కుమార్ ఫోన్ చేసి, రమక్క విషయం చెప్పిన కాడ్నుంచి మనసు మనసులో లేదు. ఇక ఉన్నచోట ఉండ బుద్ది కాలా. ఆవుంతున అటోలో బయల్దేరానే గానీ ఆలోచనలు తెగడం లా. రమక్క హైద్రాబాదులో బానే వుందనుకున్నా గానీ, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్టు, రమక్కకి ఈడా తిప్పలు తప్పినట్టు లెవ్వు.
కుమార్ వరసకు నాకు మేనల్లుడు. మా రమక్క కొడుకు. ఇరవై యేళ్ళ మునుపు చర్చిలో ఒక పిల్లను ప్రేమించి, వెళ్ళిపోయి, ఆ పిల్లనే పెళ్ళి చేసుకొని, హైదరాబాదులోనే, ఆ పిల్ల ఇలాఖాలోనే వుంటన్నాడు. పి.జి; బియిడి చదివాడు కాబట్టి ప్రైవేటు స్కూళ్ళల్లో టీచర్‌గా చేస్తా ఎట్టనో సంసారం ఎళ్ళదీసుకొచ్చాడు. మెల్లంగా సొంత స్కూల్ పెట్టుకుని నిలదొక్కుకున్నాడు. ఎట్టోకట్టా పిల్లల్ని మంచి చదువులు చదివిస్తన్నాడు. అప్పో సప్పో చేసి సొంతిల్లు కట్టుకున్నాడు. సొంతకాళ్ళ మీద నిలబడ్డాడు. అందుకే వాడంటే ఒక రకమైన ప్రేమ నాకు.
మా బావ చనిపోయిన తర్వాత ఒంటరయిపోయిన మా రమక్క..పెద్ద కొడుకు రమేషు కాడే కుదురుకుందాం అనుకుంది గానీ ఆ రమేషు గాడికి తల్లి మీద ప్రేమ కన్నా ఆమెకొచ్చే పింఛను మీదే ఎర్ర. అదీగాక వేరే కులం దాన్ని చేసుకొని ఎళ్ళిపోయిన కుమార్ గాడు మళ్ళా మెల్లగా మాటలు కలిపి కుటుంబంలో జొరబడ్డాడు. పోనీ పీడాకారం విరగడయిపోయిందనుకుంటే మళ్ళా కుమార్ గాడు, ఆడి పిల్లలు సెలవులకి ఇంటికొచ్చి, కళ్ళ ముందే తిరుగుతుంటే రమేషుకి కడుపులో కారం జల్లినట్టు కరకరా మంట మండేది. అదీ గాక అయినోళ్ళు, కానోళ్ళు తలొక మాట ఏగ్యానం చేస్తా వుంటే, ఆడికి కూడా ఏం అనాలో తెలీక పిచ్చి లేచేది. అసలే ఆడు మొదటాలమించి తాగుబోతు. ఇక ఈ కచ్చంతా మనసులో పెట్టుకొని, పీకల్దాక తాగి, రమక్క డబ్బులిచ్చిందాక నానా భీబత్సం చేసి, నానా రబస చేసి, ఇంటో వస్తువులు ఆగం ఆగం చేసేసే రాజేషుగాడిని చాన్నాళ్ళు బరాయించి బరాయించి, ఆడు తాగుడు డబ్బులు కోసం కొట్డడానికి కూడా తెగబడతుండటంతో ఇక తట్టుకోలేక, ఇంక మరో దారి అవుపడక, అప్పుడప్పుడు కుమార్ కాడకి వచ్చి పడతంది రాములక్క. ఏ మాటకా మాట..కుమారు గాడు రమక్కని బాగానే చూసుకుంటన్నాడు. అంతవరకు పోన్లే అనుకుంటే, పోను పోను ఆడ కూడా గొడవలు మొదలయ్యాయంట.
“ఇద్దరూ పొట్టు పొట్టు తిట్టుకుంటున్రు మామా..ఆళ్ళనాపను నాకు సేతకావట్లే..” అన్నాడు కుమారు నేను ఆటో దిగడం తోటే..
“అదేందిరా..ఇన్నాళ్ళ బట్టి బాగానే వుంటన్నారుగా ?” అన్నా ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి
“ఔ గానీ..మామా..ఈ నడుమల్నే షురూ జేసిన్రు..ఏం జెప్పినా ఇనడం లే. ఏం జేయాల్నో సమజ్ కాక నిన్నటి సంది మస్తు పరేషాన్ అవుతుండె. గందుకే దిమాక్ ఖరాబయి నీకు ఫోన్ జేషినా” అన్నాడు కుమారు జేవురించిన మొకాన్ని చిన్నది చేసుకుని
“యాడుందిరా అమ్మ ?”
“ఇంట్లనే వుంది.”
“మరి, నీ పెళ్ళాం..?”
“ఇస్కూల్లనే వుంది మామా..”
రమక్క రూపం గబక్కన మనసులో మెదిలింది. ఎప్పుడు చూసినా బలే ధీమాగా అవుపించే మడిసి. ఆదివారం చూడాలి.. మొకం మీద చెరగని చిరునవ్వు, ఇస్త్రీ నలగని తెల్ల చీర, చేతిలో నల్లట్ట బైబిలు, ఎండ తగలకుండా చేతిలో గొడుగు..రడీగా వున్న చెక్కరిక్షా మీదెక్కి ఎంచక్కా చర్చీకెళ్ళేది చూసి తీరాలి. ‘నెల తిరక్కుండా టంచనుగా పింఛను డబ్బులు చేతిలో పడతన్నాయిగా ఏం దొబ్బుడాయి..’ అని జనం కచ్చిగా కుళ్ళుకోవడం చూసాను. పైగా ఆమి అట్టా టిప్పుటాపుగా తయారయి చర్చీకి ఎళ్ళడం, రావడం మా చుట్టాలెవరికీ సుతారం నచ్చేది కాదు. అక్క మాటిమాటికి ‘అంతా యేసయ్య దయ’ అన్నప్పుడల్లా ఆమి చూడకుండా మొకం చిట్లించుకునేవోళ్ళు. ఆమి మరుదులకి ఆమంటే బలే కడుపుమంట. ఎందుకంటే ఆళ్ళు మా బావ బతికి వున్నప్పుడు పైలా పచ్చీసుగా తిరగతా, పనీపాటలు గాలికొదిలేసి, తాగుడికి డబ్బులిమ్మని బావ ఎనకీడితా పడేవోళ్ళు. రమక్క ఆళ్ళని పడనిచ్చేది కాదు. ఇంటి చాయలకి కూడా రానిచ్చేది కాదు. ఎట్టోకొట్టా ఆళ్ళని ఇదిలించుకొని తుస్కారంగా ఎళ్ళగొట్టేది. బావే రమక్క కళ్ళబడకుండా ఆళ్ళకి పదో పరకో ఇచ్చి పంపేవోడు. కుమారు గాడు ఆ పిల్లని చేసుకున్నాకాడ్నుంచే రమక్క పరిస్థితి కాస్త బెసికింది.
కుమారు గాడు అంతకు ముందు స్కూలుని వేరే అద్దె బిల్డింగ్‌లో నడిపాడు. తర్వాతర్వాత మెల్లగా ఒక జాగా కొని, అప్పోసప్పో చేసి మూడంతస్తులు స్కూలు కట్టాడు. ఇది కట్టినాక ఇందులోకి మారిపోయాడు. కిందంతా స్కూలు తరగతి గదులు. పైనంతా ఒక పక్కన కుమారుగాడి ఇల్లు. ఆ పక్కన ఒక రూములో విడిగా బాత్రూమ్ కట్టి, రమక్కని అందులో వుంచాడు.
ముందు కుమారు పెళ్ళాం రూతు ఏమంటుందో చూద్దామని ఆ అమ్మాయి కాడకి వెళ్ళాను. స్వతహాగా ఆ అమ్మాయి మంచిదే. మొదటాల మించి కుమారుగాడి కష్టంనష్టం, సుఖంసంతోషంలో భాగం పంచుకుంది. స్కూలు నిలబడడంలో ఆమె పాలు చాలా వుంది. కుమారుగాడు లేనప్పుడు ఒక్కతే స్కూలు చలాయించుకొచ్చేది. టీచర్ల జీతాలు అటూఇటూ అయినా సర్ది చెప్పుకు వచ్చేది. కుమార్ గాడు స్కూల్లో కొన్ని విషయాలని రూతుకే వదిలేసేవాడు.
నేనెందుకు వచ్చానో రూతు గ్రహించినట్టే వుంది. మూతి బిగించుకొని కూర్చుంది. ఆ అమ్మాయి క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళే అమ్మాయి కదా..అట్నుండి నరుక్కువద్దామనుకున్నా.. బాగున్నావనే పలకరింపులు అయాక “ఏమ్మాయ్..నువ్వు బిలీవర్‌వి కదా..మీరిట్టా ఎట్టా తిట్టుకుంటా వున్నారు..? అట్టా తిట్టుకుంటే పిల్లలు ఏవనుకుంటారు? చుట్టుపక్కల ఏవనుకుంటారు? అసలు ఇట్టా వుంటే యేసయ్య మిమ్మల్ని ఒప్పుతాడా ? ” నా మాటలు పూర్తి కాకుండానే టప్పని సమాధానం ఇచ్చింది రూతు.
“యే..ఆమె పోదా చర్చికి? నేనేనా..? ఆమెకి బీ వుండొద్దా..మీకు తెలుసా ఆమె ఏమేం మాట్లాడుతదో.. గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతది..చెప్పలేని గలీజ్ పనులు చేస్తది..”
” ఆమి పెద్దదయిపోయింది. ఆమి పనయిపోయింది. ఇంక ఆమె మాటల్ని పట్టించుకుంటే ఎట్టామ్మాయ్ ? ఆమె అనిందని మనం కూడా అంటే ఎట్టమ్మాయ్?”
“అంటా..బరాబర్ అంటా..నేనెందుకు పడాలె..? నేనంటేనే ఆమెకి చటాక్‌మంటది. నా కూరలు ముట్టదు. నా బట్టలు ముట్టదు. నేనెళ్ళిచ్చిన బాత్‌రూమ్‌ల మూడు బిందెల నీళ్ళు పారవోసి గాని పోదు..నన్ను అగ్గువగా చూస్తది..అలగ్ పెడుతది..నేను అర్రల కచ్చిన్నంటే ఆమె దూరం పోతది. పిల్లలకి గలత్ మాటలు చెప్పి ఆళ్ళనీ దూరం చేస్తది..ఆర్డర్ల పెట్టి తెచ్చుకున్న బిర్యానీలల్ల ఒక్క బొక్కముక్క ఎయ్యరు..” గన్‌షాట్‌లాగ దడాదడా మాట్టాడుతున్నదల్లా ఎవరో స్కూలు పిల్లల తలిదండ్రులు వస్తే ఆగి, అటెళ్ళింది.
నేను నమ్మశక్యం కానట్టు కుమారు వంక చూసా. ఆడు అవునన్నట్టు తలాడించాడు.
“ఔ మామా..ఈ నడుమలే అమ్మ ఇట్ట జేయవట్టె..ఊకూకే ఇజ్జత్ తీస్తది..ఊకూకే లొల్లి షురూ చేస్తది. పోనీ ఈమైనా ఖామోషుంటదా..లే..మాటకి మాట అంటా పొట్టేల్ లెక్క లొల్లికి ఉరుకుతది..రోజూ ఇంట్ల ఇదో పెద్ద పరెషాన్..ఇగ స్కూళ్ళ టీచర్ల ముంగట ఇజ్జతుంటదా మామా..” అన్నాడు కుమారు విచారంగా
“అంటే పూరా నాదేనా తప్పు..? మీ అమ్మది లేదా?” తిరిగొచ్చిన రూతు కోపంగా ఒక బూతు మాటతో అందుకుంది. రమక్క పేరెత్తితే రూతుకి కోపం కట్టలు తెంచుకోవడం గమనించాను.
“ఇగ్గో..ఏవైనా చెప్పండి. వింటాను. ఆమె సంగతి చెప్పొద్దు..నన్ను నా కులం పేరు తీసి తిడతది. నన్ను తిట్టినా పర్వాలే..పూరా మా ఖాందాన్‌ని గలీజ్ తిడతది. మా బుద్దులే మంచివి కావని తిడతది. నా అమ్మొచ్చినా, తమ్ముళ్ళొచ్చినా మాట్లాడుడు బంద్ చేస్తది. మాల మంద ఇంటి మీన పడి తింటుర్రని మొత్తుకుంటది ఆళ్ళ ముంగటనే..”
ఇంక రూతు ఏం చెప్పినా వినే స్థితిలో లేదని నాకు అర్థం అయింది. మెల్లగా లేచి రమక్క రూముకి వచ్చా. రమక్క మంచం మీద ముడుక్కొని పడుకొని వుంది. మడిసిలో మునుపటి బిగువు లేదు. ముసలితనం మీద పడిపోయింది. పైగా సుగరు ఆమిని సగం తినేసింది. తోటోరిపాలెం తిరనాళలో ప్రభలాగ ఎలిగిపోయిన రమక్క ఇప్పుడు పోలేరమ్మ గుడి కాడ చెరువొడ్డున నిమజ్జనం చేసిన మట్టి వినాయకుడ్లా చితికిపోయి వుంది. రూతు అన్న మాటలే నాకింకా బుర్రలో తిరుగుతున్నాయి.
“ఏందక్కా..ఏందీ గొడవ..? ” రమక్క ఎదురుంగా కుదురుంగా కూర్చుంటా అడిగా.
“ఏం చేయమంటావురా..ఈ వయసులో కూడా యేసయ్య ఈ వజాన నన్ను పరీక్షిత్తానే వున్నాడు”.
నేను కాస్త అసహనంగా కదిలాను.
” ఆ అమ్మాయితో నీకేందక్కా..ఒక ముద్ద తిని ఇవతలకి రాక..”
“నేనేం చేసాన్రా..అదే ఏదొక గిల్లికజ్జా పెట్టుకుంటదిరా. చిన్నంతరం పెద్దంతరం లేదు దానికి. నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేసిద్ది. ఛండాలపు మాటలు..”
“ఆ అమ్మాయి వండినియ్యి తినవంట..ఆ అమ్మాయి బట్టలు ముట్టవంట..గలీజ్ చేస్తవంట..”
” ఎవత్తిరా చెప్పింది..ఆ మాష్టిం ముండేనా..అయినా అది అంటే నేనెందుకు పడతాను..కూరలు చేత్తదా..కావాలని ఉప్పు కశిం చేస్తది..తినలేం..రోజూ ఎత్తి పారబోయటమే..ఇక బట్టలంటావా.. నాయి..పిల్లలియి ఉతుక్కుంటాం..దాని బట్టలు అది ఉతుక్కోలేదా ఏంది? అదేమన్నా గవర్నరా.. కలెక్టరా ? అయినా అంత రోషగత్తే అయితే కరోనాలో నా మీద పడి ఎందుకు తినిందంటా..? అంత నాపగత్తె అయితే దాని అమ్మ ఇంటి నుంచో..దాని అన్నదమ్ముడు కాడ్నుంచో తెచ్చుకొని తినక పోయిందా..? నా ఎదాన పడి ఎందుకు తినడం? అయినా దాని మొకం చూసి ఎవడు పెట్టాడు..? నా మనవడు, మనవరాళ్ళ మొకం చూసి పెట్టాను గానీ..” అక్క నోటి నుండి అట్టాంటి మాటలు వస్తాయని నేనసలు ఊహించలా. బిర్రబిగుసుకుపోయి ఆశ్చర్యంగా ఆమెనే నోరెళ్ళబెట్టి చూస్తన్నా.
“లేకపోతే ఏందిరా..సరేలే అయిందేదో అయిపోయింది. చూస్తా చూస్తా కన్నకొడుకుని పోగొట్టుకుంటామా అని దాన్ని రానిచ్చామేనుకో..ఒబ్బిడిగా వుండక్కరలా..? గుట్టుచప్పుడు కాకుండా సంసారం చేసుకోనక్కరలా? ఉహుఁ..ఏదో చిన్న తగాదా అయిందనుకో..ఆడ్ని మొగుడని గౌరవం కూడా లేకోకుండా ఆ బూతుకూతలేంది చెప్పు? పైకప్పు లేచిపోయేట్టు ఓ..అని ఏడిచి, రోడ్డు మీదకెక్కి ఆ పెడబొబ్బలేంది చెప్పు? ఇంటింటికి ఉరుకులు పరుగులు పెట్టి పొయ్యి ఇంటో విషయలు చెప్పేదేంది? ఎవుతయినా అట్టా ఇంటో విషయాలు బజార్లో పెట్టుకుంటారారా? అయ్యో..మనకి ఒక స్కూలుందే..అందులో పిలకాయలున్నారే..మనం టీచర్లమే అనే ఆలోచన యావైనా వుందా దానికి? యాడకి పోతాయి ఈళ్ళ లేకిమారి బుద్దులు..”
“అదేందక్కా..ఆ రమేషుగాడి పెళ్ళాం చేసింది మాత్రం ఏందేంది ? రోడ్డు మీదకెక్కి రచ్చరచ్చ చేయలేదా..? అప్పుడు నీకు సమ్మగా వుందా ఏందక్కా? “
రమక్కకి రమేషుగాడిది ఒక సెర అయితే రమేషుగాడి పెళ్ళాం రజనిది మరో సెర. మొగుడే తల్లిని గౌరవించకుండా తిడతా కొడతా వుంటే కోడలుకి అలుసు కాకుండా వుంటదా ? రమక్కంటే పడని ఇరుగుపొరుగోళ్ళు కుమారుగాడికి డబ్బంతా దోచి పెతందనీ, వున్నా ఆస్తి అంతా ఆడికే ధారాదత్తం చేసేత్తదనీ రజనికి ఎక్కేసి చెబతా వుండటంతో, ఆ చెప్పుడు మాటలు చెవిలో బాగా ఏసుకున్న రజని, రమేషుగాడు ఇచ్చిన అలుసుతో వీలున్నప్పుడల్లా రమక్కని ఏపుకు తినడం మొదలుపెట్టింది. తాగొచ్చిన మొడుకికి చాడీలు చెప్పి రమక్క మీదకి ఎగదోసేది. తనకి, తన మాటకి ఎదురు లేకపోవడంతో చీమ చిటుక్కుమంటే చాలు..రోడ్డెక్కి రమక్కని బండబూతులు తిడుతుండే రజని గొంతు కిలోమీటర్ దూరం దాక మాకు వినపడతా వుంటది. ఇంకా నా చెవుల్లో గింగిర్లు తిరగతానే వున్నాయా తిట్లు..సంసారులు వినలేరా బూతులు..ఒకటి రెండు మాటలు ఎదురుజెప్పినా రజని నోట్టో నోరు పెట్టి గెలవలేక, గమ్మున ఇంటోకి పోయి గెడేసుకునేది రమక్క. జనం మొదట్లో నిలబడి చోద్యం చూసేవోరు..తర్వాతర్వాత మామూలయిపోయి వాళ్ళూ పట్టించుకోవడం మానేసారు. రమక్క చర్చీ యవ్వారం నచ్చని చానా మంది ‘దీని తిక్క ఇట్టాగే కుదరాల్లే..’ అనుకునేవోళ్ళు.
“అరేయ్..అదీ ఇదీ ఒకటేనట్రా..ఎంత కాదనుకున్నా, అది మన కులపోళ్ళ పిల్ల..ఎంత తిట్టుకున్నా.. తన్నుకున్నా మనలోనే సమసిపోద్ది. పైగా అది మనూరు. ఇదట్టా కాదుగా..మన జాతి కాదు.. మనూరు కాదు..మన కత కాదు..తక్కువ జాతిది..అందుకే దీనికీ లేకి బుద్దులు..”
ఆ మాటలకి బిత్తరపోయి, నేను మారుపలకడం కూడా లేదనే సంగతి కూడా పట్టించుకోవడంలా రాములక్క. అదే ఆలాపనలో చెప్పుకుపోతా వుంది.” అసలీ కుమార్ గాడి వల్ల వచ్చింది తంటా..ఈడి యవ్వారాలకి ఆ రెడ్డిగారి చర్చీలో ఎంత మంది మన కులపోళ్ళ పిల్లలు లేరంటా? పొయ్యి పొయ్యి ఆ మాల ముదనష్టపుదే కావాల్సొచ్చిందా ? సరే..అయిపోయింది. దాన్ని వదిలించుకోక, తీసుకొచ్చి మన నెత్తి మీద కూర్చోబెట్టాల్నారా..? ఊళ్ళో ఎంత నామర్దా? ఎంత పరువు తక్కువ ? నలుగుర్లో ఎంత తలొంపులు? అందరూ ఇట్టానే చేసుకుంటన్నారారా..?”
“…………..”
” ఈ ఎర్రిబాగుల నా కొడుకు వింటేగా..ఒరే..దీన్ని వదిలిచ్చుకొని మన కులపుదాన్ని చేసుకుందాంరా అన్నా.. ఉహుఁ.. గంగా వింటేగా..మందు పెట్టినట్టు ఇదే కావాలని హఠమేసుకొని కూర్చున్నాడు.. ఇప్పుడు అనుభవిత్తన్నాడు..”
ఉలిక్కిపడి రమక్క వంక చూసా. ఇదంతా ఏం పట్టించుకోనట్టు ఆమె చెప్పుకుంటా పోతంది గానీ అవేవీ నా చెవికెక్కడం లేదు.
రమక్కేనా ఈమి..?! నాకు తెలిసిన రమక్కేనా ? ఎప్పుడేనా నేను ఇంటో అలిగి వచ్చేస్తే..అక్కలాగ కాకుండా అమ్మలా చూసి, నా ఆకలి కడుపుకి ఇంత అన్నం పెట్టిన ఆమేనా ఈమి? బావ లేకపోయినా కష్టమో నష్టమో కలో గంజో తాగి కుటుంబాన్ని పళ్ళ బిగువున ఈదుకొచ్చినామేనా ఈమి? ఎన్ని ఒడిదుడుకులొచ్చినా తలొంచకుండా, వెన్నొంచకుండా ధీమాగా నిలబడి జీవితాన్ని నెగ్గుకొచ్చినామేనా ఈమి? ఒకళ్ళ కాడ దేహీ అనకుండా, పౌరుషంగా బతికేనామేనా ఈమి?
ఆశ్చర్యంగా, అపనమ్మకంగా అట్టా నోట మాట లేకోకుండా ఆమెనే చూస్తా వుండిపోయా. నా కంటికి రమక్క మునుపటి మడిసిలా లేదు. సాంతం కొత్త మడిసిలా వుంది. నాకు తెలీని మడిసిలా వుంది. మడిసిలో వున్న మరో మడిసిలా వుంది. మసి పూసుకున్న మడిసిలా వుంది. ఆమెను చూస్తే ఎందుకో నా ఒళ్ళంతా జలదరించింది. ఆమె మీద నాకున్న ఇష్టమంతా ఎవరో చేత్తో తీసేసి విసిరేసినట్టు, నోరంతా చేదు కమ్మింది.
మడిసిలో కొన్ని గుణాలు అసలు అంతరించవేమో..? ఆ గుణాలు కొన్ని అసలు కంటికి కనిపించవేమో..తరతరాలుగా మడిసిని అట్టా అంటిపెట్టుకొని, మన ఎముకల గుజ్జుల్లో రంగరించుకొని వుంటాయేమో..ప్రతి మడిసి మనసు మారుమూలల చీకటిలో కునుకు తీస్తా వుండే ఇట్టాటి గుణాలు దాని సమయం వస్తే తప్ప నిద్ర లెగవ్వనుకుంటా..మడిసి ఎంత చదివినా, ఎంత జ్ఞానం వచ్చినా కానీ ఇట్టటియి కొన్నింటిని వదిలించుకోలేడనుకుంటా.. ప్రతి మడిసిలో ఇద్దరు మడుసులు వుంటారంటారు..కానీ రమక్కలో ఇట్టాంటి మడిసి వుంటదని నేను ఊహించలా..ఈ మడిసి నాకు మింగుడు పడలా.
‘’నేనీడ వుండలేను. ఊరికి వచ్చేత్తారా..నన్ను తీస్కెళ్ళు” అంటే ఈడకి రాక ముందు ‘’సరేనన్నా..’’
కానీ నేనెప్పడు రమక్క కాడ్నుంచి లేచి కిందకు వచ్చేత్తన్నానో నాకే తెలీదు. మెట్లు మీద నుండి కిందకి దిగతా వుంటే పాతాళంలోకి దిగుతున్నట్టే వుంది నాకు. మనసంతా చికాకు చికాకుగా, చిందర వందర అయింది.
“ఈ మడిసి ఎవరో నాకు తెలీదు. తెలీనే తెలీదు” గొణుక్కుంటా అనుకుంటా, ఒంట్లో ఓపికంతా ఎవరో తోడేసినట్టు, పీల్చేసినట్టు మడిసిని కకావికలం అయిపోయా.. _
*








Add comment