ఈ కవి అద్దెకివ్వబడును

ఖాళీ అయిపోయాడు పాపం

లేదు, తనను ఖాళీ చేసుకున్నాడు

లోపలి సముద్రాలన్నీ ఊదేశాడు

అడవులన్నీ ఊడ్చేశాడు

శిఖరాలు కూల్చేశాడు

 

బొట్లు బొట్లుగా  జారిపోయాయి కలలు

పొడి రెప్పలకు

 టు లెట్ బోర్డులు తగిలించుకున్నాడు

రాసిందంతా కుప్ప పోసి తగలబెట్టేశాడు

 

లోపలంతా శుభ్రంగా తుడిచి

గడపకు ముగ్గులు పెట్టి

ఏ పాలపుంతల వసంతమో

కొత్త పెళ్ళికూతురిలా  అడుగుపెడుతుందని

గుమ్మానికి వెల్ కమ్ బోర్డులా వేలాడుతున్నాడు

 

ఎవరొస్తారో చూడాలి

పక్షులొస్తే సరేసరి..పాటలే అద్దెకు బరాబర్

పువ్వులొస్తే మరీ మంచిది  ఆ పరిమళం చాలు

అమాంతం ఒక అడవి వస్తే..?

 

పర్వాలేదు నెలకో ఆయుధం ఇస్తే

అద్దెగా జమ చేసుకుంటాడు

పిల్లలొస్తే ఇంటిని మైదానంగా మార్చే

మంత్రం నేర్చుకున్నాడు

ఎవరో ఒకరు తన ఒంట్లో దీపం పెట్టేవారు

నేల మీద కాకుండా ఈ ఇంట్లోనే

తొలిసారి పాదం మోపేవారు

రాకుండా పోతారా..!

కొత్త కొత్త పదాల పాలు పొంగించి

తన దేహప్రవేశం చేయకపోతారా..!

 

గోడలన్నీ రంగు రంగుల నీడలతో

పెయింట్ చేశాడు

పగలూ రాత్రుల పనిముట్లు చేసిన

 ఇంటీరియర్ తో ఇంటిని సిద్ధం చేశాడు

తన కక్ష్యలోకి  కాంతి వేగంతో ఏ  గోళమో

విశ్రాంతి కోసం వస్తే కాలక్షేపానికి

తన పంచ ప్రాణాల రామచిలకలుంటాయని

హామీ పత్రాన్ని ఆకాశానికి అతికించాడు

అందుకే ప్రకృతికి ఒక ప్రకటన ఇచ్చాడు

ఈ కవి అద్దెకివ్వబడును

 షరతులు మాత్రం వర్తిస్తాయి

*

ప్రసాద మూర్తి

5 comments

Leave a Reply to U.Suryachandra Rao Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కొత్తగా బావుంది.ప్రమూ అన్న మార్క్ కనిపిస్తుంది జాగ్రత్తగా చదివితే..ఇలాంటి వస్తువు తట్టడమూ..ఇలా నిర్వహించడమూ..కావాలి..చాలా Metal కావాలి లోపల..

  • కొత్త ప్రయోగం బావుంది.
    “అందుకే ప్రకృతికి ఒక ప్రకటన ఇచ్చాడు

    ఈ కవి అద్దెకివ్వబడును

    షరతులు మాత్రం వర్తిస్తాయి”

  • కవిత మస్తుంది ప్రసాద్ గారు.

    అమాంతం ఒక అడవి వస్తే..?

    ..

    పిల్లలొస్తే ఇంటిని మైదానంగా మార్చే

    మంత్రం నేర్చుకున్నాడు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు