ఇలా గదిలో కూర్చుని ఏ ఆలోచనలు లేకుండా ఉన్నాను
ఎందుకీ నిద్రలేని బాధలు
ఇంటికాడుంటే ఈ పాటికి బొంత చల్లగా తగులుతుంటే
కాళ్ళతో చేతులతో పసితనంతో ఆ చల్లదనం కోసం తడుముకుంటూ
కొండగాలి సన్నగా వీపు మీద పారుతుంటే
నక్షత్రాల కింద మెడ వరకూ దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉండేవాణ్ణి.
తెల్లారి గుంజెడు పొద్దెక్కినా మెలుకువనేదే రాదు.
నిదర మనిషికి ఎంత హాయి!
మనిషి హాయిగా నిద్రపోవడం కోల్పోతున్నాడంటే
అతను తన ప్రశాంతతను కోల్పోయాడనే కదా!
మమ్మ అనేది నిద్ర మడిసి ఒంటికి బలం అని
ఏమో అది నాకు తెలీదు.
నాకు నిద్రపోవడం సుఖం.
ఎండ, చీమలు కట్టినట్టు కుడుతుంటే
కళ్ళు తెరవటం కూడా బద్దకమయి
ఎక్కడ కళ్ళల్లో నిదర జారిపోతుందోనని
దుప్పట్లు ఒద్దిగ్గా పట్టుకొని
ఇంట్లోకి పరిగెత్తి మళ్ళీ ముసుగు తన్నేవాణ్ణి.
మా నాన్న నా నిద్రను తరమాలని
తిట్ల పారాయణం చేసేవాడు.
పొద్దుటి నిద్ర నెత్తికి పట్టిన దెయ్యం
నాలుగు తిట్లు తిడితే గానీ తల దిగి పరిగెత్తదు.
నిద్రలో నేను
మా నాన్న కల్లో కూడా నన్ను తిట్టడం మనడేమో అనుకునే వాణ్ణి
మా నాన్నకి నన్ను తిట్టి నిద్రలేపటం ముఖ్యమైన పనుల్లో ఒకటి.
ఇక్కడ ఈ నగరంలో కాసింత నిదర కోసం ఒంటరిగా
రాత్రంతా కాచుకొని ఉన్నాను.
గదిలో నలిగిపోయిన గాలే మరలా మరలా
గోర్లతో రక్కుతున్న పిల్లిలా చుట్టూ తిరుగుతుంది
లైటాపేస్తే నిండా చీకటే కానీ
దీనిలో మనిషిని నిద్రపుచ్చే మెత్తదనం లేదు.
కాస్త తడి లేదు.
దానిని హత్తుకోవాలనే కోరికా లేదు.
నిద్రను ధ్వంసం చేసే కుట్రలు ఏమున్నాయి నగరంలో?
బయట వాహనాల చప్పుడు కూడా
తాగినవాడు ఒకే మాట పదిసార్లు వాగినట్లు వినిపిస్తూ ఉంది.
కానీ ఇప్పుడు నాకెందుకో రైలు కూత వినాలని ఉంది
పెళ్ళింట్లో సన్నాయి మోతలాగా ఉంటుంది దాని అరుపు.
కాకి పిల్ల నోరంతా తెరుచుకోకుండా కూసినట్టు ఉంటుంది.
బయట వెన్నెల కూడా పొడవలేదు
చీకటి పండిపోయింది
ఇక ఇప్పుడు…
‘నడి జాములో మానవుడి కోరికలకు అంతు లేదు.
ఈ రాత్రి నా కంటికి నిదర లేదు’
అనుకోవడమే నేను చేయదగిన పని
ఈ నగరం లాంటి నా గదిలో…
*
నైస్ పొయం…నారాయణ