ఎప్పుడో 1980లో అన్నాకరేనినా నవల చదివాను. వరుసగా ఒక పది రోజులు పాటు. చివరకు వచ్చేసరికి ఆమె తన ప్రేమ విషయంలో అపోహతో రైలు కింద పడి దారుణంగా మరణిస్తుంది. అది చదవడం ఏమిటి, పుస్తకం పక్కన పెట్టి, బల్ల మీద తల పెట్టుకొని ఏడ్చాను. ఆ సందర్భాన్ని ఇప్పటికీ మరువలేను. ఇప్పుడు బహుశా అంత ఉద్విగ్నభరితమైన హృదయం కొరబడిందేమో కానీ ఆమె పట్ల నా హృదయంలో కరుణ అలాగే ఉంది. ప్రేమ కూడా.
ఇలా ప్రేమ కోసం స్త్రీలు తమ ప్రాణాలు త్యాగం చేసిన కథలలాగే, తాము ప్రేమించిన స్త్రీల కోసం ప్రాణాలు అవలీలగా వదులుకున్న పురుషుల కథలు కూడా ఉన్నాయి.
ఎందుకనో వాటి గురించి చెప్పాలనిపిస్తోంది.
అటువంటి ముగ్గురు నాయకులనుగా ఒప్పుకోని ప్రతి నాయకుల గురించి చెప్పుకుందాం. ఒకరు ఫ్రాన్స్ కు చెందిన వారు. మరొకరు రష్యా దేశీయుడు, మూడవ వాడు భారతీయుడు.
మొదటగా ఫ్రాన్స్ కు చెందిన ‘సిడ్నీ కార్టన్’ టేల్ ఆఫ్ టూ సిటీస్ వవల లో పాత్ర.
ఆ ఎనభయిల్లోనే చార్లెస్ డికెన్స్ రాసిన’ టేల్ ఆఫ్ టు సిటీస్’ తెలుగు అనువాదం ‘రెండు మహానగరాలు’ చదివాను. తర్వాత దూరదర్శన్ లో ప్రతి శుక్రవారం అర్థరాత్రి వేసే పాత సినిమాల సిరీస్ లో ఆ సినిమా కూడా చూశాను.
ఫ్రెంచ్ విప్లవం తాలుకు చరిత్రను నవలగా మలిచే ప్రయత్నంలో వచ్చిన నవల అది. అందులో సిడ్నీ కార్టన్ ఒక న్యాయవాది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఆమె భర్తకు బదులు ఆ శిక్షను తాను స్వీకరించి గిలటన్ అనే రూపం లోఉండే మృత్యు దేవతను ఆహ్వానించి వరించిన కథ.
నేనే కాదు ఆ నవల చదివిన వారు ఎవరూ అతన్నిమరువలేరు.
ఫ్రాన్స్ నగరం అంతా జమీందారుల దుర్మార్గాలతో. క్రూరత్వాలతో విసిగిపోయి ప్రజల తిరుగుబాటుతో హింసాత్మకంగా మారిపోయింది. చాలామంది ఫ్రాన్స్ నుంచి ఎలాగోలాగా ఇంగ్లాండ్ పారిపోయి వచ్చేసారు. అందులో ఒక జమిందార్ కొడుకు తన తండ్రి, పిన తండ్రి చేసిన దుర్మార్గాలు సహించలేక ఫ్రాన్స్ ఒదిలి లండన్ వచ్చి ఫ్రెంచ్ పాఠాలు చెప్పుకునే ఉపాధ్యాయుడుగా డార్నీ అనే మారు పేరుతో ఉంటూ ఉంటాడు. అతనిని ఆంగ్ల ప్రభుత్వం దేశద్రోహ నేరంతో కోర్టులో నిలబెట్టి ఉరిశిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతని తరపున వాదించే మరొక న్యాయవాది స్ట్రైవర్ అనే వాడికి సలహా చెప్పి డార్నీ ని రక్షిస్తాడు కార్టన్. ఇది మొదటిసారి డార్నీ ని రక్షించడం.
అప్పుడు ఆ కోర్టులోనే సాక్ష్యం చెప్పటానికి వచ్చిన ఒక అందమైన యువతి లూసీ, ఆమె తండ్రీ కూడా ఉంటారు. వారిని కార్టన్, డార్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు. తర్వాత వారిద్దరూ తరచుగా లూసీ ఇంటికి కూడా వెళుతూ ఉండేవారు. ఇద్దరు లూసీ ని ప్రేమించారు.
కానీ కార్టన్ స్థిరమైన జీవితం లేని వాడు. తాగుబోతు. అసాధారణమైన తెలివితేటలు ఉండి కూడా వాటన్నింటినీ పక్కన ఉన్న వాళ్ళకి ధారబోయడమే లక్ష్యంగా ఉన్నవాడు. ఒక రకంగా కారణం తెలియదు గానీ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకున్నవాడు. ఒకరికి ఉపకారం చేయడం మాత్రమే తెలిసినవాడు. అతని వల్లనే స్ట్రయివర్ న్యాయవాదిగా కేసులు గెలుస్తూ ఉంటాడు. అతను ఒకరకంగా కార్టన్ ని వాడుకుంటూ ఉంటాడు. ఆ సంగతి తెలిసినా తన స్వభావం ప్రకారం అలాగే ఉంటాడు సిడ్నీ కార్టన్.
లూసీ కి ఎంతో నిజాయితీగా కార్టన్ తన ప్రేమ గురించి చెప్పి, తనతో జీవితం ఎవరికీ బాగుండదని అందువల్ల తాను దూరంగా ఇలాగే ఉంటానని, కానీ తన మనసులో ఉద్దేశం ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయాను అనీ తన ప్రేమ నివేదించుకుంటాడు.
లూసీఅతని పట్ల ఎంతో కరుణ చూపిస్తుంది.కానీఆమెకు అతని పట్ల ప్రేమ లేదు. కానీ దానితో సంబంధం లేకుండా అతను దూరంగానే ఉంటాడు.
లూసీ డార్నీలు ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్లి చేసుకుంటారు. కార్టన్ వారిని ఎంతో ఆనందంగా ఆశీర్వదిస్తాడు. వారికి ఒక పాప కూడా పుడుతుంది.
ఇంతలో ఫ్రాన్స్ లో తిరుగుబాటు దారుణహింస లోకి తిరుగుతుంది. తన ఆత్మీయుని రక్షించడానికి డార్నీ లండన్ నుంచి ఫ్రాన్స్ వెళతాడు. అక్కడ రాజకుమారుడు గా గుర్తించబడి నేరస్తుడుగాకోర్టు ముందు నిలబడ్డాడు. కోర్టు అతనికి ఉరి శిక్ష విధించింది.
అప్పటికే ఫ్రాన్స్ లో ఉరిశిక్షలు లెక్క లేకుండా ఉన్నాయి నాలుగు రోడ్ల కూడలిలో పెట్టి ఉరి తీసే గిలటన్ అనే కొత్త మారణాయుధాన్ని పట్టుకొచ్చారు. అప్పుడు రాజకుమారుడు డార్నీ ని రక్షించడానికి అదే పోలికలో ఉండే సిడ్నీ కార్టన్ అతనిని జైలు నుంచి తప్పించి, తాను గిలటన్ కి ఎంతో భక్తి పూర్వకంగా బలవుతాడు. తాను ప్రేమించిన స్త్రీ కోసం, ఆమె బిడ్డ కోసం ఈ త్యాగం చేసినందుకు సిడ్నీ కాటన్ ఆనందంతో ప్రాణాలను వదులుతాడు.
లూసీ ని కార్టన్ ఎంతగా ప్రేమించేడో నవల చదువితే తప్ప తెలియదు.
ఈ వాక్యాలు చూడండి
“ఒక పురుషుడు ఒక స్త్రీని అమిత గాఢంగా ప్రేమించటం, ఆ స్త్రీ తనకు కాకుండా ఇతరులకు దక్కడం, అయినా కూడా ఆ పురుషుడి లో ఆ స్త్రీ పట్ల పూజ్య భావం మిగిలి ఉండటం ఊహించరాని సంఘటన” అంటాడు రచయిత.
తను బతికినంత కాలం ఆమె జీవించిన ప్రతి నిమిషాన్నీ ప్రేమించాడు కార్టన్.
ఇలాంటి సిడ్నీ కార్టన్ ని మనం మర్చిపోగలమా!!?
సినిమా కూడా నవల అంత అద్భుతంగానూ ఉంటుంది.
ఇక రెండవ నాయకుడు కుప్రీన్ రాసిన రాళ్ల వంకీ కథలో వ్యక్తి. మొదట్లో అతనికి ఒక పేరంటూ రచయిత ఇవ్వలేదు కానీ అతను రాకుమారి వేరకు రాసిన ఉత్తరంలో కింద జి. ఎస్. జెడ్ అని సంతకం పెడతాడు. బహుమతి పంపుతాడు. అతను అతి సాధారణమైన తపాలా ఉద్యోగి. ఒక రాజవంశానికి చెందిన అందమైన అమ్మాయిని చూసి ఆరాధిస్తాడు. ఆమె వివాహితురాలు. ఆమె వివాహానికి రెండేళ్ల ముందు నుంచే అతను ఆమెను ఆరాధిస్తూ, ఆమెకు ఉత్తరాలు రాస్తూ, అనుక్షణం ఆమె కదలికలను గమనిస్తూ ఉండేవాడు.
ఆ తర్వాత ఆమె ఒక రాజకుమారుని పెళ్లి చేసుకుంది అతనికి ఆ విషయం తెలుసు.ఆమె పేరు వేరా. ఆమె భర్త చితికి పోయిన జమీందారు. అందుకని వాళ్ళు నగరంలో కాకుండా చిన్న పట్టణంలో ఉంటారు. ఆమె పొదుపరి. నిరాడంబరమైన వ్యక్తి. ఆమె గురించి కుప్రీన్ ఇలా అంటాడు.
రాకుమారి వేరాకి భర్త పట్ల ఉన్న గాఢ ప్రేమ ఈనాడు అంటే రెండేళ్ల కి నిజమైన చిరస్థాయిగా ఉండే స్నేహంగా సర్దుకుంది. అలాంటి వేరాకు ఆమె పుట్టిన రోజు నాడు ఒక కానుక పంపుతాడు పోస్టల్ ప్రేమికుడు.
ఆమె విందు మధ్యలో ఉంది. చాలా కానుకలే వచ్చి ఉన్నాయి. కానీ అతను రహస్యంగా లోపలికి వచ్చి వంటామే చేతికి ఆ కానుక ఇచ్చి వెళ్ళిపోతాడు. అది చిన్న ఎర్రని ముఖమల్ పెట్టె. అందులో ఒక బంగారు కంకణం ఉంది.అది పచ్చల తో కెంపులతో చేసినది. దాని లోపల అష్టకోణంగా ఒక జాబు మడిచి ఉంది.
అతను తన ప్రేమనంతటను ఆ జాబులో పెట్టి, ఇది ఏడేళ్ల నాటి ప్రేమ అని చెప్పి, ఈ ఆభరణం మా తాతమ్మది, మా అమ్మగారే చివరిసారి ధరించారు, ఇది మీరు ధరిస్తే బాగుంటుందన్నాడు. ఇది ధరించిన స్త్రీకి విచారకరమైన ఆలోచనలు ఉండవని, ఇది వారి భర్తలకు దుర్మార్గమైన మరణం సంభవించకుండా చేస్తుందని, అది వారి కుటుంబ విశ్వాసం అని చెప్తూ లేఖ రాస్తాడు. నా బొంది లో ప్రాణం ఉన్నంతకాలం, ఆ తర్వాత కూడా మీకు అణకువ గల సేవకుడను అని పూర్తి చేస్తాడు.
ఆమె చుట్టూ ఉన్న ఆ విందు వాతావరణమంతా వ్యాపార నాగరికత వాతావరణం.చౌకబారు కబుర్లు. అలాంటి చోట లో ఈ కానుక, ఈ ఉత్తరంలోని ప్రేమ ఏమాత్రం అతకవు.
తర్వాత ఆమె ఆ కానుక సంగతి, అతని సంగతి భర్తకు చెప్తుంది. భర్త కన్న కూడా ఆమె సోదరుడు ఈ విషయం పట్ల చాలా ధూర్తం గా మాట్లాడుతాడు. ఎలాగైనా సరే వాడికి బుద్ధి చెప్పాలంటాడు. భర్త వసీలి సున్నిత మనస్కుడు. వదిలేద్దాం అంటాడు. అయినా సరే సోదరుడు వినడు.
మొత్తానికి అతని అడ్రస్ పట్టుకొని ఆ ఇంటికి తన బావను తీసుకొని కానుక గా ఇచ్చిన రాళ్ల వంకి కూడా తమతో తీసుకుని వెళ్తాడు.
ఈ ప్రేమికుడు ఉంటున్న ఇల్లు చాలా మురికిగా పాతగా ఉంటుంది. లోపలికి వెళ్ళటం కూడా కష్టంగా ఉంటుంది. మొత్తానికి అతని గదికి చేరి తలుపు కొడితే ఒక నీరసపు గొంతు వినిపించింది. తర్వాత జల్తుకోవ్ అనే ఆ వ్యక్తి వారిని లోపలికి పిలిచాడు. అతన్ని వాళ్లు ముఖ్యంగా ఆమె సోదరుడు హెచ్చరించాడు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేస్తామన్నాడు.
అంతవరకు ఎంతో భయం భయంగా, వినయంగా ఉన్న అతను వెంటనే వేరేగా మారిపోయాడు.
మీరు అంటున్నది అధికారులకు తెలియజేద్దామనా? నేను పొరపాటు వినలేదు లేదు కదా!! అంటూ అప్పటిదాకా ఉన్న భయాన్ని వినయాన్ని వదిలేసి సోఫా మీద కులాసాగా జార్ల పడి జేబులోంచి సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు.
అప్పుడు ఇలా చెప్పాడు.
“ఈ మాటలని అనడం కష్టం. నేను మీ భార్యని ప్రేమిస్తున్నాను అని అనడం. కానీ ఏడు సంవత్సరాల నిరాశాభరిత, నిరహంకార ప్రేమ నాకు ఆ హక్కును ఇస్తోంది. మొదట్లో ఆమెకు పెళ్లి కానప్పుడు నేను తెలివి తక్కువ ఉత్తరాలు రాశాను. చిట్ట చివరిగా ఈ రాళ్ల వంకి పంపడం కూడా తెలివితక్కువతనమే. కానీ ఇవన్నీ మానేస్తాను కానీ, ఆమెను ప్రేమించకుండా మానేయడం అనేది నా శక్తికి మించిన పని అని నాకు తెలుసు. చెప్పండి ఏం చేయమంటారు? నేను ఆమెను ఇలాగే ప్రేమిస్తూనే ఉంటాను. జైల్లో పెట్టేస్తారా? అప్పుడు కూడా ఆమెకు నేను ఉన్నానని తెలియజేసే అవకాశం ఉంది. ఇక మిగిలిన పరిష్కారం మృత్యువు మీకు అదే కావాలంటే నేను దానికి కూడా సిద్ధమే. ”
ఈ కథ మొత్తానికి ఈ ఘట్టం గానీ ఈ మాటలు కానీ మనని కుదిపి కదిపేస్తాయి.ముందు తెల్లబోతాం. తర్వాత నిఖార్సయిన ప్రేమ ఎలాంటి నిక్కచ్చి తనాన్ని ఇస్తుందో ముఖం మీద కొట్టినట్టు తెలుస్తుంది.
ఆ తర్వాత కూడా వాళ్ళు ఏదో మాట్లాడేరు.
ఇతని ప్రేమ తాలూకు గాఢత ముఖ్యంగా సోదరుడికి ఏమీ అర్థం కాదు. కానీ వేరా భర్త వసీలికి మాత్రం అతని ప్రేమ పట్ల గొప్ప గౌరవం కలుగింది. అతను చాలా ధైర్యవంతుడైన మగాడని అంటాడు. ప్రేమించడం అతని తప్పు కాదు కదా అని కూడా అంటాడు. ప్రేమ అనుభూతిని నువ్వు ఎలా పరిమితం చేయగలవు అనీ అంటాడు వసీలీ.
ఇక జల్త్ కోవ్ వారికి సమాధానం చెప్పేసాడు.
రేపటి నుంచి నా గురించి మీరేమీ వినరు. నేను మీకు సంబంధించి చనిపోయిన వాడికిందే లెక్క. కానీ ఆమెకు చివరిసారిగా ఒక్క ఉత్తరం రాయనిస్తారా అని అడుగుతాడు.
కానీ దానికి కానీ, అతన్ని కలవడానికి కానీ వేరాయే ఇష్టపడదు.
మర్నాడు వార్తాపత్రికలో అతని మరణ వార్త కనిపిస్తుంది ఆత్మహత్యే.
ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్న మాటలు మనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి ముఖ్యంగా ఆ భర్త తాలూకు సహానుభూతి అతనికి జల్తుకోవ్ పట్ల, అతని ప్రేమ పట్ల ఉన్న నమ్మకానికిీ, గౌరవానికీ నూ.
ఈ కథ ఇలా నాలుగు వాక్యాల్లో చెప్పేదికాదు. దాదాపు 80 పేజీల కథ. కానీ ఇందులో ఆ జల్తుకోవ్ అనే ప్రేమికుడు తన ప్రియురాలు తనకు లేదు కనుక, ఆమె తనను వద్దనుకుంది కనుక, ఆమెకు దూరంగా ఉండలేడు కనుక, మరణాన్ని ఆనందంగా స్వీకరించాడు.
ఈ కథ రాసి 130 సంవత్సరాలు దాటింది. కానీ ఇప్పటికీ మనల్ని మరువనివ్వదు. ముఖ్యంగా ప్రాణాల్ని సునాయాసంగా ప్రేమ కోసం పణం పెట్టిన ఆ ప్రేమికుడు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాడు
ఇక మూడవ ప్రేమికుడిని గురించి చెప్తే అందరూ ఆశ్చర్యపోతారు. అతను విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన నర్తనశాల నాటకంలోని కీచకుడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత సాంప్రదాయవాదో అందరికీ తెలుసు. ఆయనకు ప్రాచీన భారతీయ నాగరికత పట్ల ఎంతటి పట్టుదల ఉందో ఆయన కావ్యాలు చెప్తాయి, నవలలు చెప్తాయి.
కానీ వాటన్నిటికంటే పూర్తి విరుద్ధంగా ఈ నర్తనశాల నాటకం ఉంటుంది. కథ భారతంలో కథే. విరాటుడి నగరంలో అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు సైరంధ్రి గా ఉన్న ద్రౌపది. ఆమెను చూసిన మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిన నాయకుడు కీచకుడు. ఈ కీచకుడు అన్న మాటని ఇవాళ ఎంతటి నిదార్థంలో వాడుతున్నాము?
కానీ ఆ కీచకుని విశ్వనాథ వారు ప్రేమికుడిని చేశారు. కీచకుడు చాలా వివేకవంతుడు. అతనికి ఒక్కసారిగా తన బావ గారి ఆస్థానానికి వచ్చిన ఐదుగురు పురుషులు, ఒక స్త్రీ పాండవులు, ద్రౌపది అని గుర్తుపట్టాడు. వారి అజ్ఞాత వాస కాలం గురించిన లెక్క కూడా గుర్తుంది.
కానీ వారి అజ్ఞాతవాసాన్ని భంగం చేయడం అతని ఉద్దేశం కాదు. అతని శరీరము మనస్సు కూడా ద్రౌపది వశమైపోయాయి. ఎలాగైనా సరే ఆమె తనకు కావాలి. తన ప్రేమను వ్యక్తం చేశాడు. కామాన్ని కాదు, ప్రేమనే.అందులో కామన కూడా ఉంది. ద్రౌపతి తన భర్తలు గంధర్వులని ఆ కథంతా చెప్పింది.
అదంతా నిజం కాదని అతనికి తెలుసు. చివరకు నర్తనశాల సన్నివేశం, అక్కడికి రమ్మనడం, భీముడి ద్వారా చంపించడం ఇదే కదా కథ.
ద్రౌపది కీచకుడికి నర్తనశాలకు రమ్మని సందేశం పంపగానే కీచకుడికి ఇందులో మోసం ఉందని అర్థం అయిపోయిందని విశ్వనాథ రాస్తారు.
కానీ ఎందుకు వెళ్ళేడంటే ద్రౌపది లేకుండా జీవించటం అనవసరం అనిపించింది కనుక. ఆమె కోసం చనిపోవటమే నాకు సంతోషం అనుకుని నర్తనశాలకు వెళ్తాడుట.
అక్కడ ముసుగులో ఉన్న వ్యక్తి ద్రౌపది అనుకుని దగ్గరకు వెళ్లి తాకినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన సంభాషణలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి అతడు ఎంతటి శృంగార రసజ్ఞత కలిగిన వాడో చెప్పడానికి రెండు మాటలు రాస్తారు.
మొదట కీచకుడు భీముడిని ద్రౌపది అని అనుకుని స్పృశించగానే భీముడు అనుకుంటా డుట, “వీడేమి వీరుడు వీడి చెయ్యి ఇంత సుకుమారంగా ఉంది” అని.
ఇంతలో అక్కడ కూర్చున్నది ద్రౌపది కాదు పురుషుడు అని కీచకుడికి అర్థమైంది. వెంటనే అతని స్పర్శ గురించి భీముడు ఇలా అంటాడు.
“వీడు ఎంతటి వీరుడు వీడి చేతి స్పర్శ ఇంత కఠినంగా ఉంది” అని. భావనా మాత్రంగానే ఇంతటి స్పృహ కలిగిన కీచకుడి గురించి మన ఊహకు వదిలేస్తారు. ఇలా చాలాచోట్ల నాటకం లో కీచకుడి ప్రేమని, మరణాన్ని లెక్కచేయకపోవటాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పుకుంటూ వస్తారు.
చివరలో నాటకాల్లో మంగళాంతం చెప్తూ భరత వాక్యం రాయడం నాటక సంప్రదాయం.
అక్కడ విశ్వనాథ వారు ఏం చేస్తారంటే కవి లేదా నాటక రచయిత ఇక్కడ జరిగిన అమంగళానికి దుఃఖంతో ఉండి భరత వాక్యం రాయడం మానేశాడు అని ముగిస్తారు. ఆ నర్తనశాల నాటకం లో చివర భరతవాక్యం ఉండదు.
మరణానికి ఆ నాటక రచయిత ఎంత బాధపడ్డాడో చెప్తూ నాటకం ముగించటం ఆయనకు ఆ పాత్ర పట్ల ఉన్న అవగాహనను చెప్తుంది. వివాహిత అయిన ద్రౌపదిని కోరటం తప్పు అన్న విషయం పక్కన పెట్టి, అతడి ప్రేమ తాలూకు తీవ్రతను, నిశ్చలతను చెప్పడం కోసమే ఆ నాటకం రాసారా అనిపిస్తుంది.
దాని ప్రభావంతోటే మన వాళ్ళు నర్తనశాల సినిమా తీయటం అందులో ఎస్వీ రంగారావు ని కీచకుడి పాత్రలో ఎంతో దర్జాగా చూపించడం బహుశా కారణమై ఉండొచ్చు. నర్తనశాల పేరు మాత్రం విశ్వనాథ వారినుంచి గ్రహించినదే.
ఏది ఏమైనా విశ్వనాథ వారు ఈ నాటకంలో ఆశ్చర్యకరంగా పాశ్చాత్య నాటక వైఖరిని చూపెట్టడం జరిగిందనిపిస్తుంది.
కోరిన స్త్రీ దొరకనప్పుడు మరణమే ఆనందం అనుకునే మూడవ నాయకుడుగా ఈ నాయకుడు కనిపిస్తాడు.
ఇలా తమ ప్రేమ కోసం ఆత్మ త్యాగాన్ని ఆనందంగా నిర్వహించిన ప్రేమికులుగా రచయితలు, కవులు వీళ్ళని మనకు చూపించినప్పుడు పురుషులు కూడా స్త్రీల వలే ప్రేమ విషయంలో సున్నితంగా ఉంటారని ఉదాహరణలు ఉన్నాయి కదా అనిపిస్తుంది.
నిజానికి ఇందులో నేను వీళ్ళ ముగ్గురి గురించి చెప్పానే గాని ఈ ప్రతి నాయకుల వంటి దుఃఖోపహతుల గురించి రాసిన కథలు గాని నాటకం కానీ చదివి తీరాల్సిందే , గుండెబద్దలు చేసుకోవాల్సిందే.
ఎందుకూ అంటే మన చైతన్యం విస్తరించడం కోసం.
*
What a pleasant read, veeralakshmi devi gaaroo! Absolutely lively! V R Veluri.
థాంక్యూ సర్
చాలా చక్కగా వివరించారు, కొన్ని చోట్ల మాలతీ చందూర్ గారి ఇంగ్లీష్ నవలా అనువాదం గుర్తుకు వచ్చింది 👍👌