ఉద్యోగం-సద్యోగం వెతుక్కోడం

వంగూరి జీవిత కాలమ్-63

మెరికాలో అడుగుపెట్టిన వారం, పది రోజులకి కావలసినంత సేపు నిద్రా, మధ్యే, మధ్యే టీవీ తో కాలక్షేపాలూ అవీ మానేసి ఏదో ఒక వ్యాపకం చూసుకోకపోతే ‘లావై” పోతాం అని అనుమానం వచ్చేసింది. పైగా ఇండియా నించి అధికారికంగా తెచ్చుకున్న 8 డాలర్లు, అనధికారంగా తెచ్చుకున్న వంద డాలర్లలో అక్కడో డాలరూ, ఇక్కడో డాలరూ ఖర్చే కానీ జేబు నిండే అవకాశం లేదు. ఇక ఉద్యోగం ప్రయత్నాలు ముమ్మరంగానే చెయ్యవలసిన అవసరం రాగానే మా తమ్ముడి ని “ఒరేయ్. నేను బొంబాయి లో మేష్టర్ ఉద్యోగం వెలగబెట్టాను కదా. ఇక్కడ ఇంజనీరింగ్  కాలేజీలలో లెక్చరర్ ఉద్యోగానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందీ?” అని అడగ్గానే వాడు “భేషుగ్గా ఉంటుంది. ముందు నువ్వు చికాగోలో ఉన్న ఐ ఐ టి…అంటే ఇలినాయ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి వెళ్ళి అడుగు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఐదు దాటాక అక్కడ ఉండొద్దు” అని మరీ మరీ చెప్పి  అని అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పాడు. దాంతో నా జీవితంలో ఉద్యోగాన్వేషణ పర్వం మొదలయింది. ఈ అధ్యాయం ఒక నెలా, నెలన్నర పాటు జరిగింది….రక రకాల అనుభవాలతో..

మొదటి అనుభవం మా తమ్ముడూ ఉండే హార్ వుడ్ హైట్స్ అనే ప్రాంతం నుంచి పబ్లిక్ బస్సు లో 15 నిమిషాల దూరంలో ఉన్న సబ్ వే స్టేషన్ కి వెళ్ళడం, అక్కడ నుంచి సబ్ వే లో డౌన్ టౌన్ లో మిషిగన్ అవెన్యూ లో దిగి, మరొక సబ్ వే లో 33వ స్టేషన్ లో దిగి, నడుచుకుంటూ 35వ రోడ్డు మీద ఉన్న ఐఐటికి వెళ్లడం. ఇలా బస్సులూ, ట్రైన్ లూ బొంబాయి లో కూడా బాగా అలవాటే కానీ, అక్కడి లాగా ఇక్కడ “టికెట్, టికెట్” అంటూ బస్ కండక్టర్ అరుచుకుంటూ రావడం, రైల్లో ‘ఉతరో, ఉతరో” అంటూ జనాలు తోసుకుంటూ దిగడం లాంటి సరదా సీన్లు లేవు. అంతా సీరియస్ వ్యవహారమే. మనం కాయిన్లో, టిక్కెట్లో, ప్లాస్టిక్ పాస్ లాంటిదో ఏదో కన్నం లోకి తోస్తే కానీ బస్సులోనూ, రైల్లోనూ కడ్డీలు తెరుచుకుని మనల్ని లోపలికి వెళ్ళే  దారి తెరుచుకోదు.

ఇక అసలు, సిసలు తేడా అల్లా చికాగో చలి. పైగా ఈదురు గాలి. పొద్దున్నే ఆ చలి భరించడానికి కావలసిన సవా లక్ష లోపలి లాగులు, పై కోట్లు, లాంగ్ కోట్లు అన్నీ వేసుకుని, చెవులూ, మొహం పూర్తిగా కప్పేసుకుని, మా ఇంటికి వంద గజాల దూరం లో ఉన్న బస్ స్టాండ్…అంటే ఒక కేవలం ఒక జెండా కర్ర..దాని మీద అక్కడ ఆగే బస్సు నెంబర్లు ….అక్కడికి వెళ్ళి నుంచుంటే బస్ వచ్చే దాకా గడ గడ వణికి పోవాల్సిందే. కానీ ఈ తెల్లోడి మాయే ఏమిటో కానీ అంత మంచు లోనూ, ఆ బస్సు ఎప్పుడూ ఖచ్చితంగా చెప్పిన సమయానికే వచ్చేది. అంచేత నేను అక్కడ ఎక్కువ సేపు నుంచో సరిగ్గా ఒక నిమిషం ముందు మాత్రమే అక్కడ ఉండేలా ప్లాన్ వేసుకునే వాడిని. ఆశ్చర్యం ఏమిటంటే ఓ పది రోజులు నన్ను ప్రతీ రోజూ అదే సమయానికి రావడం చూసి ఆ డ్రైవర్ డేవిడ్ పరిచయం అయ్యాడు. నేను ఎప్పుడైనా కొంచెం ఆలస్యం అయి,  ఆ బస్ స్టాండ్ దగ్గరకి  తొందర తొందరగా నడుస్తున్న నన్ను చూసి అతను బస్ ఆపేవాడు నా కోసం. ఇక్కడ మరొక తమాషా చెప్పాలి. అలా ఆ బస్ స్టాండ్ దగ్గర నుల్చున్న నన్ను చూసి కొంత మంది లిఫ్ట్ ఇవ్వడానికి కారు ఆపేవారు. ఇంకా మొత మంది ముదుకు వెళ్ళీపోయిన వాళ్ళ కారుని వెనక్కి నడిపి మరీ నా దగ్గరకి వచ్చేవారు. కానీ నా మొహం, మీసాలు చూసి, అమ్మాయిని కాదు కాబట్టి “డామ్” అనో మరో “నాలుగు అక్షరాల మాటో” అనుకుంటూనో పారిపోయేవారు ఆ కుర్రకారు. “ఎవరు లిఫ్ట్ ఇస్తాను అన్నా, నువ్వు ఆ కారు ఎక్కకు. చాలా డెంజరస్” అని మా తమ్ముడు ముందే చెప్పాడు.

విషయం ఏమిటంటే… చికాగోలో ఈ ఐఐటి అక్కడ డౌన్ టౌన్ కి దక్షీణాన 35వ స్త్రీట్ లో ఉంటుంది. అక్కడి నించి ప్రారంభం అయి ఇంచుమించు సబ్ వే 60 దగ్గర ఉన్న యూనివర్శిటీ ఆఫ్ చికాగో ఉండే  ఈ ప్రాంతానికి చికాగో సౌత్ సైడ్ అని పేరు. యావత్ అమెరికాలో అత్యంత దారుణమైన క్రైమ్ ప్రాంతాలలో ఒకటి. హత్యలు, దొంగతనాలు, మగ్గింగ్, మారక ద్రవ్యాల వ్యాపారం, వాడుక ఇలాంటివన్నీ అక్కడ పట్టపగలే జరుగుతాయి. ఇక చీకటి పడితే చెప్పక్కర లేదు. అందుకే మా తమ్ముడు సాయంత్రం ఐదు దాటాక అక్కడ ఉందవద్దు అని ఘాట్టిగా చెప్పాడు. కానీ ఒక రోజు నేను పొరపాటున 33వ సబ్ వే స్టేషన్ లో దిగడం మర్చిపోయి, ఆ తర్వాత స్టేషన్ లో దిగిపోయాను.

దిగి రోడ్డు మీదకి రాగానే ఎందుకో, ఎలాగో ఇదేదో చెడ్డ ప్రదేశం అని  నిజంగానే భయం వేసింది. ఏం చెయ్యాలో తెలియక ఐఐటి వేపు నడవడం మొదలుపెట్టాను. ఒక పక్క చలి, మరొక పక్క భయం. నా కేసి ఎందరో నక్కి నక్కి చూస్తున్న ఫీలింగ్…..పైగా చేతిలో బ్రీఫ్ కేస్….నాలుగు అడుగులు వెయ్యగానే ఎక్కడి నుంచో ఓ పోలీసు నా పక్కనే కారు ఆపి, అద్దం దింపి నన్ను పిలిచాడు.”ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు. నేను భయంగానే “తప్పు స్టేషన్ లో దిగిపోయాను. ఇక్కడే ఐఐటికి వెళ్ళాలి, దగ్గరే కదా” అన్నాను. “దగ్గరే కానీ నువ్వు వెళ్ళ లేవు” అని ఆ పోలీసు తన కారులో ఎక్కించుకుని నన్ను అక్కడ దింపాడు…”It is walking distance, but you won’t get that far” అన్నది ఆ పోలీసాయన ఉవాచ. అదే అమెరికా పోలీసుతో నేను గడ గడ లాడుతూ మాట్లాడిన మొదటి సంభాషణ. పోలీసు కారు ఎక్కడం కూడా అదే మొదటి సారీ, ఆఖరి సారీ కూడానూ. చికాగో సౌత్ సైడ్ ఇప్పటికీ రోజు వారీ హింసాకాండలతో అలాగే ఉంది.  ఈ ఉదంతం మరొక సరి కొత్త అనుభవం.

ఇక మొదటి రోజు నేను ఐఐటికి వెళ్ళి అక్కడ నానా అవస్తలూ పడి మొత్తానికి నలుగురు, ఐదుగురితో మాట్లాడితే అక్కడ కానీ, మరెక్కడైనా కానీ లెక్చరర్ ఉద్యోగాలు అంత సునాయాసంగా రావు అనీ, లైబరరీకి వెళ్ళి ఇంజనీరింగ్ జర్నల్స్ లో ఏమైనా ప్రకటనలు ఉంటే అప్లై చెయ్యమనీ సలహా ఇచ్చాడు ఒకాయన. ఒక విధంగా ఆ సలహా నాకు ఓ దారి చూపించినట్టు అయింది. ఎందుకంటే ఆ లైబ్రరీలో అడుగుపెట్టగానే అమెరికాలో వెలువడే అన్ని ప్రముఖ పత్రికలూ అక్కడే కనపడ్డాయి. న్యూ యార్క్ టైమ్స్, లాస్ ఎంజెలెస్ టైమ్స్….వాషింగ్ టన్ పోస్ట్..ఒకటెమిటి…ఉద్యోగ ప్రకటనలు పడే ప్రతీ పెద్ద పత్రికా చూసుకోడానికి అది మహత్తరమైన ప్రదేశం. అంతే కాక అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ లాంటి మా ప్రొఫెషనల్ జర్నల్స్ అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇంకేముందీ,,,నా ఉద్యోగాన్వేషణకి ఒక ప్రణాళిక సిధ్దం చేసుకున్నాను. ఆశ్చర్యం వేసిన మరొక అంశం ఏమిటంటే…నేను ఆ లైబ్రరీ లో అడుగుపెట్టడానికీ, లోపల టైపింగ్ చేసుకోడానికీ, క్సీరాక్స్ కాపీలు తీసుకోడానికీ నన్ను ఎవరూ ఎప్పుడూ ఆప లేదు, నా ఐడెంటిటీ కార్డ్ లాంటిది అడగ లేదు.

ఉద్యోగ ప్రకటనలు వారాంతం పేపర్లలో శనివారం, ఆదివారం ఎంప్లోయ్ మెంట్ సెక్షన్ అని ఒక్కొక్క పెద్ద పత్రికలోనూ యాభై పేజీలపైనే వస్తాయి. అంచేత నేను సోమవారం పొద్దున్నే అంత చలిలోనూ మొండి కేసి  ఐఐటికి వెళ్ళి పోయి, సాయంత్రం దాకా అక్కడ లైబ్రరీ లో ప్రతీ పేపరూ కూలంకషంగా చూసి ఎక్కడైనా చూచాయగా “మెకానికల్ ఇంజనీర్” అనే మాట కనపడితే చాలు….అ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టడానికి రెడీ అయిపోయేవాడిని. అసలు అమెరికాలో ఇంజనీర్ అనే మాటకీ ఇండియాలో ఇంజనీర్ అనే మాటకీ అర్ధాలు వేరులే అని అప్పుడే నాకు తెలిసింది. ఉదాహరణకి ఇక్కడ స్టేషనరీ ఇంజనీర్ అంటే బాయిలర్లు మొదలైనవి రిపేరు చేసే వృత్తి. ఇండియా లో మనం మెకానిక్ అంటాం. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

మెకానికల్, హిడ్రాలిక్స్, న్యుమాటిక్స్, ఫ్ల్యూయిడ్ పవర్…ఒకటేమిటి….అసలు నాకు సంబంధించిన ఎటువంటి “హెల్ప్ వాంటెడ్” ప్రకటన ఏ పేపర్లో, అమెరికా మొత్తం లో ఏ రాష్ట్రం లో అయినా ఆ ప్రకటనలు కొన్నాళ్ళు అక్కడె ఉన్న క్సీరాక్స్ మెషీన్ లో కాపీ చేసుకునే వాడిని. కానీ పేజీకి ఐదో, పదో  సెంట్లు ఖరీదు ఉండేది. వారానికి 20-30 కాపీలు ఉన్నప్పుడు ఆ ఖర్చు భరించలేక, ఓ నోట్ బుక్ పెట్టుకుని అందులో ఆ ప్రకటన నకలు రాసేసుకునే వాడిని. ముందు ఎంతో నిజాయితీగా నా బయో డేటాని యదాతధంగా తయారు చేసుకున్నాను. అంతా రాస్తే అది “కట్టె, కొట్టె, తెచ్చె” లాగా  ఒక పేజీ కూడా రాలేదు. ఈ స్టేషనరీ ఇంజనీర్ లాటి ఉద్యోగాలకి “నేను బొంబాయి ఐఐటి లో డాక్టరేట్ పట్టా పొందితిని. మరియు ఆరు వత్సరములు లెక్చరర్ గా పని చేసితిని” అనే బయో డేటా పనికి రాదు కదా. అంచేత అచిరకాలం లోనే ఆ డాక్టరేట్ తీసేసి కొన్నీ, లెక్చరర్ మాట మర్చిపోయి కొన్నీ, నేను కంపెనీలకి కన్ సల్టెంట్ గా చేసిన ఇంజనీరింగ్ డిజైన్ పనుల గురించి వ్రాసిన వీ…ఇలా మూడు, నాలుగు రకాల రెస్యూమె లు తయారు అయ్యాయి. మిషిగన్ స్ట్రీట్ మీద ఉండే సర్ స్పీడీ అనే ప్రింటింగ్ ప్రెస్ & క్సీరాక్స్ సెంటర్ లో ఈ బయో డేటాలు టైప్ చేయించి తలో యాభై కాపీలు ప్రింట్ చేయించాను. ఏ చెట్టుకి ఆ రాయి.

“ఫలానా పేపర్ లో ఫలానా పేజీలో మీరు వేసిన ఫలానా ఉద్యోగ ప్రకటన నాకు చాలా ఆసక్తి కలిగించింది. సదరు ఉద్యోగానికి కావలసిన అన్ని అర్హతలు నాకు ఉన్నాయి. నా బయో డేటా జతపరుస్తున్నాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకోవాలి అని కుతూహలపడుతున్నాను. మీరు సత్వరం నన్ను ఫలానా ఫోన్ నెంబర్ లో పిలిచి ఎప్పుడు రమ్మంటే అప్ప్పుడు వస్తాను. ఇట్లు, భవదీయుడు” .. ఐఐటి లైబ్రరీ లో ఉన్న IBM సెలెక్ ట్రిక్ టైప్ రైటర్ లో ఒక కార్బన్ కాపీతో సహా ప్రతీ ఉద్యోగం దరఖాస్తుకీ ఈ నమూనా ఉత్తరం టైప్ కొట్టుకునే వాడిని.

సుమారు నెలా, నెలన్నర పాటు జరిగిన ఈ తతంగం లో నేను వారానికి కనీసం 20 అప్లికేషన్లు దేశం అంతా పంపించే వాడిని. ఉద్యోగం వెతుక్కోవడమే అప్పటి నా ఫుల్ టైమ్ ఉద్యోగం.  రోజూ బస్సు, సబ్ వేలలో, చలి లో వణికి చస్తూ ఐఐటీ లైబ్రర్రీ కి వెళ్ళడం, పదో, పదిహేనో ప్రకటనలు ఎంపిక చేసుకుని, అప్లికేషన్లు పంపించి, ఇక కళ్ళు కాయలు కాచేలా వాళ్ళ స్పందన కొసమో, ఫోన్ కోసమో ఎదురు చూడ్డం….ఇదీ దైనందిన దిన చర్య.  అన్ని రకాల బయో డేటాల కాపీలు, ఉత్తరాల నకళ్ళూ, స్టాంపులు, పేపర్ క్లిప్పులు, జిగురు, స్టేప్లర్, తెల్ల కాగితాలు..ఇలాంటి వన్నీ నా బ్రీఫ్ కేస్ లో ఉండే సామాగ్రి.

ఇలా అప్లై చేసిన ఏ ఒక్క ఉద్యోగానికీ నేను అర్హుడిని కాదు లేదా ఆ ఉద్యోగాలు నా అర్హతలకి సరిపోయేవి కావు అని నాకూ తెలుసు. మా తమ్ముడికీ తెలుసు. కానీ ఈ యజ్ఞం ఆప కూడదు. ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో అనుకున్నాం కానీ ఏ పుట్టలోనూ ఏ పామూ లేదు. వచ్చిన స్పందనలు అన్నీ ఒకే ఒక్క కాగితం లో ఐదారు వాక్యాల ఉత్తరాలే. “మీ అప్లికేషన్ అందింది. మీ అర్హతలకి అభినందనలు. వాటికి సరి పడ అవకాశాలు ప్రస్తుతానికి మా కంపెనీలో లేవు. మీ దరఖాస్తు ఫైల్ లో పెట్టి, అవసరం అయినప్పుడు మిమ్మల్ని పిలుస్తాం. అంత వరకూ శలవ్.  శుభాకాంక్షలతో…”..ఇదీ ఆ ఉత్తరాల సారాంశం.

ఈ నెలా, నెలన్నరలోనే కొందరు తెలుగు మిత్రులతో పరిచయం అయింది….ఆ వివరాలు త్వరలో..

*

వంగూరి చిట్టెన్ రాజు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుంది. మంది జీవిత సత్యం

  • Mee 1975 lo anubhavalu, daadaapu 30 ella taravati naa anubhavalu oke laga unnayi andi. Mee kadhalu, anubhavalu chala baaga raasaaru. Chadavataaniki bagunnayi. Dhanyavaadaalu.

    • ధన్యవాదాలు…..నా జ్ఞాపకాలు మీకు కూడా మీ జీవిత విశేషాలని గుర్తు చేస్తే….నా జన్మ ధన్యం…మిత్రమా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు