ఊపిరి వెంటిలేటర్ మానిటర్ పై తన్నుకుంటోంది
ఎర్ర బల్బుల బెదిరింపులు
ఆ గదిలో హోరెత్తుతున్నాయి
ఎగే శ్వాస, దిగే శ్వాస
నిర్దాక్షిణ్యంగా నిలబడి ఉన్న
మృత్యువు కేసి వెర్రి చూపులు
నీళ్ళ నుంచి తీసిన చేప పిల్లల్లే
ప్రాణం రెక్కలు కొట్టుకుంటోంది
మాట పెగలదు
గుండె ఆడదు
కాపాడుకోవాలనే ఆత్రమేదో
ఊపిరిని నొక్కి పెడుతున్నాయి
బతకాలన్న ఆశ,
బతికించుకోవాలన్న ఆరాటం
కరిగిపోతున్న కాలంతో
యుద్ధం చేస్తున్నాయి
గాలిని నింపుకుని బండి బయలుదేరిందట
జగన్నాథ రధచక్రాల్లా
పరుగు పరుగున
వస్తోందట
ఉండమంటే ఊపిరి ఉగ్గపట్టుకుని ఉంటుందా
కాలం ముల్లు కదలకుండా నిలబడుతుందా
దూరాన్ని, కాలాన్ని, గాలి పరిమాణంతో
వాళ్ళు తీరిగ్గా భాగాహారాలు వేస్తున్నారు
లెక్క తప్పింది
నిర్లక్ష్యం కూడిక అయ్యింది
గాలి కోసం తల్లడిల్లిన ప్రాణాలు
గాలికి హారతయ్యాయి
రోజువారీ మరణాల సంఖ్యల్లో
వారు అంకెలయ్యారు
రోడ్డున పడిన జీవితాలు
సమాధానం లేని ప్రశ్నలయ్యాయి.
*
బావుంది
Super lines
ఒక విషాణువు కారణంగా ఎంతోమందికి అనుభవంలోకి వచ్చిన దురదృష్టకర క్షణాలను ‘‘ఉగ్గపట్టుకోని ఊపిరి’’లో ప్రకటించారు రెహానా.
‘దూరాన్ని, కాలాన్ని, గాలి పరిమాణంతో
వాళ్ళు తీరిగ్గా భాగాహారాలు వేస్తున్నారు’
కవితలోని ప్రతి పాదమూ ఆకట్టుకుంది. అభినందనలు.
రోడ్డు నపడిన జీవితాలు సమాధానం లేని ప్రశ్నలు అయ్యాయి..!కవిత బాగుంది.. మేడం