ఎర్ర రాజ్యంలో నల్ల బజారు

లేషియాలోని పోర్ట్ కెలాంగ్‌లో ఉన్నాం. మన కళింగ ప్రాంతానికి అనాదిగా ఈ రేవుతో వాణిజ్య సంబంధాలుండేవనీ, ఆ పట్టణం కళింగదేశ వ్యాపారుల కేంద్రంగా విలసిల్లందనీ, అందుకే ఆ రేవుకి కెలాంగ్ అనే పేరు ఏర్పడిందనీ, గురూజీ క్రిష్ణన్ తెలిపాడు.

పోర్ట్ కెలాంగ్‌ నుండి బయలుదేరి, నల్ల సముద్రంలోని సోవియట్ (ఇప్పుడు యుక్రెయిన్) పోర్టు ఒడెస్సా వెళ్తున్నామని తెలిసింది. నల్ల సముద్రాన్ని చేరుకోవడానికి – మొదట ఎర్ర సముద్రాన్ని దాటి, సూయెజ్ కాలువగుండా మధ్యధరా సముద్రాన్ని చేరుకొని, ఇస్తాంబుల్‌లోని బోస్ఫోరస్ జలసంధిలో ప్రయాణించాలి. ముందే చెప్పినట్లు, 1967లో మూతబడ్డ సూయెజ్ కాలువని ఆ ముందు ఏడాది (1975) తిరిగి తెరిచారు. నేను ఈ భౌగోళిక వివరాలు, మా ఓడ ప్రయాణించబోయే సముద్రమార్గం – వీటిని ఊహించుకుంటూ, ఉత్సాహంతో తబ్బిబ్బు అవుతూండగా. ఇద్దరు సీనియర్ కేడెట్‌లలో ఒకడైన జస్‌బీర్ నా కేబిన్‌లోకి హడావుడిగా వచ్చాడు.

నల్ల సముద్రం (గూగుల్ మ్యాప్)]

జస్‌బీర్, మెనన్ -వీళ్లిద్దరూ ఆ ఓడలో సీనియర్ డెక్ కేడెట్‌లు. రోజుకి కనీసం పన్నెండు గంటలు పనిచేస్తారు. మాది టేంకర్ గనుక డెక్ ఆఫీసర్లకీ, కేడెట్‌లకీ పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. టేంక్ క్లీనింగ్, లోడింగ్ అన్‌లోడింగ్, బ్రిడ్జ్ మీద వాచ్-కీపింగ్, వగైరా. నేను జూనియర్ ఇంజినీర్‌ని గనుక సీనియర్‌లతో సన్నిహితంగా ఉండే అవకాశాలు తక్కువ. డెక్ కేడెట్‌లతో సావాసం కుదురుతుంది. వాళ్లు కూడా జూనియర్ ఇంజినీర్‌లతో స్నేహంగా ఉంటారు. ఇందుకు మరో కారణం కూడా ఉంటుంది. ఈ విషయమై గురూజీ నన్ను హెచ్చరించాడు. ఇంకా ట్రెయినింగులో ఉన్నారు గనుక కేడెట్‌లకు బాండెడ్ స్టోర్ నుంచి సిగరెట్లు, ఆల్కహాల్ ఇవ్వరు.

టేంక్ క్లీనింగ్‌తో తడిసిన బాయలర్ సూట్లో నా కేబిన్‌లోకి అడుగుపెడుతూనే,

“ఒరేయ్! ఒక బీరు క్యాన్ ఇలా అందుకో!” అన్నాడు, జస్‌బీర్.

తీసి ఇచ్చాను. అక్కడే గడగడా తాగేశాడు.

“హమ్మయ్య! ఇంక స్నానంచేసి, డిన్నర్ కానిచ్చి, హాయిగా పడుకోవచ్చు. మళ్లీ నాలుగ్గంటలకి లేచి బ్రిడ్జ్ మీదకి వెళ్లాలి. అవునూ, నిన్న నీకు చెప్పిన పని చేశావా?”

ముందురోజు వాడు నాకొక హితబోధ చేశాడు. రష్యా (సోవియట్ యూనియన్) వెళ్తున్నాం గనక చిక్లెట్‌లూ, బటన్ నొక్కితే తెరుచుకొనే గొడుగులూ, అమెరికన్ సిగరెట్లూ కొని పెట్టుకోమనీ, వాటికి అక్కడ విపరీతమైన డిమాండ్ ఉంటుందనీ, వందలకొద్దీ రూబుల్స్ దండుకోవచ్చనీ నాకు బోధపరిచాడు. ఆ కరెన్సీ మరెక్కడా చెల్లదు గనుక రష్యాలోనే తగలెట్టాల్సి ఉంటుందని హెచ్చరించాడు. వాడి మాటలు నేను పట్టించుకోలేదు.

అవేవీ నేను అక్కడ – అంటే మలేషియాలో కొనలేదన్నప్పుడు, చాలా కోపగించుకున్నాడు.

“నీకు తెలియనప్పుడు, నాబోటి వాడు చెప్పింది చెయ్యాలి! సరేలే, నేనే తెప్పిస్తాను. డబ్బు తరవాత ఇద్దువుగాని,” అనేసి, చిరాగ్గా వెళ్లిపోయాడు.

మర్నాడు నిజంగానే డజెన్‌ల కొద్దీ చిక్లెట్ కార్టన్లూ, రెండు డజన్ల గొడుగులూ, ఆరేసి కార్టన్‌ల కెంట్, మార్ల్‌బరో సిగరెట్లూ (మా షిప్పులో వాళ్లెవ్వరూ అమెరికన్ సిగరెట్లు తాగడానికి ఇష్టపడరు; అవి మరీ స్ట్రాంగ్‌గా ఉంటాయి). ఏజెంటు మనిషి ద్వారా తెప్పించి, నా కేబిన్‌లో పెట్టించాడు.

“అమెరికన్ డాలర్లకు కమ్యూనిస్టు దేశాల్లో గొప్ప డిమాండ్ ఉంటుంది. బ్లాక్ మార్కెట్లో మారిస్తే డబ్బేడబ్బు. కానీ వొద్దులే, ఈ ట్రిప్పుకి ఇవి సరిపోతాయి. ఎప్పటికైనా డాలర్లు వెంట ఉంచుకోవడం మంచిది,” అంటూ తెప్పించిన వస్తువులకు ధర కట్టి, సింగపూర్ కరెన్సీ తీసుకున్నాడు.

మా నాన్నగారికి మేనమావ అయ్యే వుప్పల లక్ష్మణరావుగారు వ్రాసిన ‘సోవియట్ దేశం, భూతల స్వర్గం’ చదివి ఉన్నాను. భూతల స్వర్గంలో బ్లాక్ మార్కెటా? నమ్మలేకపోయాను. అదేమాట జస్‌బీర్‌తో అంటే, వాడు –

“నువ్వొక దద్దమ్మవిరా! మనం ఏమన్నా ఎగుమతి-దిగుమతి వ్యాపారం చేస్తున్నామా? మనం ఇక్కడ కొనే వస్తువులన్నీ అమ్మేది బ్లాక్ మార్కెట్లోనే! చెప్పినట్టు చెయ్యి, బాగుపడతావు!” అనేసి వెళ్లిపోయాడు,

మార్కెట్ నిర్వచనం గుర్తుకొచ్చింది. అది ‘సప్లై డిమాండ్‌లు కలుసుకొనే ప్రదేశం’. ఆ మార్కెట్ రంగు తెలుపా, నలుపా, ఎరుపా అనేది ముఖ్యం కాదు.

ఈ జస్‌బీర్ అనేవాడు జుత్తు కత్తిరించుకున్న సర్దార్ (‘కట్ సర్డ్’); నా వయసువాడే; మరో ఏడాదిలో (పరీక్షలు ప్యాసైతే) ఫోర్త్ ఆఫీసర్‌గా షిప్‌లో చేరుతాడు. వాగుడుకాయి; సహజ స్నేహశీలి. స్ట్రీట్ స్మార్ట్. మన భాషలో మహా ముదురు. హిందీ మాట్లాడేటప్పుడు పంజాబీ బూతులు వాడి నోటి వెంట సహజంగా వస్తాయి. అవసరం అయితే చక్కటి ఇంగ్లీషు, ఫ్రెంచ్ మాట్లాడగలడు. వాడి నాన్న ఎయిర్ ఇండియాలో పైలట్. వాడికి తెలియని సంగతులు లేవు. వారానికి రెండుసార్లయినా నా కేబిన్‌కి విచ్చేసి, రెండో మూడో బీర్లు తాగిపోతుంటాడు. వాడి కంపెనీ ఉత్సాహం కలిగిస్తుంది గనక నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. పైగా ప్లేబాయ్, పెంట్‌హౌస్, డెబొనేర్ పాత పత్రికలు సేకరించి పెట్టుకొనేవాడు; నా వంటి సన్నిహితులకు ఉదారంగా ఇచ్చేవాడు.

మరో కేడెట్ మెనన్ వీడికి పూర్తిగా భిన్నం. అప్పడప్పుడూ వస్తాడు; రిజర్వ్‌డ్‌గా ఉంటాడు; మితభాషి. ఇంగ్లీషు సాహిత్యం, ముఖ్యంగా సమకాలీన బెస్ట్ సెల్లర్సన్నీ బాగా చదువుకున్నవాడు.

“ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్! నువ్వు తప్పక చదవాలి,” అంటూ తనకు నచ్చిన పుస్తకాలను నా చేతిలో పెట్టి వెళ్తూంటాడు. పాశ్చాత్య సంగీతంతో నా పరిచయం బీటిల్స్‌తో ఆగిపోకుండా కార్పెంటర్స్, నీల్ డయమండ్, క్లిఫ్ రిచర్డ్స్, బాబ్ డిలాన్‌లకు విస్తరించడానికి కారకుడు మెననే. ఒక్క క్యాన్ బీరుకన్నా ఎక్కువ తాగడానికి మొహమాట పడతాడు.

“వాడి వంతుకూడా నాకిలా పడెయ్! నా పేరులోనే బీరుంది!” అంటాడు, జస్‌బీర్.

ఒడెస్సా చేరుకోగానే వందల రూబుళ్ల కట్టలు వచ్చి నా వొళ్లో పడ్డాయి. అమ్మకాలు, బేరసారాలు జస్‌బీరే చూసుకున్నాడు. వాడి కలెక్షను వేలల్లో ఉంది.

“పొరబాటు చేశాను! నీ కోసం కూడా ఆడవాళ్లు తొడుక్కొనే అమెరికన్ జీన్స్ ఓ రెండైనా తీసుకోవల్సింది. అవంటే వీళ్లు పడిఛస్తున్నారు,” అంటూ వాడు బాధపడ్డాడు.

ఒడెస్సాలో ఉండబోయే వారం రోజుల్లో అంత డబ్బుని ఎలా తగలెయ్యాలి? అనేదే మా సమస్య.

“ఇంతకు ముందోసారి ఇక్కడికి వచ్చాను; ఇక్కడకూడా డబ్బుపెట్టి సెక్స్ కొనుక్కోవచ్చుగానీ, నాకది ఇష్టంలేదు. మన ఛార్మ్‌తోనే ఈ తెల్ల గుంటల్ని జయించాలి. అదీ అసలైన ఛాలెంజ్!” అన్నాడు జస్‌బీర్, వీరోచితంగా.

“పోరా! నిన్ను చూసి ఇప్పటికిప్పుడు ఎవత్తె పడిపోతుంది?” అన్నాను.

“చూస్తూ ఉండు, ఎలా పడగొడతానో! ” అన్నాడు, ధైర్యంగా.

“జస్‌బీర్‌గాడిని తక్కువగా అంచనా వెయ్యకు, ముఖ్యంగా ఈ విషయంలో,” అన్నాడు మెనన్.

జస్‌బీర్‌ సాధించిన నాటకీయమైన ‘ఘన విజయానికి’ నేనే ప్రత్యక్ష సాక్షిని.

***

ఒడెస్సా రేవునుండి సిటీకి వెళ్లడానికి నీస్టర్ నదిని దాటాలి. ప్రముఖ యుక్రేనియన్ రచయిత నికొలాయ్ గొగోల్ నవల ‘తారాస్ బుల్బా,’ ఈ నది ఒడ్డునే, కోసక్ వీరుడు తారాస్ మరణంతో విషాదాంతంగా ముగుస్తుంది. మా టాక్సీ ఆ నదిని దాటుతూన్నప్పుడు తారాస్ సంగతి జస్‌బీర్‌కి చెప్పాలని ఉబలాట పడ్డానుగానీ నన్ను నేను నియంత్రించుకున్నాను. ఇటువంటి పనికిమాలిన వివరాలలో వాడికి ఆసక్తి ఉండదని నాకు తెలుసు. ‘అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు?’ అంటూ రకరకాల సైగలతో డ్రైవర్‌ని వేధిస్తున్నాడు. భాష రాకపోయినా, వీడి బాధ అతనికి అర్థం అయింది.

టాక్సీ డ్రైవరు ఆ వేసవి సాయంత్రం పూట, ఇంకా ఎండ కాస్తూండగానే జస్‌బీర్‌నీ, నన్నూ ఒడెస్సా సెంట్రల్ స్క్వేర్‌లో దింపాడు. కాస్త చలి అనిపించిందిగానీ మేము వేసుకున్న జాకెట్లు మమ్మల్ని వెచ్చగానే ఉంచాయి. దినాంతపు బంగారుటెండలో స్వచ్ఛంగా మెరిసిపోతూన్న పచ్చదనం; ఆప్యాయంగా పలకరిస్తూన్న పూలమొక్కలు; మధ్యలో విరిసిన ఫౌంటెన్ చేస్తూన్న సన్నటి ఉపశమనపూరిత ధ్వని; వచ్చేపోయే వాహనాలతో కళకళలాడుతూన్న కూడలి; ట్రామ్‌ల రణగొణ ధ్వనులు; హారన్‌లు మోగించకుండా సాగిపోతూన్న బస్సులు, లాడా కార్లు.

స్క్వేర్‌ని ఆనుకొని, చెట్లూ-చేమలతో నిండిన విశాలమైన ప్రదేశం; దాని మధ్య సుత్తీ కొడవలి గుర్తు క్రింద ఎత్తుగా, ఠీవిగా నిలబడ్డ సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ఒడెస్సా కార్యాలయం; స్క్వేర్‌కి ఒకవైపున ఉన్న గోడపై యుక్రేయిన్ రిపబ్లిక్‌కి చెందిన కమ్యూనిస్ట్ వీరులు, వీరవనితల నిలువెత్తు చిత్రాలు. వారిలో ఎక్కువమంది నాజీలతో పోరాడుతూ, 1941-45ల మధ్య మరణించినవారే.

చిన్నతనంలో ‘సోవియట్ భూమి’ పత్రికతో బాటు వచ్చిన ‘రష్యన్ స్వబోధిని’ చిరు పుస్తకాలను కలిపి కుట్టి, బైండు చేయించి, నేర్చుకున్న లిపి అక్కరకు వచ్చింది, భాష అర్థంకాకపోయినా.

స్క్వేర్‌కి అన్నివైపులా దుకాణాలు; ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్; పెద్ద పుస్తకాల షాపు; ఒక మూలగా బేకరీ; హడావుడిగా నడుచుకుంటూ వెళ్లిపోతూన్న పాదచారులు; తలలకు స్కార్ఫ్ చుట్టుకున్న మహిళలు, బొద్దుగా ఉన్న పసిపిల్లల్ని ప్రేమ బండ్లలో తీసుకుపోతూనే కబుర్లు చెప్పుకుంటూన్న తల్లులు. స్క్వేర్‌లో ఉన్న బెంచీల మీద కూర్చొని స్వెట్టర్లు అల్లుతూన్న బబూష్కాలు (ముసలమ్మలు), ఒక మూల చదరంగం ఆడుతూన్న పండుజుత్తు పెద్దలు; వారిచుట్టూ చేరిన వీక్షకులు; దీక్షగా పుస్తకాలు చదువుకుంటూన్న యువతీ యువకులు. యూరప్‌లో అన్ని నగరాలు ఇంచుమించుగా ఆ విధంగానే ఉంటాయని అప్పుడు నాకు తెలియదు.

నగరం నడిబొడ్డున (కృత్రిమ మేధ – జెమిని)]

జనసందోహం తక్కువగా ఉన్న ఒక మూలకు తీసికెళ్లాడు జస్‌బీర్. నాలుగు బెంచీలలో ఒకటి ఖాళీ. అక్కడ కూర్చున్నాం. ఒక ప్రక్క అల్లికలో మునిగిపోయిన బామ్మగారు; మరో ప్రక్క పుస్తకం చదువుకుంటూన్న యువకుడు; ఎదురుగా పొట్టి పువ్వుల గౌనులో, కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా, అందంగా మెరిసిపోతూన్న అమ్మాయి.

“ఇప్పుడు చూడు! చూసి నేర్చుకో,” అని నాతో హిందీలో అని, జస్‌బీర్ ఆమెను పలకరిస్తూ, ‘కెంట్’ సిగరెట్టు పాకెట్ తెరిచి, ఒక సిగరెట్టుని పైకి లాగి, ఆమెకు ఆఫర్ చేశాడు. అప్పుడామె నవ్వింది; ఆ విధంగా నవ్వినప్పుడు ఆమె ఆమె బుగ్గ సొట్టపడింది; కళ్లు మెరిసాయి; చక్కటి పలువరుస కనిపించింది; ఆమె అందం రెట్టింపు అయింది – పాతకాలపు నవలల్లో మాదిరిగా.

“పాకెట్ తీసుకోవచ్చా?” అన్నది, ఇంగ్లీషులో.

“తప్పకుండా!” అని, జస్‌బీర్ ఆమెకు మొత్తం పాకెట్ దానం చేశాడు. ఆమె దాన్ని తన బ్యాగులో దాచుకుంది, “నేను సిగరెట్లు తాగను; మా అమ్మకి అమెరికన్ సిగరెట్లంటే చాలా ఇష్టం,” అంటూ.

“ఓ మై గాడ్! ఇంగ్లీషు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు!? నీ పేరు?” అంటూ మావాడు ఆమెను కుషామత్ చేశాడు. ఆమె మురిసిపోయి మళ్లీ నవ్వింది.

“యెలినా…ఒడెస్సా యూనివర్సిటీలో ఇంగ్లీషు లిటిరేచర్ చదువుతున్నాను,” అంది, కొంచెం గర్వంగా. చెయ్యిజాపి, జస్‌బీర్‌తో కరచాలనం చేసింది.

“అయ్యబాబోయ్! అయితే నువ్వు మా ఫ్రెండ్‌ని కలవాలి. వీడు సాహిత్యం బాగా చదువుకున్నాడు,” అని నన్ను ఆమెకు పరిచయం చేశాడు.

నేనింకా గొగోల్ ‘తారాస్ బుల్బా’ ప్రస్తావన తీసుకొద్దామని అనుకుంటూండగానే, జస్‌బీర్‌గాడు హిందీలో, “ఈ అమ్మాయితో నేను మాట్లాడుతూంటానుగానీ, నువ్వెళ్లి – అదిగో, ఆ బేకరీ నుంచి ఒక బర్త్‌డే కేకు పట్రా. డబ్బులు ఇచ్చేస్తాను,” అన్నాడు.

నాకు ఏమీ అర్థంకాలేదు. “బర్త్‌డే కేక్?! ఎవరి బర్త్‌డేరా?”

“నాదేలేరా! సైలర్ బాయ్ ఎక్కడో దేశంకానిదేశంలో ఒక్కడూ పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటే జనాలకు సింపథీ కలుగుతుంది. మిగతావాళ్లెవ్వరూ మన జోలికి రారు. తొందరగా వెళ్లు! కొవ్వొత్తి మర్చిపోకు!” అన్నాడు.

ఆరోజు వాడి పుట్టిన రోజు కాదని నాకు తెలుసు. ఎందుకంటే నెల్లాళ్ల క్రిందట నా దగ్గర రెండు కేస్‌ల బీరు తీసుకొని పార్టీ ఇచ్చాడు; బీర్‌లకి డబ్బివ్వబోయాడుగానీ, నేనే వద్దన్నాను.

ఆ విధంగా అక్కడ, ఒడెస్సాలో, ఆ సాయంకాలం అందరం మరోసారి జస్‌బీర్ పుట్టినరోజు జరుపుకున్నాం. తొలి కేకు ముక్కని యెలీనా తన చేతులమీదుగా జస్‌బీర్ నోటికి అందించింది. మిగతా ముక్కల్ని అక్కడున్న నలుగురికీ పంచే పని వాడు నాకు అప్పగించాడు. ముసలమ్మ ఆశీర్వదించింది; యువకుడు పుస్తకం ప్రక్కనపెట్టి చేతులు కలిపాడు. చదరంగ వీక్షకులు మావైపు తిరిగి, ఒక్క క్షణంసేపు చిరునవ్వులు చిందించారు. ఆడుతూన్నవాళ్లు తలెత్తలేదు. జస్‌బీర్ వెళ్లి ఆమె సరసనే కూర్చున్నాడు, ఆమెను తాకుతూ. యెలీనా అందుకు అభ్యంతరం చెప్పలేదు. పైగా కిలకిలా నవ్వింది.

ఆమె నడుము చుట్టూ చేయివేసి, అడవిలా ఉన్న పార్కులోకి తీసికెళ్లాడు. నేను సందేహిస్తూంటే, “నువ్వూ రారా!” అన్నాడు. వెంట నడిచాను. పొదలచాటున కూర్చున్నాం.

“నా పుట్టినరోజు గుర్తుండిపోయేలా నీకు స్పెషల్ కానుక” అంటూ తన సంచిలోంచి నైలాన్ స్టాకింగ్స్ పాకెట్ తీసి ఇచ్చాడు. యెలినా సంబరపడిపోయింది. ఆ సంచిని పోర్టు మెయిన్ గేటులోంచి తీసుకురావడానికి అక్కడున్నసెక్యూరిటీ గార్డులకి ఒక కార్టన్ మార్ల్‌బరో సిగరెట్లు సమర్పించుకున్నాడు.

అక్కడే, అప్పుడే ఆమె వాటిని ధరించాలనీ, తానే స్వయంగా తొడగాలనీ జస్‌బీర్ పట్టుబట్టాడు. యెలీనా అనవసరమైన సిగ్గు ప్రదర్శించకుండా అంగీకరించింది. తన కాళ్లమీదకి ప్రాకిన నల్ల రంగు నైలాన్ స్టాకింగ్స్‌ని నిమురుతూ మురిసిపోయింది. జస్‌బీర్ ఆమెను తడుముతూ ఆనందిస్తున్నాడు. ఇక నేనక్కడ ఉండడం భావ్యం కాదనిపించింది. అదేమాట వాడితో అన్నాను.

ఒడెస్సాలోకెల్లా అత్యంత ఖరీదైన రెస్టారెంట్‌లో కలుసుకుందామని నిర్ణయించుకున్నాం. అది అక్కడికి దగ్గరలోనే ఉందని యెలీనా తెలియజేసింది.

“అక్కడే కూర్చొని షాంపేన్ తాగుతూ ఉండు. కేవియర్ కూడా చాలా ఫేమస్. ఈ కార్యక్రమం ముగించి అరగంటలో వచ్చేస్తాం,” అంటూ నన్ను సాగనంపాడు జస్‌బీర్.

నేను బయలుదేరాను. యెలీనా చెయ్యి ఊపింది. వాడు నావైపు చూసి, నవ్వుతూ కన్నుగీటాడు; బొటనవేలు చూపాడు. చీకటి పడుతూండగా సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ఒడెస్సా ఆఫీసు ఆవరణలోంచి బయటపడ్డాను. దూరంగా విద్యుత్కాంతిలో వెలిగిపోతూ లెనిన్ – ఎప్పటిలాగానే ఎడమచేత్తో కోటు అంచుని పట్టుకొని, కుడిచేతిని ముందుకు సాచి, అసహనంగా, గంభీరంగా ‘పదండి ముందుకు!’ అంటూ.

లెనిన్ విగ్రహం (వీకీపీడియా)

షాంపేన్ తాగుతూండగా జస్‌బీర్ ఒక్కడే మొహం వ్రేలాడేసుకొని రెస్టారెంట్‌లోకి వచ్చాడు. నేను ఊహించిన ఉత్సాహం వాడిలో మచ్చుకి కూడా కనిపించలేదు.

“యెలీనా ఏమైందిరా? వెళ్లిపోయిందా? రేపు మళ్లీ వస్తుందా?” అని కుతూహలంగా అడిగాను.

నా ఊహల్లో గొగోల్ ఇంకా మెదులుతూనే ఉన్నాడు. నేను బాగా ఇష్టపడ్డ ‘సాయంసంధ్యలు’ (Evenings on a farm near Dikanka) గురించి ఆమెతో మాట్లాడాలని గాఢంగా అనిపించింది. ఆ కథలు సృష్టించిన మాయాజాలం నుండి ఎన్నటికీ తేరుకోలేకపోయాను.

డిన్నర్‌కి వస్తానన్న యెలీనా రాకపోవడం నాకు నిరాశను కలిగించింది. ఆ దేశాల్లో ఇంగ్లీషు మాట్లాడేవారి సంఖ్య అతి స్వల్పం. అందులోనూ సాహిత్యం తెలిసిన చక్కటి అమ్మాయి! ప్రముఖ రష్యన్ కవి అలెగ్జాండర్ పుష్కిన్, ఒడెస్సాలోనే తన దీర్ఘ కవిత ‘యూజీన్ ఓనేగిన్’ రాశాడని ఎక్కడో చదివాను. ఆ విషయం యెలీనాని అడిగి రూఢిచేసుకోవాలనుకున్నాను… షాంపేన్ తలకెక్కింది.

షాంపేన్ చప్పరిస్తూ జస్‌బీర్ తన గోడు చెప్పుకున్నాడు. “అది పెద్ద ముదుర్రా బాబూ! దాని చెల్లెలికి ఇవ్వాలని అమెరికన్ జీన్స్ దొబ్బింది. నేనూ ఫూలిష్‌గా షార్లీ పెర్ఫ్యూం దొబ్బపెట్టాను. ఇది చాలక, ‘డాలర్లున్నాయా?’ అని అడిగింది, చాలూ ఛీజ్! అంతా అయ్యాక, బస్సెక్కిపోతూ, మళ్లీ రాలేను అనేసింది. పరీక్షలున్నాయి, చదువుకోవాలి అంది, దొంగముండ!” వాడి మాటల్లో మోసపోయాననే భావన వినిపించింది.

డబ్బిచ్చి సెక్స్ కొనుక్కోకూడదని జస్‌బీర్ అనుకున్నాడు కానీ సప్లై-డిమాండ్‌ల ఆవరణలో వస్తువులు చేతులు మారాయి; క్యాష్ కాకపోయినా కైండ్. సేవలు అందించబడ్డాయి. కానీ కస్టమర్‌ సంతృప్తి చెందలేదు. తొందరపడి ఇచ్చిన అడ్వాన్సు వృధా అయిపోయింది న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశంలేదు. మార్కెట్ అన్నాక ఇవన్నీ మామూలే. బేరసారాలూ, లావాదేవీలూ, ఒప్పందాలూ, ఉల్లంఘనలూ, మోసాలు, కల్తీలు – వీటన్నిటిపైనా వివాదాలూ.

ఆనాటి మారకంలో వాడు పొందినది వశీకరణ శక్తికి ప్రతిఫలంగా కాదనే విషయం వాడికీ అర్థం అయింది. సముదాయింపుగా, “పోతేపోనీ! నువ్వు అనుకున్నది సాధించావు కదా?” అన్నాను.

“ఆ, ఏదోలే!….మూడు నెలల ప్లానింగ్ కాస్తా మూడు నిమిషాల్లో ముగిసిపోయింది!” అన్నాడు, విచారంగా. వాడిని ఎలా ఓదార్చాలో తెలియలేదు. కాసేపు ఆలోచించి,

“పోనీలేరా, రేపు మళ్లీ మరో పుట్టినరోజు జరుపుకుందువుగాని! అయినా నీకా ఐడియా ఎలా వొచ్చిందిరా?! యు ఆర్ గ్రేట్!” అని, భుజం తట్టాను.

ఉదారంగా నవ్వేసి, “ఛీర్స్!” అంటూ షాంపేన్ గ్లాసుని పైకెత్తాడు.

అయితే ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు. ఆ రాత్రి షిప్పులోకి చేరుకుంటూనే ఒక దుర్వార్త విన్నాం. ఒక్కోసారి కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తూంటారు గనుక మా ఛీఫ్ ఆఫీసర్ కొంతకాలం క్రితం, తన ఖరీదైన స్కాచ్ విస్కీ సీసాలు రెండింటిని కేడెట్‌ల క్యాబిన్‌లో భద్రంగా ఉంచమని ఇచ్చాడు. జస్‌బీర్‌గాడు వాటిని ఖాళీ చేసేశాడు. అదే రోజున పట్టుబడ్డాడు. వాటి ధర చెల్లించేస్తానని ఛీఫ్ ఆఫీసర్‌తో జస్‌బీర్ విసురుగా పలికినప్పుడు, అతడు మండిపడి, వాడి షోర్‌లీవు రద్దుచేశాడు. అంటే షిప్పు పోర్టులో ఉన్నప్పటికీ బయటకు పోవడానికి వీల్లేదు.

మా ఎదుట ఛీఫ్‌ని కాసేపు బండబూతులు తిట్టాక, జస్‌బీర్ తన రూబుల్స్ కట్టల్ని నాకూ, మెనన్‌కీ పంచిపెట్టాడు. వాటిని తగలెయ్యడానికి నానా అవస్థలూ పడ్డాం. ఆ వివరాలు తరువాయి భాగంలో. చివరిగా ఒకమాట. సీసాలు ఖాళీ చెయ్యడంలో మెనన్ పాత్ర కూడా ఉన్నప్పటికీ, తప్పంతా తన మీదే వేసుకున్నాడు జస్‌బీర్. ఈ విషయం మెననే స్వయంగా నాకు చెప్పాడు.

*

ఉణుదుర్తి సుధాకర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Wonderful! I never imagined what offshore life at strange places could be like. Your narration sent me into a scene as if I were a witness to that evening. Thanks for sharing such an experience honestly. Looking forward to such outings

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు