ఆకలేస్తే
ట్రిగ్గర్ పై వేలు సహజం గా
తన చోటులో
తానే పరాయైతే
ట్రిగ్గర్ యే క్రియ
తన జీలుగు
యంత్ర ధ్వంసం లో
నేల కూలుతుంటే
పొలికేక ట్రిగ్గర్ యే
లోయలో తేనెపట్టు
చదునౌతుంటే
తేనెటీగల ఘీంకారమే ట్రిగ్గర్
వనరు ఆంబోతుల దాడిలో
కన్నీరు కారిస్తే
రాలే ఒక్కో చుక్క ట్రిగ్గింగ్ వైపు
వాడు నాటలే
వాడు నీరు పోయలే
వాడు కాంచలే వాడు పెంచలే
అకస్మాత్తు గా వూడిపడి
వూర్లకి వూర్లే లేపేస్తుంటే
ట్రిగ్గర్ యే దిక్కుగా
ఆకులు రాలుతుంటాయి
చిగురిస్తుంటాయి
మనిషి ఆశలనే తుంపేస్తే
అడవి నేర్పిన ధర్మం
మోదుగు పూల ఎరుపే ట్రిగ్గర్
ఆకలి అసమానతల పై ట్రిగ్గర్
లక్ష్యాన్ని ఛేదిస్తే
వ్రేళ్ళు ట్రిగ్గర్ పై కాక
నేల లో తారాడుతుంటే పంటలతో
పులకరించు పుడమి
తంగెళ్ళల్లో దాక్కున్న తూటా సాక్ష్యంగా
ఇప్ప పూల సాంబ్రాణి తో
కొత్త దారిలో అడుగులు….
*
Good poem