రెండవ అమెరికా తెలుగు రచయితల సదస్సు ఈ సారి డాలస్ లో జరిగింది. దేశం నలుమూలల నుండి అమెరికా తెలుగు రచయితలు వస్తుండడం, ఉంటున్న ఊరులో ఈ సదస్సు జరుగుతుండడంతో ఎలాగైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని అనుకున్నాను.
ఇప్పటిదాకా ఫేస్ బుక్ ద్వారానే పరిచయం అయిన రచయితలను, సాహిత్యాభిమానులను ముఖాముఖి కలవబోతున్నాను అనుకుంటూ సదస్సు జరిగిన ప్రదేశానికి బయలుదేరాను. ముందుగా అల్పాహారం ఏర్పాటు చేయడంతో అందరూ ఒకరినొకరు తెలుసుకునే అవకాశం కలిగింది. అక్కడే సగం కొత్తదనం పోయి కాస్త రిలాక్స్ అయ్యాను. తరువాత వెంటనే ఆలస్యం చేయకుండా పరిచయ కార్యక్రమం ఆపైన అసలు చర్చా కార్యక్రమం మొదలైంది. చిన్నా పెద్దా, కొత్తా పాతా రచయితలంతా తమ గురించి తామే సభకు పరిచయం చేసుకోడంతో వాతావరణం తేలిక పడి ఉత్సాహం కలిగింది. ఆపై క్లుప్తంగా ఏయే అంశాలపై చర్చలు జరుగుతాయో తెలిసే సరికి మరింత ఆసక్తి నెలకొంది. కథ, కథనం, కవిత్వం, పత్రికలు-ప్రచురణలు, నవల ఇలా ఐదు విభాగాలుగా మొదటి రోజు చర్చలు జరిగాయి. ప్రతి అంశం పైన ఒక మండలిని ఏర్పాటు చేసి అందులో ప్రతి ఒక్కరికి ఒక్కో అంశంపైనా ఉపయుక్తమైన ప్రశ్న ఇచ్చి దానిపై చర్చలు, మిగతావారి స్పందనలు, విమర్శలు, అభిప్రాయాలకు తావు ఇచ్చి చక్కగా కార్యక్రమాన్ని నడిపించారు.
నాకు ముఖ్యంగా నచ్చిన అంశం సమయ పాలన. ప్రతి ఒక్క విభాగానికి ప్రశ్నలకు, చర్చలకు, స్పందనలకు సరిపోను చక్కగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేస్తూ కార్యక్రమాన్ని నడిపించిన తీరు హర్షణీయం. చక్కని అంశాలపై చర్చ ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేస్తూనే మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అమెరికా తెలుగు కథా గతిని తెలుపుతూ, భవిష్యత్తు ప్రణాళికల వరకూ జరిగిన చర్చ అమెరికాలో తెలుగు రచనలు చేసే వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పాలి. నేను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్న విషయాలు అనేకం. ముందుగా రచన పట్ల రచయితకి ఉండాల్సిన నిబద్ధత, నిజాయతీ, విశ్వాసం తెలుసుకున్నాను.
కథ పై పాఠకులకి గల ప్రభావం చర్చ ద్వారా రచయిత ఎంత వరకు పాఠకుల స్పందనని తీసుకోవచ్చో తెలుపుతూ, రచయితకు తన రచన పట్ల ఉండాల్సిన నమ్మకం గురించి చెప్పినప్పుడు కొండంత ధైర్యం వచ్చినట్లు అనిపించింది. ఇలా మనసులో రచన పట్ల ఉండే ఎన్నో అనుమానాలను తెలియకుండానే చక్కని ప్రశ్నల్లో అందించి చర్చల ద్వారానే సమాధానాలు తెలిసేలా చేసారు. ఇవే కాకుండా పుస్తక ప్రచురణల గురించిన ఎన్నో విషయాలను చర్చించి, వాటిలోని కష్ట నష్టాలను తెలిపినప్పుడు మేమున్నాము మీతో అన్న ధైర్యాన్ని ఇచ్చినట్టు అనిపించింది. రాసే వారికి చదవడం ఎంత ముఖ్యమో తెలిసింది. చదవడం, చదివించడం, రాయడం, రాయించడం ముఖ్య ప్రణాళికగా ఈ కార్యక్రమము జరిగింది. మధ్యలో చతుర సంభాషణలతో, చమత్కార స్పందనలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉపయుక్తంగా జరిగింది ఈ సభ.
సభ విజయ వంతంగా జరిగిందనడానికి చిన్న ఉదాహరణ చెప్పాలి. “చారిత్రక నవలలు వాటికోసం చేయవలసిన కృషి” అనే అంశం పై చర్చ జరిగాక ప్రేక్షకుల స్పందన అడిగినప్పుడు అక్కడ సహాయానికని వచ్చిన తెలుగు స్టూడెంట్ వాలంటీర్ “నేను కూడా నా అభిప్రాయం చెప్పి ఒక ప్రశ్న అడగవచ్చా?” అంటూ ముందుకు రావడం చూస్తే కార్యక్రమం ఎంత రసవంతంగా జరిగింది అనేది చెప్పవచ్చు. అలా మొదటి రోజు కార్యక్రమం ముగిసింది. రెండవ రోజు విమర్శ, అనువాదాలు అనే అంశాలపైన చర్చలు జరిగాయి. ఇలా అమెరికా తెలుగు రచయితల సదస్సులో పాల్గొనడం ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పాలి. ఇక్కడి రచయితగా నాలో రచన పట్ల అవగాహనని, నిబద్ధతని పెంపొందించిందనే చెప్పాలి. ఈ సదస్సులు ఇలా విజయవంతంగా జరుగుతూ ఇంకా మరింత మంది కొత్త రచయితలకు స్పూర్తిని ఇవ్వాలని ఆశిస్తున్నాను.
*
Add comment