బాలగోపాల్: కొన్ని జ్ఞాపకాలు!

మిత్రులకు మనవి: బాలగోపాల్ వొక్కడే. ఇంకో బాలగోపాల్ అసాధ్యమే అన్నంత గౌరవాన్ని నిలబెట్టుకున్న ఆలోచనా, ఆచరణ జీవి బాలగోపాల్ గురించి మీ జ్ఞాపకాలు రాసి పంపించండి. బాలగోపాల్ ని తలచుకోవడం ద్వారా ఇప్పటి సామాజిక సందర్భంలోంచి ఎలాంటి ఆచరణ, ఆలోచన అవసరమో మరోసారి గుర్తు చేసుకుందాం. 

బాలగోపాల్ తో నాకు వ్యక్తిగత సాన్నిహిత్యం ప్రత్యేకించి లేదని నేను రాయటానికి కూర్చుంటే అర్ధమయింది. నాకు ఆయనతో రాజకీయ సాన్నిహిత్యం వుంది.

హైద్రాబాదు యూనివర్సిటీ నుండి 1995 లో పౌర హక్కుల సంఘం హైద్రాబాదు యూనిట్ లో చేరినప్పుటి నుండి మానవ హక్కుల వేదికని 2001 చివరిలో వదిలేసే వరకూ ఆయన నేను, నా వంటి యువ కార్యకర్తలు చేపట్టే కార్యక్రమాలకి పూర్తి మద్దతు నిచ్చేవాడు. అన్ని రకాల రాజకీయాలు కొత్తయిన నాకు ఫాక్ట్ ఫైండింగ్ లకి వెళ్ళినప్పుడల్లా ఆయా ప్రదేశాల సాంఘిక రాజకీయాల గురించి, మనుషుల గురించి తనకి తెలిసిందంతా, అంటే కూలంకషంగా, చెప్పేవాడు. ఏ ఊరెళ్తే ఆ కార్యకర్తల మంచి లక్షణాలు, ఉంటే అవలక్షణాలు గురించి చెప్పే వాడు. నా మీద అప్పుడప్పుడు చిన్న జోకులు వేసేవాడు కానీ ఆప్యాయంగా ఉండేవాడు.

హక్కులకు ఉండాల్సిన రాజకీయ దృక్పధం గురించి జరుగుతున్న చర్చలో, నేను, భాగ్య లక్ష్మి, చైతన్య కలిసి స్త్రీల హక్కులపై రాసిన పత్రాన్ని తీవ్ర విమర్శికి గురిచేద్దామని ఇతర కామ్రేడ్లు ఉత్సాహపడినప్పటికీ అయన చర్చని ఒక పద్ధతిలో నడిపించేవాడు. అయన లేనప్పుడు జరిగిన హైద్రాబాదు యూనిట్ చర్చలో నాకు గంటన్నర పాటు పది మంది పురుష కామ్రేడ్లు నాకు ఏడుపొచ్చేటంతగా నా స్త్రీవాద దృక్పధాన్ని ఏక ధాటిగా విమర్శించినప్పుడు అయన మద్దతు వల్లే నేను పాల్గొన్న కొన్ని మీటింగ్లలో నాతో అందరు మర్యాదగా ప్రవర్తించారని నాకర్ధం అయింది.

మానవ హక్కుల వేదిక ఏర్పడిన తరువాత ఒక సారి ఎన్నికలప్పుడు మంథని ప్రాంతానికి ఎలెక్షన్ సర్వే చెయ్యటానికి వెళ్లాం. స్కూటర్ మీద చిక్కటి అడవి మధ్యలో వెళ్తూ అయన ఎక్కడెక్కడ ఎన్ని ఎన్కౌంటర్లలో ఎవరెవర్ని పోలీసులు చంపేసారో తో చెప్పాడు. ఊర్లలో ఆగినప్పుడు టి కోట్ల దగ్గర వాళ్ళతో మాట్లాడుతూ ఆ మాటల్ని – అంటే, పైసలు అస్సలు ఇవ్వలేదు, ఆబ్బె సారా అసలు లేదు – ఎలా డీకోడ్ చెయ్యాలో చెప్పేవాడు. వాళ్ళు ఏ రకంగా డబ్బు, సారా పంపిణీ చేస్తారో వర్ణించే వాడు. కొన్ని చోట్ల చూపించాడు కూడా. అసలు మానవ హక్కుల పని ద్వారా మన సమాజాన్ని ఎంత లోతుగా, విస్తృతంగా అర్ధం చేసుకోవచ్చో ఆయనతో వెళ్లిన ఈ మంథని ట్రిప్ లో నాకు బోధ పడింది. ఆయనతో ఫాక్ట్ ఫైండింగ్ అంటే, అవి ఎంత బాధాకరమైన సంఘటనలు అయినప్పటికీ, ఒక రకంగా వెళ్లాలనిపించటానికి అదే కారణం.

నాకు పబ్లిక్ స్పీకింగ్ అలవాటు ఏ మాత్రం లేకపోయినప్పటికీ మానవ హక్కుల వేదిక కన్వీనర్   గా నన్ను భిన్న విషయాలపైన మీటింగ్స్ లో మాట్లాడమని వాడు. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. అనర్గళంగా బాలగోపాల్ ఉపన్యాసం, ముందో, వెనకో నట్లు కొట్టుకుంటూ తెలుగు, ఇంగ్లీష్ కలిపి నేను. కానీ సరిగ్గా మాట్లాడలేదని ఒక్కసారి కూడా విమర్శించలేదు.

కొత్తవాళ్లతో పెద్దగా పరిచయాలు ఏర్పర్చుకోవటానికి ఏళ్ళు తీసుకునే నాకు ఈ రాజకీయ సాన్నిహిత్యం చాలా విలువయింది. 2009 లో ఆయన చందాల కోసం మా ఆఫీసుకి వచ్చినప్పుడు అదే సాన్నిహిత్యం కాస్సేపు సరదాగా మాట్లాడుకునేటట్లు చేసింది. అప్పటికి నా కవల పిల్లలు కొంచెం పెద్దవటంతో మళ్ళా పని చేద్దామా అనే ఆశ పుట్టింది. నెల లోపలే ఆయన చనిపోవటంతో ఆ అవకాశం పోయింది. కానీ అప్పుడు నేర్చుకున్న రాజకీయ సాన్నిహిత్య విలువని ఇప్పటికీ కాపాడుకుంటూనే వున్నాను.

*

 

సునీత అచ్యుత

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు