శ్రీకాంత్ రాసిన “ముఖంపై రెండు కవితలు” గురించి నాలుగు మాటలు పంచుకుందాం.
ముఖంపై రెండు కవితలు
1.
horror
pure horror
when you realize
that the face
you loved
is no more
***
like a blade in the throat ….
దిగ్గున లేచి కూర్చున్నావు అర్థరాత్రిలో –
నీకు ప్రియమైన
ముఖం వొంగి, నీ పెదాలకు
ఎంతో దగ్గరగా వచ్చినట్లూ, తన శ్వాస
నీ ముఖాన్ని
తాకినట్లూ కలగనీ, లేచీ, మరిక
వొణికిపోతే, గదంతా చీకటి. దూరంగా
ఉరుముతోన్న
ఆకాశం: వాన ముందటి ఉక్కపోత,
పిల్లలు ఏడుస్తోన్న శబ్దం. లీలగా గాలి.
చెట్లు కదిలి
ఈ రాత్రిని మరింతగా నీలోపలికి
జొనిపే దృశ్యం. నాలిక పిడచకట్టుకుని,
చీకట్లోకి చేతులు
కళ్ళై తడుముకుంటే, ఏముంది
అక్కడ? అప్పుడు? నీలోనూ? బయట?
***
దిగ్గున లేచి కూర్చున్నావు అర్థరాత్రిలో
నీకు ప్రియమైన
ఆ ముఖం, నిను వీడిపోతోన్నట్లు
ప్రాణం నీలోంచి, అడుగు వెనుక మరొక
అడుగై, క్రమేణా
నీ నుంచి దూరమౌతోన్నట్లు, ఇక
ఒక స్మృతిగా మిగిలిపోబోతోన్నట్లు!
***
దిగ్గున లేచి కూర్చున్నావు అర్థరాత్రిలో –
ఇక, ఆ రాత్రంతా, బయటా, నీలోపలా
వేలవేల చినుకులై
వానదీపం భళ్ళున పగిలి, నీలోంచి
చిట్లే -ఎడ తెగని- ఒక రంపపు కోత
2.
this darkness
is a grave,
& your longing
for the sun
is not
a lie –
వీధులు, కలల్లోని రాత్రులు
ప్రియ వదనంపై శ్వేతవస్త్రాన్ని కప్పినట్లు
ఆకాశం, వెలుతురూ –
చివరిసారిగా, ఆ ముఖంలో నువ్వు
నవ్వుని చూసింది ఎన్నడు? తడిచి నానిన
వాసన నీ చుట్టూతా –
బహుశా, నువ్వే, ఒక చివికిన చెక్క
ముక్కగా మారుండవచ్చు. “ఎంతో పచ్చగా
బ్రతికిన కొమ్మది,
ఒకప్పుడు” అని పదుగురికీ నువ్వు
కవితల్లోనో, మాటల్లోనో చెప్పి ఉండవచ్చు –
లేక, నీలో నువ్వే
పలుమార్లు గొణుక్కుని ఉండవచ్చు …
***
మబ్బు కమ్మిన ఆకాశం. నైరాశ్యాన్ని ఊదే
గాలి గుండె. చుట్టూ
అంతా మసకగా, అంతా జిగటగా ఇక
వేలకోరలతో ఏదో నిన్ను బిగించి పట్టుకుని
నిను మరి వీడక
క్రమేణా, నీలోకి చొచ్చుకుపోతోన్నట్లు!
***
ఆఖరిసారిగా ముఖాన్ని చూసుకుని, ఇంటి
దారి పట్టావు. “చిక్కి
శల్యమై, ఎముకల పోగులా మారిన
తన శరీరంలా ఈ రాత్రీ, నిన్ను ఎన్నటికీ
ఇంటికి చేర్చలేనీ
వీధులు” అని కూడా అనుకున్నావు –
***
నీకు ప్రియమైన ముఖం పొగ మంచులా
మారిన నింగీ, నేలా!
ఎక్కడ? ఈ తెరలను చీల్చుకుంటో
సర్వాన్ని తాకి, తిరిగి పునరుజ్జీవింపజేసే
నునువెచ్చని
పసిడి నదీ, నావా అయిన చేయీ
ఆ చేయివంటి జీవకాంతీ ఎక్కడ?
*
ఒక సందర్భాన్ని దాని వెనక దాగి ఉన్న భావోద్వేగాల్ని కవిత్వం చేయడానికి ఒక్కోసారి భాష సరిపోదు. విషాద సన్నివేశానికి దుఃఖాన్ని మించిన భాష దొరకదు. అంతే దుఃఖ భాషే. అంతే. బాగా ఇష్టమైన వ్యక్తులు, ఇష్టపడే వ్యక్తులు దూరమైనప్పుడు మనసును కమ్ముకునే నైరాశ్యం తాలూకు వేదన కృంగదీస్తూ ఉంటుంది. దీన్ని ’వాన ముందటి ఉక్కపోత’గా వర్ణిస్తాడు కవి.
‘Like a blade in the throat’అనే expression దుఃఖ భాషకు పర్యాయపదం అవుతుంది. ‘దిగ్గున లేచి కూర్చున్నావు అర్ధరాత్రిలో..’ అని పదే పదే అంటున్నప్పుడు దృశ్యాన్ని మరింతగా ఫోర్స్ ఫుల్ గా ఆవాహన చేస్తున్నట్టు అనిపిస్తుంది. కవిత్వమయ్యేది పదబంధాల పదనిసలు కాదు.. పాఠకుడిని తనతోపాటు తీసుకువెళ్లే మూడ్ అండ్ టోన్. కవి ఏ టోన్ తో పలుకుతున్నాడో పాఠకుడు దాన్ని క్యారీ చేస్తూ తధాత్మ్యం చెందుతుంటాడు. ఇక్కడున్నవన్నీ మామూలు పదాలే. ఆ పదాల వెనుకున్న, అవి మోసుకు తిరుగుతున్న వేదనే..పాఠకుడిని తన చుట్టూ తిరిగే బొంగరాన్ని చేస్తుంది. అనేక ఫ్రేముల్లో దృశ్యం మన ముందు కదలాడుతున్నట్టు అనుభూతిస్తాం.ఆయా దృశ్యాల్లో మన అనుభవాల్ని ముందేసుకుని పోల్చుకుంటుంటాం. స్మృతిగా మిగిలిపోయిన మనుషుల ‘బతికిన క్షణాల్ని’ పదే పదే మననం చేసుకుంటూ ఉంటాం. కవి ‘ఎడతెగని రంపపు కోత’ అంటాడు. బతక లేకపోయిన గడియల్ని ప్రశ్నలుగా సంధిస్తూ ఉంటాం.
*
ఒక చివరి చూపు తర్వాత అంతా అయిపోయినట్టుగా భ్రమింపజేసే భౌతిక ప్రపంచం వేరు. మన లోపలి మానసిక ప్రపంచం వేరు. భూమిలోకి నీరింకినట్టు మనసులోకి ఇంకుతుంది. వాటి వాటి తీవ్రతని బట్టి, ఆయా మనుషులు మనపై వేసిన బలమైన ముద్రల్ని బట్టి చేతనం(conscious) నుండి ఉపచేతన(sub conscious) లోకి, చివరికి అచేతన స్థితి (un conscious)లోకి జారుకుంటుంది. మనిషి జీవితంలో జరిగే కొన్ని ఉపద్రవాలు, పెను ప్రమాదాలు, చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ ఎవరు పూరించలేని సంఘటనలు.. కాలక్రమంలో మరుపుకు గురవుతుంటాయి. వాటిని మనమే బలవంతంగా అదిమి పెడుతుంటాం. దీన్ని’దమనం’ అని పిలుస్తుంటాం. కొంచెం గుర్తు చేసుకుంటే లేదా ఆలోచిస్తే జ్ఞప్తికి వచ్చే విషయాలు మన ఉపచేతన స్థితి నుండి బయటికి వస్తాయి. ఎప్పటికీ గుర్తు రాకూడదనుకున్న గతం తాలూకు అంశాలు మనస్సు అట్టడుగు పొరల్లో అచేతనస్థితిలోకి చేరిపోతాయి. మనం ఎంత కాలం వాటిని దమన స్థితిలో ఉంచగలుగుతామనే దానిపై వాటి పునరుజ్జీవనం ఆధారపడి ఉంటుంది.
*
సిగ్మండ్ ఫ్రాయిడ్ – మనిషి చేతనాత్మక స్థితిలోని మూడు దశల(Three levels of human consciousness – pre conscious or sub conscious, conscious and un conscious states) గురించి చెప్పడం జరిగింది. ఈ మూడు దశలు సులువుగా అర్థం కావడానికి ‘ఐస్ బర్గ్’తో పోలిక చెప్పి నీటిపై తేలియాడే మంచు చేతన స్థితి గా, నీటిలో మునిగి ఉండి పైకి కనిపించే భాగం ఉపచేతన స్థితిగా, కనిపించని అట్టడుగు మంచు పొరలు అచేతన స్థితి గా వర్ణించడం జరిగింది. సాధారణంగా ఆత్మీయుల మరణాలు మొదలైనవి ఉప చేతన స్థితిలో నిక్షిప్తం అవుతాయని చెప్పవచ్చు. గుర్తు చేసుకున్నప్పుడు చేతనం నుంచి ఉపచేతన స్థితిలోకి వచ్చి బాధ పెడతాయి. శ్రీకాంత్ రాసిన కవిత వెనకున్నభావోద్వేగాలు కొంతకాలానికి ఉపచేతన స్థితిలోకి జారుకుని, వీలున్నప్పుడల్లా తోడుకునే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
*
Add comment