ఇవాళ ఈ కవితని కన్నయ్య లాల్ వైపు నించి చదువుకోవాలా?

 2019 లో ఇదే రోజు అచ్చయిన కవిత ఇది. ఇప్పుడు ఇది కన్నయ్య లాల్ వైపు నించి చదువుకోవాలా? మతం ఎవరి చేతుల్లో ఖడ్గమో ఇప్పటికైనా తెలుస్తుందా?!
*

యివాళ్టికి నా పేరు షమ్స్ తబ్రీజ్ అన్సారీ

1
యివాళ్టికి నా పేరు షమ్స్ తబ్రీజ్ అన్సారీ.
 
మీ ఆటలో వోడిపోయిన నా శరీరానికి ఆ పేరే యెందుకు వుందో నాకు తెలీదు. మీరందరూ మారణాయుధాలై నా మీదికి పరిగెత్తుకు వస్తున్నప్పుడు యే దేవుడిని యే పేరుతో తలచుకున్నానో కూడా నాకు తెలీదు. దేవుడు స్త్రీ అయితే అమ్మలానో, పురుషుడైతే నాన్నలానో వుండాలని మాత్రమే నాకు తెలుసు.
 
మీ అందరిలానే నేనూ వాళ్ళ కన్నీళ్ళ పొత్తిళ్లలోనే పెరిగాను. నా చెట్టు మీంచి వొక్కో కలా నిరాశపడి, వున్న పళాన యెండిపోయి రాలిపోతున్నప్పుడు తన గరుకు చేతుల్లో పొదివిపట్టుకొని, నాలో పచ్చదనం వొంపాలని ఆశపడ్డ నాన్నే నా దేవుడు. అంతకుమించి యింకే దేవుడూ, యే దేవతా, యే విగ్రహమూ, యే గుడీ మసీదూ నాకు తెలీదు. యివాళ్టికి నా యింటిపేరు కూడా నా అమ్మానాన్నల మొదటి పేరే కావాలి.
 
2
 
కన్నపేగుల మీద యెవరి అధికారం యెంతో యింతవరకూ నాకెవ్వరూ చెప్పలేదు.
 
ఆస్పత్రి గోడల మధ్య పెల్లుబికిన నా చివరికేకల మంటల్లో ఆ కన్నపేగుల సమిధలన్నీ కళ్ళారా చూశాను. అమ్మా, నన్ను కన్నందుకు నీ పశ్చాత్తాపాలు విన్నాను. నాన్నా, నువ్వు మోసుకు తిరిగిన శరీరం చావు మూలుగులు నీకే వినపడుతున్నందుకు నీ రహస్యమైన ఏడుపులు చూశాను.
 
నన్ను కడిగేటప్పుడు నా గాయాలు నా నెత్తురూ కనిపించకుండా నా పైన యింకో చర్మం కప్పగలరా?
 
3
 
మొన్నటి నా పేరు కంచికచర్ల కొటేశు.
 
నిన్న అఖ్లాక్.
 
యివాళ
షమ్స్ తబ్రీజ్ అన్సారీ .
 
1947 లో నా పేరు నీకు గుర్తుందా?
 
1992 …2002 …
 
ఆ తరవాత ఆ సంవత్సరాలన్నీ once more లు కొట్టించుకుంటున్న నా కాలంలో
 
అవి సంవత్సరాలో కుప్పకూలుతున్న వేల అన్సారీలో తెలియని ఆకాలంలో
 
కేవలం
సమాధి రాళ్ళ మీద మాత్రమే కనిపించడానికి పుట్టిన
యివాల్టి యీ పేరొక్కటే
 
నేను
నిరాకరిస్తున్నా.
 
యివాళ
 
జైశ్రీరామ్ అనిపించగలరు వేల గొంతులతో.
వొక్క శరీరంలో గుక్కెడు ప్రాణం పోయగలరా,
 
దయచేసి చెప్పండి
అనేక అన్సారీలు నడివీధుల్లో శవాలు కాకముందే!
 
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
జులై 1, 2019

అఫ్సర్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎన్నో ప్రాణాలు ఉన్మాదుల ఘాతుకం లో

  • ముందు చూపుతో భవిష్యత్తును చూడటమంటే ఇదే. మతోన్మాదం పెచ్చరిల్లినప్పుడల్లా అది మెజార్టీనా మైనార్టీనా అనేది కాదు ; మానవ మనుగడే ప్రశ్నార్థకo అవుతుంది. మంటో నుంచి అఫ్సర్ దాకా మనల్ని వెన్నాడే ప్రశ్న ..
    ” గుక్కెడు ప్రాణం పోయగలరా ?”
    షమ్స్ తబ్రీజ్ అన్సారీలు , కన్నయ్య లాల్ లు బతకాలంటే అన్ని మతోన్మాదాలపైనా కలాలు ఎక్కుపెట్టాల్సిందే. ఇలాంటి కవితలు ఇప్పుడు మళ్ళీ రాయాలి. దెబ్బ ఎటునుంచి తగిలితే రాయి అటువైపు విసరాల్సిందే.

  • ఉన్మాదానికి మతం తెలియదు, మానవత్వం తెలియదు, దైవత్వం అసలే తెలియదు.

    థాంక్స్ అఫ్సర్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు