ఉన్నా లేకున్నా
రెండు గ్లాసులు తెచ్చి
పక్కపక్కనే పెట్టు
నీటితో నిండిన గ్లాసులు పక్కపక్కన
అందులో ఒకటి నువ్వు ఒకటి నేను
రెండూ రెండు సముద్రాలు
రెండు మొక్కలను పక్కపక్కన పెడితే
రెండు మహారణ్యాలు
ఒకటి నువ్వూ ఒకటి నేనూ
సముద్రం సంక్షుభితం అవుతుంది
అడవి అల్లకల్లోలమౌతుంది
నువ్వు అడవి నేను సముద్రం
గ్లాసుల సముద్రాలు గ్లాసుల అరణ్యాలు
ప్రాకృతిక సౌందర్యాలు- ఆటవిక ప్రవృత్తులు
అంతర్లీనంగా వెలుగుతున్న మనం-
రేప్పొద్దున సూర్యుడు
ఒక గ్లాసులో ఉదయించి
మరో గ్లాసులో అస్తమిస్తాడు
ఉదయాస్తమయాలైన మనం-
రెండు గ్లాసులో ఎత్తేస్తే ముక్కలవుతాం
ఉన్నాలేకున్నా వాటి అస్తిత్వం మిగులుతుంది
2
గట్టి గింజ
కొద్దిపాటి శాంతైనా
ఒక మహా శాంతి కింద లెఖ్ఖ
ఆ కొద్దిపాటి శాంతి- ఎటు నుంచొచ్చినా
ఒక్క క్షణం పాటైనా
యుగయుగాల నుంచి ఎదురుచూస్తున్న
ఒక మహా విశ్రాంతి కింద లెఖ్ఖ-
మనసు నిండా ఒక నిశ్చలతని నిశ్చింతని
నింపి, ఏ కలతల కలవరపాటులేని
నిరంతరాయ వేదనని దూరం చేసి
ఒకే ఒక్క క్షణం నిబిడ నిశ్శబ్దం కింద
దుఃఖంలేని దేవతావృక్షం కింద నిల్చోబెట్టి
సర్వాంగాలనీ అమృతమయం చేసి-
ఏమి స్థితి అది ?
ఏమీ లేని స్థితి ఏమీ రాని స్థితి
ప్రపంచంలోని శుభమంగళాల సాక్షిగా
ఇక్కడే వుంటాం
ఇక్కడ వుండటం- ఎక్కడో
అనిముషులుండే చోటులో వున్నట్టు
అదొక ఏమీలేని, అన్నీ వున్న స్థితి
బతికి వుండి మరణపు శాంతిని
అనుభవించే ఒక స్వర్గక్షణం
నిశ్చల నీరవ కాంతి నిమఘ్న అవెరపు క్షణం
మీకు నేను చెప్పలేకపోవచ్చు
మీరు నాకు చెప్పలేకపోవచ్చు
కాని, ఆ క్షణముంది, అనేక వేల సంవత్సరాల
మానవ చరిత్ర గుండా తోసుకొస్తున్న
అలిఖిత అమోఘక్షణం
దీన్నందుకుంటానికేనా
యోగులందరూ తలకిందులుగా
తపస్సు చేసి- పొందీపొందక-
వ్యవధి ఎంతైతే ఏమిటి
ఆ క్షణం ఎన్ని జీవితాలైనా జీవించవచ్చు
ఆ అద్భుత క్షణశాంతిని అందుకోగలవా-
జీవితాన్నంతా జల్లించి జల్లించి
గట్టి గింజ ఆ ఒక్క క్షణాన్ని
పట్టుకోవాలి, పొదువుకోవాలి.
*
గురువు గారికి నమస్సులు
Guruvu Garu glassu neella nu kuda goppa kavitwam cheyya galaru. Gatti ginja viluva cheppagalaru. Guruvu gariki vandanalu
శివారెడ్డి గురువు గారు గ్లాసు నీళ్లను కూడా గొప్ప కవిత్వం చెయ్యగలరు. గట్టి గింజ విలువ చెప్పగలరు. గురువు గారికి వందనాలు ~ వసీరా
( వసీరాగా సుపరిచితుడైన వక్కలంక సీతారామారావు తెలుగు రచయిత. ప్రస్తుతం టీవీ జర్నలిస్టు. అతను రాసిన ” కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు కానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం ” అనే వ్యాఖ్య అందరికీ సుపరిచితం )