మూలం: కె సచ్చిదానందన్
లేదు.
ఇంద్రప్రస్థం లో ఏమీ మిగలదు.
గడ్డకట్టిన నెత్తురు మట్టిపెళ్లలుగా మారిపోయింది,
శవాలు శిలాజాలైనవి.
ఇక తవ్వడానికేమీ లేదు:
నాణేలు లేవు, మునిపోయిన ఓడల తెరచాపలూ లేవు
దేవాలయాల గోడలపైనుండి విరిగిపడ్డ
చిత్రకళల ముక్కలూ లేవు
రాజభవనాల స్థంభాల నుండి రాలిపడ్డ
చెక్కిన రాతిఫలకాలూ లేవు.
మహారాణుల పట్టు పరదాల అంచులూ లేవు
విల్లమ్ములూ లేవు
అక్షరాలూ మిగలవు.
ఇక్కడ పచ్చిక కాదు మేకులు మొలుస్తాయి
చెట్లను వెతుక్కుంటూ ఇక్కడికి ఏ పక్షులూ రావు
యమునా నది ఒడ్డు నుండి ఏ వేణువూ వినిపించదు
నది నీళ్లు తాగిన ఆవులు చనిపోతాయి.
అన్ని ద్వారాలూ నరకానికి తెరుచుకుంటాయి
సంభాషణలు మంచులో సమాధి అవుతాయి.
మల్లయోధులు బంగారాన్ని పంచుకుంటుంటే
ఒకప్పుడు మనుషులుగా బతికినవాళ్ల
పుర్రెల కంటి రంధ్రాలగుండా గాలి వీస్తుంది.
శవపేటికల్లో వార్తలు చేరుకుంటాయి
అధోలోకాల్లోంచి సీతాకోకచిలుకలు పైకిలేస్తాయి
యంత్రాలు సాయంత్రాలని దొర్లిస్తాయి
గాలిబ్ గీతాలను మ్యూజియం లో కుక్కి పెట్టారు
సూర్యకాంతిలో వికలాంగులైన వీధుల్లో బ్రహ్మజెముళ్ళ మధ్య
అమీర్ ఖుస్రో అనాథ గాలిలా తిరుగాడుతుంటాడు.
మహాభారతం లో ఎవరూ గుర్తుపెట్టుకోని ఓ చిన్న పాత్రలా
నేను బతికే ఉన్నాను.
చివరికి అద్దాలు కూడా నా ముఖాన్ని ప్రతిబింబించవు.
తెల్లవాళ్ళ యుద్ధం లో నేను మరణించను
నల్లవాళ్ళ యుద్ధాలకి నాయకత్వమూ వహించను
యుద్ధభేరీలన్నీ నిశ్శబ్దమైపోయాయి.
ఏ యుద్ధం లోనూ
నాయకుణ్ణీ కాని ప్రతినాయకుణ్ణీ కాని నేను,
ఎవరినీ కాపాడలేక,
అంపశయ్యపై నెత్తురోడుతూ శిథిలమవడానికి సిద్ధమై,
రక్షించడానికి వీల్లేని నగరాలు కాలిపోతుంటే
అర్ధనిమీలిత నేత్రాలతో నిస్సహాయంగా చూస్తూ
నిర్ణిద్రంగా పడుకుని ఉన్నాను.
Add comment