నీటిలో నీడ
~
నడి రాతిరి
నక్షత్రాల జల్లు
నీలాంబరి ఒక్కసారిగా
జుట్టు విప్పుకుంటుంది
సాగిపోయే మబ్బులకు
ప్రహరీ కడుతూ …
అప్పుడు
అంతా నిస్సవ్వడి
తటాలున పూరెక్క ఏదో
ఎండిన ఆకుని ముద్దు పెట్టుకుంటుంది
విరిగిన పసుపు కొమ్ము గంధంలా
పాట ఒకటి సాగిపోతూ గుబాళిస్తుంది
నిండు బాలింత పొతిళ్ళలో
ఒదిగిన రేయి
పసిపాప నోటి సుపరిమళం
కళ్ళను చుట్టేస్తుంది
గడియారం ముళ్ళు వెనక్కి తిరిగి
నిక్క పొడుచుకున్న వెన్నపూస
కాలం గాలిలో బందీ
ఒక మూసిన కల తెరుచుకుంది
కళ్ళు తెరుచుకొని చూపుకు
బికారి పిలుపు ఒకటి
కిటికీ సందుగుండా…
ఆత్మకు దేహానికి
అతీతంగా నర్మ గర్భ నవ్వు
నిశితంగా పరికించి
మడమ వెనక్కి తిప్పాడు
చెదిరిన సాలె గూళ్ళో
జరజరా పాకిన పురుగులా…
వీధి వీధినా తచ్చాడుతున్న పాదముద్రలు
రోడుకు ఆవలి పక్క
పెకిలించిన గూన పెంక ఇంటి గోడపై
సాగిలపడిన తంబూర తీగను సవరిస్తూ …
తిరగబడిన దుప్పటి దులిపి
విడివడిన జడ ముడులతో
తిరగాడిన చోటే తిరగాడుతూ …
ఆకలో … దాహమో
ఆకళింపో … ఆకతాయితనమో
చుట్టేసుకున్న చీకటి నీడ తోడుగా
వీధి వాకిట నిలిచి
ఉట్టిమీద నిండు కుండ
సగం తెరిచిన తలుపులోంచి
ఆత్రంగా వంపుకొని
అంటిన మెతుకైనా మిగిలించకుండా
తడారని మట్టి కుండలో
నిప్పుకణికలు విసిరేసి
నిశ్చేష్టలు విదిలించి
వెన్నంటి సారించిన చూపుకు
దారి పొడువునా
రాలిపడిన గింజలు
దాటి వచ్చిన బాట
మాటేసిన చీకటిలో
తడబడిన అడుగులు చెరిపేసిన చోట
భుజాన చిరుగుల ఖాళి జోలెతో …
బికారి … బేకారి .
*
నిర్ణిద్ర
~
నిశ్శబ్దాన్ని కదలించకు
భంగపడ్డ కలల శిధిలాలు
లావాలా పొంగుతాయి
పదాలకు అర్థానివ్వకు
పరిహసించే నీరు కట్ట
ఎగిరెగిరి పడుతుంది
నిశీధిలో కళ్ళు తెరువకు
సముద్ర గర్భం విచ్చుకొని
క్రీనీడలను సాగదీస్తుంది
రాలిపడిన ఆకుల్లోంచి
సంధ్యాచ్చాయా ఒళ్ళంతా
నల్లని మేఘాన్ని కప్పుకుంటుంది
తారలు కనుమరుగై
కలత పడిన రేయి
సూర్యుడ్ని ప్రసవిస్తుంది
తామరాకుపై
జారిపడిన పూర్ణ బిందువు
నుదుట సిందూరమై
నాదాలను పలికిస్తుంది
మళ్ళీ
నిశ్శబ్దాన్ని కదిలించకు
రగులుతున్న రణరంగం
నెత్తుటి చారికలను దున్నుతుంది
వెదజల్లిన మృతాత్మలు
అడ్డంగా అతుక్కొని
రెండు తోకలతో నిలబడతాయి
కర్ణభేరిని సోకిన మాటలకు
అలవాటు పడిన ఆచేతనము
మాయ మహల్లో నర్తిస్తుంది
కనురెప్పలకు తలకిందులుగా
వేలాడే గాయాలు
కాలి మడమపై కదలాడుతాయి
నిశ్శబ్దాన్ని కదలించకు
అదీ
ఆదమరిచి నిద్రపోతుంది … ఇక.
*
పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్
మస్తాన్ …నిర్ణిద్ర..చాలా బాగుంది
వెల్కం సారంగ
అన్నా..యీ కవిత వూర్మిళ గారిచే విరిచితం…బొమ్మ. నే వేసినది…
అర్థం మై కానట్టు అస్పష్ట దోబూచులాట…
నీటిలో నీడ…కవిత
అయినా వాక్యం రసాత్మకం…
నదిలో పడవ లా కొట్టుక పోతూ మది…
ఊర్మిళ గారికి అభినందనలు .
నిర్ణిద్ర కవిత
రాలిపడిన ఆకుల్లోంచి
సంధ్యాఛాయ ఒళ్ళంతా
నల్లని మేఘాన్ని కప్పుకుంటుంది
Nice ma’am
సూపర్బ్ మేడమ్
రెండు అద్భుతమైన కవితలు – ఊర్మిళ గారికి అభినందనలు – రెండు కవితల్లోనూ అద్భుతమైన పద భావ చిత్రాలు – స్త్రీ అత్యాధునిక అస్తిత్వ వేదన – నర్మ గర్భతా – కవితలు పలుమార్లు చదవాలి – చదివిన కొద్దీ కొత్త అనుభూతి – కొత్త అర్థాలు – మొత్తంగా ఒక కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్లాయి