బండి. ఎప్పటి కల!
నడిచీ, సైకిల్ మీదా వెళ్ళేటప్పుడల్లా ఒక బండి కొనుక్కుంటే బాగుణ్ణని అనిపించేది. కానీ ఎట్లా? డబ్బులెక్కడున్నయ్?మనం చేసే ప్రైవేటు బళ్ళో పంతులుజ్జోగానికి వచ్చేదెంత? మిగిలేదెంత? – ఇంక బండేడ కొంటాం!
అయితే ఈ మజ్జెనెవరో ఒక పిల్ల రోజూ ఫోను చేస్తంది. ఏదో ఒక టైమ్ లో చేసుద్ది. రోజుకొక నంబరు తో చేసుద్ది. దీన్దుంపదెగా! వొద్దన్నా వదిలిపెట్టట్లా.
ఇంతకీ ఏమనుద్దంటే, వాళ్ళ కంపెనీ వాళ్ళు వూరకనే బండిప్పిస్తారంట. నెలకింతని మనం వాయిదాలు కట్టుకుంటే చాలంట. “అయ్యి మాత్రం ఏడ్నుంచి తెచ్చి గడతానే తల్లా?” అంటా నేను. ఇనిపిచ్చుకోదసలు. “సున్నా శాతం వడ్డీ సార్” అంటది. “రాండి, మాట్టాడుకుందాం” అంటది. “అంతా మేమే చూసుకుంటాం” అంటది.
మీ దగ్గర దాచేదేముందిలే గానీ ఒకసారి బూతులు కూడా తిట్టా. “ఏం పన్లేదా ఇట్టా సావనూకుతున్నావ్ నీ…” అని! అయినా ఏం లాభం. మళ్ళీ మామూలే.
అయితే ఇనంగా ఇనంగా నాక్కూడా పురుగు తొలవడం మొదలయ్యింది.
దీనికి తోడు ఆరోజు నాలుగు నిమిషాలు లేటుగా ఎల్లానని మా గుండోడు నానా మాటలనేసరికి “బండే గానుంటే ఇట్టా లేటయ్యే వాణ్ణా” అనిపిచ్చింది.
“తియ్ దీనెబ్బా, ఏవైతే అదయింద”ని కొన్నా బండి. ఆ ఫైనాన్స్ కంపినీ వాళ్ళు ఏడ సంతకం పెట్టమంటే ఆడ కళ్ళు మూసుకుని సంతకం పెట్టా.
“ఇంక తీస్కెళ్ళండి సార్ బండి” అన్నాడు షాపోడు. “తీస్కెళ్తానుండు” అన్చెప్పా.
“ఏడీ, మా సోషలోడు? రింగియ్యంగానే పర్మీషనడిగి వస్తా” అన్నవాడు ఇందాకట్నుంచీ ఫోనూ తియ్యకపోతండే. రానూ రాకపోతండే.
నాకు బండి నడపటం రాదు. నేర్చుకోవాలి. మా సోషలోడు నేర్పుతానన్నాడు. మనోడే. మంచి ముండాకొడుకు. ఇంటి పేర్లు కూడా ఒకటే. వాడి దయిర్నం తోనే కొన్నా. మరేం జేత్తాడో!
“ఏముందిరా, కొంటే రొండ్రోజుల్లో నేర్చుకోవచ్చు” అంటాడే గానీ “నా బండి మీద నేర్చుకొమ్మ”ని మాత్రం మాట వరసగ్గూడా అనడు దొంగ నాయాలు!
అయినా బళ్ళో మేవిద్దరు ముగ్గురం తప్ప అంతా ’వాళ్ళే’! ఒక్కణ్ణి కదిలియ్యటానికి లేదు. వాళ్ళదే రాజ్యం. ఈ సోషలోడితోనే మనకి స్నేహితం. ’వాళ్ళు’ కలవాలనే జూస్తారు గానీ, మనకే నచ్చదోళ్ళ యవ్వారం. ఎక్కడుండాల్సినోళ్ళని అక్కడుంచాల! కాదంటారా?
అడుగో, వచ్చాడు మా వాడు.
“ఏందిరా సోమీ, ఇంతలేటు?”
“ఆ గుండోడు క్లాసయ్యినాక పోదువులే అన్నాడ్రా నాయ్నా నేనేం జేసేది”
“సరే పా.. – తిని మజ్జానం నించీ బడికి రావాలి నేంగూడా. ఒక్క పూటే సెలవు పెట్టింది”
“మరి బండి పూజ? సింగరకొండంటివే?”
“రేపు సెలవేగా. నీకేమైనా పనుందా ఏంది?”
“లేదులే – ఎక్కు, ఎల్దాం”
**
దీనెంకమ్మా. ఈ బండి సావనూకుతుంది. నా వల్ల కాటల్లా దాన్ని తోల్టం. అరే చిన్న పిలకాయలు నడిపేత్తన్నారు, మొన్న ఆ ముళ్ళమూరామెవరో ముగ్గుర్నెనకమాల ఎక్కిచ్చుకోని అద్దంకి సెంటర్లో ఆవలిచ్చినంత తేలిగ్గా పెద్ద బండి నడిపేత్తంటే మన చెంద్రమౌళో ఎవురో ఫుటో తీసి పేపర్లో గోడా ఏశారు.
నాకు సైకిల్ గూడా వొచ్చునే, నాకు రాటల్లేదేందీ ఈ బండి నడపటం?
మా వాడేమో “క్లచ్చి ముయ్ రా క్లచ్చి ముయ్ రా” అంటాడు. “అంతలోనే గేరెయ్ రా గేరెయ్ రా” అంటాడు.
ఒక్కసారి ఒక పని చెయ్టమే మనకి అంతంత మాత్తరమయితే రొండూ ఒకే సారి చెయ్మంటాడేంద్రా సోవే ఈ తప్పుడ్నాబట్ట?” అనుకుంటా నేను.
కిందా మీదా పడతన్నా. నాలుగుసార్లు పడ్డా. దెబ్బలు తగల్లా ఎట్నో.
ఒక నెల కిస్తీ గోడా కట్టా. బడికి మాత్తరం సైకిల్ మీదే, కర్మ!
ఇంక లాబం లేదని నిన్న చిన్నంగా బండి మీదే బయల్దేరా. దారిలో తెలుగోడు అగపడ్డాడు. నడిచే వొస్తుంటాడు బడికి రోజూ. దగ్గరే వాడిల్లు. పేరుకి తెలుగు పంతులు, నల్లగా ఎలుగు లాగుంటాడు. ముక్కశుద్ది తప్ప డొక్క శుద్ది లేదు.
అసలు మా చిన్నప్పుడు తెలుగు చెప్పిన శాస్త్రీ సారు తెలుగు పంతులంటే. చూస్తే చెయ్యెత్తి దణ్ణం పెట్టాలనిపిచ్చేది. పజ్జెం పజ్జేనికీ పిర్ర పగల్నూకేవాడు గదూ నన్ను! ఇప్పుడు పజ్జెం నోరు తిరగనిళ్ళల్లో పుట్టినోళ్ళు కూడా తెలుగుపంతుళ్ళవతండే. అసల్రేపు డియ్యస్సీ పడ్నా, పోస్టులన్నీ ఈల్లకేగా. మనకేడొస్తన్నయ్?
ఒక్కరవ్వ స్లో చేశా. అనుకుంటానే ఉన్నా ఆగుద్దేమో అని. ఆగనే ఆగింది, దీనెబ్బడాలా బండి!
పక్కన తెలుగోడు. వాడి మొహంలో నవ్వేమన్నా ఉందా?
“ఏంది సార్ ఆగిందీ..?”
“ఇహీహీ..ఏందో స్లో అయితే చాలు ఆగుతుందీ…” అంటా స్టాట్ చేశా. ఒక్కరవ ముందుకెల్లి మల్లీ ఆగింది. మల్లీ స్టాట్ చేశా. మల్లీ ఆగింది. చెమట్లు పోస్తన్నయ్.
పక్కన ఆ ఎదవ లేకపోతే బాగుణ్ణు.
పొద్దున బయల్దేరినప్పుడు ఎవురూ ఎదురొచ్చింది? మా అమ్మ గదూ. ఆ బోడి మొకమేసుకుని ఏడకన్నా ఎల్లేటప్పుడు ఎదుర్రామాకవే అని ఎన్ని సార్లు చెప్పానో! ఇని చస్తే గా.
“ఏంది సార్, టైమవతంది స్కూల్ కి. కాస్త పక్కకి రాండి” అంటా వచ్చి నా చేతుల్లోంచి బండి తీసుకుని స్టాట్ చేసి “ఎక్కండి సార్” అన్నాడు తెలుగోడు.
ఎక్కడ కాలాలో అక్కడ కాల్తంది నాకు. ఏం జెయ్యాలిప్పుడు? ముకం వాడి రంగు కంటే నల్లంగా అయిపోయింది. వాడిదేమీ పట్టిచ్చుకున్నట్టులేదు.
ఎక్కి కూచున్నా. వాడు నడిపేప్పుడు కూడా బండి ఆగిపోతే బాగుణ్ణు. దేవ్డా దేవ్డా!
ఆగలా. బండి మీద మండిపోయింది. కోపం కోపంగా ఉంది. నేరుగా తీసుకుపొయ్యి బడి కాడ ఆపాడు.
సోషలోడు నాకల్లి ఎగతాలి గా జూత్తన్నాడా బండి మీంచి దిగుతుంటే?
మా గుండోడు, ఏదో పని మీద బడి కాడకొచ్చిన మా పక్కింటోడు, వరండాలో నిలబడున్న మా తెలుగోడి బ్యాచ్చీ అందరూ ఎగతాలి గా జూత్తన్నారా? పరువు పోయింద్రా నాయ్నా!
అబ్బా! అంతా ఈ బండి మూలంగానేగా!
ఉండ బుద్ధి కాటల్లా బళ్ళో. పరువు – పరువు పోయినాక ఇంకేందసలు?
ఇంటర్వెల్లు!
అరుగో. ఆ చెట్టు కింద కూడారు వాళ్ళంతా. తెలుగోడేదో చెవుతున్నాడు. అందరూ నవ్వుతున్నారు. నా గురించేనా?
ఎల్లి సోషలోడికి బండి తాళాలిచ్చా. “సాయంత్రం వొచ్చేటప్పుడు బండేసుకుని ఇంటికి రా”మని చెప్పి ఇంటికి బయల్దేరా. “రేయ్, ఏంటిది? ఎక్కడికి? నీకు సెలవెక్కడిస్తాడు వాడిప్పుడు?. అడిగితే ఏం జెప్పాలి?” “ఏదో ఒకటి చెప్పు. విరోచనాలవతన్నాయని చెప్పు”
వాడేదో అరుస్తానే ఉన్నాడు వెనకనించీ. వినిపిచ్చుకోకుండా వొచ్చేశా.
**
తిక్క తిక్క గా ఉంది. మందేసుకుని ఫోన్లో నాలుగు బూతు సీన్లు చూసి పడుకున్నా. పరువు పోయిందన్న మంటే రగిలిపోతంది కడుపులో.
ఏకుంజామున నాలుగింటికే మెలుకువొచ్చింది. లేచి బయటికొచ్చా. తలకాయ పగిలిపోతంది. కడుపింకా రగిలిపోతానే ఉంది. ఏందో చప్పుడొచ్చి అటు చూశా. కుక్కలు.
ఒకదానికొకటి లింకేసుకోని ఉన్నాయ్. ఓరి దీనెబ్బా! ఈ కుక్క! ఎట్టా పెంచాను దీన్ని! చిన్నప్పుడు బాపనాయన నడిగి తీసకొచ్చుకున్న కుక్క. తెల్లగా మెరిసిపోతా ముద్దుగా ఉండేది. ఇంట్లో ఏం తింటే అది పెట్టి బయట కాలు పెట్టాల్సిన అవసరం లేకండా పెంచి పెద్ద దాన్ని జేస్తే ఇప్పుడు ఆ అపార్ట్ మెంట్ వాచ్ మన్ గాడి నల్ల కుక్కతో ఇట్టా..మాదిగోళ్ళ కుక్కతో ఇట్టా..
-అడివి తుమ్మ చెట్లు ఇంటి ముంగట కాళీ స్తలమ్మీద పెరుగుతుంటే నరకాలని మొన్న తెచ్చిపెట్టిన కత్తి పంచలో ఉంది. తీసుకున్నా.
ఒకే ఒక్క వేటు!
రెండోది విడిపించుకునే లోపు దాని మీద కూడా అదే దెబ్బ!
లాగి అవతల పడ్నూకా, జాతి తక్కువ ముండల్ని!
పంచలో బండి. ఎంతో ముచ్చట పడి కొనుక్కున్న బండి. ఎన్నో ఖర్చులు తగ్గిచ్చుకోని కిస్తీ లు కడతానికి సిద్దపడి కొనుక్కున్న బండి. వెల్తురు పడి మెరుస్తా ఉంది. రాత్రి నేను నిద్ర పోయేటప్పుడు సోషలోడు తెచ్చి అక్కడ పెట్టిపోయుంటాడు.
ఇప్పుడా బండిని చూసినప్పుడల్లా తెలుగోడు గుర్తొస్తున్నాడు. నవ్వులు గుర్తొస్తున్నాయి. పరువు గుర్తొస్తంది.
సుత్తి ఒకటి తీసుకున్నా. రెంచీలు బండి లోనే ఉన్నయ్. ఇష్టమొచ్చినట్టుగా పార్టులు పార్టులు పీకేసి నలగ్గొట్టేస్తన్నా.
టక్ టక్ మని చప్పుడుకి ముసల్ది బయటకొచ్చింది. ఏదో అరవబోయింది. సప్పుడొచ్చిందంటే సంపుతానన్నా.
నా అవతారం జూసి దడుచుకున్నట్టుంది. లోనకి పరుగెత్తింది.
ఫోను చేసిందేమో సోషలోడు ప్రత్యక్షమయాడు. బిత్తరపోయాడు నా వాలకం చూసి.
“ఏందిరా ఇది? ఆ కుక్కల్ని చంపడమేందీ? ఆ నెత్తురేందీ? – ఈ బండిట్లా చేస్తన్నావేంటి? ఆ ఫైనాన్సోడు కేసు పెడ్తాడు. జైలుకు పోతావ్”
“పరువు పోగొట్టిన ఆ నికృష్టాన్ని కళ్ళెదురుగా చూస్తా ఉండే కంటే జైలుకెళ్టమే నాకిష్టం రా”
***
కధ అయిపోయింది. శిల్పశాస్త్రం ప్రకారం అయితే ఇదిరాసిన నేను ఇంకేం మాట్టాడకూడదిక్కడ. కానీ ఎందుకో శిల్పం మీరదామనిపిస్తుంది. రెండు ముక్కలు మాట్టాడతా, ఏమనుకోమాకండి.
ఎవడ్రా ఈ కధలోని “నేను” అనే వాడు? ఒట్టి మెంటల్ కేస్ లాగా ఉన్నాడు అనిపిస్తుందా? అసలు మనిషే కాదు అనిపిస్తుందా? వాడు కుక్కల ప్రాణం తీయడం చూస్తుంటే జుగుప్సగా ఏమైనా అనిపిస్తుందా?
ఒక టీచరయ్యుండీ వాడి భాష, ఆలోచనలు, చేష్టలు అన్నీ ఇలా ఉండటం అసహజంగా రోతగా జబ్బు జబ్బు గా కనిపిస్తోందా?
మరి కత్తులు పట్టుకుని వార్తల్లోకొస్తున్న తండ్రులు? వాళ్లు ఇంకా రోతగా అనిపించాలే!
“తండ్రిని కూడా అర్ధం చేసుకుందాం” అంటూ వస్తున్న సన్నాయి నొక్కుల్ని షేర్లో ఫార్వార్డ్ లో చేయబోయేముందు ఈ “బండి కధ” ను ఒక సారి గుర్తు చేసుకుంటే మంచిదనుకుంటా.
వస్తువుల పట్లా, కుక్కల పట్లా నే ప్రేమ ఉన్న మీకు మనుషుల పట్ల కూడా ప్రేమ ఉండే ఉంటుంది.
***
అద్భుతమైన కథ. ఇప్పటికి కావలసిన కథ.
సర్, థాంక్యూ…
ఆసక్తికరంగా సాగింది. అయితే సామాజిక హింస అనెది కొన్ని సంకుచిత భావనల నుండే రాదు. దాని వెనుక లాభానికి, పెట్టుబడికి సంబంధించిన విలువలున్నాయి.
సర్, అవును – ఆ సంకుచిత స్వభావాన్ని అలా కాక పితృ / మాతృ ప్రేమగా చూస్తోన్న ఒక సమూహాన్ని “అంతేనంటారా…” అని అనాలని చేసిన ప్రయత్నం…
బాగుంది చాలా
సర్, థాంక్యూ…
చాలా బాగా రాశారు
చదువుతున్న కొద్ది ఆసక్తి గా ఉంది .
సర్, థాంక్యూ…
OK kukkala bathukki manushulaku madya chala nagarikatha sampradayalu acharalu develop ayyayi kada avanni tungalo thokki kukkalla bathukudamantara
కత్తి పట్టుకు నరికిన ఒక తండ్రి తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి చేసానన్నాడు. రెండో తండ్రి విషయానికి వస్తే కథలో లాగా కుక్క లంకె వేసుకున్నప్పుడే చంపేటట్లయితే 9 వ తరగతిలోనే చంపాలి. 150 కోట్లు సంపాదించిన తరువాత పెళ్లయి, రిసెప్షన్ ప్రపంచానికంతటికీ తెలిసేటట్లు వాట్సాప్ లు, యూట్యూబ్ లలో పెట్టి రోజుకో వీడియో వదులుతుంటే అప్పుడు చంపించాడంటే విషయం కేవలం కుక్కలంకె కాదని అర్థం కావాలి. కనీసం మిర్యాలగూడలో కూడా చుట్టుప్రక్కలవారు దీనిని రెండు కుటుంబాల మధ్య రగడగానే చూసారు తప్ప, ఇది కుల హత్య, పరువు హత్య అని అనలేదు. రెండో హత్యకి కారణం కులమేనని, అదొక్కటేనని సూత్రీకరించడంలోనే భావజాల లేమితనం కనబడుతోంది. గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఏ సంఘటన జరిగినా వెంటనే అనేక మాధ్యమాల ద్వారా వెంటనే ప్రపంచానికి తెలుస్తోంది. ఈ ఒక్క సంఘటనలోనే సమస్త కులతత్త్వాన్ని చూసే ప్రయత్నం చేయకుండా ఆ మాధ్యమాల ద్వారా గత ఏడాదిగా, పోనీ, ఆరు నెలలుగా ఇలాంటి హత్యలు (అంటే, తల్లిదండ్రులకు ఇష్టంలేని కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న సందర్భంలో జరిగిన హత్యలు) ఎన్ని జరిగాయో జిల్లా ఎడిషన్ల దగ్గర నుండి మనం గనక పరిశీలిస్తే వాటన్నింటికీ పెట్టని గగ్గోలు, భీకర ప్రచారం దీనిని కేవల కులహత్యగా చిత్రీకరించి, విగ్రహాల స్థాపన దాకా వెళ్లిన రాజకీయం, మీడియో సెన్సేషనలిజం మనకు అర్థమవుతుంది. కుల నిర్మూలన లేదా కులవివక్ష నిర్మూలనకు మార్గం ఇది మాత్రం కాదు. దీనివల్ల మరిన్ని ఘర్షణలు, మరింత సామాజిక విచ్ఛితి పెరుగుతుంది తప్ప మార్పు రాదు. కిరసనాయలమ్ముకునేవాడని రెండో తండ్రి గురించి వ్యాఖ్యనించినప్పుడే ఇక్కడ కులకోణం కాకుండా అనేకం వున్నాయని అర్థంకావాలి.