ఊరికే ఉంటావ్ నువ్వు
లేవని అనిపించకుండా
ఏదీ అంటదు నిన్ను
నీ వెతుకులాట ఎందుకో
ఎవరికీ అర్థం కాదు
ఈ సమూహంలో నుంచి
ఎప్పుడు తప్పిపోయావో
నీకు మాత్రమే తెలుసు
ఇక్కడిక్కడే తిరుగుతుంటావ్
నీ ఉనికి నీకు కూడా తెలియనంత నిమ్మళంగా
ప్రపంచపు మోతలేవీ నీ దాకా చేరని
ఆ రహస్యపు గుహలో నిన్ను ఎట్లా దాచుకున్నావా అని
నిన్నొక ప్రశ్న ముందు నిలవేయాలని
ఎవరెవరో ప్రయత్నిస్తుంటారు
అర్ధరాత్రి అడవిలో విచ్చుకున్న ఆఖరిపువ్వు
నీ పెదాలపై నవ్వై ఉదయిస్తుందని
వీధి దీపాలు వెలవెలబోయేలా
మిణుకుమనే నక్షత్రాలు
నీ కళ్ళలో ఆశ్చర్యార్థకాలని వెలిగిస్తాయని
ఈ లోకానికి ఇంకా అర్థం కాలేదుగా!
నిన్ను నువ్వు మోసుకు తిరగడం
ఈ మలుపులోనే ముగుస్తుంది
ఇక్కడే ఈ ఎత్తైన చెట్ల నీడల్లో
నీ సొంతనీడని చప్పున విడిచిపెడతావు
నీ చిన్న నిఘంటువులో పట్టని బరువైన పదాల్ని
అక్కడి నీటిమడుగుల్లో వదిలేస్తావు
“అహం, కోరిక, అనుభవం” అన్నీ ఒట్టి మాటలుగా
నీటివాలుకి ఎండుటాకుల్లా కొట్టుకపోతుంటే తేలిగ్గా చూస్తావు!
ముడులన్నీ వీడిపోతుంటే
జీవుడు రెక్కలు తొడుక్కుంటున్నాడు
మళ్ళీ అదే లోకం వేలెత్తి
“చేతకానితనం అదిగో ఎగురుతోంది” అంటుంది
ఎంతో మౌనం తర్వాత, జాలి తర్వాత
నువ్వు పెదవి విప్పి,
“ఇది చేతనం, జీవనానందం” అని బదులిస్తావు
ఇంకా దూరం
ఇంకా ఎత్తు
లోకంలో ఉంటూ చూడలేని దాన్ని
లోకం నుంచి బయటపడి చూడగలుగుతావు
చెట్లచేమలకు మాటలొచ్చు
ఆకాశానికి నవ్వడం వచ్చు
నీటికి పాడడం వచ్చు
గాలికి వికసించడం వచ్చు
ఎగురు, ఎగురు
ఈ గాలికి మాత్రమే తెలుసు
నీ ఆకాశాన్ని ఎలా విశాలం చెయ్యాలో
ఈ ఆకాశానికి మాత్రమే తెలుసు
నీ జీవితేచ్ఛని ఎలా పూర్ణం చెయ్యాలో!
*
చిత్రం: కిరణ్ కుమారి
Bavundi
Baagundi….
ఊరికే ఉంటావ్!nice kavitha.ji.