ఇగురంగల్ల మనిషి ‘భూలచ్చుమమ్మ’

చచ్చినంక సమాధి మీద బర్రెను కట్టేస్తే ఏం లాభం. బతికుండగానే వాళ్ళను మంచిగ చూసుకోవాలని హితబోధ చేసే కథ ఇది.

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలైపోయాక డబ్బుకు విలువ పెరిగి మనిషి విలువ పడిపోయింది కానీ ఒకప్పుడు మనుషులెంతో విలువలతో కూడిన జీవితం జీవించే వారు. కుటుంబం కోసం, పిల్లల అభివృద్ధికోసం తల్లిదండ్రులు చివరి క్షణందాకా ఎంతో తాపత్రయపడేవారు.  పిల్లల ఆనందంలోనే తమ ఆనందాన్ని వెతుక్కునేవారు. జీవిత సర్వస్వాన్ని కుటుంబం కోసమే ధార పోసిన తల్లిదండ్రుల్ని ఇంకా చావడం లేదని పాలు తాగి రొమ్ము గుద్దినట్టు, ఏరు దాటి తెప్ప తగిలేసినట్టు బతికుండగానే బజారులో, బస్టాండులో, ఆఖరికి స్మశానంలో కూడా  వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు.  జీవితాంతం కష్టపడి ఆస్తులు, అంతస్థులు సమకూర్చి పెట్టినా అవసాన దశలో ఇన్ని గంజి నీళ్ళు పోసే దిక్కులేక, జీవునం వదలలేక కళ్ళల్లో నీళ్ళు ఉబుకుతుంటే బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూసే ముదుసలి ప్రాణాలు కోకొల్లలు. అలాంటి దిక్కు లేని ఒక తల్లి కథ, పిల్లల ఆదరణ దక్కక తల్లడిల్లి పోయిన ఒక స్త్రీమూర్తి కథ ‘భూలచ్చుమమ్మ’.

భూలచ్చుమమ్మ

జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి లెక్క ఉండే భూలచ్చుమమ్మకు పద్నాలుగేళ్లకే పెళ్ళైంది. ఇప్పుడు డెబ్బై ఏండ్లు. ఆమె పెనిమిటి నర్సయ్య ఉత్త అమాయకుడు. అందుకే ఇంటి పెత్తనమంతా భూలచ్చుమమ్మదే. భూలచ్చుమమ్మకు అయిదుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. పిల్లలంటే ప్రాణం. తాను తినకున్నా పిల్లల కడుపు నింపేది. పిల్లలు పెద్దగైతుండ్రు వాల్లకింత బతుకుదెరువు చూపించాలె అని ఎన్నో కష్టాలను, అవమానాలను ఓర్చుకొని 24 ఎకరాల భూమి సంపాదించింది. సంసారం నిలదొక్కుకుంది. కొడుకులందరికి పెళ్లిళ్లు చేసింది. అందరికీ సర్కారు నౌకర్లు దొరికినై.  బిడ్డకు కూడా ఘనంగా పెళ్లి చేసింది. ఉమ్మడి సంసారంల కోడండ్ల మధ్య లొల్లులు షురూవయ్యేసరికి లాభం లేదని తలా నాలుగెకరాలు భూమి ఇచ్చి ఏరు పోసింది. తమ ఇద్దరాలుమొగలు మిగిలిన భూమిని కౌలుకిచ్చుకొని వచ్చిన దానితో బతుకెల్లదీస్తుండ్రు. ఇట్లా రోజులు మంచిగనే జరుగుతున్నై అనుకునేటాల్లకు భూలచ్చుమమ్మకు కిడ్నీలు ఖరాబయి మూత్రం బందైంది. ఆపరేషన్ చేయాలన్నారు.

కొడుకులని అడుగుతే ఎవ్వడు సప్పుడు జెయ్యలేదు. తమ వంతుకొచ్చిన భూమినన్నా అమ్మి ఆపరేషన్ చేయించుకుందామంటే కొడుకులు అడ్డం తిరిగిండ్రు. రియలెస్టేట్ భూమ్ బాగా ఉంది. వచ్చే సంవత్సరం అమ్మితే కోట్లు కురుస్తయి ఆగుదాం అన్నారు. వచ్చే సంవత్సరందాకా ముసలిది బతుకది కదా అన్నరు ఊళ్ళె పెద్ద మనుషులు. కోడండ్లు గయ్యిన లేచి “సత్తె సావనియ్ తియ్. ఆ మాయదారి రోగం మేం తెచ్చుకోమన్నమా  ఇప్పుడామె బతికి రాజ్యాలు గెలిచేదున్నదా? రాజ్యాలు ఏలేదున్నదా?” అని తీసి పారేశిండ్రు. కోపం ఆపుకోలేక కొడుకుల మీద, కోడండ్ల మీద దుమ్మెత్తి పోసింది భూలచ్చుమమ్మ. ఆ రాత్రి నిద్ర పడుతలేదు భూలచ్చుమమ్మకు. కోడండ్లు అన్న మాటలే మనసుల తిరుగుతున్నై. కన్ను తడి ఆరకుంట ఏడ్చింది. తెల్లారేటాల్లకు ఏమైందో భూలచ్చుమమ్మ ఏం నిర్ణయం తీసుకుందో తెలుసుకోవాలంటే మనమంతా  భూలచ్చుమమ్మ ఊరుకు పోవాలె. ఆమె ఇంటికి పోవాలె…

మూడు దశాబ్దాల తెలంగాణ చరిత్రను, మానవ సంబంధాల వైచిత్రిని కళ్ళకు కట్టిన కథ ఇది. మన వేలే  మన కన్నును పొడిచినట్టు, కన్న పేగే తల్లిని కాదంటే ఆ పిచ్చితల్లి ఎంత తల్లడిల్లి పోయిందో, ఎంత మదన పడిందో రచయిత ప్రతి అక్షరంలో చూపెట్టాడు. భూలచ్చుమమ్మ పాత్ర సృష్టిలోనే రచయిత కథా విజయం సాధించారు. కథలో  భూలచ్చుమమ్మను పాఠకుల ముందు ఆవిష్కరించిన తీరు అద్భుతం.  కథా వస్తువు సాధారణమైందే కానీ సన్నివేశ కల్పన, కథను స్వచ్చమైన తెలంగాణ తెలుగు భాషలో చెప్పడం, సరళ శిల్పంలో కథను నడిపిచడం కథకు మరింత  బలాన్ని చేకూర్చి పెట్టింది. తెలంగాణలోని ఏ పల్లెకు పోయినా భూలచ్చుమమ్మలు చాలా మంది కనిపిస్తారు. జీవితంలో దగా పడడం మామూలే కాని కన్న కొడుకుల చేతిలో మోసపోవడమే  భూలచ్చుమమ్మకు మింగుడు పడని విషయం. ఏరి కోరి తెచ్చుకున్న కోడండ్లు కూడా అత్త కంటే ఆస్తే ముఖ్యమైందని నిరూపించారు. మానవత్వం లేని మనుషులుగా మిగిలిపోయారు.

భూలచ్చుమమ్మది మాయా మర్మం తెలియని స్వభావం. కష్టాలకు ఎదురీది కుటుంబం కోసం, పిల్లల వృద్ధి కోసం ఆరాటపడి, పోరాడే మనస్తత్వం. ఆమె తల్లి మనసు గొప్పది. పిల్లలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా ఓర్చుకోదు. చదువుకోకున్నా, ఉద్యోగాలు చేసి, రాజ్యాలు ఏలకున్నా ఆమెది విశాలమైన మనసు. వ్యవసాయాన్ని నమ్ముకొని ఇంటిని నిలబెట్టింది. కొడుకులు చదువుకుంటేనే బాగుపడతారనే ముందు చూపుతో చదివించి, ఉద్యోగాలు చేసేలా ప్రోత్సహించింది. కొడుకుల మధ్య మనస్పర్ధలు వస్తే వెంటనే పరిష్కారం ఆలోచించి వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా జరిగేలా నిర్ణయం తీసుకుంది.

తల్లిదండ్రులు చచ్చినంక సమాధి మీద బర్రెను కట్టేస్తే ఏం లాభం. బతికుండగానే వాళ్ళను మంచిగ చూసుకోవాలని హితబోధ చేసే కథ ఇది.  ఆస్తులు అమ్మడానికి వారసుల సమ్మతి అవసరమని చెప్పే చట్టం, అదే వారసులు అవసానదశలో తల్లిదండ్రుల్ని సాకక పోతే శిక్షించే చట్టాలు రావాలని అన్యాపదేశంగా చెప్పే కథ. కోర్టులు అప్పుడప్పుడు తమ తలుపులు తట్టిన కేసుల్లో మానవత్వంతో తీర్పులు చెప్తున్నా నిర్దిష్టమైన చట్టాలు లేక పోవడం గమనార్హం. ఇంటి నుండి తల్లి నేర్పిన భాషను తరిమేస్తున్నట్టే, తల్లిదండ్రుల్ని కూడా తరిమెసే తరాలను చూస్తున్నాం.

కథ సాంతం చదివేశాక మన మనసు వెన్నలా కరిగిపోతుంది. భూలచ్చుమమ్మ తరపున మనం కూడా వకాల్తా పుచ్చుకొని వాదిస్తాము. భూలచ్చుమమ్మ కొడుకులను, కోడండ్లను బయటకు గుంజి నిలదీస్తాము. కేవలం రెండున్నర పేజీల కథలోనే కథకుడు జీవితంలోని అన్నీ సంఘర్షణలను చెప్పి సంక్షిప్తత అనే కథా సూత్రాన్ని పాటించాడు. కథలో లేవెనెత్తిన సమస్య మానవ జాతి ఉన్నన్ని నాళ్ళు వెంటాడే సమస్య. తక్షణమే పరిష్కారం వెతకాల్సిన సమస్య. ఇలాంటి ఒక సజీవ సమస్యను మానవీయ కోణంలో కథీకరించిన కథకుడు సినీ గేయ రచయిత డా. కందికొండ.

‘మళ్ళీ కూయవే గువ్వా..  మోగిన అందెల మువ్వ..’, ‘మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా..’, ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..’ లాంటి సుమారు 1000 పాపులర్ సినీ గేయాలను రాసి ప్రసిద్ధులైన డా. కందికొండ అప్పుడప్పుడు కథలు కూడా రాస్తుంటారు. ఇప్పటి దాకా దాదాపు పది కథలు రాశారు. అవన్నీ ఒక సంపుటిగా వెలువడాల్సి ఉన్నది. ‘తెలుగు సినిమా సన్నివేశ గీతాలు’ అనే అంశం పై పిహెచ్. డి. చేసిన డా. కందికొండ ‘తెలంగాణ సినీ గేయ కవుల పుట్టుక’, ‘తెలుగు సినిమా అభ్యుదయ గీతాలు’, ‘జాషువా సాహిత్యం – సామాజిక విప్లవం’, లాంటి అనేక విలువైన పుస్తకాలు, రీసెర్చ్ ఆర్టికల్స్ రాశారు. ప్రస్తుతం యోగి వేమన విశ్వ విద్యాలయం, ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్ మెంట్ లో BoS మెంబర్ గా, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ లో EC మెంబర్ గా ఉన్నారు. ఎంతో మంది తెలుగు అగ్ర కథానాయకులతో కలిసి పని చేసిన డా. కందికొండ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండగల పైన చాలా గొప్ప, ప్రజాదరణ పొందిన పాటల్ని రాశారు. అవన్నీ యూ ట్యూబ్ లో, సోషల్ మీడియాలో కొన్ని లక్షల వ్యూస్ తో చక్కర్లు కొడుతున్నాయి. వీరి సినీ, సాహిత్య కృషికి గాను పలు అవార్డులు, సత్కారాలు పొందారు. ఈ ‘భూలచ్చుమమ్మ‘ కథ మొదటి సారి నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’లో 25 సెప్టెంబర్ 2016లో ప్రచురింపబడింది.

            *

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

20 comments

Leave a Reply to Dr P Shivakumar Singh Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంది అమ్మల దయనీయ గాథ ఈ కథ. పల్లెటూర్లలో దాదాపు అన్ని ఇండ్లల్లో తరతరాలనుండీ ఇప్పటికీ జరుగుతున్నదే. నేటి కోడళ్ళందరూ రేపటి భూలచ్చుమమ్మలే. కాని వారు తమ రేపటి పరిస్థితిని ఇప్పుడు గ్రహించరు. ఈ భూలచ్చుమమ్మల పరిస్థితి ఎలా మారుతుందో, ఎప్పుడు మారుతుందో , అసలు మారుతుందో లేదో….‌.‌‌…..????
    మనసుల్ని అతలాకుతలం చేసి ఆలోచింపజేసింది ఈ అద్భుత కథను రాసిన రచయిత శ్రీ కందికొండ గారికి అభినందనలు. అలాగే తనదైన శైలిలో విశ్లేషించి మనకందించిన శ్రీ శ్రీధర్ గారికి అభినందనలతోపాటు అదనంగా ధన్యవాదాలు.‌

    • గంగుల నర్సింహారెడ్డి గారి స్పందనకు ధన్యవాదాలు

  • డా. వెల్డoడి శ్రీదర్ అన్న కు హృదయపూర్వక కృతజ్ఞతలు
    బూలచ్చుమమ్మ కథ లోని ఆత్మను గొప్పగా ఆవిష్కరించారు
    నేను మా వరంగల్ జిల్లాలో అనేక గ్రామాలు తిరుగుతున్న సందర్భంలో మా గ్రామం నాగుర్లపల్లి లో అనేక మంది ముసలి తల్లుల నిస్సాహయ స్థితిని చూసి వారి మాటల ద్వారా వారి వారి ఆవేదనను విని కదిలిపోయి కన్నీళ్లతో రాసిన కథ ఇది.
    ఇది వందలాది బూలచ్చుమమ్మల కథ ఈ కథ పై వ్యాసానికి అవకాశం ఇచ్చిన సారంగ యాజమాన్యానికి ధన్యవాదాలు నా తొలి కథ “ఏం జేత్తదో ఎవలకెఱుక” ను ప్రచురించి నన్ను ప్రోత్సాహించిన సారంగ బాద్యులకు మరొక్కసారి కృతజ్ఞతలు
    అప్సరన్నకు ప్రత్యేక శేణార్ధులు…

  • సీధర్ బాయ్…చాలా బాగుంది…. కథను అద్భుతమైన రీతిలో రాసిన కందికొండ కు అభినందనలు

    • కోడం అన్న స్పందనకు ధన్యవాదాలు

  • Oka goppa katha nijamga jariginde…..jarugutunnadhe prati okkari chadavalsinadhe..sreeder visleshana adbutam katha saranni aasaktikaramga telpadam. Katha goppatam telsindhi. Sandesatmaka vivaranalu…congrats sreeder

  • హృదయమైన ఈ కథ చదివాక నా అభిప్రాయానికి, మంచి అనే పదానికి మించి మాటలు వెతకాల్సి ఉంది.

    కథ బాగుంది అంటే సరిపోదేమో.

    కథలో ఉంది అచ్చమైన తెలంగాణ పల్లె బతుకు. ఈ కథలో ఉన్న భూలచ్చుమమ్మ పాత్ర తెలంగాణ ప్రతి పల్లె ప్రతి గడపలో ఉంటుంది.

    కథలో అమ్మ నోరు కట్టుకొని కొంగులో దాచుకున్న ప్రసాదమే కాక యావదాస్తి బిడ్డలకు ఇచ్చి, వారి ఎదుగుదలకు శక్తి మొత్తం దారబోసి కొవ్వొత్తిలా కరిగిపోతుంది.

    వృద్ధిలోకి వచ్చిన బిడ్డలు పెళ్లిళ్లు అయ్యాక చివరికి కన్న తల్లిపై ప్రేమకు బదులుగా స్వార్ధాన్ని చూపుతారు. బిడ్డల నిరాధరణ, అనారోగ్య కారణాలు, సొంత కష్టార్జితమయిన భూమిని అమ్ముకోలేని నిస్సహాయతలో ఊపిరి తీసుకున్న భూలచ్చుమమ్మ తన జీవితంను అర్ధాంతరంగా బలవంతంగా ముగిస్తుంది.
    ఇది సమాజంలోని కొడుకులందరికీ
    గుణపాఠం. సమాజానికి కనువిప్పు.

    విశాదాంతం కథ అయినప్పటికి కథలో ఉన్న బరువైన నేపథ్యం మనసును కరిగిస్తుంది.

    ఈ కథ చదువుతున్నప్పుడు చిన్నప్పుడు మాఅమ్మ నా కోసం తినకుండా దాచి తెచ్చిన ప్రసాదం గుర్తుకు వచ్చింది.

    కథలో తెలంగాణ భాష వాడకం నేటివిటీని పట్టించడంలో తోడ్పడింది.

    కథలో వాస్తవికత, సహజమైన గ్రామీణ సౌందర్యాన్ని రచయిత కళ్ళకు కట్టారు. ఇంతటి హృద్యమైన కథలను సారంగ పత్రిక లో తిరిగి చదివే అవకాశం కలిగించడం అభినందనీయం.

    రచయిత కందికొండ కథలోని పరిమిత పాత్రలలో గ్రామీణ భాష సౌందర్యాన్ని, సాధారణ కుటుంబాలలో పిల్లల అభివృద్ధి కోసం కోసం తల్లిదండ్రులు పడే తపన మరియు ఎదిగిన తర్వాత పిల్లల నిరాదరణ కళ్లకు కట్టారు.

    విమర్శకులు డాక్టర్ వెల్దండి శ్రీధర్ కథలోని పలు పార్శ్వాలను సరిగ్గా అర్థం చేసుకొని, చట్టంలోని లోపాలను రచయిత పాత్రల ద్వారా ఎత్తిచూపిన విషయాన్ని బయోస్కోప్ లో స్పష్టంగా చూపారు.

    విమర్శకులు శ్రీధర్ గారు… కథలో ముఖ్యంశం
    “ఆస్తులు అమ్మడానికి వారసుల సమ్మతి అవసరమని చెప్పే చట్టం, అదే వారసులు అవసానదశలో తల్లిదండ్రుల్ని సాకక పోతే శిక్షించే చట్టాలు రావాలని అన్యాపదేశంగా చెప్పే కథ.” అని క్లుప్తంగా కథ యొక్క ఆత్మను ఆవిష్కరించారు. విమర్శకులకు కూడా హృదయపూర్వక అభినందనలు.

    👏👏👏

    • శీలం వీర1భద్రయ్య గారు చాలా గొప్ప స్పందన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

    • శీలం భద్రయ్య గారు చాలా గొప్ప స్పందన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

      • డా. పి. శివకుమార్ గారి స్పందనకు వందనాలు

      • నిజంగా మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలైయిపోయాయి. తన కొరకే తరిగి పోయిన తల్లిదండ్రులను కొందరు మూర్ఖులు (కొడుకులు) గుర్తించక రోడ్డుమీద వదిలి పోయేవారు చాలామంది ఉన్నారు…
        రచయిత కందికొండ గారి కలం నుండి జాలువారిన భూలచ్చుమమ్మ కథ వాస్తవికతను ఆవిష్కరించింది. వారికి ప్రత్యేకమైన అభినందనలు.
        అలాగే క్లుప్తమైన కథా విశ్లేషణ చేసిన వెల్దండి శ్రీధర్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు.

  • మానవ సంబంధా లు ,వాటిపై ఆస్తి ప్రభావం,వ్యక్తిత్వం గల భూ ల వంటి వారు ప్రతి చోట క నిపిస్తరు.దానిని కందికొండ అద్భుతంగా కథ రూపంలో చెప్పిన తీరుని అందరికీ అర్థమయ్యే విధంగా మీ విశ్లేషణ…చాలా బాగుంది సర్

  • డా. కందికొండ కలం చిత్రించిన భూలచ్చుమమ్మ చిత్రం అంతర్లీన సౌందర్యాన్ని నాలాంటి సాధారణ పాఠకునికై బహిర్గత పరిచే విధంగా సాగిన డా. వెల్లడి విశ్లేషణ అభినందనీయం… అయితే, మానవ జాతి ఉన్నన్ని నాళ్ళు వెంటాడే సమస్య. తక్షణమే పరిష్కరించాల్సిన సమస్య. పరస్పర విరుద్ధ భావాలు…

    • జి. రంగనాధ గారికి ధన్యవాదాలు…

  • డా, కందికొండ కలం నుండి జాలు వారిన కథ హృదయాన్ని కదిలించింది……

    మీ…..
    డా. పి. శివకుమార్ సింగ్
    వృక్ష శాస్త్ర అధ్యాపకులు, తెలంగాణ కవి….
    పాలమూరు విశ్వవిద్యాలయము

  • భూలచ్చుమమ్మా కథ బాగుంది. కానీ కొంచెం నిరాశ కలిగించింది. ఆమె చావు బాధ కలిగించింది. చాలా మంది తలిదండ్రుల ఘోష మాత్రం కనిపించింది ప్రస్తుత సమాజం స్థితి ని తెలియజేసింది ఈ కథ . శ్రీధర్ గారి విశ్లేషణ కూడా బాగుంది.

  • పరుచూరి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు
    బూలచ్చుమామ్మ మరణం నిరాశ కలిగించిన
    రోజు జరుగుతున్న నిజం అదే కదండీ

  • శ్రీధర్ వెల్డండి గారు పరిచయం చేసిన డా కందికొండ గారి కధ బూలచుమమ్మ కూడా చాలా ఆర్ద్రంగా ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు