ఇరవయ్యేళ్ళ విప్లవశ్రీ చూపిస్తున్న వెలుగు!

కవిత్వ స్వరం మారుతోంది. కొత్త తరం వస్తోంది. ప్రతి పక్షం ఒక కొత్త పరిచయం..చదవండి!

కొన్ని ఘడియలు 
నువ్వు ఒంటరివే అని నిరూపిస్తాయి 
గొప్ప ప్రేమలను సాధించిన మత్తులో ఉన్నపుడు 
మళ్ళీ నిజాన్ని గ్రహించడానికి 
ఒక రేయి ఒక పగలు మధ్య 
నీ జీవితపు కాన్వాసుపై
కొన్ని సందిగ్ధాలను గీసేళ్లిపోతారు
కొందరేమో కొన్ని నిర్లిప్తతలను చల్లెలతారు 
ఆశల కోటలు కట్టుకుంటూ పోతున్న ఓ స్వాప్నిక కూలీ … ! 
నీకోసం ఒక మాట చెప్పనా ? 
చెవులతో కాదు 
స్నేహాల గురుతులతో ఖాళీగా మిగిలిన 
నీ హృదయంతో విను !! 
అలలు తీరం చేరటం నీకానందం 
అలలకు నిన్ను తాకి వెనుదిరగటం ఒక మామూలు సరదా 
అవి తీరాన్నే అంటిపెట్టుకునుండటం 
కలల్లోని నలుపు తెలుపు చిత్రాలకు రంగులు పూయడంలాంటి భ్రమే !! 
పాదరసం లాంటి నీ మనుషులు
Group photo లోంచి మెల్లిగా జారిపోతుంటారు 
నువ్ కాల్చిన ఆఖరి సిగరెట్ బూడిద 
Ash tray లో పోగయ్యేలోపే 
ఒంటరిగా మిగిలిపోయిన నిన్ను నువ్వు మేల్కొలపాలి !
చీకటి కన్నులు వెలుగు వైపు పయనించాలంటే 
వేకువ వస్తే సరిపోతుందా ? 
వెలుగు జిగేలుల వద్దకు 
నీ కాళ్ళు ఒంటరిగానే పయనించాలి ! 
~ శ్రీనిధివిప్లవశ్రీ
*
విత్వానికి మనుషుల్ని కలిపే జీవ లక్షణం ఉంది.సామూహిక జీవితాల్లోనుంచి ఎవరిని వాళ్ళు వెతుక్కుంటూ, గమనం లోకి రాని ఇరుకు మార్గాల్లో తమ దారి చూసుకుంటూ వెళ్లాలంటే స్థిరత్వం చాలా అవసరం, అది కొంత మందికి జన్మతః వస్తుంది. కళ అవసరమైన చోట తనకి కావాల్సిన మనుషులని తయారు చేసుకుంటుంది. దానికి వయసు బేధం ఉండదు. కాబట్టే 20ఏళ్ల వయసులోనే “విప్లవ శ్రీ” తన తొలి కవితా సంపుటి “రాలిన చుక్కలు” ని వెలువరించింది. అటు సామాజికాన్ని, అందులో తాను జీవిస్తున్న వైయక్తిక జీవితపు అనుభవాన్ని రంగరించి రాసుకున్న అక్షరాల్లో ఆమె నిజాయితీ కనబడుతుంది. భాష మీద పట్టుఉంది. తన కోణంలో నుంచి ప్రపంచం ఎలా కనబడుతుంది అన్న విషయాన్ని  తొణక్కుండా చెప్పింది. వయసనేది శరీరానికే కానీ మనసుకు , జ్ఞానానికి మాత్రం కాదని తేల్చి చెప్పేసింది.
 ఈ వెలుగు అనే కవిత చూస్తే ఇందులో చాలా మార్మికత కనబడుతుంది.జీవితాన్ని జీవించడం లో ఉండే సందిగ్దతని చాలా చక్కని స్వరంతో మాట్లాడింది. అసలు ఎన్నుకున్న వస్తువు మీద ఇంత పట్టుఉండడం కొత్త తరం కవుల్లో మనం చాలా అరుదుగా చూస్తాం. అసలు వస్తువు అంటే ఏంటో కూడా తెలియని కవుల మధ్య నడుస్తున్న క్రమంలో “విప్లవ శ్రీ” తన ఆధునికమైన ఆలోచనలతో మనకి ఆశ్చర్య చకితుల్ల్ని చేస్తుంది. ఆశలు కోటలు కట్టుకు పోతున్న స్వాప్నిక కూలీ నీకోసం ఒక మాట చెప్పనా,చెవులతో కాదు, స్నేహాలు ఖాళీ చేసిన హృదయం తో విను” అనే మాటల్లోని అర్ధం అంత చిన్న విషయం ఏమి కాదు. స్వాప్నిక కూలీ అన్న మాటలోని విసురు ఒకసారి వ్యంగ్యంగా మరాసారి జాలిగా కూడా కనబడుతుంది.ఇలాంటి వాక్యాలు భలేగా       పేల్తాయి. గ్రూప్ ఫొటోలో మాయమవుతున్న వాళ్ళ గురించి , ఆఖరి సిగరెట్ పొగ అయిపోయే లోపు ఖాళీ అవుతున్న జీవితాల గురించి తన మాటలు ఎక్కడో మనల్ని చిన్న కలతకి గురిచేస్తాయి. నీ జీవితాన్ని నువ్వే లీడ్ చేసుకోవాలి అనే ముగింపు చుట్టూ తాను మోహరించిన పదాల విన్యాసం చూస్తే నిజంగా ముచ్చటేసింది.
ఎక్కడా ఎవరికి గుచ్చుకోకుండా వాక్యం రాయడం కంటే మౌనంగా ఉండడమే మేలు కదా. కనీసం నీ మిత్రుడితోనైనా నువ్వు నిజాన్ని పంచుకోకపోతే మనం చేసే మోసానికి విలువ కట్టడం ఎవరివల్ల కూడా కాదు.విప్లవ శ్రీ తాను చెప్పదలుచుకున్న మిత్రుడిని హృదయం తో వినమని చెబుతూ తాను ఉన్న జీవితం కాకుండా మరో కోణంలో ఆలోచన చేయమని చెప్పే తీరు మనకి నచ్చుతుంది.కవిత మొత్తం లో మనం మనకి కనబడే అనేకానేక సన్నివేశాలు ఉంటాయి. ఏమో చెప్పలేం మనకి కూడా ఎక్కడో ఒకటి రెండు మాటలు గుచ్చుకున్న ఆశ్చర్యం లేదు.అదే కదా కవిత్వం చేసేపని. కవి రాయవల్సిన పద్దతి. కాస్త వస్తువు నిర్వహణలో తొందర పాటు తగ్గించ గలిగితే బాగుంటుంది. రూపాన్ని వస్తువు కాస్త కలవర పెడుతుంది.అదొక్కటి సరి చేసుకుంటే చాలు. అయినా ఈమాట కూడా తనకి ఏదైనా ఒక చిన్న మాట చెప్పాలని మాత్రమే తప్పా తనను జడ్జ్ చేయడానికి కానే కాదు. నిజానికి తనకున్న లోతైన అవగాహన ముందు ఇవన్నీ తక్కువే అనిపిస్తాయి. అందుకే ఈ శీర్షిక లో “విప్లవ శ్రీ” పరిచయాన్ని అనుకున్నది.
విప్లవ శ్రీ ఇప్పుడొక సంస్థ లో కంటెంట్ రైటర్.  ” రాలిన చుక్కలు” పేరుతో ఒక కవితా సంకలనం తన వయసు.  చలాన్ని, రంగనాయకమ్మని ఈ వయసుకి చదవడం ఒకింత ఆశ్చర్యం అయినా తాను ఆ ఇష్టాన్ని అపరిపక్వంగా అయితే చదవలేదు అనే అనిపిస్తుంది.తన వాక్యాలు చూస్తే కూడా మనకి ఆ మాట అర్ధం అవుతుంది.ఇంతా జేస్తే చదివేది డిగ్రీ రెండో ఏడాది మాత్రమే. ఆరో తరగతి నుంచి కవిత్వం రాస్తున్న “మిట్టే శ్రీనిధి”( తన అసలు పేరు) కవిసంగమం లోకి వచ్చాక తనను తాను కాస్త మెరుగుపెట్టుకున్నా అంటుంది. యాకూబ్  కవిత్వాన్ని, నరేశ్కుమార్ సూఫీ కవిత్వాన్ని ఇష్టపడే తను ఇంకా బోలెడంత కవిత్వం రాయవలసి ఉంది. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ దాకా వచ్చిన ఈ ప్రస్థానం మరింత వేగంగా యావత్ తెలుగు ప్రజలందరికీ విస్తరించాలని కోరుకుందాం.
(వచ్చే సంచికలో  మరో యువ కవి తో కలుద్దామా!?)
*

అనిల్ డ్యాని

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • జీవితాన్ని పరిచయం చేస్తూ కవి
    కవిని పరిచయం చేస్తూ మరో కవి
    ఇద్దరూ నిజాయితీగానే స్పందించారు.

    సరికొత్త … ఒక ప్రేమపూర్వక బాధ్యతను మోస్తున్న
    అనిల్ డాని సర్… అభినందనలు. ధన్యవాదాలు కూడా.

  • అభినందనలు డానీ. మంచి పరిచయం. నా వరకు నాకు సలహాలు ఇవ్వకపోవడమే మంచిదనిపిస్తుంది.

  • కొత్త గొంతుకను,కొత్తగొంతు పలికే వాక్యాన్ని
    పరిచయం చేస్తున్న మీకూ..వేదికైన సారంగకు,నడిపిస్తున్న అఫ్సర్ సర్ కు శుభాకాంక్షలు..
    తొలిగా ఇక్కడ పరిచయం చేసిన నవనవ లాడే నూతన వాక్యం శ్రీనిధికి..శుభాకాంక్షలు..
    పరిచయం బావుంది అన్న…
    మంచి ప్రారంభం.

  • నా చెల్లి విప్లవ శ్రీ ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤️❤️

  • అన్న…ప్రారంభం బావుంది.కొత్త గొంతుకను ,కొత్త గొంతులో వాక్యాన్ని ప్రోత్సహించడం సంతోషదాయకం.
    వేదిక కల్పించిన సారంగకు,ప్రసిద్ధ అఫ్సర్ గారికి మీకూ శుభాకాంక్షలు….

  • మంచి ప్రయత్నం.అఫ్సర్ మనుష్యుల్ని పట్టడంలో విజయుడు.నీ శీర్షిక బాగుంది అనిల్.కొత్త కవయిత్రి కవిత చాలా బాగుంది.నీ విశ్లేషణ లో సలహాలు వద్దనే చెప్తా..మనం చెప్పే పరిభాష అర్థం కూడా కాదేమో , కాబట్టి వదిలేయ్. కవిత ఎలా బాగుందో అదే చెప్పు.మళ్లీసారి ఎవరిని పరిచయం చేస్తావో…ఎదురుచూస్తా.

  • కొత్తతరం కవుత్వాన్ని పరిచయం చేయడం చాలా నచ్చింది. విప్లవశ్రీ పేరుతో శ్రీ నిధి రాస్తున్న కవిత్వం నిజంగా చాలా బావుంటుంది..మీ పరిచయం నిజంగా అభినందనీయం

  • అనిల్ గారు మంచి ప్రారంభం! మీకు, విప్లవ శ్రీ కి నా హృదయపూర్వక అభినందనలు!

  • మంచి ప్రారంభం అనిల్ గారు. మీకు, శ్రీనిధి కి హృదయపూర్వక అభినందనలు. మీరు ఇలానే యువ కవులను పరిచయం చేస్తూ ఉండాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు