ఎండాకాలం సెలవులు

సగం ఆకాశమంత పరుసుకున్నట్టు మల్లెచెట్టు ఉండేదొకటి – పందిరి లెక్క.

ప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చెయ్యమంటే – ఇరవయ్యొక్కటి రోజులుగూడ నిండని నన్ను, ఇంకో ముగ్గురు పిల్లల్ని తీస్కొని రోశమ్మవ్వ ఇంట్లనించి సుశీలాంటి ఇంట్ల పడ్డరు అమ్మానాన్న. నా సగం బాల్యమంత సుశీలాంటి ఇంట్లనే. పదేండ్లున్నప్పుడో ఏమో ఇప్పుడున్న ఇంట్లకి మారినం.

నేనిప్పటికీ ‘పాతింట్ల’ అని ఏ ముచ్చటన్న చెప్తే అది సుశీలాంటి ఇంట్ల జరిగిందని. ఆ పాతింట్ల మొత్తం ఆరేడు పోర్షన్లు ఉండేటివి. ముందు పోర్షన్ల మేమే ఉండేది. ఆ ముందలున్న వాకిలంత మాదేనన్నట్టు. అన్ని పోర్షన్లు దాటితే ఎనకాలంతా ఖాళీ జాగ ఉండేటిది. అదైతే ఒక అడివే. ఎన్నెన్ని చెట్లుండేటియో! మేం ఆ అడివిలనే డొప్పాట ఆడేది, దొంగ పోలీస్ ఆడేది, ఒంగుడు దుంకుడు ఆడేది. ఎప్పుడన్న ఆ అడివిని కళ్లముందలికి తెచ్చుకుందామనుకుంటగానీ ఎట్లనో ఏమో.. బ్రెయిన్ల నించి అదొక్కటి మాయమైంది.

మా వాకిట్లగూడ చెట్లుండేటివి. సగం ఆకాశమంత పరుసుకున్నట్టు మల్లెచెట్టు ఉండేదొకటి – పందిరి లెక్క.

నాకు మూడు నాలుగేండ్లు వచ్చేసరికే మా అక్క పెండ్లి అయిపోయింది కాబట్టి ‘అక్క ఇల్లు’ అంటే నాకది హౌజింగ్ బోర్డే. పాతింట్లనైతే నాకంటే పదేండ్లు పెద్ద మా అన్న, రెండేండ్లు పెద్దది చిన్నక్క, నేను ముగ్గురం ఎండాకాలం వచ్చిందంటే వాకిట్ల నవారా మంచం మీద పండుకొని ఆకాశంలకి చూసుకుంట చుక్కలు లెక్కబెట్టేది. నేను పాటలు పాడేటోణ్ని. మా అన్న ఏవో కథలు చెప్తుండేటోడు. ఇట్ల అందరం ఏదో ముచ్చట చెప్పుకుంటుంటే – నేనేమో ఎవ్వలికి కనవడకుండపోయి మా పెద్నాయన సుట్ట దీస్కొని తాగిన్నని చెప్పి మా అక్క ఆట పట్టిస్తుండేది.

పొద్దుగాల బడికి పోయేది లేదు. ఎనిమిదిగాకముందే ఎక్కడివక్కడ్నే లైట్లు బంద్ అయిపోయేవి. రాత్రుళ్లు ఆ చుక్కలు లెక్కబెట్టుకుంట ఉండేది. నాకు అర్థమయ్యే ఇంగ్లిష్ మాటలకు స్పెల్లింగ్ చెప్పి – “కరెక్టేనా?” అని మా అన్నని అడుగుతుండె.

నేను చిన్నప్పటిసందె చదువుల ఫస్టు. ఇంటికొచ్చి చదివేది ఎప్పుడూ లేదుగానీ ఒక్కసారి చదివిన్నంటే అది మర్చిపోయేది కాదు. హోమ్ వర్క్ అయితే ఇచ్చింది ఇచ్చినట్టు చేస్తుండేటోణ్ని. ఎప్పుడన్న ఇట్లనే ఆడుకుంట ఆడుకుంట నిద్రపోతే – మధ్యరాత్రికాడ లేషి హోమ్ వర్క్ చెయ్యనిది గుర్తొచ్చేది. గోలపెట్టి మా అమ్మనిగూడ లేపి రాసినంకనే పండుకునేది. నేనేం రాస్తున్ననో తెల్వకున్నా మా అమ్మైతే నేను రాసేటంతసేపు నన్నే చూసుకుంట కూసునేది. పలక మీద రాసినది మళ్ల పోతదని కిటికీల టీవీ ఉంటే ఆ టీవీ సందుల పెట్టేదంట.

హోమ్ వర్క్ ఇస్తే అట్ల చేసే నేను – పదో తరగతిల టౌన్ టాపర్ వచ్చిన. అట్లని చెప్పి ఆటోలగూడ తిప్పిన్రు. సరే, అది చెప్తే నాకు సిగ్గయితది, చెప్పనుగానీ —

ఫస్టొచ్చిన నేనే బడి లేదంటే హాయిగ ఉంటుండె. ఎండాకాలం వచ్చిందంటే ఇగ నా కథంత వేరే తీర్ల ఉంటది. కాకపోతే ఎండాకాలం వస్తే ఇంట్లకి బియ్యం ఎట్ల అని నాకొకసారి డౌటొచ్చింది.

మాది ఎయిడెడ్ స్కూల్ కాబట్టికి నెల నెల మూడు కిలోల బియ్యం ఇచ్చేది. ఆ మూడు కిలోలు ఒక సంచిల ఏస్కొని చేతుల పట్టుకునేది. టిక్కుం టిక్కుం బ్యాగు ఉండేటిది ఒకటి, అది భుజానికి ఏస్కొని నడుసుకుంట నడుసుకుంట షేర్‌బంగ్లల ఉన్న బడికానించి గొల్లవాడకట్టదాంక పొయ్యేది. అట్ల నేను తెచ్చిన బియ్యమే అమ్మకు ఇచ్చి, నెలంత ఇయ్యె వండుతరు అనుకునేది.

“నేను తెచ్చిన బియ్యమే వండినవా?” అని అడిగి తినేది. మరి ఎండాకాలమొస్తే బళ్లు బందయితయి. బియ్యం రావు. ఇంట్ల ఏం వండుతున్నరో అని “అమ్మా, నేను బియ్యం తేకుంటే ఇంట్ల అన్నం ఎట్ల తింటున్నమే?” అని అడిగిన.

“నువ్వు తెచ్చిన బియ్యంతోటే బతుకుతున్నాంరా?” అన్నది అమ్మ.

“కాదే?”

“ఎయ్..”

“కాదా?” అని అమ్మ సుట్టూనే తిరుక్కుంట అడిగిన ఒక ఎండాకాలం సెలవుల్ల.

ఆ మళ్లసారి ఎండాకాలంల కావాల్నని అట్లనే చేస్తుంటే – “దొంగ బాడ్కావ్..” అని వాకిట్ల దాంక ఉరికిచ్చేది అమ్మ. నేను ఆ వాకిట్ల నించి ఒక్క దమ్మున బయటపడేది. ఆ తర్వాత కొత్త ఆటలొచ్చినయి. ఎండపూటైతే ఇంట్లనే ఉండుకుంట అష్టా చెమ్మా, దాడి. ఇగ సాయంత్రం కాంగనే క్రికెట్. క్రికెట్ అంటే ఎంత పిచ్చంటే.. ఆడుకుంటానికి ఒక్కోసారి పెద్దక్క ఇంటికి.. అంటే హౌజింగ్ బోర్డ్ దాంక పొయ్యేది. మా అక్క నన్ను చూసిందంటే – “ఇట్ల వచ్చిన్రు ఏం రా” అని అక్కడ ఉరికిచ్చేది.

ఏడేడ్నో తిరిగి అలిసిపోయొచ్చినంక రాత్రుళ్లు మళ్ల మంచమెక్కి అట్ల చుక్కలు లెక్కబెడుతుండె. ఎండాకాలమొస్తే నాకు బాగ చెమటకాయలు అయ్యేది. మా అమ్మ మొత్తం ఒళ్లంత పౌడర్‌జల్లి – “ఎండకు తిరగకురావారి అంటే తిరుగుతవు నాన్నా!” అనేది. నేను మాత్రం ఆకాశంలనే ఉంటుండె.

అట్ల చూస్తున్నప్పుడు ఎప్పుడన్న గాల్ల ఒక విమానం పోవుడు బాగుండేది. అదిపోయేంత దూరం దాని దిక్కే చూస్తుండేటోణ్ని. రాత్రిపూటైతే చిన్న లైట్‌లెక్కనే కనిపిస్తది. పొద్దుగాల చూసిన్నంటే ఆ లెక్క వేరేలాగుంటది. ఎందుకో విమానమంటే ఒక తీరు పిచ్చి. ఆ సౌండ్ ఇనిపిస్తే అన్నం తింటున్నోణ్నిగూడ బయటికొచ్చి చూస్తుండె.

నేను ఇష్టంగా విమానం పోతదేమోనని ఆకాశంలకి చూస్తున్న ఎండాకాలమే ఒకసారి, ఇట్లనే ఎవరో – ఆశా చాక్లెట్ కవర్లు పోగుజేసిస్తే విమానం బొమ్మ ఇస్తరంట అని చెప్పిన్రు. నేను, మా చిన్నక్క అంతకుముందె ఒకసారి కోల్గెట్ పౌడర్ డబ్బాలు ఇస్తే క్రికెటర్ల బొమ్మలు ఇస్తున్నరంటే పోగేసి ఇచ్చినం. అజిత్ అగార్కర్ బొమ్మొచ్చింది. ఆశ చాక్లెట్ కవర్లు పోగేస్తే విమానం బొమ్మగూడ ఇస్తరని ఆ కవర్లు దాచిపెట్టుడు మొదలుపెట్టినం. మొత్తం ఐదొందలు కావాలి.

ఆశ చాక్లెట్లు అంటే అప్పట్ల ఎవ్వరికన్న ఇష్టమే. కానీ మనదగ్గర ఉన్న అన్ని పైసలతోటి చాక్లెట్లే కొనం కదా? నేను మాత్రం విమానం బొమ్మ కోసమైనా ఇది చెయ్యాలని ఆశ చాక్లెట్లు కొనుడు, ఆ కవర్లు దాచిపెట్టుడు – ఇదే పని.

ఇంటికెవరన్న వచ్చి పైసలిస్తే ఆశ చాక్లెట్లు. అమ్మ పైసలిచ్చినా ఆశ చాక్లెట్లే. ఇంకేదన్నా కొనుక్కోమన్నా ఆశ చాక్లెట్లే. ఎవరన్న దోస్తులు ఇంకేదన్న కొనుక్కుంటుంటే – “అరెయ్, ఆశ చాక్లెట్లు కొనొచ్చుగారా?” అంటుండె.

ఒక సంచినిండ వంద చాక్లెట్ కవర్ల లెక్కన జమ చేస్తున్నం. ఒక్కో సంచి జమయితుంటే ఇగ విమానమొచ్చినట్టేనని నా కండ్లల్ల ఆనందం. పిచ్చి లెక్కలు ఏస్తనే ఉండేది. బయట ఆడుకుంటుంటే ఎక్కడన్న ఆ చాక్లెట్ కవర్లు దొరికినా తెచ్చి సంచిల పడేసేది. ఆ ఎండాకాలమంత ఎట్లనోజేసి ఐదు సంచులైతే నింపినం.

ఆ ఐదు సంచులను ఒక్కదగ్గర పెట్టి నేను, మా చిన్నక్క ఒకళ్ల ముఖం ఒకళ్లం చూసుకున్నం. ‘అరెయ్, విమానమొస్తది!’

ఆ సంచులేస్కొని చౌరస్తకి పోయినం. నల్లగొండ టౌన్ల చౌరస్త అంటే.. అక్కడ దొరకని సామాన్లు ఉండవు. హోల్‌సేల్ షాపులన్నీ అక్కడ్నే ఉంటయి. మేం సామాన్లు తెచ్చుకునే, మాకు అజిత్ అగార్కర్ బొమ్మిచ్చిన షాపాయనకాడికే పోయినం.

చాక్లెట్ల కవర్లన్ని చూపిచ్చి అడిగినం – “విమానం కావాలి?”

“ఏం విమానం రా?”

“ఇయిస్తే విమానం బొమ్మ ఇస్తున్నరంట గదా?”

“విమానమా? ఎవరు చెప్పిన్రా? అట్లాంటియి ఏం లేవు!”

“అదేంది? ఆశ చాక్లెట్ కవర్లిస్తే విమానం ఇస్తున్రని చెప్పిన్రు”

“ఎవర్రా చెప్పింది? అట్లాంటియేం లేవు పో” అని కసురుకున్నడు ఆ షాపాయన.

“అట్లాంటియేం లేవా?”

“ఎయ్..” అని ఆయన కసిరితే దెబ్బకు విమానం లేదు, ఏం లేదు అని నేను, మా అక్క ఆ సంచులన్ని ఆడ్నే పడేసి ఇంటికి ఉరుకుడు లగా!

ఆ తర్వాతగూడ కొన్ని ఎండాకాలాలొచ్చినయి, మా ఆటలు గూడ ఒక్కో తీరుగ మారుకుంట వచ్చినయి.

తొమ్మిదో తరగతి అయిపోయినంక మాత్రం “ఈసారి సెలవులు ఉండయి, డైరెక్ట్‌గ పదో తరగతి క్లాసులు” అని చెప్పిన్రు.

పాతింట్ల ఉన్నప్పుడు ఎప్పుడన్న మబ్బుల్నే లేస్తే.. అమ్మ అప్పటికే సాంపి జల్లి చాయ్ పెట్టిచ్చేది. అమ్మను చూసుకుంట నేను ఆ చాయ్ తాగుతుండెసరికల్లనే తెల్వకుండనే చీకట్లు పోయి తెల్లారుగట్లయ్యేది. తొమ్మిదో తరగతి అయిపోయినంక సరిగ్గ అట్లనే ఒక్క దమ్మున ఏడికి పొయ్యిందో.. పొయ్యింది నా బాల్యం.

బళ్ల ఉన్నన్ని రోజులు ఎండాకాలం సెలవుల కోసం ఎదురుచూసిన నేనే.. ఇప్పుడైతే ఆ బాల్యం దిక్కు చూస్తుంట ఎప్పుడూ!

*

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

7 comments

Leave a Reply to V Sarada Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • You’ve the ability to teleport people to their childhood using your words. Such a Beautiful mind you’ve got. Amazing story telling skills Mallikarjun!

  • మల్లికార్జున్ !!!

    చాలా మంచి ప్రయత్నం!!
    మీ బాల్యం లో జరిగిన విషయాలు… పాఠ కుడి కి విసుగు రాకుండా చదివి అనుభూతి చెందేలా వ్రాశారు.

    మీ వేసవి బాగుంది…. తాటి ముంజలు ఆపకుండా పది తిన్నట్టు వుంది…కమ్మగా..

  • ఆకాశమంత మల్లె పందిరి ఇచ్చిన ఆహ్లాదం, పసివాని భాష లోని మాధుర్యం వెరసి చదువరులకు కొండంత ఆనందం!
    Waiting for more posts from the writer!

  • ఈ అనుభవాలు ఇంకో 20 ఏళ్ల తర్వాత మరింత మధురంగా ఉంటాయి

  • ఙ్ఞాపకాలు అనే తేనె తుట్టేను కదిలిచ్చినవ్ అన్న…పదో తరగతి కి ముందర బాల్యమంతా ఆవిరై పోయింది …ఇప్పుడు మల్ల వాన సుక్కల్లెక్క కింద పడ్తుంటే …అంటే ఒక్కొక్కటి గుర్తొస్తు వుంటే …రాత్రి పూట సుక్కల్లేక్క పెట్టుకుంటా నిద్రపోయిన అంతా ఆనందం గా ఉందన్న

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు