ఈ వ్యాసం Indigenous Toronto: Stories That Carry This Place అన్న పుస్తకం లో “Now that we know” పేరిట 2021లో అచ్చయింది. రచయిత్రి: Lila Pine. మూల వ్యాసం ఇక్కడ చదవొచ్చు. ఈ తెలుగు అనువాదానికి అనుమతి ఇచ్చిన వ్యాసకర్తకి, పబ్లిషర్లకి, నా ధన్యవాదాలు. This essay is translated with permission from Indigenous Toronto: Stories That Carry This Place (Coach House Books, 2021).
ఇక ముందుగా నాదో చిన్న మాట: ఇందులోని వస్తువు కెనడాలోని ఆదివాసీ జాతులకి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుని కొన్ని తరాల పాటు వారి జీవితాలని ప్రభావితం చేసిన ఒకాయన పేరుని పెట్టిన యూనివర్సిటీలో పనిచేస్తున్న రచయిత్రి ఆ మనిషి గురించి రాసిన విషయాలు. ఇది కెనడాకి ప్రతేకమైన విషయమే అయినా ఆవిడ లేవనెత్తిన కొన్ని అంశాలు ఏదో ఒక సమయంలో ఎంతో కొంత అణగదొక్కబడిన ప్రతి జాతికీ అనుభవమే అనిపించింది నాకు. అందువల్ల ఈ వ్యాసం తెలుగు వారికీ కొన్ని ఆలోచనలు రేకెత్తిస్తుందని నమ్ముతూ ఈ అనువాదం చేశాను.
**********************
ట్కరొంటో నగరం (కెనడాలోని టొరొంటో నగరానికి మోహాక్ జాతి వారి పదం) నడిబొడ్డున ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరడానికి నేను అంగీకరించినపుడు నాకు దీని పేరు వెనుక ఉన్న వ్యక్తి గురించి చరిత్ర తెలియదు. నేను రోజూ కొన్ని డజన్ల సార్లు అతని విగ్రహం ముందు నుండి పోతూ ఉంటాను – దాని వెనుక కథ తెలియదు. అప్పట్లో అప్పర్ కెనడా గా పిలువబడే ప్రాంతానికి స్కూళ్ళ చీఫ్ సూపర్నెంటు హోదాలో అతను తెల్ల పిల్లలకి మాత్రమే తప్పనిసరి, ఉచిత, పబ్లిక్ స్కూళ్లు ఉండాలని సూచించాడని నాకు తెలియదు. స్థానిక ఆదివాసీల పిల్లల గురించి అతనికి ఉండే ఊహలు వేరనీ, తరువాతి కాలంలో ఆదివాసీల కోసం వెలిసిన రెసిడెన్షియల్ స్కూళ్ల వ్యవస్థ ఈయన పుణ్యమేననీ నాకు అప్పుడు తెలియదు. 1850 కామన్ స్కూల్స్ ఆక్ట్ అన్న చట్టం నల్లవాళ్ళ పిల్లలని అధికారికంగా ఆంటారియో రాష్ట్రంలోని పబ్లిక్ స్కూళ్ళలోకి రానివ్వనీయకుండా చేసి, వాళ్ళకోసమని వేరుగా పెట్టిన స్కూళ్ళకి బలవంతంగా పంపింది. దాన్ని అమలుపరిచింది ఇతనే అని నాకు అప్పుడు తెలియదు. ఇతను శత్రువులని తిట్టడానికి ‘hermaphrodite spawn’ అన్న పదం సరైనది భావించాడని నాకు అప్పుడు తెలియదు. అమెరికా ఖండానికి వలసదారులు తీసుకొచ్చిన స్త్రీ,పురుషులు కాని ఇతరులపై గల విద్వేషాన్ని మరింత పెంపొదించే తరహా దూషణ అది.
1847లో ఇతనొక ఉత్తరం రాశాడు. ఇది వేలకొద్దీ స్థానిక ఆదివాసీ పిల్లల జీవితాలనూ, వాళ్ళు అదృష్టవశాత్తూ ఈ స్థితి దాటుకుని పెద్దయితే వాళ్ళ తరువాతి తరాలని కూడా ప్రభావితం చేసిన ఉత్తరం. బ్రిటీషు వారి వర్క్ హౌస్ పద్ధతిలో ‘ఆదివాసీల మంచి కోస’మంటూ వృత్తివిద్యా స్కూళ్ళు పెట్టాలన్న ప్రతిపాదన చేశాడు. వీటి ధ్యేయం ఆదివాసీ పిల్లలకి రైతుగానో, మెకానిక్ గానో పనిచేయడానికి కావలసినంత ఇంగ్లీషు విద్యని మాత్రం ఇచ్చి, వేరే ఏ విధమైన బౌద్ధిక విద్యా అందివ్వకపోవడం.
ఈ స్కూళ్ళలో వ్యవసాయం, తోటపని, వ్యవసాయ పనిముట్ల తయారీ, మరమ్మత్తు వంటి విషయాల పై శిక్షణ ఉంటుందని రాశాడు.
ఇదంతా జరగాలంటే ఆదివాసీ పిల్లలంతా తమ తమ కుటుంబాల నుండి విడివడి దూరంగా నివసించాలి అని ప్రతిపాదించాడు. స్కూళ్ళలో మామూలు చదువు, మతపరమైన బోధలూ రెండూ ఉంటాయన్నాడు. మెధడిస్టు ఎపిస్కోపల్ చర్చి కి చెందిన భక్తిపరుడైన క్రైస్తవ మతాచార్యుడిగా అతని ధ్యేయం ఈ ఆదివాసీ పిల్లలనందరినీ క్రైస్తవంలోకి మార్చడమే. ఈ పిల్లలకి ‘నాగరికత’ నేర్పాలంటే వీళ్ళని కుటుంబాలకి దూరంగా ఉంచాలని బలంగా వాదించాడు. అంటే వాళ్ళ భాషలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, ఆధ్యాత్మికత, బంధువులు ఏదీ వాళ్ళని ప్రభావితం చేయకూడదనమాట. వీరి పరిస్థితిని, వ్యక్తిత్వాన్నీ, మతం ఆసరా లేకుండా మార్చలేము. ఈ ఉత్తర అమెరికా ఖండపు మనుషులని నాగరికులుగా మార్చాలంటే మతబోధలు, మత భావనల సహాయంతోనో, లేక వాటి ప్రభావం వల్లనో మాత్రమే సాధ్యం’ అని కూడా రాశాడు ఆ లేఖలో.
‘ఈ కారణాల వల్ల ఈ పాఠశాలలు ప్రభుత్వం-చర్చి కలిసి నిర్వహించాలి’ అని ప్రతిపాదించాడు. ఈ స్కూళ్ళ అంతిమ లక్ష్యం విద్య – ముఖ్యంగా మతవిద్య ద్వారా ఆదివాసీ పిల్లలని క్రైస్తవ సమాజంలోకి చేర్చుకుని వాళ్ళని కార్మిక కర్షకులుగా మార్చడమే. వాళ్ళకందించే విద్య వాళ్ళని ఇలాంటి వృత్తుల్లోకి మాత్రమే పంపగలదు. వ్యవసాయ విద్య తప్ప ఇంకే విషయం పైనా సమయం, డబ్బు ఏవీ వెచ్చించరు. వేసవి కాలంలో పిల్లలు రోజూ ఎనిమిది నుండి పన్నెండు గంటలు పనిచేయాలని సూచించాడు. ఇందులో రెండు నుండి నాలుగు గంటలు మాత్రమే పాఠాలు చెప్పడం కోసం. నాట్ల, కోతల కాలంలో అయితే ఆ కాస్త పాఠాలు కూడా ఉండవు. తన సూచనలని అతను చాలా వివరంగా రోజువారీ ప్రణాళికతో సహా రాశాడు. పొద్దునే పిల్లలు ఐదింటికి లేచి, రోజంతా పనిచేసి, రాత్రి ప్రార్థనలయ్యాక ఎనిమిది లేదా తొమ్మిదింటికి నిద్రపోవాలటళి
1847 లో రాసిన ఈ ఉత్తరం ఎందరో ఆదివాసీ పిల్లలు తమ ‘అనాగరిక’ కుటుంబాల నుండి బలవంతంగా వేరు చేయబడడానికి రంగం సిద్ధం చేసింది. రెసిడెన్షియల్ స్కూళ్ళనబడే భయంకరమైన వ్యవస్థకి మూలకారణమైంది.
అతనికి ఈ పిల్లలు ఆ స్కూళ్ళలోని టీచర్ల లైంగిక వేధింపులకి గురి అవుతారన్న ఆలోచన రాలేదేమో అని మీరనవచ్చు. అసలు పిల్లలని ఆకలితో మాడ్చడం, ఏవో పరిశోధనలకి వాళ్ళని వాడుకోవడం, ఇలాంటి ఉద్దేశ్యాలు అసలతనికి లేవని మీరు వాదించవచ్చు. ఆ పిల్లలని బలవంతంగా వాళ్ళ తల్లుల చేతుల్నుంచి లాక్కోవడం అతని ఉద్దేశ్యం కాదేమో అని మీరనవచ్చు. అవును, మీరన్నది నిజమే.
అతని చర్యల వెనుక ఉన్న ఆలోచనలు మంచివి అని అంటారు మీరు.
ఆ ‘మంచి ఆలోచనలు’ కెనడాలోని ఆదివాసీలకి ప్రత్యక్ష నరకాన్ని రూపొందించాయనీ, మేమింకా ఆ ప్రభావం నుండి పూర్తిగా బయటపడలేదనీ మీ వాదనకి నా ప్రతివాదన.
అతను వేరే కాలానికి చెందిన మనిషి, మన కాలం నాటి విలువలతో అతన్ని బేరీజు వేయకూడదని మీరనవచ్చు. అయితే గతాన్ని బేరీజు వేయడానికి మనకున్న ఏకైక మార్గం వర్గమానమే అని మీకు నా ప్రత్యుత్తరం. చరిత్రనే న్యాయనిర్ణేతను చేద్దామన్నది మీకు నా ప్రతిపాదన. మా సంస్కృతిలో ఏదన్నా చేసేముందు మనం చేసే పనులు రాబోయే తరాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించి చేయాలని నేర్పుతారు. ఈ మనిషి చేసిన పనులు చరిత్ర పెట్టే పరీక్షకి నిలువవు.
కనుక, ఇపుడు నాకిదంతా తెలుసు కాబట్టి ఈసారి అతని విగ్రహం ముందు నుండి నడుస్తున్నపుడు గింజుకుంటే ఏమనుకోకండి.
నా సహోద్యోగులు ఇతను ఆదివాసీల మిత్రుడు అంటారు. పీటర్ జోన్స్ అన్న ఒజిబ్వే జాతి నాయకుడు ఇతన దగ్గరి స్నేహితుడు. ఒకసారి పీటర్ ఆరోగ్యం పాడైతే కోలుకునేదాక తన ఇంట్లో ఉంచుకున్నాడు. కనుక ఇతనికి జాతి ద్వేషం లేదని అంటారు వాళ్ళు.
ఈ పీటర్ జోన్స్ కథ ఏమిటో చూద్దాము. ఇతను చిన్నతనంలో తన తల్లివద్ద, అనిషినాబెక్వె సంప్రదాయాలు, విశ్వాసాల మధ్య పెరిగాడు. అయితే పధ్నాలుగేళ్ళ వయసులో యునైటెడ్ ఎంపైర్ విశ్వాసపాత్రుడైన తండ్రి వద్దకి వెళ్ళాడు. అక్కడ అప్పర్ కెనడా లోని క్రైస్తవ వలసదారులైన తెల్లవారి పద్ధతులు, భాషా నేర్చుకున్నాడు. తరువాత మెథడిస్టు మతం పుచ్చుకుని, మత ప్రచారకుడిగా మారాడు. తద్వారా క్రెడిట్ ప్రాంతంలో మిస్సిసాగా జాతి, అలాగే దగ్గరిలోని కనియెన్కెహకా (Kanien’kehá:ka) జాతి వారూ క్రైస్తవంలోకి మారడానికి దోహదం చేశాడు. ఇతనూ, ఇతని స్నేహితుడూ కలిసి మిస్సిస్సాగా జాతివారు ఐరోపా పద్ధతిలో చేసే వ్యవసాయానికి, క్రైస్తవంలోకి మారడానికీ కారణమయ్యారు.
కనుక క్రైస్తవంలోకి మారిపోయి దాదాపు తెల్లజాతి వాడిలా మారిపోయిన ఒక ఆదివాసీతో స్నేహంగా ఉన్నాడన్న కారణంతో మా విశ్వవిద్యాలయానికి ఈ పేరు రావడానికి కారణమైన ఈ వ్యక్తిని ఆదివాసీ మితృడనడం హాస్యాస్పదంగా ఉంది. ఇతను చాలా ఏళ్ళు మిస్సిస్సాగా జాతి వారి మధ్య జీవించి వారికి వ్యవసాయం నేర్పాడన్నది కూడా ఇతనికి ఆదివాసీలతో గల స్నేహానికి తార్కాణంగా పేర్కొంటారు. శ్రమైక జీవనం వంటి నాగరిక విలువలని ఆదివాసులు కూడా స్వీకరించాలని, వేటకి పోవడం, చేపలు పట్టడం వంటి ‘అనాగరిక’ పనులని వాళ్ళు విడిచిపెట్టాలనీ అతను కోరుకోవడం అతనికి ఆదివాసీల పట్ల ఉన్న సహృదయతకి ఉదాహరణ అంటారు. అతను ఆదివాసీల కోసం చేసినదంతా వారి మంచి కోసమే, ఈ పారిశ్రామీకరించబడిన సమాజంలో వాళ్ళు నెగ్గుకురావాలన్నదే అతని ఆశ, అతని మనసూ, ఆలోచన మంచివి అంటారు.
అయితే, తన స్నేహితుల్లో ఏ విలువా చూడని వాడేం స్నేహితుడు? అనిపిస్తుంది నాకు. తన మతాన్ని, చదువుని, భాషనీ స్నేహితుల మీదకి రుద్దేవాడు ఏం దోస్తు? ఇతను ఆదివాసీ మిత్రుడు కాదు. ఇతనికి వాళ్ళర్థం కాలేదు. వాళ్ళ ఔదార్యం, దురాశ లేకపోవడం, ఇతనికి కనబడలేదు. పరిణతి చెందిన వారి పరిపాలనా వ్యవస్థలు అతనికి కనబడలేదు. వాళ్ళ భాష నేర్చాడు కానీ దానిలోని సొగసు, ఆ భాషలో పొదిగిన జ్ఞానం తెలుసుకోలేదు. అతని దేవుడిలాగే అతను కూడా ఆదివాసులు తమలాగే మారాలని అనుకున్నాడు.
ఇపుడు నాకు ఇదంతా తెలుసు కనుక, అతని పేరు ఉచ్ఛరించవలసి వచ్చిన ప్రతిసారీ నేను ఆవేశంతో ఉక్కిరిబిక్కిరౌతే మీరు ఏమనుకోకూడదు.
ఇక్కడి ఆదివాసీలని బహిరంగంగా ద్వేషించి, వాళ్ళని మాడ్చి చంపాలని, నిర్భంధం లో ఉంచాలనీ కోరుకున్న సర్ జాన్ ఎ. మెక్ డోనాల్డ్ ఈ మనిషికి స్నేహితుడు. ఈ స్నేహాన్ని బట్టి చూస్తే కూడా ఇతని ఉద్దేశ్యం మంచిదన్న మాట అనుమానాస్పదమే.
నా సహోద్యోగులు ఇతను నల్లవారి పిల్లలకి ప్రత్యేక స్కూళ్ళు ఉండాలన్నాడు అన్న విషయం గురించి ఇంకా ఏదో ఒక సమర్థన చెప్పలేదు. ఆ మనిషి తనంతట తాను ఇచ్చిన వివరణ జాతివిద్వేషం సంస్థాగతమవ్వడానికి దోహదం చేసింది. ప్రజల మనోభావాలు, వాళ్ళ మనసుల్లో పాతుకుపోయిన దుర్భ్రమలు చట్టాలకన్నా బలమైనవన్నది కొన్ని ప్రాంతాల్లో ఇలా ప్రత్యేక పాఠశాలలు అవసరం అన్న వాదనకి అతను ఇచ్చిన వివరణ. ఇలాంటి ప్రత్యేక పాఠశాలలు అమలు పరిచిన ఇలాకాలలో నల్లవారు తెల్లవారి పాఠశాలలకి వెళ్ళడానికి అనుమతి లేదు. ఇలాంటి ప్రత్యేక స్కూళ్ళు లేని చోట్ల నల్లవాళ్ళ పిల్లలు వేరే బెంచీల మీద కూర్చునేవారు. పన్నులు కట్టే నల్లవారిని ప్రత్యేక స్కూళ్ళ కోసం పోరాడమని, అదే వారికి మంచిదనీ ఉద్భోధించాడితను. ఇందాక ప్రస్తావించిన 1850 కామన్ స్కూల్స్ ఆక్ట్ దాదాపు వందేళ్ళ పాటు కొనసాగిందన్న విషయం గమనించాలి. కెనడాకి స్వతంత్రం వచ్చాక ఆంటారియో, నోవా స్కోషియా – ఈ రెండు రాష్ట్రాలలోనే స్కూళ్ళలో ఇలాంటి వివక్ష కొనసాగింది.
సరే, యువతుల విద్యపై ఇతని అభిప్రాయం చూద్దాము. ఈ విషయమై ఈయన ఏకైక అభిప్రాయం – “వద్దు. వాళ్ళ స్థానం ఇంట్లో.” ప్రాథమిక విద్య తరువాత ఆడవాళ్ళు చదువుకోవడాన్ని వ్యతిరేకించడమే కాక కొంచెం ఎక్కువ నాణ్యత గల విద్యని అందించే గ్రామర్ స్కూళ్ళలో ఆమ్మాయిల ప్రవేశాన్ని కూడా వ్యతిరేకించాడు. అప్పర్ కెనడా లో బాలబాలికలు కలిసి చదువుకునే పద్ధతిని కూడా నిషేధించి, అమ్మాయిలూ, అబ్బాయిలూ వేర్వేరుగా చదువుకోవాలని నొక్కి చెప్పాడు.
కనుక, ట్కరొంటో నగరం మధ్యలో నేను పనిచేస్తున్న విశ్వవిద్యాలయం పేరు గల వ్యక్తిని గురించి నేను – “ఇతను సంస్థాగతంగా ఆదివాసీలు, నల్లజాతి వారి పట్ల వ్యతిరేకత పెరగడానికి పునాదులు వేశాడు” అన్న అభిప్రాయానికి వస్తే మీరు ఏమనుకోకూడదు. ఈ జాతివిద్వేషి, స్త్రీ ద్వేషి, ట్రాంస్ ఫోబిక్ అయిన వ్యక్తి పేరిట వెలిసిన మా విశ్వవిద్యాలయంలో జీతభత్యాల తారతమ్యాలు ఇంకా ఇప్పటికీ ఉండడం గురించి నేను ఆలోచించడం మొదలుపెడితే మీరు నన్ను క్షమించాలి. ఇపుడు ఇదంతా నాకు తెలుసు కదా.
ఏదన్నా విషయం తెలుసుకోవడం వల్ల ఒక సమస్య ఏమిటంటే ఇక మళ్ళీ అది తెలియకపోవడం అన్న పరిస్థితి రాదు. అందువల్ల, 2020లో మా విశ్వవిద్యాలయం అధ్యక్షుడు సమధర్మం మా రక్తంలో ఉందని ప్రకటించినపుడు ఆయన్ని ప్రశ్నించడాన్ని మీరు తప్పుగా భావించకూడదు.
2017లో మా శాఖాధిపతి నన్ను సాగజివె అధ్యక్షురాలి హోదాలో కెనడా దేశానికి 150ఏళ్ళు నిండిన సందర్భంగా ఏదైనా చేయమని అడిగారు. సాగజివె అన్నది ఈ విశ్వవిద్యాలయంలోని ఒక శాఖలో ఆదివాసీ పరిశోధనల గురించిన సంస్థ.
ఇది వినగానే మొదట నాకేం తోచలేదు. 150ఏళ్ళ సామూహిక జాతి హనానాన్ని గురించి ఏం చెప్పాలి? నా మిత్రుడు, సాగజివె లో ఆర్టిస్ట్ ఇన్ రెసిడెంస్ గా ఉన్న బిల్లీ మెరాస్టీ కి ఫోను చేశాను. మేమిద్దరం చర్చి స్ట్రీట్ లోని గ్లాడ్ డే బుక్ షాపులో కలిసి కాసేపు ఈ విషయం చర్చించాము. ఆ షాపులో వెనక వైపు పింక్ గోడలున్న ఒక గదిలో కూర్చుని ఈ శాఖాధిపతి విజ్ఞప్తిని మన్నిస్తూ, ఆదివాసీలుగా మా ఉనికికి తగ్గట్లుగా ఉండేలా ఏం చేయాలో ఆలోచించాము. కెనడా అంటే మాకు ఏమిటన్నది చర్చించాము. బిల్లీ ప్రకారం ఆదివాసీలకి కెనడాలో భద్రతాపరంగా ఉత్తమమైన ప్రదేశం వారి సమాజంలోని ఇల్లే. దీనితో మేము స్వస్థానానికి, ఇంటికీ సంకేతమేమిటన్నది ఆలోచించి క్యాంపస్ లో మా సంప్రదాయక గుడారమైన టీపీ ని పాతుదాం అని నిర్ణయించుకున్నాము. కానీ, మా విశ్వవిద్యాలయానికి పేరు ద్వారా రెసిడెన్షియల్ స్కూళ్ళ వ్యవస్థతో ఉన్న సంబంధాన్ని మాత్రం మర్చిపోలేము అని కూడా అనుకున్నాము.
నిర్భంధంలో మరణించిన పిల్లలని ఈ ఇంట్లోకి తీసుకురావాలని నిర్ణయించాము. తరువాత కొన్ని వారాలు నేను ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ రికార్డులు, ఆర్కైవులు వెదికి, నాకు కనబడ్డ దాదాపు నాలుగు లక్షల పేర్లలోంచి 150 ఏళ్ళకి ఏడాదికి ఒకరి చొప్పున 150 పేర్లు ఎంపిక చేసి, వాటిని చెక్క పలకలపైకి లేజర్ ప్రింట్లు తీయించి, టీపీ లోపల వేలాడదీశాను. నాలుగు పగళ్ళు, నాలుగు రాత్రులు ఈ పిల్లల జ్ఞాపకార్థం పవిత్రాగ్నిని వెలిగించాము. ప్రతిరోజూ రెండుసార్లు బిల్లీ మా కథలు చెప్పేవాడు ఇక్కడ కూర్చుని. నిషి డిష్ రెస్టారెంటు వారు సూపు, బ్రెడ్డు తెచ్చేవారు ఈ కథలు వినడానికి చుట్టూ చేరిన వారికి ఇవ్వడానికి. నాలుగో రోజున ఈ 150 మంది పేర్లనీ పలికి ఆ చెక్కపలకలని మంటల్లో వేసేశాము. నిష్ డిష్ వారు విందు చేశారు. మంటలు ఆరిన తరువాత ఆ బూడిదను ఆంటారియో చెరువు లో కలిపాము. ఈ స్థలానికి మేము “సర్వాధికారముతో కూడిన మనుగడ” (survival through sovereignty) అని నామకరణం చేశాము. ఇక మా తదుపరి ప్రణాళిక క్యాంపస్ లో ఉన్న అతని విగ్రహం చుట్టూ ఈ నాలుగు లక్షల పేర్లూ గల గోడని నిర్మించడం. ఈ పిల్లలందరి స్మారకార్థం ఆరని జ్యోతిని ఒకదాన్ని వెలిగించి ప్రతి నాలుగు రోజులకీ ఒక పేరుని కనిపించేలా చేయడం. ఈ గోడ నిర్మాణానికి నాలుగేళ్ళు పడుతుందని అనుకుంటున్నాము. ఇది పూర్తయితే ఆ గోడ అతని విగ్రహాన్ని కప్పేస్తుంది.
బహుశా ఇదంతా ఇన్నాక మీరు నేను ఒక చారిత్రక వ్యక్తిని ఇప్పటి విలువలతో కొలిచి సంస్కృతి రద్దు (cancel culture) చేయబూనుతున్నానని అనవచ్చు. చరిత్రలో ఇతన్ని స్థానాన్ని తుడిచేయడం నా ఉద్దేశ్యం కాదు. చరిత్రలో ఇతని స్థానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని నా కోరిక. ఇతని చర్యలు తరువాతి తరాలలోని పిల్లలని ఎలా ప్రభావితం చేశాయో అందరం అంగీకరించాలి. అసలు నా శరీరం, మనసూ, ఆత్మా రోజూ ఇతని పేరుగల ఈ విశ్వవిద్యాలయం హాళ్ళలో రోజూ నేను నడుస్తున్నపుడూ, ఆ విగ్రహం ఉన్న దారిలో వెళ్తున్నపుడూ ఏమనుకుంటూన్నాయో మీకు చెప్పాలనుకుంటున్నాను.
ఇది నా ఒక్కదాని సమస్యే కాదు. నా తోటి ఆదివాసీ, నల్లజాతి సహోద్యోగులు చాలా మంది ఇలాగే భావిస్తున్నారు. ఇప్పటికే మా విద్యార్థులంతా ఆ విగ్రహం పైకి ఎర్ర రంగు చల్లడం వాళ్ళకి ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చెబుతున్నారు. ఈ రంగు వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూళ్ళకి బలైన విద్యార్థుల రక్తానికి ప్రతీకలా తోస్తుంది. ఆ విగ్రహం తమ శరీరాలపై జరుగుతున్న హింసకి ప్రతీకలా తోస్తుంది అంటున్నారు. నాకు తెల్సిన ఒక అనిషినాబెగ్ విద్యార్థి జర్నలిజం కోర్సు చేస్తూ మధ్యలో వదిలేశాడు. రోజూ ఈ విగ్రహాన్ని చూస్తూ ఇక్కడ చదువుకోలేనని వెళ్ళిపోయాడు. అతనికి ఇదంతా తెలిసి పోయింది కదా మరి!
ఇపుడు మనకి ఇదంతా తెలుసు కనక, ఈ విశ్వవిద్యాలయం పేరు మార్చుకోవాలని నేను అడుగుతున్నాను. ఆదివాసీ, నల్లజాతి సంస్కృతులని గౌరవించే పేరు ఒకటి కావాలి. మహిళలని, పురుషులు కాని ఇతరులని గౌరవించే పేరు కావాలి. మనందరిలోని భిన్నత్వాన్ని, వైవిధ్యాన్నీ కలుపుకుపోయే పేరు ఒకటి కావాలి. యూరోపు నుండి వలసదారులు రాక ముందు నాటి స్థానిక ఆదివాసీల విలువలని ప్రతిబింబించే పేరొకటి కావాలి. ఇపుడు కొత్తగా కనుగొన్న ఆదర్శాలూ, విలువలూ మా సంస్కృతిలో ఎప్పట్నుంచో ఉన్నవే! కాలపరీక్షకి నిలిచే పేరొకటి కావాలి. చరిత్రని న్యాయమూర్తిని చేసి నిలబడగల ధైర్యం ఉన్న పేరొకటి కావాలి.
********
కొసమెరుపు: ఈ రచయిత్రి, ఇలాంటి మరెందరో చేసిన కృషి వల్ల 72ఏళ్ళ చరిత్ర గల ఈ కెనడియన్ విశ్వవిద్యాలయం (Ryerson University, Toronto) గత నెలలో తమ సంస్థ పేరుని మార్చాలని నిర్ణయించింది.
[…] నేను తెలుగులోకి అనువదించాను. అది సారంగ పత్రిక వారు వేసుకున్నారు. ఇందులోని వస్తువు కెనడాలోని ఆదివాసీ […]
ఆ యూనివర్సిటీకి ఆ వ్యక్తి పేరు తొలగించాలని నిర్ణయించారన్న కొసమెరుపు చాలా రిలీఫ్ గా అనిపించింది.
వ్యాసం చివరివరకూ ఆ వ్యక్తి పేరు చెప్పకపోవడం కూడా ఆసక్తిగా చదివించింది.
మంచి అనువాదం.
ఇది చదువుతున్నంత సేపూ నాకు రాజస్థాన్ హైకోర్టు ఎదుటనున్న మనువు విగ్రహం గుర్తుకు వచ్చింది.
చాలా బావుంది. ఈ పిల్లల దేహాలు ఈ మధ్య దొరికినపుడు కొత్త గ్రీన్ గేబుల్స్ సిరీస్ లో చూపించిన పాప గుర్తొచ్చింది. చెట్టుకు పూసి గాలికి ఊగుతున్న పువ్వుని కోసి, ఏ హక్కుతో బానిస చేసి, జుత్తు కత్త్రిరిస్తారో.. అలాంటి పిల్లలు ఇందరా? చాలా బాధ కలిగించే చరిత్ర.
ఆదివాసీలపై దమన కాండ ఇప్పటిది కాదని చెప్పిందా ఉత్తరం. దేశమేదైనా ఆదివాసుల పై అణచివేత ఒక్కటే. ఈ నేల మీద మూలవాసులఫై జరుగుతున్న కుట్రపూరిత వ్యవహారాన్ని విప్పిచెప్పిన వ్యాసమిది.
ఆదివాసులవ కోసం, అణగారిన వర్గాల కోసం ఏర్పడిన ప్రత్యేక
పాఠశాలల వ్యవస్థల మీద ఇప్పుడున్న నా అవగాహన ని మార్చుకోవాలేమో అన్న అనుమానం కలిగించింది.
ఆ విశ్వవిద్యాలయం పేరు మార్చడం శుభ పరిణామం.
ఆ విగ్రహం ముందు నల్లజాతీయుల పేర్లు కనపడేలా కడుతున్న గోడ ఎంత ఎత్తైనదో! చరిత్ర లో ఇలాంటి విగ్రహాలనే కాదు, ఇలాంటి ఉత్తరాలనీ కప్పేయాలి.
ఓ నూటడెభ్భయ్యయిదు ఏళ్ళ క్రితం ఉత్తరం వ్రాసి, దాన్నో విధానంగా రూపు దాల్చేలా చేసిన వ్యక్తి విగ్రహాన్ని ఇప్పుడు సమాధి (సజీవ సమాధి అనలేం కదా) చేబూనారంటే ఆశ్చర్యంతో బాటు, ఆ విద్యా విధాన పర్యవసానం యొక్క తీవ్రతను గుర్తించి ఇంతటి నిరసన తెలుపుతున్నారనే విస్మయం కూడా కలుగుతోంది. కానీ ఆ కుట్రపూరిత మత విద్యావిధానం కొన్ని తరాల నుండీ ఆదివాసీల, ఇతర జాతుల జీవనాడులలో ఇంకి కలగలిసిపోయి, శాశ్వతంగా బానిసల్ని తయారుచేసే వ్యవస్థను పదిలంగా స్థిరపరచేసింది కదా! ఇప్పుడు ఆ విగ్రహం పై నిరసన ఆ కుట్రపూరిత విధానాలను ఏ మాత్రమైనా కదిలించగలదా? కనీసం స్పృశించగలదా? అయినా ఇలాంటి వివక్ష విధానాలను బయలు పరచిన వ్యాసకర్తా, దాని ప్రాముఖ్యాన్ని గుర్తించి, తెనుగించిన అనువాదకురాలూ అభినందనీయులు.
[…] వివిధ కెనడియన్ ఆదివాసీ ప్రముఖులు, మేధావులు, రచయితలు – టొరొంటో ప్రాంతాలలో పనిచేస్తున్న వారు -అంతా కలిసి రాసిన అనుభవాల సంకలనం. కొన్ని వ్యాసాలు చాలా నచ్చాయి. అలా నచ్చిన ఒక వ్యాసాన్ని నేను తెలుగులోకి అనువదించాను. అది సారంగ వెబ్ పత్రికలో ఇక్కడ చదవవచ్చు. […]