ఉపోద్ఘాతం అక్కెర పడని ఉద్గ్రంథం 

సుదీర్ఘ కవితా ప్రస్థానం అతనిది. ‘తంగెడు పూలు’ నుంచి ‘రేపటి మైదానం’ వరకు అదొక నిరంతర సాహితీ ప్రయాణం. ఇప్పుడు మనం అతని 29వ కవిత్వ మైలురాయి వద్ద నిలుచుని ఉన్నాం. మెతుకు ముట్టి గంజులో బువ్వ ఉడికిందో లేదో చెప్పగలం. అతను ముట్టిన ప్రతి అక్షరపు మెతుకు కవిత్వ బువ్వ యి మన ఆకలిని తీర్చగలదు. అతనే డా. ఎన్  గోపి. తాను తొలి రోజుల్లో రాసిన “తంగెడు పూలు” కవితను ప్రస్తావించుకుందాం. ఎవరికి వారు తెలుగు వచన కవిత్వ పరిణామం ఎలా ఉందో అంచనా వేసుకోవడానికి వీలు కలుగుతుంది.
*
‘తంగెడు పూలు’
అంటే ఒప్పుకోను
బంగరు పూలు
పొంగిన విచారాన్ని
దిగ మింగిన పూలు
వెలగలిగిన గులాబీల కన్నా
వెలవెలబోయే మల్లెల కన్నా
వెలలేని ఈ పూలు మేలు
తెలుగువారి బతుకమ్మల కమ్మని మొగాల
వెలుగు నింపు పూలు
కాపు కన్నెల ముద్దుగొలుపు ముద్దకొప్పుల్లో
 కాపురముండే పూలు
మనసున్న పూలు
మమతలు ఉన్న పూలు
వాసన లేకున్నా వలపు
బాసలు నేర్చిన పూలు
పేద పూలు
పేదల పూలు
‘తంగెడు పూలు’ అంటే ఒప్పుకోను
బంగరు పూలు
*
1967లో రాసిన కవిత ఇది ఈ కవితకు కవి రాసిన ఫుట్ నోట్స్ ను యధాతధంగా మననం చేసుకుందాం.
” ఒకరకంగా ఇది నేను రచించిన మొట్టమొదటి వచన కవిత. ఏ పత్రికలో వచ్చిందో గుర్తులేదు కానీ ఇది కవి సమ్మేళనాల్లో బాగా పేలిన కవిత. తంగెడు పూలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు. అందుకేనేమో చాలా రోజుల వరకు నన్ను ‘తంగేడు పూల గోపి’ అనేవారు. అప్పుడు నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ లో ప్రవేశించాను. కుందుర్తి ఈ కవితను పెంచి దీర్ఘ కవితగా రాయమన్నారు. దీర్ఘ కవిత అంటే ఏమిటో తెలియదు. ఇది సంపుటిలోకెక్కిన మొదటి కవితే గాని దీనికంటే ముందు ‘కన్నీరు’ అనే కవిత రాశాను. స్రవంతి అనే పత్రికలో అచ్చయ్యింది. దాని సంపాదకమండలిలో ఉన్న సినారె దాన్ని నా ముఖతః విని అచ్చువేశారు. అది ఎందుకు ‘తంగెడు పూలు’ సంపుటిలో చేరలేదో గుర్తులేదు. ‘కమ్ర పుష్ప మకరందం కన్నీరు’  అనే పంక్తి గుర్తుంది. అప్పటికే వందలాది పద్యాలు, గేయాలు రాసిన నేను ఈ కవితతో వచన కవిత్వంలో ప్రవేశించినట్టయింది. కాబట్టి శైలి విషయంలో ఇది సంధి దశను ప్రతిబింబిస్తుంది. ప్రాసలు అనుప్రాసలు వగైరా”
*
ఎత్తుగడ, ముగింపు ఒకే వాక్యాన్ని పునరావృతం(refrain) చేస్తాయి. శీర్షికకు మరింత బలాన్ని చేకూర్చడానికి, ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి, దాని ప్రాముఖ్యతను ఎత్తిచూపడానికి కవితలో పునరావృత వాక్యాలను కవి వాడుకుంటాడు,
” తంగెడు పూలు అంటే ఒప్పుకోను/ బంగరు పూలు” (తంగెడు పూలు)
‘పొంగిన విచారాన్ని దిగ మింగిన పూలు’ అనే ఒక చారిత్రక దుఃఖభరిత సత్యాన్ని, దాని బరువును మోసుకు తిరగడం గమనిస్తాం. ఇక్కడ ఒకే కవితాత్మక వాక్యం రెండు పాదాలుగా విరువబడింది. ‘విరుపు’లో దాగి ఉన్న అంత: సూత్రాన్ని పట్టుకుంటే లీనియేషన్ టెక్నిక్ వల్ల కలిగే ప్రయోజనం అర్థమవుతుంది. విరుపులో ఒక స్ట్రెస్ ఉంటుంది. ఒకే వాక్యంలోని రెండు పాదాలు దేనికవే సంపూర్ణ అర్ధాన్ని ఇచ్చేవిగా ధ్వనిస్తాయి.
“తెలుగువారి బతుకమ్మల కమ్మని మొగాల/ వెలుగు నింపు పూలు”
పై పైన చూసినప్పుడు నిరలంకార శిల్పం కవితను ఎంత దేదీప్యమానంగా వెలిగిస్తుందో ‘తంగెడు పూలు’ కవితే ఒక సాక్ష్యం అని అనిపించక మానదు. అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇందులో కూడా శ్లేష (pun)దాగి ఉంది. మామూలు అర్థంలో తంగేడు పూలతో పేర్చిన ‘బతుకమ్మ’ ఒక అర్థమైతే, తెలంగాణ ఆడపడుచుల్ని ‘బతుకమ్మ’ అని సంబోధించే పల్లె సంస్కృతిలో ‘స్త్రీ’ అనే మరో అర్థం దాగి ఉంది.
ఇక్కడ “గులాబీల కన్న, మల్లెల కన్న” అనే తేడా చూపిస్తూ పోలిక చెప్పినా ‘పేదల పూలు’ అని సూత్రీకరించడం వల్ల,  “సంపద పోగేసుకున్న వ్యక్తుల కన్నా పేదలే మేలు”  అనే అర్థమూ స్ఫురిస్తుంది.
సాధారణంగా స్త్రీలు కేశాలంకరణకు తంగేడు పూలు వాడుతారో లేదో, వాడేవారో లేదో ఇతమిత్థంగా తెలియదు. కానీ కవి “కాపు కన్నెల ముద్దుగొలుపు ముద్దకొప్పుల్లో కాపురముండే పూలు” అని వాడుతాడు.’ కాపు కన్నెలు’ అనే పదబంధాన్ని గమనించినప్పుడు ‘వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే ఆడపడుచులు’ అనే అర్థం లోనే కవి వాడి ఉంటాడు. అది అప్పటి ‘అర్థ గౌరవం’ను సూచిస్తుంది.
*
సహజంగానే తంగేడు పూలు వాసన లేనివి. అలాగే వెలలేనివి. కాదు కాదు వెల కట్టలేని అపురూపమైనవి. అందుకే అవి గోపి కవిత్వంలో మనసున్న పూలుగా, మమతలున్న పూలుగా, వలపు బాసలు నేర్చిన పూలుగా, పేదపూలుగా వర్ణించబడ్డాయి. తంగేడు పూలకు పల్లీయ జనుల గుణాలను ఆరోపించడం జరిగింది. మానవగుణారోపణ(personification) కు ఔచిత్యవంతమైన ‘మెటఫర్స్’ వాడటం వల్ల సహజత్వాన్ని అద్దినట్టయింది. అయితే ఒక విషయాన్ని గమనిస్తే తొలి రోజుల్లో కవి వాడిన ప్రాసలు, అనుప్రాసలు ఇప్పటికీ సమ్మోహన పరుస్తూ కొనసాగుతూ ఉండటం  గోపి కవిత్వంలోని విశిష్టతగా చెప్పవచ్చు.
75 వసంతాల పసి బాలుడికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు.
*

బండారి రాజ్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు