ఇందిరా గాంధీతో అనుకోకుండా ఐదు నిముషాలు

ఆ ఎగ్జిబిషన్ అయిపోయాక వెనక్కి బొంబాయి వచ్చేసే ఇదంతా చెప్పగానే ఎవరూ నమ్మ లేదు కానీ నవ్వేసి ఊరుకున్నారు.

జీవితం లో కొన్ని కొన్ని సంఘటనలకి నిజమైన ప్రాముఖ్యత లేక పోయినా, సరదాగా జ్ఞాపకం పెట్టుకోడానికి భలే బావుంటాయి. అలాంటిదే ఈ సంఘటన….అప్పటికి నేను లెక్చరర్ గా చేరి రెండేళ్ళు అయింది. కాలం గడిచిపోతోంది. నా డాక్టరేట్ పని కుంటి నడకన నడుస్తోంది.

బహుశా 1971 అక్టోబర్ లో అనుకుంటాను…మాకు ఒక తాఖీదు వచ్చింది. నవంబర్ 14-22, 1971 లో దేశం లో మొదటి సారిగా “నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ ఫర్ చిల్డ్రన్” ఢిల్లీలో జరుగుతుంది అని ఆ ప్రకటన సారాంశం. నెహ్రూ గారి పుట్టిన రోజు నాడు..అంటే బాలల దినోత్సవం నాడు ప్రారంభించిన ఆ మొట్ట మొదటి భారీ స్థాయి శాస్త్ర పరిజ్ఞాన ప్రదర్శన శాల కి స్ఫూర్తి అప్పటి ప్రధాన మంత్రి ఆయన కుమార్తె ఇందిరా గాంధీ గారే.. ఆ ప్రాధాన్యత వలన దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆ ఎగ్జిబిషన్ లో పెద్ద ఎత్తున పాల్గొనాలి అని మా డైరెక్టర్ డా. కేల్కర్ గారు అన్ని డిపార్ట్ మెంట్ లకీ “బాలబాలికలకీ, యువతీ యువకులకీ స్ఫూర్తి కలిగించేవే కాకుండా మన బొంబాయి ఐఐటి కి పేరు తెచ్చే పరిశోధనలు, మనం కనిపెట్టిన కొత్త పరికరాలూ మొదలైనవి సేకరించండి” అని ఒక తాఖీదు పంపించారు. సరిగ్గా అదే సమయం లో నా ఆప్త మిత్రుడు శివరామ్ అప్పటి కొత్త టెక్నాలజీ అయిన ఫ్లూయిడిక్స్ ని ఉపయోగించి, ఎక్కడా ‘కదిలే పరికరాలు’ (మూవింగ్ పార్ట్స్) లేకుండా డాక్టర్లు వాడే ‘కృత్రిమ ఊపిరి తిత్తులు” (ఆర్టిఫిషియల్ రెస్పిరేటర్) కానీ ‘కృత్రిమ గుండె కాయ” (ఆర్టిఫిషియల్ హార్ట్) చెయ్యగలమా అనే ఆలోచనలో ఉన్నాడు.

మాకు తెలిసినదల్లా మనిషి గుండె కాయ డబ, డబా కొట్టుకుంటూ రక్తాన్నీ, ఊపిరి తిత్తులు ఉష్షూ, ఉష్షూ అంటూ గాలినీ ఒక క్రమ పద్దతిలో ప్రసారం చేస్తూ ఉంటాయి అని మాత్రమే. మా గురువు గారి ఉత్సాహకరమైన అనుమతి తో శివరామ్, నేనూ, మూర్తీ, కుల దీప సింగ్ సయ్యాన్ అనే సర్దార్జీ, మరి కొందరూ రంగం లోకి దిగి ఒక చిన్న ఫ్లూయిడిక్ సర్క్యూట్ డిజైన్ చేశాం. ఫ్లూయిడిక్స్ అంటే ఎలెక్ట్రానిక్ కణాల బదులు వాయు కణాలు వాడే కొత్త శాస్త్రీయ విధానం అని ఇది వరలో వివరించాను కదా!. ఆ కొత్త పరికరాన్ని ఈ సైన్స్ ఎక్జిబిషన్ లో పెట్టడానికి మాలో ఎవరికో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఒక పెద్ద తెల్ల కార్డ్ బోర్డ్ అట్ట తెచ్చి, దాని మీద ..ఇంకెవరూ..శివరామ్ నే పడుకో బెట్టి, పెన్సిల్ తో చుట్టూ వాడి ప్రొఫైల్ గీసి ఒక కటౌట్ తయారు చేశాం. వాడి ఊపిరి తిత్తులు ఉండే చోట కన్నం పెట్టి అందులో ఒక ఫుట్ బాల్…అమెరికా ది కాదు, ఇండియా బంతి లోపల ఉండే రబ్బరు బెలూన్ అమర్చి, మా సర్క్యూట్ ని దానికి తగిలించగానే ఆ బెలూన్ ఉష్షూ, ఉష్షూ అంటూ ఉబ్బి తబ్బిబ్బు అవడం మొదలు పెట్టింది. ఇంకేముందీ …అందరం పొలోమని తప్పట్లు కొట్టేసుకుని మా డైరెక్టర్ గారికి చూపించగానే ఆయన కాస్త నవ్వుకుంటూనే దాన్ని ఢిల్లీ లో ప్రదర్శించడానికి ఒప్పుకున్నారు. అయితే ఒక చిన్న తిరకాసు పెట్టారు.

అందరి ముందూ నన్ను పక్కకి లాగి, నా పేరు అడిగి తెలుసుకుని “This V.C. Raju will represent our IIT Bombay in Delhi Science Exhibition and I want all departments to work with him and send your display items” అన్నారు. మా గురువు గారు మహానంద పడ్డారు కానీ నేను హడిలి చచ్చి పోయాను. ఎందుకంటే అది చాలా పెద్ద బాధ్యతే కాకుండా నాకు ఢిల్లీ గురించి ఏమీ తెలియదు. అక్కడ ఎవరూ తెలియదు. పైగా అది అక్కడ చలి కాలం. అన్నీ వ్యతిరేకతలే కానీ అవకాశం మంచిది.

మొత్తానికి నానా అవస్తా పడి, ఒక లారీలో శివరాం రబ్బరు ఊపిరి తిత్తులతో సహా సుమారు ఇరవై ఇతర పరికరాలూ, బొమ్మలూ, పోస్టర్లూ అన్నీ ఢిల్లీ లో ప్రగతి మైదాన్ కి పంపించాను. ఎప్పుడో చిన్నప్పుడు తెలిసిన ఒక స్నేహితుడు ఢిల్లీ ఐఐటి లో ఉన్నాడు అని జ్ఞాపకం రాగానే అతని ఆచూకీ పట్టుకుని ఆ వారం రోజులు అతని గదిలోనే ఉన్నాను. అతని పేరు ఇప్పుడు గుర్తు లేదు.

మొదటి రోజు ఉదయం ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గారే ఆ మొట్టమొదటి నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించి, అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఆ సువిశాల మైదానం లో ఉన్న సుమారు 250 ఎగ్జిబిషన్ బూత్స్ చక, చకా నడుచుకుంటూ చూశారు. అక్కడే ఒక విచిత్రం జరిగింది. నేను ఒక్కడినీ ఉన్న మా బొంబాయి ఐఐటి బూత్ దాటి వెళ్ళిపోతూ, వెళ్లి పోతూ హఠాత్తుగా మా శివరామ్ ఊపిరితిత్తుల వేపు చూశారు ఇందిరా గాంధీ గారు. ఎందుకంటే అది ఎర్రగా , బుర్రగా ఉండి డబా, డబా కొట్టుకుంటూ ఉండడం ఆవిడ దృష్టి ని ఆకర్షించి ఉండాలి. వెంటనే ఆవిడ ఆగి, రెండు అడుగులు వెనక్కి వేసి “వాటీజ్ దిస్?” అని నన్ను అడగగానే ముందు నిర్ఘాంత పోయినా, క్షణం లో తేరుకుని నేను ‘ఫ్లూయిడిక్స్ గురించీ ‘అర్టిఫిషియల్ లంగ్స్’ గురించీ చెప్పడం మొదలు పెట్టడం, ఆవిడ ఒకటి, రెండు ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగి పోయాయి. ఇదంతా ఐదు నిముషాల పైనే. చెప్పొద్దూ, ఆ తరువాత వారం రోజులూ ఆ ఎగ్జిబిషన్ లో నాది హీరో స్థాయి.

ఆ ఎగ్జిబిషన్ అయిపోయాక వెనక్కి బొంబాయి వచ్చేసే ఇదంతా చెప్పగానే ఎవరూ నమ్మ లేదు కానీ నవ్వేసి ఊరుకున్నారు. ఎందుకంటే నా దగ్గర ఫొటో సాక్ష్యాధారాలు లేవు మరి. కానీ మేము తయారు చేసిన ఆ “వాయు పంపు”…అదే..రెస్పిరేటర్ అనబడే రబ్బారు ఊపిరి తిత్తుల కటౌట్ ఇక్కడ జత పరుస్తున్నాను.

అయితే ఆ తరవాత సంవత్సరమే.అంటే 1972 లో మా ఐఐటి 10వ స్నాతకోత్సవానికి ప్రధాని ఇందిరా గాంధీ గారే స్నాతక ఉపన్యాసం చేశారు. అప్పుడు మా కేంపస్ లో ఆమె గౌరవార్ధం పెట్టిన ప్రదర్శన శాల లో కూడా ఈ రబ్బరు ఊపిరి తిత్తులు పెట్టి ఎంత ఆతృతగా ఎదురు చూసినా ఈ సారి ఇందిరా గాంధీ గారు నా కేసి కన్నెత్తి కూడా చూడ లేదు. అయినా నేను మూడు అడుగుల దగ్గర నుంచి నేను చూసిన ఇందిరా గాంధీ గారి ఎంతో తీక్షణమైన చూపు, గంభీరమైన ముఖం నాకు ఇంకా బాగా గుర్తు.

అత్యంత ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే…..ఇందిరా గాంధీ గారు మా కేంపస్ కి వచ్చినప్పుడు కూడా వచ్చిన ఒకానొక స్టాఫ్ ఫొటొగ్రాఫర్ నన్నూ, శివరామ్ ఊపిరి తిత్తులనీ మళ్ళీ చూసి, గుర్తు పట్టి పలకరించాడు. అప్పుడే అతను తీసి నాకు ఇచ్చిన ఫొటో ఒకటి ఇక్కడ జతపరుస్తున్నాను. ఢిల్లీ ఫొటో లేక పోయినా ఇది ఇంకా నా దగ్గర ఉంది. అందులో ఇందిరా గాంధీ పక్కన ఉన్నాయన మా డైరెక్టర్ కేల్కర్ గారు కానీ నాకు ఆ ఫొటో ఇచ్చిన స్టాఫ్ ఫొటోగ్రాఫర్ మటుకు ఆ ఫొటోలో ఉన్నాయన కాదు.

మరి కొన్ని అలనాటి జ్ణాపకాలతో…వచ్చే నెల కలుద్దాం.

*

వంగూరి చిట్టెన్ రాజు

6 comments

Leave a Reply to తీర్ధాల ప్రసాద్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అలనాటి జ్ణాపకాలన్నీ ఓ చోట చేర్చి పుస్తకం వెయ్యండి. తరువాతి తరాలకు మార్గదర్శకం అవుతుంది

    • చూద్ద్దాం, ప్రసాద్ గారూ. ఇంకా చాలా ఉన్నాయి…సమయమూ ఉంది.

      మీ స్పందన కి ధన్యవాదాలు.

      ఈ మధ్య ఏమైనా వ్రాశారా?

  • “అప్పుడే అతను తీసి నాకుయిచ్చిన ఫొటో ఇక్కడ జతచేస్తున్నాను” అన్న ఫొటో జతచేయటం జరగలేదు.
    విషయాన్ని చెప్పిన పద్ధతి బాగుంది. ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు