గ్రహచారం బాగోలేనపుడు అన్ని ఇసిత్రాలూ జరగతాయి. ఇడ్డూరం గుడ్డు బెడితే అయ్యవోరమ్మ అట్టు పోసిందట – అని అందికే అంతారు. ఉత్తరాంధ్ర పరిస్తితలగున్నాది. ప్రెతీవోడూ ఉత్తరాంధ్ర పెనమ్మీద అట్టు పోసెత్తండు. పెనం కాంచి సుయ్యి మని సౌండు రావడం సాల్ను…నాదొక అట్టు అని తయారయిపోతండ్రు యెక్కడెక్కడోళ్ళో! ఉత్తరాంధ్ర ఇపుడు కాల్తన్న పెనం! కాల్చుకు తింతున్న మానబావులు తిని తుంగుంతారా? తుంగోరు! తిన్న ఇంటి వాసాలు నెక్కెడతారు. జెండాలు,రంగులూ తేడా తప్పా వాసాలు లెక్కెట్టే వోళ్ళంతా వొక్కటే! వొకడు మీ తరుపున నిలబడి సేవ చేస్తానని వోట్లడుగుతాడు. మరొకడు మీ నేలల కంపెనీలెట్టి మీకు ఉపాధి కలిగిత్తానని భూములడుగుతాడు. ఇంకొకడు ఇంకేదో చేస్తానని యేదేదో ఇమ్మంతాడు. కొసకి మీకోసం విప్లవం చేస్తామని ప్రాణాలడుగుతారు కొందరు. అందరూ ఉత్తరాంధ్రని యేదో ఇమ్మని అడిగినోళ్ళే తప్పా ఉత్తరాంధ్రకి ఇచ్చినోళ్ళు కారు. ఆనాటి అశోకుడి నుండీ ఈనాటి అడ్డమయినోళి దాకా ఉత్తరాంధ్ర నుంచి తీసీసుకున్నోళ్ళే!
వాకపల్లి నుంచి ఉద్దానం దాకా ఆకుపచ్చ కోకల్ని వొలిసిన దుశ్శేసనులే! నీలాల తీరమ్ లోని కారువాకల్ని చెరిసిన చండాశోకులే!! నాగేటి చాళ్ళల్లోని కాంచన సీతలను అంకించుకున్న అయోధ్యరాజులే!!! ఉత్తరాంధ్ర పేరిపుడు ఆక్రమిత!
ఆక్రమితని అవహేళన చేస్తారు. పొట్ట సింపితే అచ్చరం రానిదంటాడు. ఆడు అచ్చరాలతో యాపారం సేస్తాడు! ఆక్రమిత యూనివొర్సిటీని దెయ్యాల కొం పంటాడొకడు. ఆడు విద్యా వ్యాపారం సేస్తాడు! ఆడోళ్ళు జేకట్లేసుకోరటగా… సుట్టలు కాలస్తారటగా…యేటంతావు, అలగలగే…వోసోసే…అని మోటుగా మాటాడతారటగా…అని యెటకరిస్తాడొకడు. కట్టునీ,బొట్టునీ,మాటనీ యేళన సేస్తారు..!
యెక్కడెక్కడి నుండో వొచ్చి ఉత్తరాంధ్ర ఉప్పు దిని బతకతన్నాము, మీము ఉత్తరాంధ్ర వాళ్ళమే, ఆళెవులో లాగా కాదు మేము అనే యెవుళూ ఆ మాటల్ని తప్పు బట్టరు. తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్ట గూడదనరు. ఇనీ,ఇనబడనట్టగ … గాంధీ గారి మూడు కోతుల లెక్క గమ్ముగుంటారు.ఉత్తరాంధ్రేతరులు గదా – ఆళ్ళకి ‘కమ్మ’గ ఉంతాయి యెటకారాలు!
ఇక్కడొక యూనివొర్సిటీ ఉంతాది. దాని పాలకులెపుడూ ఉత్తరాంధ్రేతరులే! ఆళ కళ్ళకి ఇక్కడి కళాకారులు,కవులు కనబడరు. యెదికెదికి యెక్కడెక్కడోళికో డాక్టరేట్లు ఇస్తారు. ఇక్కడోళు…దేశ,విదేశాల క్రీడల పోటీల్ల గెలిచి బంగారపు కప్పులు తెచ్చినా…అవి పనికిరాని చిప్పల కింద లెక్క! కైలాసగిరి మీద తెలుగు మ్యూజియం కోట్ల రూపాయల కర్సుతోటి కడతారు. యెక్కడివోడో, యే సామాజిక వర్గం వాడో మ్యూజియమ్ ల ఉంటాడు .ఉత్తరాంధ్రుడు ఒక్కడుండడు. ఉత్తరాంధ్రుడెవుడూ చరిత్ర ప్రసిధ్ధుడు కాడన్న గోరోజినం కాదా?
విజీనగరం ల గురజాడని యేటా కొలుస్తారు..! కతలూ,కయితలూ రాసి అభ్యుదయానికి అడుగుజాడ యేసిన గురజాడ అవార్డులేమో పాటగాళ్ళకీ, సినిమా వేషగాళ్ళకీ ,పుక్కిటి పురాణాల్ని ప్రవర చెప్పే ప్రబుధ్ధులుకీ ఇస్తారు. మతము లన్నియు మాసిపోవును ,గ్యానమొక్కటి నిలిచి వెలుగునన్న మానభావుడి సంస్మరణ రోజు మతాల్లోని గ్యానాన్ని మైకుల్లోమ్చి గోస బెట్టిస్తారు… గురజాడ బతికుంతే ఉరేసుకు సవ్వాల! సిక్కోలు సంబరాలని సేస్తారు…సిక్కోలు జానపదుల ఆటపాటలకి సోటుండదు. జముకుల పాట, కోలాటం,తప్పేటగుళ్ళు…కళాకారుల్ని జెబర్దస్త్ టీం దబాయిస్తాది. నాజూకు నాట్యాల స్వాతి ముత్యాలు సందడి సందడి చేస్తారు. సంబరాలు సంపన్నులవీ…పేరు సిక్కోలుదీ!
యేమనగూడదు…ఇది వివక్ష అనగూడదు. ఈ వెతలు రాయగూడదు.ఈ కతలు సెప్పగూడదు. యేడుపు గొట్టు రాతలంటారు. యేడుపులో శిల్పం లేదంటారు. మోటు బతుకులుకి, మోటు మాటల మనుషులుకి సంస్క్రుతి తెలీదంటారు. ఆడు చికాగోలో బతికినా, సిక్కోలులో బతికినా ‘నున్న’ నయిన బతుకులు బతికీవోళికి సనసన్నని స్వరాలే సమ్మగా ఉంతాయి. ఆకలి కేకలు సీకాకెడతాయి.
సంపదలు నొక్కీసారు, సంస్క్రుతినీ నొక్కేస్తన్నారు…ఉత్తరాంధ్ర ఉసురు పోసుకుంతన్నారు.
సచ్చిపోయినోడు, బతికున్నోడు.. యెవుడెవుడో – రాత్రికి రాత్రి విశాఖపట్నం బీచ్ వొడ్డున విగ్రహమై వెలిగిపోతుంటాడు. ఆడు విశాఖకో, ఉత్తరాంధ్రకో చేసిన సేవ యేటో, ఉపకారమేటో యెవుడికీ తెల్దు! సినిమాలు తీసినోడు, సినిమాలల్ల నటించినోడు, యాపారాలు సేసి యారాడకొండ లాగా దిట్టంగా బతికినోడు…మా ముందర విగ్రహంగా నిలబడతాడు. దండలు యేయించుకుంతాడు. బీచ్ బీచంతా యేవుడెవుడో ఆక్రమించీసాడు. ఆకరికి కారు యాక్సిడెంటుల యెక్కడో సచ్చినోడు గూడా ఇక్కడ మా బీచ్ ల విగ్రహం గా నిలబడతాడు…దండలు యెయ్యండిరా – అనంటాడు. బతికున్నపుడు మా నేలని, మా సంపదల్ని ఆక్రమించినోళ్ళు…సచ్చీ విగ్రహాలుగా ఆక్రమించుతన్నారు…ఇదేగదా ఇసిత్రం గుడ్డెట్టడము- అమ్మోరు అట్టు పోయడం!
నిగ్రహం యెవుళికయినా కొన్నాళ్ళే! అది కోల్పోతే…విగ్రహాలు కూలిపోతాయని ఉత్తరాంధ్ర లోకానికి తెలియజేసే రోజు అద్గద్గో…అదిగో!
*
Enjoyed reading the story. బహు చాతుర్యముగా మలిచారు శిల్పాన్ని. వస్తువు సంగతి అసలు చెప్పనే అక్కరలెదు. శానా పదునుగుండాది. శైలి గూడ ఉత్తరాంద్ర యాస! సక్కని పెయత్నం.
ఇంకా ఎన్ని వందల ఏళ్ల నిగ్రహం మీలో మిగిలివుంది అట్టాడ అప్పల్నాయుడు గారూ? అరిషడ్వర్గాలు అందరిలోనూ సమానంగానే వుంటాయి. భావోద్వేగాలను ప్రకోపింపజేయడం కన్నా ముందుగా వ్యక్తిగత స్థాయిలో మార్పును తెచ్చుకోగలిిగితే, తేగలిగితే స్థిరమైన, నిలకడైన విముక్తి సాధ్యమవుతుందని నా అభిప్రాయం. మీ రచనలు ఎంతమంది ఉత్తరాంధ్ర సామాన్యులకు చేరతాయో నాకు తెలియదుగానీ చేరినవారైనా ఆలోచన మొదలుపెట్టినట్లు, ఆచరణకు పూనుకున్నట్లు మీరెన్ని ఫలితాలు చూసారో తెలుసుకోవాలని వుంది. కొమ్ములు తిరిగిన సామ్యవాద భావజాల అనుయాయులు ఎక్కువగా వున్న, భావజాలాన్ని అన్వయించుకున్న ఎడమ, ఎడమాతి ఎడమ విద్యావంతుల సంఘాలైన ఉపాధ్యాయ వర్గాలలోనే ఏ విధమైన అవగాహన ప్రబలిందో, వారి జీవన శైలి ఏ విధంగా మారిందో, మారి, ఇంకా ఎట్లా వృద్ధిచెందుతోందో ఇదే సారంగ పత్రికలో మీ, మన ఉత్తరాంధ్ర రచయిత శ్రీ బమ్మిడి జగదీశ్వరరావు తన ‘మాస్టారూ, పేకేసుకుందామా’ అనే తన కథలో అద్భుతంగా చిత్రీకరించారు. అలా వ్రాసారని ఆయన పైన భీభత్సమైన వ్యాఖ్యా దాడి జరిగింది. మరి, అంత విద్యావంతులు, వివేచనపరులకే స్వీయ విమర్శ సూచన రుచించలేదంటే, పొట్టకూటికో, లేక మధ్యతరగతి జీవనాన్ని నిలబెట్టుకోడానికో ఆరుగాలం కష్టపడుతున్న సామాన్యులకు మీ హితవు ఎలా రుచిస్తుందంటారు? వ్యక్తిగత స్థాయిలో స్వార్థం, దురాశ, లేదా మామూలు ఆశలు తగ్గించుకునే నైతిక పరమైన విద్య గరపనంతకాలం, లేదా ఆ దిశలో మన ప్రయత్నాలు సాగనంతకాలం ఈ రచనల ప్రాసంగికత, ఫలితం వుంటుందంటారా? కష్టపడినవారికి వారి కష్టానికి తగిన ప్రతిఫలం ముట్టాలి అన్న ఒకే ఒక లక్ష్యమే అంతిమం. అయితే, అది మాత్రమే చాలుతుందా? ఇంకా కొంత వ్రాయాల్సింది వుంది. ఆలోచనలు ఒక స్థిరమైన రూపం తీసుకున్న తరువాత మీకు కూడా ఆసక్తి వుంటే వ్రాస్తాను.
మీ స్పందన కు ధన్యవాదాలు
ఉత్తరాంధ్ర అస్థిత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ
అన్నా, శానా బాగుండాది. నిజాలను నిగ్గుదేల్చి వీళ్లకి బుద్ది చెప్పాలి. పూర్వం బానిసలకి సంకెళ్లు బహిరంగంగా కనిపిస్తండ్య , ఇప్పుటి నయా బానిసత్వ సంకెళ్లు నెత్తురులోనే ఉన్నాయి. అవి కన్పించవు, వినిపించవు . కాని వానికి ఏంకావాలో అది చేసిపెడుతున్నాయి, నిశ్శబ్దంగా. మన రూపేణ మనలో దాగిన వాన్ని తరిమి తరిమి కొట్టాలి. అప్పడే మన గడ్డకు దక్కాల్సిన న్యాయమైన హక్కులు దక్కేది..
ధన్యవాదాలు శ్రీకాంత్
Dear sir ….. this is the second story in this edition directly or indirectly target KAMMA … community …. what wrong we did sir …
i think progressing in general as a community (may be more people are in upward mobility visibly ), where as other people who achieved upward mobility are seen as individuals are the problem i think, the writer could not spot the difference and expressed his jealousy in this form on entire community .
అశోకుడి నుండీ ఈనాటి అడ్డమయినోళి దాకా ఉత్తరాంధ్ర నుంచి తీసీసుకున్నోళ్ళే నా కళింగవీరుడా ? ఉత్తరాంధ్ర నిగ్రహం కోల్పోతే యేటి జరుగుద్దో నోకానికంతా చెప్పాల. అంతకుముందు సెప్పాల్సినోళ్లకు కూడా సెప్పాల.
” ఉత్తరాంధ్రుల జీవితాలు తారుమారయ్యాయి, గిరిపుత్రులు, భూమిపుత్రులు, గంగపుత్రులు జీవిస్తున్న ఈ నేల ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొందింది. నేడు ఆ ఛాయలు కానరావడం లేదు.
“రైతులు ఉన్నారు కాని పంట భూములు లేవు.” “మత్స్యకారులు ఉన్నారు అయిన సముద్రంపై వేట లేదు.” “గిరిపుత్రులు ఉన్నారు కాని గిరులపై హక్కు లేదు.” ఇలా ఏమి లేకుండా ఉత్తరాంధ్ర సగటు జీవి చిక్కి శల్యమయ్యాడు. పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మలేక పొట్ట చేతపట్టుకుని రాష్ట్రం, దేశం ఎల్లలు దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నాడు. రాష్ట్రంలోనే కాదు దేశంలో మరెక్కడా లేన్నని వలసలు ఉత్తరాంధ్రలో కనిపిస్తాయి.
విద్య, వైద్యం, సేథ్యం, పరిశ్రమలు, ఉపాధి ఇలా అన్ని అంశాలలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతూనే ఉంది. “
avunu…raamayya gaaru…mee maaTalu nijam