1
గుత్తులు గుత్తులుగా పూలు
రాలుతున్నట్లు
గుంపులు గుంపులుగా మబ్బులు
భయంతో పరుగులు
పెట్టుతున్నట్లు
గుట్టలు గుట్టలుగా శిలలు తలలు
పట్టుకున్నట్లు
విషాదం
ముద్రలు ముద్రలుగా
ముద్దలు ముద్దలుగా
2
పాట మొదలైనా ఆగినా
చరణాల మరణ యాతనే
కుంచె జాలువారినా విరిగినా
దృశ్యం కన్నీటి వాసనే
కాలి అందియ
మడమ తిప్పినా
లయ తొణికినా
నాట్యవేదం ఖేదమే
విషాదం
తెరలు తెరలుగా
ఆయాస ప్రయాసలుగా
3
వేసిన తలుపుల అవతల
పిలుపులు మరచిన శూన్యం
నీడలు
వెలిసిన రంగుల గోడల ఇంటిల
పెయింటింగ్ ల పెయిన్ గాథలు
పసిప్రాయం
చింతపండుముద్ద పెట్టి విసిరే
చొప్ప కట్టెల బాణాలకు
చిక్కని కాలాలు
విషాదం
అంచెలంచెలుగా
కంచెలు దాటిన కోవిడ్ లా
4
దందెడ తెగిన
ఊట కాట గలిసిన
మోటబాయి పాడుబడ్డ కథ
బక్కఎడ్ల బండ్లబాట
ఇరుసు విరిగిన కరుసు ఎత
గుడ్డం కుదువ
అప్పుల పజీత
మనసు రోసిన ఎట్టి కట్టం గాథ
విషాదం
వెన్నంటుకునే
వెనకటి నుంచే
5
పట్టాల మీద తల పెట్టిన చోటున
కట్టిన రక్తం మడుగుని
ఏ ప్రశ్నలు అడుగుదాం
చేతికీ మూతికీ
అచ్చిరాని పొలంల
కుతికె పిసుక్కున్న గొంతుల
ఎన్ని ప్రశ్నలుండెనో
ఒడ్డుకు కొట్టుకుపోయే ఉబ్బిన
శవాల లెక్కలకు
ఏవి సమాధానాలు
విషాదం
బరువు బరువుగా
బతుకు బతుకుగా
6
ఆధిపత్య యజ్ఞంలో
హాహా కారాల నేర మెవరిది
వర్ణ వర్గ రాజ ప్రతాపాల
మగ్గిన ఊరవతలి గుడిసెల
పాపాలేవి
పౌరుష పురుషత్వాల
క్రీనీడల
లేమల వెచ్చని కన్నీరెంత
విషాదం
మలుపు మలుపులో
చరిత్ర సొరగు పుటలలో
7
పూలదండలు మోసే మెడ
కాడి మోసే వాడి గోడు తెలిసేనా
ఘూర్ణిల్లు శిలాఫలకాలు
ఏ కాంక్షల మూర్చనలు
రాజ ప్రసాదాలు రాచరికాలు
ఏ వెలుగుల ప్రస్థానాలు
విషాదం
అడుగులు తప్పిన నడకలలో
నుడుగుల మెప్పుల గొప్పలలో
8
ఆనంద అర్ణవాల కోసం
కొస దొరకని పయనాల గోస
గెలుపు దరహాసాల పిలుపు కోసం
దిన గుండంలో కాగుతున్న శ్రమ
చుక్కలు
హక్కుల హరివిల్లు కోసం
పేనిన గొలుసుల బంధీ వాక్యం
విషాదం
నా అపురూప ముఖచిత్రంలో
గర్వ కారణమైన నా దేశ
చిత్రపటంలో
ముసురు ముసురులుగా
డల్లు డల్లులుగా
జడి ఝడి వాన వానలుగా
*చిత్రం: స్వాతీ శ్రీకర్
Add comment