ఒకానొక జ్ఞాపకం మనలో ఉన్నంత కాలం “గతం” అనేమాట అబద్దం అనిపిస్తుంది నాకు. కాలం నడుస్తుంది, మనమూ వయసూ, ప్రాంతమూ మారిపోతాం. కానీ, వెంటవచ్చు జ్ఞాపకమొకటి వేటాడినట్టు పదే పదే గాయం చేస్తూనే ఉంటుంది. అట్లాంటిదే నా బాల్యమనబడే కాలం కూడా-
ఏదో అభివృద్ధి, మరేదో మార్పు ఈ భూమిమీద కొంత ప్రాంతాన్ని మాయం చేసింది. మా ఊరిని ఓపెన్ కాస్ట్ అనే బొగ్గులోయలోకి తోసి చంపేసింది. కారణమేదైనా కావచ్చు నేను కోల్పోయింది మాత్రం నా బాల్యాన్ని, నా జీవితంలో కొంత భాగాన్ని, మా ఊరు, నా చిన్నతనం అనబడు రెండు మాటలు శాశ్వతంగా నాలోంచి బలవంతంగా చేరిపేశారు. ఇప్పుడు నేనెక్కడ నిలబడితే అదే నా ఊరు, నాకు బాల్యం అనేది ఒకానొక ఊహాగా మాత్రమే మిగిలింది.
రాసుకోవటానికి నాలుగు అక్షరాలు నేర్చుకున్నవాన్ని కనుక ఊరు గుర్తొస్తే, ఊరిలో నేను పిల్లవాడిగా కదలాడిన నేలా, నేను చూసిన మనుషులూ ఓ ఫేస్బుక్ పోస్టులోనో, మరేదైనా కవితలోనో డాక్యుమెంట్ చేయటం ఒక అవసరమైంది. మంగలిపల్లె అనబడే ఆ ఊరు గవర్నమెంట్ రికార్డుల్లో కూడా పెద్దంపేట గ్రామపంచాయితీగా నమోదై ఉండటం వల్ల… ఇట్లా రాసిన రాతల్లో తప్ప చరిత్రలో మరెక్కడా కనబడే అవకాశం లేదు. ఇది నాకు నాలాంటి అతికొద్దిమంది మనుషులకు మాత్రమే దక్కిన దుఃఖం.
నోస్టాల్జియా అనే ఈ కవిత రాసేనాటికి నేను హైదరాబాద్ నగర వీధుల్లో తిరుగుతున్నాను. ఒకానొక రోజు నా గదిలో… కూర్చుని సిగరెట్ వెలిగించి కిటికీలోంచి చూస్తే కనిపించిన వో మోహర్రం వేడుక, పీరీల ఊరేగింపు మరొక్కసారి మంగలిపల్లె జ్ఞాపకాల బోనపుకుండని మళ్లీ తలమీదకెత్తింది.
నాకు ఉన్న యాదులే నా మనాదులు అందుకే కొత్త దుఃఖాలని నెత్తికెట్టుకోవటంలోనూ ఏదో ఆనందం ఉంటుందేమో. ఈ కవితలో ఉన్న మాదిగ బక్కులు డప్పు కొట్టడంలో మొనగాడు, కన్నూరోడు అనబడు నా నేస్తగాడు కన్నూరి రమేష్ అత్యద్భుతమైన పాటగాడు. జమాల్ కాక మా వూరి ఏకైక రెస్ట్రాంట్ కమ్ మీటింగ్ హాల్ ఓనర్… వీళ్లంతా చెల్లా చెదురుగా వెదజల్లబడ్డ నిజమైన మనుషులు.
నాన్న మంగలినర్సయ్య ఉరఫ్ మంగల్సార్ అలియాస్ నర్సయ్య సార్ అనబడు మనిషి నా తండ్రి, అనసూయ నా తల్లి… మనిషి, చెట్టూ, జంతువూ అనేవి చనిపోవడం ఎప్పటికో అప్పటికి తప్పదన్న సత్యం నాకు తెలిసిందే అయినా… భూమి, కొండా, ఊరు, చరిత్రా కూడా చనిపోతాయని అనిపించిన క్షణం అది… హైదరాబాద్ పీరీల ఊరేగింపు ఇట్లా నా ఊరిని పాడుకున్న కవితగా మారిన రోజున –నా నోస్టాల్జియా అనబడు ఈ పద్యం పుట్టింది.
ఎక్కడో… ఒకదగ్గర నా ఊరివాడు, నా ప్రాంతం వాడు నా వలెనే ఏ బొగ్గుగని కోసమో, ఏ సెజ్ కోసమో, ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు కోసమో ఇవేవీ కాక… కుల, మత ప్రాతిపదికన తన ఊరిని, తన మనుషులనీ కోల్పోయిన వాడు ఉండకపోతాడా, ఈ నాలుగు అక్షరాలతో వాణ్ణి కౌగిలించుకోక పోతానా. ఈ వలపోతని పంచుకోకపోతానా అన్నదే ఈ కవితని రీ పోస్ట్ చేసినప్పుడల్లా కలిగే భావన… ఇప్పుడు ఇలా సారంగ ఇచ్చిన అవకాశాన్నీ అక్షరాలా నా వలెనే ఊరులేని బే సహారా ముసాఫిర్ మనుషులకోసం వాడుకున్నాను.
~నోస్టాల్జియా~
ఏదీ మిగిలిచ్చుకోవు
మరేదీ మిగలనియ్యవు
కల,జ్ఞాపకం నిజానికి రెండూ అబద్దాలే
జరగనిదీ, జరిగిపోయినదీ….
జంగమా…జంగమా…
ఊదవేమీరా శంఖాన్ని..,పాడవేమిరా తత్వాన్ని
బతుకంతా బొగ్గుపెళ్లలాయె గదరా తండ్రీ…!
యాదులనీ, మనాదులని కైగట్టి
డప్పు గొట్టవేమిరా మాదిగ బక్కులు కాకా
చిన్ననాడు దాచి దాచి తెచ్చిన
గొడ్డుమాంసపు తునక వాసన
వెంటాడుతోందిరా సురేసా..!
ఎల్లిపాయ కారం కలిపి నోట్లే ఒక్క బుక్కవెట్టు
జమాల్ చిచ్చా ఓటల్ బందువెట్టినంక
సర్కారుబడీ పిట్టలన్నీ చూచిరాతల జాతర చేస్తయ్
శినిగిన శేడ్డీల, శీమిడిముక్కుల దేవదూతలమే గదరా మనమంతా
చెక్క కత్తుల, అట్టకిరీటాల మారాజులమే కదరా
పాడు..పాడు..కన్నురోడా పాడరా పాట
జంగు పిల్లి వేట కన్నుల పాట
అన్నమైన సింగరేణి పాట.., అందమైన సింగరేణి పాట
ఇప్పుడు నోరు తెరిచి నిన్ను మింగుతున్న ఓపెన్కాస్ట్ పాట
మంగలి పల్లె పాట, మనూరి పాట
పిల్లా నువ్వన్న రా
పచ్చిజామకాయల ముచ్చట్లు చెప్పు
గునుగుపూల వేట, కట్లపూల మాట
బతుకమ్మ గద్దెల కాడ ఓరచుపుల సంగతి
పోనీ… బీరపూల దాడి పక్కనే నీ వరకట్నపు మరణ గాథ
చెప్పు..చెప్పు.. నా రహస్య ప్రేమికా
వొల్కేనో చూపులా వాలుకనులదానా నువ్వన్న మాట్లాడు..
మాబువల్లీ, పెదబాద్దూర్, చిన్నబాద్దూర్,
మేకల కోసే బాషామామ, మైబూబ్ బ్రాస్ బ్యాండ్ మైనోద్దీన్
పీరీల ఊదు పొగల కనిపిస్తాలేరేవ్వలు
అంతా రాకాసిబొగ్గు దుమ్ము… గతాన్ని గొంగడై కప్పేసిందా?
ఊరి జ్ఞాపకం
ఇపుడు స్టేజ్ షో… లేదూ ఒక కవిత
మెడదంతా మొలుస్తున్న ఒక రెయిన్ ఫారెస్ట్
సంగతించిన సాయితలన్నీ కండ్లనీళ్లయి కారుతున్నాయిరా
మాయమైతున్నాడోక్కొక్కడు పట్నపు పర్దాల వెనుక
మంగలి నర్సయ్యా…! కలవై నా కవితైనవా నాయనా..
కండ్లనిండా లావాపాతపు సెగ
నువ్వేకాదు.. ఊరు సచ్చిపోయింది తండ్రీ…
అమ్మా…! ఆకలైతుందే
నీ పాతచీరల బొంతల మొఖం దాసుకున్న
నోసట ఒక్క ముద్దు దీవేనార్తి పెట్టు
NTPC ఆవిరి కన్లల్ల నిండిందే అనసూయా
జిట్టిరేగు పండ్ల పలారం పెట్టు
ఆకలైతుందే అమ్మా….
బతికే ఆకలి… బతుకై ఆకలి… బతుకుల ఆకలి..
*
సూఫీ నామ సార్థకం. Excellent poem
Thank you sir
Boss
Heart touching stanza .