గది ఎంత నిశ్శబ్దంగా వుందో !
ఆగిపోయిన ఊపిరి
వెలుపలి ఆర్తనాదాలకు, పరామర్శలకు
జవాబు చెప్పదు.
ఊదారంగు మేఘాల కళ్ళలోంచి
ఒక కన్నీటి చుక్క తెగదు.
తెరిచిన కనురెప్పల్లోకి కర్కశంగా దూరిన గది.
ఒంటిలో గగుర్పాటు మూల కేంద్రకం
ఆలోచనల్ని ఓ క్షణం స్తభింపజేస్తుంది.
నిట్టాడిలా నిలుచున్నట్టే కూల్చేస్తుంది.
నేనేనని వేలాడుతున్న తాడుకు
ఎవరేస్తారు సంకెళ్లు.
తెగిన ఊపిరి వాసన
ఎండిన రేగడి చెరువు గీసిన నెర్రెల చిత్రం.
పుకార్ల గజిబిజి గందరగోళంగా
అంతుచిక్కని దరి దారి
ఊహల మలుపుల రహస్యాల్లోకి ప్రవహిస్తాయి.
మూలల్లోకి ఒదిగిన వస్తువుల్లా
జరిగిందేమిటో తెలియని పిల్లలు అవాక్కైపోతారు.
కొక్కేనికి వేలాడుతున్న పాత చొక్కా జేబులో
మడతలు పడిన కాగితంలో అక్షరం మాట్లాడదు.
అంతదాక ఊపిరి తీసుకోని గదికి
పగిలిన గాజులే జవాబు చెప్పాలి.
అప్పుడే మళ్ళీ గదికి ఊపిరాడుతుంది.
*
బావుoదండీ
Aptly captured the end stage.nice👏
ఎక్సెలెంట్ పొయెమ్ సర్
Wonderful sir
ఎంత బాగా రాశావయ్యా. చాలా బాగుంది.
తెరిచిన కనురెప్పల్లోకి కర్కశంగా దూరిన గది.
పగిలిన గాజులే జవాబు చెప్పాలి.
బాగుందండి..👏