చేతులు, ముఖ్యంగా అరచేతులు అంటే చాలా ఇష్టం నాకు. ప్రేమ అవంటే. ఎన్ని రకాల అరచేతులు! చల్లనివీ, తెల్లనివీ, నల్లనివీ, గోరువెచ్చనైనవీ, దహించేవీ, దహించుకుపోయేవీ, ఏడ్చేవీ, నవ్వేవీ, శిశువు పిడికిలి వంటి హృదయపు భాషని చేతివేళ్ళతో తెలియచెప్పేవీ, ప్రేమించేవీ, దయతో చూసేవీ, గాయపడినప్పుడు చిన్నబోయిన ముఖాలతో అలా స్థాణువై నిన్ను చూసేవీనూ –
చేతులు, ముఖ్యంగా అరచేతులంటే చాలా ఇష్టం నాకు. ప్రేమ. ఈ కవితలు, ఆ చేతులని గుర్తు చేసుకున్న క్షణాలు. A tribute –
1
నీ చేయి పట్టుకుని
నీ చేయి పట్టుకుని ఎవరో ఏడుస్తారు –
మైనం కరిగి,
నీ ముంజేయిపై పడినట్లు
కోసుకుపోతుంది ఏదో. బయట రాత్రి –
నవంబర్ రాత్రి.
నరాలు తేలినట్లు వేప చెట్టు –
ఎందరు ఇలా ఏడ్చి ఉంటారు? ఎవరికీ
చెప్పుకోలేక, నలిగి
విరిగి, ముక్కలై చచ్చిపోయి?
*
నీ చేయి పట్టుకుని ఎవరో ఏడుస్తారు –
ఎవరు? నీ తల్లి బహుశా,
నీ ప్రియురాలు, లేక నీతో నువ్వే!
*
నీ చేయి పట్టుకుని ఎవరో ఏడుస్తారు –
కళ్ళ దీపాలలోంచి
రాలి, నిన్ను కోసినా వేడి చుక్కలు
ఏ వేకువజామునో గడ్డకట్టి, ఇక నువ్వై!
2
ఒక చేయి
ఎంతో దూరం వెళ్ళాలి, ఎంతో మరి –
ఊరికే ఒక చేతిని
పట్టుకుని అట్లా ఉండేందుకు –
ఒక చిన్న అరచేయి. లిల్లీ పూవులాగా
లేక, పగుళ్లిచ్చిన
నల్లగా మారిన ఒక ఇటుకలాగా –
అది ఒక చేయే! మసిగుడ్డలాగా ఎవరో
కని వదిలేసిన
గుక్క పట్టి ఏడ్చే ఒక శిశువులాగా,
ఒక చిన్న అరచేయే అది. పొయ్యిలాగా
మండీ మండీ
ఆరిపోయే, ఆఖరి ఊపిరితో మరి
మిణుకు మిణుకుమనే, చిన్న చేయది –
నీదేనా అది?
పొగ చూరి కళ్ళ వెంట నీళ్లు తిరిగే
స్పృహ తప్పుతోన్న, వణికే అరచేయి?
నీదేనా అది?
విరిగిన పలకైన, బలపమైన చేయి?
*
ఎంతో దూరం వెళ్ళాలి, ఎంతో మరి –
ఒక అరచేతిని
పుచ్చుకుని బ్రతికి ఉండేందుకు …
ఒక అరచేతిలో, చచ్చిపోయేందుకు!
3
చీకటి, ఒక అరచేయిలాగా …
నీ చేయి కూడా ముసలది అవుతుంది
నాలాగే; సముద్ర తీరాన్ని
తాకే, అలల నురగవంటి నీ చేయి …
మాట్లాడింది అది ఇన్నాళ్లూ నాతో మరి
ఎన్నో చీకటి రాత్రుళ్లలో,
తడిచిన ఇసుకై, మెత్తగా గరకుగా!
నీ చేయి ఒక అద్భుతం. చీకట్లలో, మరి
గాలి వేణువై నీళ్లతో
ఎలుగెత్తి గానం చేసే మహా రహస్యం –
చేపలో, చేపపిల్లలో, గవ్వలో, ఒడ్డునిక
మత్తిల్లి, అర్థంలేని ఒక
అలాపనని అరిచే జాలరి: నీ చేయి –
*
నీ చేయి, జననం లేనిదీ మరిక మరణం
కూడా తాకనిదీ! చూడు,
తెలియడం లేదా నీకు, ముదుసలి
ఒకడు రాస్తున్న ఓ ప్రేమ గీతం ఇదని?
*
Add comment