పెట్టెలు ఎలా పట్టుకోవాలో తెలియక , అసలిదంతా ఎందుకో తెలీక , అయోమయంగా చూస్తూ నిలబడింది ముత్యాలు .
“.కొండా! రా !” అన్నాడు ,వెంకన్న .”కొండకి పనుంది. నువ్వు చిన్న కారు తీసుకుని ,వెళ్ళు “ఖద్దరు చొక్కా ఆయన చెప్పారు.
తల ఊపి ,బయటకు వచ్చాడు వెంకన్న “రాముత్యాలు , ఇవాళ ఛాన్స్ కొట్టావు చిన్న కారట ‘
“చిన్నకారూ ఒద్దు, ఏటీ ఒద్దు బాబా! నాకు చిన్నకారు అదీ పడదు . నువ్వు తిన్నంగా రాజుగారి పాల కొట్టుకాడికి వచ్చేయి .నేను అక్కడ నిలబడతాను .అంతకన్న కారు కూడా లోపలికి పోదు.” అంటూనే ముత్యాల నడిచి వెళ్లి పోయింది పెట్టెలన్నీ చిన్న కారులో సర్దుకుని వెంకన్న బయలుదేరాడు రెండు సందులు దాటేసరికి , తనదో, ఎదుటివాడిదో తప్పెవరిదైనా ….కారు , ‘పల్సర్ ‘గుద్దుకున్నాయి .
సడన్ బ్రేక్ వేసి ఆపి , కిందకు దిగాడు వెంకన్న . “ ఏరా? కళ్ళు నెత్తికెక్కాయారా?” గదమాయించాడు. “ నీకే కావాలేమో కళ్ళద్దాలు ?!” విసురుగా చెప్పాడు వాడు . “ఏరా మాటలు లేస్తున్నాయి ?! ఇది ఎవరి కారో తెలుసా ?” అన్నాడు వెంకన్న.
“జై ——— అన్నా ! జై, జై ,————-అన్నా!————- గుర్తుకే మీ ఓటు ! ————-గుర్తుకే మన ఓటు !!!” గబగబా బండి తోలుతున్న కుర్రాడు , వెనకాల కూర్చున్న మరో ఇద్దరు పిల్లలు ఒకటై అరుపులు లంకించుకున్నారు . ఒకడైతే చొరవగా కారు తలుపులు తీయబోయి ,”అయినా కారులో ఏమున్నాయి ? అసలు కారులో ఏమున్నాయి ? చెప్పన్నా? మీరేం పంచుతున్నారు ??” అంటూ గట్టిగా అరిచాడు .వెంకన్న కి చెమటలు పట్టాయి పైకి తెలియకుండా, బింకంగా ,”వద్దురా బాబు !మీ మానాన మీరు , మా దోవన మేం పోదాం. ఎవరైనా ఏముంది?! ఇంకోళ్ళకి పనిచేసే వాళ్ళమే ,కదా ! మనకి మనకి మధ్యలో గొడవలెందుకు ?!పద తమ్ముడూ ! బయల్దేరెళ్ళెళ్ళు” అని వాళ్లని పంపేసి , కార్ హెడ్ లైట్ ని ఓసారి తడుముకుని ‘పోనీలే పై డిప్పే. పెద్ద ఖర్చవ్వదు “, అనుకుంటూ మళ్లీ కారెక్కి బయలుదేరాడు. ప్రశ్నార్ధకంగా ఆలస్యమైందేమని చూస్తున్న ముత్యాలుతో ‘జెసిబి ఎనక్కి తిప్పతన్నారు.. ట్రాపిక్జామక్కడ!” అన్నాడు.
సంచుల్లో పెట్టెలు సద్దుకుని చెరో రెండూ తలొక చేత్తో పట్టుకుని,కాలనీ లోపలికి వచ్చారు. మురికి కాలువలు , దోమల పటాలంతో సహా ఎదురయ్యాయి. పక్కనే కాల్చిన రబ్బరు టైర్ల పచ్చి వాసన . కోళ్లు అడ్డంగా పరిగెడుతుంటే, పందులు డ్రైనేజీ లో ,మహదానందంతో మూలుగుతున్నాయి. గన్నేరు చెట్టు పక్కనున్న రెండు గదుల ఇంటి ముందు నాచు కట్టిన సిమెంట్ తొట్టెలో రెండు గ్లాసులు పెట్టి నీళ్లు అటు ఇటు పోసుకుంటూ తన మూడేళ్ల మనవరాలు కేరింతలు కొడుతోంది . మూడడుగుల దూరంలో కుక్కి మంచం మీద మాంగారు నర్సయ్య , యధాలాపంగా బీడీ కాల్చుకుంటూ పడుకొని, వేసంగి వేడిని వేడి తోనే మాఫీ చేసుకుంటూ పడుకున్నాడు. కుక్కలు అనుమానంగా
మొరిగేతలికి , కదిలి, వెంకన్న ని ఎగాదిగా చూస్తూ , మంచం మీద సర్దుకుని కూర్చున్నాడు నర్సయ్య.
పెట్టెలు దింపి , గుమ్మం పక్కన పెట్టి, “ముత్యాలూ!ఎలక్షన్ కోడ్ వచ్చేస్తోంది !ఒక చీరకి రెండు ఓట్లు …!అర్థమైందిగా ! ? ఏటి ?!”
మళ్లీ వచ్చిన దారిన బయలుదేరాడు . .ఇప్పుడు అర్థమయింది ఈ చీరల పేరంటం ఏమిటో! ముత్యాలు కి.
“ఏటిదంతా. ఓటు బేరాలేనా ?! పర్లేదులే !ఈనెలకన్నీ బగుమానాలే! ఇందాకనే, రాజు కొత్త టీవీ తెచ్చాడు . రంగ కి కిరికేట్ కిట్నంట.., నా దాకా ఇంకా ఏదీ బయానా రాలేదు !మీ అత్త ఓటు ఇంకా తీసేసి ఉండరు . ఎవరొచ్చినా వాళ్ళ చెల్లెలు కాడికి , ఊరెళ్ళింది అని చెప్పు . కాటికెళ్లిందనేవు! పొరపాట్న… ఎందుకు బగుమానం పోగొట్టుకునేది?” మాంగారి మాటలు మెల్లగా వేడిగాలితో పాటు చుట్టూ తిరుగుతున్నాయి…
‘వేలికి చుక్కెడతారు! అత్త ఓటెవరేత్తారో! ఏటో! ముసలాయనకేటీ తెల్దు..!’ అనుకుంది ముత్యాలు. చంటి పాప నీళ్ళ తొట్టి లోంచి , “మమ్మమ్మా…. బూ…! “ అంటూ ఒక ఆకుపచ్చగా వున్నదేదో ,చేత్తో ఎత్తి చూపించింది.
పరధ్యానంగా ఉన్న ముత్యాలు , ఉలిక్కిపడి ఎక్కడ నోట్లో పెట్టుకుంటుందోనన్నట్టు ,
’వద్దమ్మా !!!’ అంటూ వేలాడుతున్న నాచు మొక్కని దూరంగా విసిరేసి పిల్లని చంకలో వేసుకుని , పిల్ల చెయ్యి సబ్బుతో కడగడానికి ఆయత్త మైంది .
**********
“మనసు మమత” సీరియల్ టైం అయిపోతోంది, పెద్దకూతురు ఇంకా ఇంటికి రాలేదు -పాపం ! కొట్లో ఏం లేటైందో.. ఏమో ! చంటి పిల్ల నాలుగు మెతుకులు తిని, నిద్రకి వచ్చింది . నరసయ్య కి బువ్వ పెట్టింది.
ఇంతట్లో , గట్టిగా మాటలు వినబడ్డాయి .
రంగా వచ్చినట్టున్నాడు ! వెనకాల వేసుకున్న గదులు గదులు బ్యాగు తీసి కింద పెట్టాడు . చిటికలో స్నానం చేసి వచ్చి ,కొత్త చొక్కా వేసాడు . గుప్పు మంటూ సెంటు వాసన. తలకు కూడా ఏదో రాశాడు .”ఏరా! నత్తల వేపుడు,” అంది ముత్యాలు.
“అమ్మా! బిర్యానీ పేకెట్స్తు ఇస్తన్నారులే !”
”మరి , కాలేజీ మానేసేవా… ఏంటి ?”
“కాదులే ! ఫ్రీ టైం లోనే , గుంపులో గోవిందా , అని వెళుతున్నా. …ఏంటీ? ఏవో పెట్టెలు కనబడుతున్నాయి?”
“అయా!… పెద్దమ్మ గారిచ్చారు. ఓట్లుఎలక్షన్లంట కదా ! బహుమతులు..” “మీ పని బాగానే ఉందే !!!”రంగా చిన్న ఈల వేశాడు.
“ఏమోరా ! కలో- గంజో, ఉన్నది తినాలి గానీ…. ఇలా మన్ది కాన్ది మనం తీసుకుంటే ఇంకో చోట పోతది . అయినా, మీ నాన్న అయాంలో , నేనెవరికీ పెట్టింది లేదు . పెద్దమ్మ గారి పుణ్యమా అని ఇప్పుడు అందరికీ తలో టి పంచేస్తాను !”
“మరి నీకో!”
“నా కొడుకే నా భోగం!”
గట్టిగా నవ్వాడు రంగ!
“ఇంతకీ , నువ్వు గాని చుక్కేసుకుంటన్నావా? ఏమి?” నిలదీసింది ముత్యాలు .
రంగ ముత్యాలు కి దగ్గరగా వచ్చాడు .కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు .”అమ్మా! తాగి ,తాగి నాన్న ఒళ్ళు ,గుండే , పేగూ, కన్నాలడి పోయాయి కదా ! పొట్టలో కంతొచ్చి, ఇరవై ఒక్క రోజు , పెద్దాసుపత్రిలో పగలు ,రాత్రి -మందులు కంపు -ఒంటేలు కంపు – రక్తంతో తడిసిపోయిన బ్యాండేజీల కంపు- ఎన్ని పడ్డానే ?!! తెలిసీ ఆ గూటికి ఎలా పోతాను?” మెత్తగా చెప్పాడు, రంగ.
“ఏమోరా జట్లు కట్టి ,బిర్యానీ పాకెట్ల కాడికి పోతుంటే ….. ఎవరికీ చెప్పుకోలేని ఏదో బాధ.. రా ! ఉన్నదాంతో బతకాలి గాని…”.
”నువ్వేం బెంగ పెట్టుకోక! ఓటు ఫలానా వాడికి వేయమని చెప్పడం, మన ఓటు ఎవరికెయ్యాలో మరొకడు మనకి చెప్పడం , ఇలా గుంపుగా మన్నందర్నీ ఏదో ఒక బహుమానం ఇచ్చి , తప్పుడుపన్లు చేయించడం ….వీటన్నిటికీ దూరంగా పోవాలి ..అందుకే ,ఉద్యోగం చూసుకుంటా . ఉద్యోగం వచ్చేంత చదూకుంటా ! మన ఇంటి తలుపు ఎలక్షనొచ్చేసరికల్లా, ఎవడో ఒకడు తట్టకుండా ఉండేలా … దూ…రంగా ఇల్లు కడతా ! అక్కడ నిన్ని పెడతా !నువ్వు బెంగ పెట్టుకోకే అమ్మా!”
‘మరి జట్లు?’
”అమ్మా!…. ఇక్కడున్నన్నాళ్లు ,నలుగురితో ఉన్నట్టుండాలి …. నీకదంతా తెలీదు గానీ , పడుకో !”బయటికి నడిచాడు, “అక్క,,బావ రాలేదా ఇంకా..?!. చంటిది జాగర్త” చివరాఖరు మాటలు దూరంగా వినబడ్డాయి .
అంతా తెలవకపోయినా, రంగా మటుకు తెలిసినట్టుంది. ఈ పాటికిరావాల్సిన పెద్ద కూతురు, అల్లుడు కోసం ఎదురుచూస్తూ కూర్చుంది ముత్యాలు. పిల్ల వస్తే మనవరాల్ని ఒప్పచెప్పేసి అమ్మమ్మ డూటీ దిగీవచ్చు.!
*
very nice story madam…
Thanku Kalyan… ThankYou
Sailaja, very natural, truthful story.
Thanku Indira. So nice of you
Excellent and realistic
ThankYou verymuch Sir
శైలజ, చక్కగా రాసారు. మంచి సందేశం ఇచ్చారు -మనది కానిది మనం తీసుకుంటే ఇంకో చోట పోతుంది అని.
గదుల గదుల బ్యాగ్… కొద్ది క్షణాలు పట్టింది అర్ధం అవడానికి…
Thanku Chitra …
ఓటరుకు నిజంగానే మీరు చూపిన విజ్ఞత వస్తే దేశందుస్థితి కొంచమైనా మారుతుంది.చాలాచక్కగా కథని మలిచారు శైలజ గారు అభినందనలు.💐
Thanku Vasudharani garu…
నిత్య జీవితంలో మన చుట్టూ తిరిగే ముత్యాలు, వెంకన్న , నీ కథలో చక్కగా ఒదిగి పోయారు…. రంగ లాంటి వాళ్లకోసం సమాజం ఎదురుచూస్తున్నది..జరుగుతున్న తతఃగంలోనుండీ కోరుకునే మేలుకొలుపు …..చక్కటి కథానిక శైలు ….
సరిగ్గా నా ఆలోచనలివే మిత్రమా…!
Excellent sailaja one more interesting story from you. Really you are great. How you get the themes
Wonderful story madam gaaru. పరిసరాల చిత్రణ, పాత్రల మానసిక చిత్రణ ఛాలాబాగున్నాయి.
బాగుంది మీ కథ. చైతన్యం నింపే కథ.