బెంగాలీ నుండి తానే స్వయంగా అనువదించిన 103 కవితలున్నఆంగ్ల గీతాంజలికి ఠాగూర్ 1913లో నోబుల్ బహుమతి పొంది, ఈ పురస్కారం అందుకున్న మొదటి ఐరోపేతర వ్యక్తిగా, మొదటి ఏషియన్ గా, ఒకే ఒక్క భారతీయుడిగా నిలిచాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే!
ఈ పుస్తకానికి పరిచయవ్యాఖ్య రాసిన ఐరిష్ సాహిత్య ప్రసిద్ధుడు యేట్సు (W.B. Yeats) కూడా, సరిగ్గా పదేళ్ళ తర్వాత, తన యాభై ఎనిమీదో యేట అదే నోబుల్ పురస్కారం అందుకుని, అప్పటివరకూ తను చేసిన అప్పులే గాక, తండ్రి చేసిన అప్పులు కూడా తీర్చేసాడు. ఇది మనకు సంబంధం లేని విషయం
గుడిపాటి వెంకటాచలం, ఆదినారాయణ రావు, బెల్లంకొండ రామదాసు, మేరువ వెంకటేశ్వర రావు, దుర్గానంద్, మువ్వల సుబ్బరామయ్య – వీళ్ళందరూ ‘గీతాంజలి’ ని తెలుగులోకి అనువదించారు. అయితే వీళ్ళల్లో ఎవరూ కూడా యేట్సు ‘ఇంట్రో’ ని ఎందుకో తర్జుమా చేయలేదు. ఇదీ అసలు పాయింట్!
అందరూ వదిలేసిన ఆ పరిచయ వ్యాఖ్య మీకోసం.
***
కొద్దిరోజుల క్రితం ఒక ప్రముఖ బెంగాలీ డాక్టర్ తో నేను ఇలా అన్నాను.
“నాకు జర్మన్ భాష తెలియదు, కానీ ఒక జర్మన్ కవి అనువాదం నన్ను కదిలిస్తే, బ్రిటిష్ మ్యూజియంకు వెళ్లి, ఆ కవి జీవితచరిత్రా, అతని ఆలోచనా విధానం తెలియజేసే ఆంగ్ల పుస్తకాలను వెతుక్కుంటాను. గత కొద్ది సంవత్సరాలుగా నన్ను ఏ పుస్తకమూ కదిలించలేదు, కానీ ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ వచనానువాదాలు నా రక్తాన్ని చైతన్యవంతం చేసాయి. ఒక భారతీయ యాత్రికుడు చెప్పకపోయుంటే, ఠాగూర్ జీవితం గురించి గానీ, అతని ఆలోచనావిధానం గురించి గాని నాకు అసలు తెలిసుండేది కాదు.”
“నేను రోజూ రవీంద్రున్ని చదువుతాను, ఆయన ఒక్క లైను చదివడమంటే లోకంలోని కష్టాలన్నీ మరచిపోవడమే.”
అవి నన్ను కదిలించడం అత్యంత సహజమైన విషయమే అన్నట్టు మాట్లాడాడు ఆ డాక్టర్.
నేనిలా అన్నాను.
“రెండవ రిచర్డ్ పాలనలో లండన్‌లో నివసిస్తున్న ఒక ఆంగ్లేయుడు, పెట్రార్క్ లేదా డాంటే అనువాదాలు చదివితే, అతని సందేహాలకి సమాధానం వెతుక్కోవడానికి పుస్తకాలేవీ దొరకవు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినట్టుగానే ఏ ఫ్లోరెంటైన్ బ్యాంకర్ నో, లాంబార్డ్ వ్యాపారినో ప్రశ్నించేవాడు. నాకు తెలిసినంత వరకూ ఠాగూర్ కవిత్వం చాలా సంపన్నంగానూ సరళంగానూ ఉంది. మీ దేశంలో కొత్త ‘పునరుజ్జీవనం’ మొదలైంది. దాని గురించి నేను ఇలా వినడం తప్ప ఎప్పటికీ తెలుసుకోలేను.”
డాక్టర్ ఇలా జవాబిచ్చాడు.
“మా దగ్గర ఇంకా ఇతర కవులు కూడా ఉన్నారు. కానీ ఠాగూర్ తో సరితూగే వాళ్ళెవరూ లేరు. మేము దీన్ని ‘రవీంద్రనాథ్ యుగం’ అని పిలుస్తాము. అతనిలాంటి గొప్పకవి నాకు యూరప్‌లో ఎక్కడా కనిపించలేదు. ఠాగూర్ కవిత్వంలోనే కాదు, సంగీతంలో కూడా గొప్పవాడు. పశ్చిమభారతం నుండి బర్మా వరకూ, ఎక్కడ బెంగాలీ మాట్లాడే వాళ్ళున్నా అతని పాటలు పాడతారు. పంతొమ్మిదేళ్ళకే అతను తన మొదటి నవల రాసి ప్రసిద్ధికెక్కాడు. కొంచెం పెద్దవాడయ్యాక రాసిన నాటకాలు ఇప్పటికీ కలకత్తాలో ఆడుతున్నారు. ఠాగూర్ పరిపూర్ణ జీవితాన్ని నేను చాలా ఆరాధిస్తాను. చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడే అతను ప్రకృతి గురించి ఎక్కువగా రాసాడు. రోజంతా తన తోటలోనే కూర్చునేవాడు. అతని ఇరవయ్యైదేళ్ళ నుండి ముప్పయ్యైదేళ్ళ మధ్యలో, అంతులేని విషాదంలో ఉన్నప్పుడు అత్యంత అందమైన ప్రేమకవిత్వాన్ని రాసాడు మా భాషలో.”
తర్వాత ఆ డాక్టర్ తీవ్రభావోద్వేగంతో ఇలా అన్నాడు.
“నా పదిహేడేళ్ల వయస్సులో, ఠాగూర్ ‘ప్రేమ కవిత్వాని’ కి ఎంత రుణపడిపోయానో మాటల్లో చెప్పలేను. తర్వాతకాలంలో అతని కళ మరింత లోతుగా, మతపరమైనదిగా, తాత్వికంగా మారింది. మానవజాతికి స్ఫూర్తినిచ్చే శక్తి ఆయన కీర్తనల్లో ఉంది. జీవితాన్ని త్యజించకుండానే జీవితం గురించి మాట్లాడిన మొట్టమొదటి సాధువు ఆయన. అందుకే మేము ఠాగూర్ కి మా ప్రేమను పంచాము.”
ఆ డాక్టర్ ఆచితూచి మాట్లాడిన మాటల్లో కొన్ని పదాలు అటూఇటూ మారినా, నాకు గుర్తున్నంత వరకు దాని సారాంశం ఇదే.
“మా బ్రహ్మ సమాజానికి మేము ఇంగ్షీషులో మీ ‘చర్చ్’ అనే పదాన్ని ఉపయోగిస్తాము. కొన్నాళ్ళ కిందట మా చర్చిల్లో ఒకదాంట్లో ఠాగూర్ దైవ ప్రార్ధన చదవడానికి వచ్చాడు. అది కలకత్తాలోనే అతిపెద్ద చర్చి అయినప్పటికీ కిక్కిరిసిపోవడమే గాకుండా వీధులన్నీ నడవడానికి కూడా వీల్లేనంతగా జనంతో కిటకిటలాడాయి.”
చిన్నవిషయానికైనా పెద్ద విషయానికైనా హాస్యమనే ఒక ముసుగు తొడిగి వాటి తీవ్రతని తగ్గించే ప్రపంచంలోంచి వచ్చిన నాకు, నన్ను కలవడానికి వచ్చిన భారతీయులందరూ ఠాగూర్ పట్ల చూపించే హృదయపూర్వక గౌరవం చాలా వింతగా అనిపించేది. మనం పెద్దపెద్ద చర్చిలు నిర్మించేది అలాంటి గొప్పవ్యక్తుల పట్ల గౌరవంతోనే కదా?.
“నేను చూడలేదు గానీ నాకు తెలుసు, ఒకతను నాతో అన్నాడు; ప్రతిరోజూ తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన (ఠాగూర్) కదలకుండా ధ్యానంలో కూర్చుంటాడు. రెండుగంటలపాటు అసలు లేవకుండా భగవద్ స్వరూపంమ్మీద తనకున్న గౌరవాన్ని ప్రకటిస్తాడు. అతని తండ్రి కూడా మహాఋషి. ఠాగూర్ కొన్నిసార్లు రోజంతా అక్కడే కూర్చునేవాడు. ఒకసారి నదిపై ప్రయాణిస్తున్నప్పుడు అక్కడి మనోహర ప్రకృతిదృశ్యాన్ని చూస్తూ మైమరచిపోయి ధ్యానంలోకి వెళ్ళాడు. పడవలోని తెడ్లు మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఎనిమిది గంటలు ఆగాల్సి వచ్చింది.”
ఆ తర్వాత ‘మిస్టర్ ఠాగూర్’ కుటుంబం గురించీ, తరతరాలుగా ఆ వంశవృక్షం లోంచి ఎలాంటి గొప్పగొప్ప వ్యక్తులు వచ్చారో నాకు చెప్పాడు ఆ డాక్టర్. “ఈరోజు ఆ కుటుంబంలో గగనేంద్రనాథ్ మరియు అబనీంద్రనాథ్ కళాకారులుగా ఉన్నారు. రవీంద్రనాథ్ సోదరుడు ద్విజేంద్రనాథ్ గొప్ప తత్వవేత్త. ఉడుతలు కొమ్మలనుండి కిందకి దిగివచ్చి అతని పాదాల మీద పాకుతాయి. పక్షులు అతని చేతులపైన వాలుతాయి.”
ఈ మనుషుల ఆలోచనల్లో ప్రస్పుటంగా కనిపించే అర్థాన్నీ, అంత:సౌందర్యాన్నీ నేను గమనించాను. ‘ప్రస్తుతమో, భవిష్యత్తులోనో – భౌతిక విషయాలను ప్రభావితం చేయని ‘నైతిక’ లేదా ‘విజ్ఞాన’ సౌందర్యాన్ని విశ్వసించకూడదు’ అనే ‘నీషే’ సిద్ధాంతాన్ని వీరు పాటిస్తున్నారు. ”తూర్పుదేశాల్లో కుటుంబాన్ని ఎలా విశిష్టంగా ఉంచుకోవాలో మీకు తెలుసు. నిన్న ఒక మ్యూజియం క్యూరేటర్, వాళ్ళ దగ్గర చైనీస్ ప్రింట్‌లను సిద్దంచేస్తున్న ఒక నలుపు చర్మం గల వ్యక్తిని నాకు చూపించి ‘అతనొక కళా నిపుణుడు. మికాడో రాజవంశంలో ఆ పదవిని చేపట్టిన పద్నాలుగో వ్యక్తి’ అని చెప్పాడు.” అన్నాను నేను.
అప్పుడా డాక్టర్ అన్నాడూ, ”రవీంద్రనాథ్ బాలుడిగా ఉన్నప్పుడు, ఇంట్లో సంగీతం మరియు సాహిత్యం అతన్ని చుట్టుముట్టి ఉండేవి.”
సరళంగానూ సమృద్ధిగానూ ఉన్న రవీంద్రుని కవితలు గుర్తుచేసుకుని నేను ఇలా అన్నాను.
“మీ దేశంలో ప్రచార సాహిత్యం, విమర్శనా సాహిత్యం విరివిగా ఉన్నాయా?. ఈ విషయంలో మేం చాలా చేయాల్సి ఉంది, ముఖ్యంగా మా దేశంలో…! మా మెదడు నెమ్మదిగా సృజనాత్మకంగా మారడం మానేసింది. అయినా మేం (రచయితలం) నిస్సహాయులుగా మిగిలాం. మా జీవితం ఒక నిరంతర యుద్ధం కాకపోయుంటే, ఏది మంచో ఏది చెడో మాకు తెలిసేది కాదు. వినేవారు చదివేవారు మాకు దొరికే వాళ్ళే కాదు. మా శక్తిలో నాలుగోవంతు పరాయివాళ్ళ ఆలోచనలతోనో లేదా స్వీయ ఆలోచనలతోనో పోరాడటం అనే ఒక ‘చెడు అభిరుచి’ కోసమే ఖర్చు చేస్తున్నాము.”
డాక్టర్ సమాధానమిచ్చాడు…
“నాకు అర్థమైంది, మా దగ్గర కూడా ‘ప్రచార సాహిత్యం’ ఉంది. మధ్యయుగపు సంస్కృతం నుండి తీసుకున్న దీర్ఘ పౌరాణిక పద్యాలను మా పల్లెల్లో వల్లెవేస్తారు. వాటిల్లో ప్రజలు తమ విధులను తప్పకుండా నిర్వర్తించాలని చెప్పే భాగాలను తరచుగా చొప్పిస్తారు.”
రవీంద్రుని అనువాదాల రాత ప్రతిని చాలారోజులు నా దగ్గరే ఉంచుకున్నాను. రైళ్లల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంట్లలోనూ చదివేవాడిని. అది నన్ను ఎంతగా కదిలించిందో నా పక్కనున్నవాళ్ళకి తెలియకుండా తరచుగా దాన్ని మూసేయాల్సి వచ్చేది. నన్ను కలిసిన భారతీయులు చెప్పినట్లు, మూలంలోని ఈ గేయాలు, అనువాదానికి అసాధ్యమైన రంగు రుచి కలిగి, ఒక ‘లయాత్మక సూక్ష్మత’ తో నూతన లయనిర్మాణాన్ని ఆవిష్కరిస్తూ, నేను జీవితాంతం కలలుగన్న ఒక ప్రపంచాన్ని నాకు చూపించాయి.
సాంస్కృతికంగా అత్యున్నత స్థాయి కలిగినప్పటికినీ, ఈ రచనలు సాధారణ నేలమీద మొలిచే గడ్డి, దర్బ లాగా కనిపిస్తాయి. మతమూ కవిత్వమూ ఒకటిగా కలగలిసిన సాంప్రదాయంలో శతాబ్దాలుగా ప్రయాణించి, నేర్చుకున్న మరియు నేర్చుకోవాల్సిన ప్రతీకలనూ, భావోద్వేగాలనూ రంగరించి ఒక నూతన ఆలోచనల్లోని విజ్ఞానాన్ని, యశస్సును మళ్లీ జన సమూహానికి అందిస్తాయి. మాలాగా ఒకరితో ఇంకొకరికి సంబంధంలేని డజనుముక్కలైన ఆలోచనగా విడిపోకుండా, అందరిలోనూ ఒకే దైవికకమైన సామజిక స్పృహ ప్రవహించే బెంగాల్ నాగరికత ఇలాగే అవిచ్చిన్నంగా ఉంటే, కొన్నితరాల తర్వాత ఈ శ్లోకాల్లోని సూక్ష్మాన్ని రోడ్లపై బిచ్చగాడు కూడా గ్రహిస్తాడు.
ఇంగ్లండ్‌లో ‘ఏక ఆలోచన’ ధోరణి ఉన్నప్పుడు చౌసర్ ‘ట్రోయిలస్ అండ్ క్రెసిడా’ రాసాడు. చదవడానికో లేదా వల్లెవేయడానికో రాసానని అనుకున్నాడతను. కానీ వేగంగా మారిన కాలగమనంలో విదూషకులు దాన్ని పాట రూపంలో గానం చేశారు. చౌసర్ పూర్వీకుల వలె, ఠాగూర్ కూడా తన పదాలకు సంగీతం సమకూర్చాడు. ఈ పని ఆయన చాలా సమృద్దిగా, సహజంగా, అలవోకగా, సాహసోపాతమైన అభిరుచితో, అందరూ ఆశ్చర్యపడేలా చేసాడని ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఆయన అసాధారణమైనదో, అసహజమైనదో లేదా అనాదరింపబడే పనో చేయలేదు. అందంగా ముద్రింపబడి (రెస్టారెంట్లలో ఒంటరి స్త్రీలకోసం రిజర్వ్ చేయబడిన) ‘లేడీస్ టేబుల్స్’ మీద అలంకరించబడే పుస్తకాలమధ్య ఈ పుస్తకం ఉండకపోవచ్చు. వాళ్ళు జీవితం గురించి తెలుసుకోవలసింది ‘ఇదే’ అని తెలియక, తమ నిర్లిప్త హస్తాలతో పేజీలు తిరగేసి, ఈ అర్థంలేని జీవితమేంటని నిట్టూర్చవచ్చు. జీవితాన్ని అప్పుడే మొదలు పెట్టబోతున్న విద్యార్థులు దీన్ని విశ్వవిద్యాలయానికి తీసుకువెళ్ళి పక్కన పడేయవచ్చు. కానీ తరాలు గడిచేకొద్దీ… రహదారులమీద ప్రయాణించే యాత్రికులూ, నదులమీద తెడ్డువేసే నావికులూ వీటిని పాడుకుంటారు. ప్రేమికులు ఒకరికోసం ఒకరు ఎదురుచూస్తున్నప్పుడు వీటిని గొణగుతూ కనిపిస్తారు. భగవత్ప్రేమలాంటి ఈ మాయాసముద్ర పాయలో తమ చెడు తలపులని కడుక్కుని, వాటికి పునర్యవ్వనాన్నిస్తారు. అపజయానికి, అనాదరణకి వెరవకుండా ఈ ‘కవి హృదయం’ ప్రతిక్షణం వెలుపలికి ప్రవహిస్తూనే ఉంది. ఎందుకంటే అది ప్రజల జీవిత స్థితిగతులతో నిండిపోయిందనీ, కాబట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారనీ ఈ కవికి తెలుసు. వొంటిమీద దుమ్ము కనిపించకుండా గోధుమరంగు దుస్తులు ధరించిన ప్రయాణీకుడూ, రాకుమారుడిలాంటి ప్రియుడిచ్చిన పుష్పగుచ్ఛం నుండి రాలిపోయిన పూరేకులను మంచమ్మీద వెతుక్కుంటున్న అమ్మాయీ, ఖాళీ ఇంటిలో యజమాని ఆగమనం కోసం ఎదురుచూస్తున్న సేవకుడూ లేదా నవవధువూ- ఇవన్నీ మనసుని దేవుని వైపు మళ్ళించే హృదయ చిత్రాలు. పూలూ నదులూ, ఊదుతున్న శంఖపు గవ్వలూ, భారతదేశంలో జూలైలో కురిసే భారీ వర్షాలూ, సంయోగవియోగాల్లోని హృదయానుభూతులూ, సరోవరంమ్మీద పడవలోకూర్చుని విపంచి మీటుతున్న సంగీతకారుడూ, చైనీస్ ‘నైరూప్య చిత్రపటం’ లోని ఓ వ్యక్తీ, అన్నీ.. అందరూ… దేవుడి రూపాలే. ‘అంతులేని విచిత్రం’ లా మనకు తోచే ప్రజాసమూహాన్నీ, ఆ మొత్తం నాగరికతనూ కవి తన ఊహాప్రపంచంలోకి తీసుకున్నట్టనిపిస్తుంది. ఆ ‘విచిత్రత’ వల్ల మనం స్పందించలేకపోవచ్చు గానీ, మనదైన ఒక సొంతదృశ్యాన్ని మనసులో చూసుకుంటాము. సాహిత్యంలో మొట్టమొదటిసారిగా, రోజెట్టి (Rossetti) ‘Willo Woods’లో నడిచినట్లుగానో లేదా ఏదో కలలో విన్నట్లుగానో మన ‘స్వరం’ మనమే వింటాము.
పునరుజ్జీవనోద్యమం (Renaissance Movement) తర్వాత యూరోపియన్ సాధువుల రచనలూ, వారి పరిచిత ప్రతీకలూ, మూస ఆలోచనా నిర్మాణం – మన దృష్టిని ఆకర్షించడం మానేసింది. ఏదోరోజు ఈలోకాన్ని విడిచిపెట్టాలని మనకు తెలుసు. బలహీనమైన క్షణాల్లోనో, ఉన్నతమైన క్షణాల్లోనో స్వచ్ఛందంగా ఈలోకాన్ని విడిచిపెట్టాల్సిందే నన్న ఆలోచనకి మనం అలవాటు పడ్డాము; కానీ ఇంత కవిత్వం చదివి, ఇన్ని పెయింటింగ్స్ చూసి, ఇంత సంగీతాన్ని విన్న మనం- రక్త మాంసాల రోదననీ, రిక్తఆత్మల శోకాన్నీ ఒకేరకంగా దర్శించిన తర్వాత, ఈలోకాన్ని ఇంత నిర్దయగా ఇంత అమర్యాదగా ఎలా వదిలివేయగలం?
మనకూ, స్విట్జర్లాండ్ సరోవరాల సౌందర్యాన్ని చూడకుండా తన కళ్లను కప్పుకున్న సెయింట్ బెర్నార్డ్ కీ, లేదా హింసాత్మక అలంకార సహిత ‘బుక్ ఆఫ్ రివిలేషన్స్’ కీ- ఉన్న సాపేక్షత ఏమిటి.?. ప్రయత్నపూర్వకంగా పరిశీలిస్తే ఈ పుస్తకం (గీతాంజలి) లో ఉన్నట్లుగానే చాలా మర్యాద పూర్వకమైన పదాలను కనుగొంటాం మనం.
“సోదరులారా…!
నేను సెలవు తీసుకుంటున్నాను
నాకు వీడ్కోలు చెప్పండి
మీ అందరికీ వినమ్రంగా నమస్కరించి నిష్క్రమిస్తాను
నా తలుపులకి వేసిన తాళం చెవిని మీకు తిరిగి ఇస్తున్నాను
నా ఇంటిమీద నాకున్న అన్నిహక్కులను వదులుకుంటున్నాను
మీనుండి దయగల ఆఖరి పలుకులను మాత్రమే అడుగుతున్నాను.
సుదీర్ఘకాలం మనం ఇరుగుపొరుగుగా ఉన్నాము
తిరిగివ్వగలిగిన దానికంటే నేను ఎక్కువే పొందాను
ఇప్పుడు… ఈరోజు… పొద్దువాలింది
నా చీకటిమూలను వెలిగించిన దీపం ఆరిపోయింది
ఆదేశాలు అందుకున్నాను
నా ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను…”
‘కెంపిస్’ లేదా ‘జాన్ ఆఫ్ ది క్రాస్’ నుండి దూరం జరిగి ‘నేను జీవితాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి, మరణాన్ని కూడా ప్రేమించాలని నాకు తెలుసు’ అని రోదించే మన స్వీయ మానసిక స్థితి ఇది. ఈ పుస్తకం కేవలం మన ‘వియోగ తలపుల’ లోతులని కొలిచేది మాత్రమే కాదు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనకు తెలియదు, బహుషా ఆయన్ని విశ్వసిస్తున్నామని మాత్రమే అనుకుంటాము. మనం జీవితంలో ఒకసారి వెనక్కిమళ్ళి చూసుకుంటే, మన అరణ్యమార్గాల అన్వేషణలోనో, పర్వతసానువుల మీది ఏకాంత ప్రదేశాల ఆనందంలోనో, మనకు ఏదైనా రహస్యంగా స్వాధీనమైన దానిలోనో, మనం ప్రేమించి పొందలేని ఆ స్త్రీ లోనో, ఈ ప్రమాదకర మధురతని సృష్టించే భావోద్వేగాన్ని కనుగొంటాము.
“ప్రభూ…!
అనేకానేక నశ్వరక్షణాల్లో…
నువ్విచ్చిన శాశ్వత సంకేతాన్ని నేను గుర్తించనే లేదు
నా అనుమతి లేకుండానే
సామాన్య జనసమూహంలో ఒకడిగా
నువ్వు నా హృదయంలోకి ప్రవేశించడం
నాకు తెలియనే లేదు…”
ఇది ఎంతమాత్రమూ పవిత్రమైన శిక్షో శాపమో కాదు; దుమ్మునీ సూర్యకాంతినీ చిత్రిస్తున్న చిత్రకారుడి మనో:స్థితిని మరింత గొప్పగా తీవ్రతరం చేసే ఒక ఉద్దారకం. మన హింసాత్మక చరిత్రకు ‘పరాయి’ గా కనిపించే సెయింట్ ఫ్రాన్సిస్, విలియం బ్లేక్ లలో కూడా ఈ రకమైన ‘స్వరం’ మనం గమనించవచ్చు.
రాయడంలోని ఆనందాన్ని పొందకుండా, ఒక అలవాటైన రూపనిర్మాణాన్ని నమ్ముకుని, ఏ పుటలోనూ విషయం లేని పెద్దపెద్ద పుస్తకాలను రచిస్తూ, పోట్లాడి, డబ్బుసంపాదించి, బుర్రనిండా రాజకీయాలు నింపుకుంటున్నాం మనం. అన్నీ నీరసమైన పనులు చేస్తున్నాం. కానీ ఠాగూర్ గారు, భారతీయ నాగరికత లాగా, ఒక ఆత్మను ఆవిష్కరించి దాని సహజ స్వరూపానికి తనను తాను అప్పగించేసుకుని సంతృప్తి చెందారు. అతను తరచుగా మన జీవన వైఖరిని ఎక్కువగా ఇష్టపడే వాళ్లతో విభేదిస్తున్నట్టుగా కనిపిస్తాడు. తన వాదనలో బలముందని ఈ ప్రపంచాన్ని ఒప్పిస్తాడు. ఎల్లప్పుడూ వినయంగా, తన మార్గమే తనకు ఉత్తమమైనదన్నట్టుగా ఉంటాడు.
“ఇంటికి తిరిగివెళ్తున్న పురుషులు
లిప్తకాలం నన్ను చూసి నవ్వుతారు
లజ్జతో నింపుతారు నన్ను
నేను బిచ్చగత్తెలా కూర్చుని
పరికిణీ నా ముఖంమ్మీదకు లాక్కుంటాను
నీకేం కావాలని వాళ్ళు అడిగినప్పుడు
జవాబు ఇవ్వకుండా నేను కళ్ళు వాల్చేస్తాను…”
ఒకప్పటి తన భిన్నజీవనాకృతిని తలుచుకుంటూ ఇంకోచోట ఇలా అంటాడు, ‘మంచీ చెడులతో ఘర్షిస్తూ చాలా ఘడియలు గడిపాను. కాని ఇప్పుడు నా ఈ రికామీ దినాలతో ఆడుకునే ఆటగాడిమీద మనసు లగ్నంచేయడం నాకు ఆనందంగా ఉంది. కానీ నాకు తెలియదు, ఈ పిలుపు ఏ పనికిరాని పని పర్యవసానమో…’
సాహిత్యంలో మరెక్కడా కనిపించని అమాయకత్వమూ, సరళత వల్ల, పక్షులూ ఆకులూ అతని దగ్గర చేరాయి, పిల్లల దగ్గర చేరినట్టుగా. అలాగే ఋతువుల మార్పుల్లో జరిగే గొప్పగొప్ప ఘటనలన్నీ మనలో ఆలోచన రేకెత్తడానికి ముందే అతని దగ్గర చేరాయి. అతను దీన్ని బెంగాల్ సాహిత్యం నుండి పొందాడా లేక అతని మతం నుండి పొందాడా అని కొన్నిసార్లు ఆశ్చర్యపోతాను నేను. మరికొన్నిసార్లు, అతని సోదరుడి చేతులమీద పక్షులు వాలడాన్ని గుర్తుచేసుకుంటూ, ఇది వంశపారంపర్యంగా సంక్రమించిందేమో అనుకుంటూ ఆనందపడతాను. ట్రిస్టన్ లేదా పెలనోర్ లాగా, శతాబ్దాల ప్రయాణంలో అమరిన ఒక మార్మికత సౌజన్యమేమో నిజానికి. అతను పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు, అతనిలోని పిల్లాడి లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది,. ఒక సాధువులాగా మాట్లాడ్డం లేదని కూడా ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు.
“వాళ్ళు ఇసుకతో ఇళ్లను నిర్మించుకుంటారు
వాళ్ళు ఖాళీ గవ్వలతో ఆడుకుంటారు
ఎండిన ఆకులతో పడవలను అల్లుకుంటారు
విస్తారమైన లోతుల్లో వాటిని తేల్చి నవ్వుతారు
మాటల తీరాల్లో పిల్లలు ఆటలాడతారు…!
ఈదులాడ్డం తెలియదు వాళ్ళకి
వలలు వేయడమూ తెలియదు వాళ్ళకి
నీటిలో దూకుతారు ముత్యాలకోసం వేటగాళ్ళు
నౌకాయానం చేస్తారు వ్యాపారులు వాటికోసం
గులకరాళ్ళను మాత్రం పోగుచేసుకుని
మళ్లీ వాటిని చెల్లాచెదురు చేస్తారు పిల్లలు
వాళ్ళు గుప్తనిధుల కోసం వెతకరు
వాళ్ళకి వలలు విసరడం తెలియదు…”
W.B. Yeats సెప్టెంబర్ 1912
నొబెల్, చాసర్….అనడం మేలు.
నిర్లిప్త హస్తం. కొత్తగా ఉంది. కొంత మంది సాహిత్య విమర్శల లో ప్రస్తావిస్తే చదవడమే గానీ, యేట్స్ గారి పరిచయ వ్యాఖ్య పూర్తిగా చదవడం ఇదే మొదలు. చాలా బాగున్నది. ధన్యవాదాలు సామల గారూ.
Thank you మురళి గారూ.!