కొత్త గూడెంలో బాలోత్సవ్ పాతికేళ్లు నిర్వహించి కొన్ని అనివార్య కారణాల వలన ఆపేశాక మా డాక్టర్ రమేష్ బాబు గారు ఒక రెండు రోజుల కార్య శాలను 2106 నుంచి ప్రారభించారు. కొత్తగూడెం చుట్టుపక్కల ఉండే ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలల పిల్లలకి అక్కడ కథ, కవిత్వం వంటి వాటిమీద ఒక రెండు రోజుల శిక్షణనిస్తారు.చాలా మంది కవులు ,కథా రచయితలు అక్కడ పిల్లలకి శిక్షణ కోసం వెళ్లిన వారే.
అలా వెళ్లి వాళ్ళకి కవిత్వం అంటే ఇది అని ఏదో మాకు తెల్సిన నాలుగు ముక్కలు మేం చెప్పి తెల్లారి మీకు తోచింది రాయండి అంటే వాళ్ళు చాలా కవిత్వాన్ని రాసేవాళ్ళు.అందులో ఒకింత అమాయకత్వం , అమ్మలాంటి నాన్న మీద, నాన్న లాంటి అమ్మమీద ప్రేమ లాంటివి రాసేవాళ్ళు బాగుందని చప్పట్లు కొట్టించి వాళ్లలో రాయాలనే బీజం నాటించి వచ్చేవాళ్ళం. అలా వెళ్లే క్రమంలో 2020 లో జరిగిన సెమినార్ లో మా దృష్టికి వచ్చింది ఈ కవయిత్రి పేరు ” స్పందన” చదువుతున్నది అప్పటికి డిగ్రీ మొదటి ఏడాది. కొత్తగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో.
మొదటి రోజు ఏమి మాట్లాడలేదు చాలా మౌనంగా ఉంది కాని ఒక అంశం ఇచ్చి కవిత రాయమని అడిగితే ఆ అమ్మాయి చాలా గొప్ప కవిత రాసింది. నేను, కవి భగవంతం ఇద్దరం ఈ అమ్మాయి తో కాసేపు మాట్లాడాం. అర్ధం అయింది ఈమె స్వంతగా తన బాధని రాయగలదు అని. అంశం ఏమి లేకుండ నీకు నచ్చిన అంశం మీద కవిత రాయమని అడిగాం అప్పుడు రాసిందే ఈ కవిత .
అద్దంలో నన్ను నేను
తక్కువగా చూసుకుంటా నేను అద్దంలో
ఒకవేళ అందరూ ఉంటే మరీ తక్కువ
కానీ ఒకరోజు
చుట్టూ ఎవరూ లేరు
ఎదురుగా అద్దం నన్ను చూడు అంటుంది
రోజుటిలాగే ఒకసారి చూశా
మళ్ళీ చూశా మళ్ళీ మళ్ళీ చూశా
ఎందుకో తను నేనేనా అనిపించ సాగింది
నాలోనుంచి ఒక కొత్త వ్యక్తి బయటకి వచ్చినట్టు అనిపించింది
బహుశా మరిచిపోయానేమో నన్ను నేనే
కొత్తగా అనిపించింది
కోల్పోయానేమో నన్ను నేను
అలా చాలా సేపు వెతికా నన్ను నేనే
చివరికి అర్ధమైంది
కోల్పోయింది నా రూపాన్ని కాదు
నాలోని ఆత్మ విశ్వాసాన్ని
అందుకే నన్ను నేనే అని నమ్మలేకపోయా
గుర్తించలేకపోయా
ఇక నిర్ణయించుకున్నా
అన్వేషిస్తా నన్ను నేను
ఆవిష్కరిస్తా నన్ను నేను…!
వాస్తవానికి ఆ టీనేజ్ వయసులో ఉండే ఆకర్షణ మరియూ ఇతర ప్రభావాలకి భిన్నంగా స్పందన తన హృదయాన్ని ఆవిష్కరణ చేసుకుంది. తనలో ఉండే లోపాలని లోటుపాట్లను అద్దం ముందు చూసుకుంటా అని రాసుకుంది. చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబం అలాంటి నేపధ్యం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి కవిత్వాన్ని ఆశ్రయిస్తారు. కానీ స్పందన మాత్రం తన ఆలోచన భిన్నంగా ఉండాలని ఆలోచన చేయడం ఆమెలో ఉన్న కవితా దృష్టికి నిదర్శనం.
ఈమధ్య కరోనా కాలం లో ఆమె రాసుకున్న ఒక కవితలో స్త్రీ యొక్క హృదయాన్ని ఆమె కుటుంబానికి చేసే శ్రమని మిగతా ప్రపంచం ఎందుకు గుర్తించదు అని ఒక ప్రశ్న వేస్తుంది. ఆ కవితలో కొన్ని పాదాలు చూడండి. రాస్తున్న వస్తువుపట్ల తనకు ఉండే కన్సర్న్ మనకి చాలా బాగా కనబడుతుంది.
” ప్రశ్నార్ధకంగా ఉన్న ప్రస్తుత జీవితంలో వనిత తాను నలిగిపోతూ
ఎన్నో వంటలు నేర్చి కడుపు నింపింది
తాను నేర్చిన విద్యని నలుగురు కి పంచి
సావిత్రీబాయి పూలే ఆశయాలకిపూల బాట వేసింది
ప్రశస్తమైన తెల్లకోటు ధరించి
ఆపద పొంచి ఉందని తెలిసికూడా
తానో థెరిసా అయి తన సంకల్పానికి ఉన్న సత్తా చూపింది
ఖాకీ చొక్కా ధరించి రహదారులన్ని గస్తీ కాసింది
కాలం మారొచ్చు
జీవన విధానం మారవచ్చు కానీ
మహిళా నీ ఔన్నత్యం చెరగనిది.
ఇందులో చూడండి స్త్రీ పనుల్లో ఉండే కొత్త కోణం కనబడుతుంది.ఆమె ఎవరైతేనేం ఒక స్త్రీ ఆమె ఏమేం చేస్తుంది.కేవలం ఆమె ఇంటి పనికి వంట పనికి మాత్రమే కాదు అని ఆమె సమాజానికి ఉపయోగపడే పనులెన్నో చేయగలదని నిరూపణ చేసింది. చేస్తూనే ఉంది. కిషోర ప్రాయం లో ఇలాంటి ఒక విశాల దృక్పథం ఉండడం సమాజానికి రాబోయే తరాల నుంచి ఒక భరోసా దొరుకుతుంది. యువత నుంచి అందునా ముఖ్యంగా మహిళా యువత నుంచి ఆరోగ్యకరమైన సాహిత్యం చాలా తక్కువ వస్తుంది.స్పందన లాంటి కొత్త రక్తాన్ని మనం జాగ్రతగా ఒడిసి పట్టుకోగలిగితే వాళ్ళు మరింత ముందుకువెళ్లాడానికి అవకాశం ఉంటుంది.
ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇన్ని అంశాలు ఈమెలోకి అని ఆలోచన చేస్తే అది కేవలం ఆమె జీవన దృక్పథం లోనుంచి మాత్రమే తాను రాస్తుందనే అవగాహన మనకి ఏర్పడుతుంది. స్త్రీ ల పట్ల వాళ్లయొక్క హక్కుల పట్ల, వాళ్ళ బాధల పట్ల తనకి ఒక సాధికారిక చూపు ఉన్నట్టు మనకి తాను రాసే ప్రతీ కవితలో కనబడుతుంది. సాహిత్యం చదవడం ఇంకా తాను మొదలు పెట్టనే లేదు. ఇంకా కొంత సాధన చేస్తే చాలా గొప్ప కవిత్వాన్ని మనం స్పందన నుంచి చూడొచ్చు. ఇప్పటికి పుస్తకాలు ఏమి తననుంచి రాలేదు కానీ,త్వరలో మనం తననుంచి ఒక కవితా సంపుటాన్ని కోరుకోవడం మాత్రం తప్పుకాదు.
ఇలా ఈ వయసులో కవిత్వం రాస్తున్న ఏ వర్గపు యువతీ యువకులైనా సరే మనం వాళ్ళని కాస్త భుజం తట్టి వాళ్ళని ముందుకు వెళ్లేలా వాళ్లని నడిపిస్తే మనకి మొనాటని లేని కవిత్వం వస్తుంది. కొత్త తరం ఆలోచనలు ఆశలు తెలుస్తాయి. వర్తమానపు సాంకేతికత వెంటాడుతున్నా దాన్ని తప్పించుకుని కవిత్వపు ఛాయలోకి వచ్చి సేద దీరుతున్న కొత్త వాళ్ళని రూపం, సారం, వస్తువు, శిల్పం అని భయ పెట్టకుండా వాళ్ళని నిర్భయంగా రాయనిస్తే వాళ్లే కింద పడతారు, పైకి లేస్తారు. వాళ్ళదయిన రోజున గొప్ప కవిత్వం రాస్తారు. స్పందన లాంటి యువ స్వరాలని వెలికి తీసే ప్రయత్నమే ఈ శీర్షిక ఉద్దేశం. కొత్త వాళ్ళని చదవండి. మీ ప్రోత్సాహం అందించండి. కొత్త వాక్యం కనబడితే నాలుగు మంచి మాటలు చెప్పండి. నాలుగు పుస్తకాలు కొనివ్వండి వాళ్ళు చిగుర్ల నుంచి కొమ్మలదాక విస్తరించి పూలై వికశిస్తారు.కవిత్వానికి మనం అంతకన్నా చేయవల్సింది ఏముంది కనుక.
వచ్చే పక్షంలో మరో కొత్త కవి తో కలుద్దాం.
*
ఔను. యువకవులను వెన్నుతట్టితే మరిన్ని మంచి కవితలు వస్తాయి
Tq sir,
And very proud of you 👏 🥰 💛 chelli
కొత్తతరం కవులను అన్వేషించి, ప్రోత్సహించడం తప్పని సరి.ఆమధ్య ముప్పై అయిదేళ్ళ లోపు కవులూ కథకులు కోసం సర్వే చేస్తే దిగులు వేసింది.ఓపిక, ఉత్సాహం ఉన్న మీలాంటి వారు కొత్త కవులను కాలేజీలలో వెలికి తీయాలి.అభినందనలు అనిల్ డానీ గారూ.
ధన్యవాదాలు మేడం…
కొత్త వాళ్ళని రూపం, సారం, వస్తువు, శిల్పం అని భయ పెట్టకుండా వాళ్ళని నిర్భయంగా రాయనిస్తే వాళ్లే కింద పడతారు, పైకి లేస్తారు. వాళ్ళదయిన రోజున గొప్ప కవిత్వం రాస్తారు.
యెంత గొప్పగా చెప్పారు సార్.. అందరూ ఇలా ఆలోచిస్తే యెంత బాగుంటుందో.
ఈ శీర్షిక చాలా బాగుంది. 👌👌
కొత్తవాళ్ళకి సంకెళ్లు వేయకూడదు అనేది నా ఉద్దేశం.. కాల ప్రవాహంలో ఏది ఎలాంటి కవిత్వం అన్నది వాళ్లే తెలుసుకోవాలి .లేకపోతే అది కూడా వాళ్ళకి నష్టమే.కానీ ముందే మనం వాళ్ళని తరాజులో వేసి తూచే ప్రయత్నం చేయకూడదు.
చాలా మంచి ప్రయత్నం అనిల్.నేను చాలా సంవత్సరాలుగా మా పాఠశాల విద్యార్థులతో కవిత్వం చదివిస్తున్నాను,రాయించే ప్రయత్నం చేస్తున్నాను కానీ పెద్దగా ఫలితం లేదు.అయితే వారు భావాయుక్తంగా కవితలు చదవడమే పెద్ద ఎచీవ్మెంట్ అనిపిస్తూ ఉంటుంది
మంచివి ఉంటే ఇవ్వండి సార్ ఇక్కడ పరిచయం చేద్దాం
*స్పందన* కు నా ఆశిస్సులు
కొత్త శీర్షిక తో కొత్త తరాన్ని ముందుకు తీసుకొస్తున్న *అనిల్ డ్యానీ* సార్ కి అభినందనలు 💐💐
నిస్సందేహంగా, చక్కటి అభివ్యక్తీకరణ సామర్థ్యం ఉంది – స్పందనకి. ఆమెకి శుభాశీస్సులు, ఆమెను వెన్నుతట్టి, తద్వారా తెలుగు తల్లి తలలో మరో కలికితురాయి కావడానికి కారనమవుతున్న్ మీకు – అభినందనలు, ధన్యవాదాలు.
కొత్త వాళ్ళని రూపం, సారం, వస్తువు, శిల్పం అని భయ పెట్టకుండా వాళ్ళని నిర్భయంగా రాయనిస్తే వాళ్లే కింద పడతారు, పైకి లేస్తారు. వాళ్ళదయిన రోజున గొప్ప కవిత్వం రాస్తారు..నిజం చెప్పారు అనిల్ . కొత్తగా రాస్తున్న వాళ్ళకు సరైన స్వేచ్ఛను ఇవ్వగలిగితే అద్భుతంగా రాసి చూపెడతారు..ఈ ప్రయత్నం చాలా బావుంది గో హెడ్..
స్పందన కవితా హృదయం, మీ విశ్లేషణ, ప్రోత్సాహం అన్నీ బాగున్నాయి. మున్ముందు మరిన్ని కొత్త కలాలను ప్రోత్సహిస్తూ, పరిచయం చేయాలని కోరుతున్నా.