ఇంత రాజకీయం ఇంకెక్కడా వుండదు: అజయ్ వర్మ

తెలుగు కవిత్వం అనువాదంలో వాచ్యమైపోయి పలుచబడిపోవడం గమనించాను.

జయ్ వర్మ అల్లూరి ప్రస్తుతం M.Sc Physics Mysore University లో చదువుతున్నారు. లోగడ కన్నడంలో “గగనసింధు” కవిత్వ పుస్తకం వెలువరించారు. మంచి అనువాదకులు కూడా. స్పానిష్ నుంచి కన్నడ లోకి diana mara కవిత్వం అనువాదం చేశారు. కన్నడ నుంచి తెలుగులోకి “కలల కన్నీటి పాట” కవిత్వం అనువాదం చేశారు. ఈ మధ్య వోల్గా గారి “విముక్త“ని కన్నడంలోకి అనువాదం చేశారు. స్వస్థలం: సింధనూరు. రాయచూరు జిల్లా

  1. చిన్నప్పటి నుంచి పుస్తకాలు అందుబాటులో ఉండటం వల్ల మీకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిందా?

 లేదనిపిస్తుంది‌. పుస్తకాలంటే మా ఇంట్లో ఎక్కువుగా యండమూరి నవలలుండేవి. వాటిని నా చిన్నప్పుడు మా అమ్మ చదువుతుండేది. కాని నేనస్సలు చదవలేదు. తరువాత స్కూల్లో భాషా పాఠ్యా పుస్తకాల వలనే మెల్లమెల్లగా సాహిత్యం మీద ప్రేమ కలిగింది. అప్పటినుండి కథల పుస్తకాలను కొనమని మా నాన్నగారిని అడిగేవాడిని. ఆయన ప్రతి నెలా ‘బాలమిత్ర’ అప్పుడప్పుడూ ‘చందమామ’ పుస్తకాలు తెచ్చిపెట్టేవారు. తెలుగు-కన్నడ రెండు భాషలవీనూ. (కర్నాటకలోని నేనున్న ప్రాంతంలో తెలుగు ప్రభావం ఉండడం వల్ల తెలుగు పత్రికలు – పుస్తకాలు కూడ దొరికేవి) ఆ పుస్తకాలు చడవడం వలనే ఇంకా మంచి మంచి పుస్తకాలని చదవాలనే ఆసక్తి కలిగింది.

  1. ఎప్పటి నుంచి రాస్తున్నారు? రాయటానికి ప్రేరకం ఏమిటి?

ఎందరివో పుస్తకాలు చదివినప్పడు అనిపిస్తుండేది నేను కూడ ఎప్పటికైనా ఇలా రాయాలని. అలా మొట్ట మొదటి కవితను రాసినప్పుడు నాకు పదకొండేళ్ళు. మాది ఇంగ్లీషు మీడియం స్కూలు. కన్నడ తరగతిలో తప్ప మిగతా అన్ని వేళల విద్యార్థలు కేవలం ఇంగ్లీషులోనే మాట్లాడాలని రూలు ఉండేది. పొరపాటున కూడా తెలుగులోనో కన్నడలోనో మాట్లాడితే ఫైను కట్టాలని భయపెట్టేవారు స్కూలు వాళ్ళు. ఆ భయంతోనే ఏమో – నేను మొదటి కవితను ఇంగ్లీషులోనే రాసాను.తరువాత ఐదవ తరగతిలో కన్నడ సారు అందరనీ ఏదైనా ఒక వస్తువు పై కథ రాసుకు రమ్మన్నారు. నే‌ను ‘బడవ రైత’ (పేద రైతు) అనే కథ రాసుకు వెళతే మా సారు బాగా మెచ్చుకుని అందరికీ చూపించారు. అప్పుడు నాకు కలిగిన ఆనందం మరవలేనిది. తరువాత నా ఎనిమిదవ తరగతి నుండి సీరియస్‌గా కవిత్వం రాయడం మొదలుపెట్టి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ‘గగనసింధు’ (కన్నడ) అనే కవితా సంపుటిని తీసుకొచ్చాను. ఇప్పుడు కథలు రాస్తున్నాను, ఎక్కువుగా అనువాదాలు చేస్తున్నాను. ఇక రాయాడానికి ప్రేరకం అంటే చదవడం అనే చెబుతాను.

  1. సాహిత్యం ఎలాంటి ప్రశ్నలు రేకెత్తించింది? ఎలాంటి సమాధానాలు ఇచ్చింది?

ప్రశ్నలకన్నా సమాధానాలే ఎక్కువ. నేను అడగని, ఊహించని, నాకు తెలియని ఎన్నో ప్రశ్నలకి సాహిత్యం ద్వారా సమాధానాలు దొరికాయి. ఒక రకంగా సమాధానాల మూలానే నాలో ప్రశ్నలు మొదలయ్యాయేమో. సాహిత్యం చదివే, రాసే ప్రతి మనిషిలో రేకెత్తే ముఖ్యమైన ప్రశ్నలు అస్తిత్వం – అన్వేషణల గురించే – నేను ఏంటి ? నేను ఎవరు ? నా జీవన గమనమేంటి ? ఇలాంటివి.

  1. తెలుగు సాహిత్యానికి, ప్రపంచ సాహిత్యానికి మధ్య మీరు గమనించిన తేడా?

ప్రపంచ సాహిత్యానికీ తెలుగు సాహిత్యానికీ భాషా విస్తృతి రీత్యా చాలా తేడా ఉంది. నేపథ్యాల రీత్యా తేడా ఉంది. మరప్పుడు, రెండిటి సాహిత్యం – సాహిత్యవిలువుల మధ్య తేడాని పోల్చి చెప్పడం ఎలా ? నేనస్సలు చెప్పలేను. ప్రపంచ సాహిత్యాన్నైతే మనం ఎప్పటికప్పుడు అనువాదాల మూలకంగానో, ఇంగ్లీషులోనో చదువుకుంటున్నాము. మరి, మన సాహిత్యాన్ని వారికి అందిస్తున్నామా ? లేదు. ప్రపంచ భాషల్లో ఏంటి – భారతీయ భాషల్లోకి కూడ తెలుగు సాహిత్యం ఎక్కువగా అనువాదం అవ్వడంలేదు. ప్రభుత్వం కూడ ఈ దిశలో ఏ చర్యలు తీసుకోవడం లేదు.

5.మానవ జీవన గమనానికి సాహిత్యం ఎలాంటి ఇంధనం ఇచ్చిందనుకుంటున్నారు?

మనో-వైజ్ఞానికమైన ఇంధనాన్ని ఇచ్చిందనుకుంటున్నాను.

‌‌‌‌ఈ ప్రశ్నకు నాకెందుకో హెన్రీ డేవిడ్ థోరో రాసిన ‘వాల్డెన్’ పుస్తకం గుర్తుకు వస్తోంది

  1. మీ దృష్టిలో ఏది అత్యుత్తమ సాహిత్యం?

చదివినప్పుడు మనల్ని కుదిపేసి, కలచివేసి, కన్నీళ్ళు ,‌ఆలోచింపజేసే, ఆచరణకు తీసుకోమనే సాహిత్యమే అత్యుత్తమ సాహిత్యమని అందరూ చెబుతుంటారు. అయ్యుండచ్చు. కాని తేలికగా చెప్పాలంటే నాకు ప్రసిద్ధ ఆఫ్రికన్-అమేరికన్ రచయిత్రి మాయా ఏంజిలో ఒక చోట చెప్పిన మాటే గుర్తుస్తోంది – ‘పుస్తకంలోని ఏదైనా ఒక భాగమో, వాక్యమో చదివిన పాఠకుడు – అరే !నాకెప్పుడూ ఇలాంటి ఆలోచన తట్టలేదే ! – అననుకుంటే అదే గొప్ప సాహిత్యం’ అంటుంది మాయా. నేనూ ఇదే చెబుతాను.

  1. సాహిత్యం అంతిమ లక్ష్యం ఏమిటి?

నరమృగాలను మనుషులుగా చేయటం. ఏ తారతమ్యాలు లేని సమసమాజాన్ని నిర్మించటం. అందరినీ వెలుగు బాటలో  ‌‌‌నడపించటం.

  1. అనువాదం చేసేటపుడు మీరు ఎలాంటి విషయాలని పరిగణలోకి తీసుకుంటారు?

ఒక భాషలోని పుస్తకమో లేక రచనో వేరే భాష సాహిత్యానికి కొత్తగానో లేకపోతే తులనాత్మక గుణాలు కలిగి ఉన్నాయని నేను భావిస్తే అలాంటి పుస్తకాలను,రచనలను నేను ఎంపిక చేసుకుంటాను. ఒక్కోసారి నా అభిరుచి కూడా కారణమవుతుంది. ఉదాహారణకు ఆత్మకథలు, దళిత సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, సాహితీ చరిత్ర అనువాదాలకు నేను ప్రాధాన్యత ఇస్తాను.

  1. తెలుగు,కన్నడ సాహిత్యాలలో ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఆలోచనలో పడేసిన అంశాలు ఏమిటి?

రెండు భాషలలోనూ ఆధునిక కవిత్వం, విమర్శ విషయాలపై నేనిప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్నాను. కవిత్వం సంగతికొస్తే రెండు భాషల్లోను కవిత్వంలో చాలా తేడాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఉద్యమ నేపథ్యంలో ఎక్కువ కవిత్వం వచ్చింది కానీ కన్నడలో ఉద్యమ నేపథ్యంగా చాలా తక్కువ కవిత్వం వచ్చింది. రెండు భాషల వాళ్ళు ఛందముక్తంగానే   కవిత్వం రాస్తున్నారు కానీ కన్నడతో పోలిస్తే తెలుగులో వచన శైలి ఎక్కువగా ఉంటుందని, కన్నడలో ఛందముక్తత ఉన్నప్పటికీ శ్రుతి,అంతర్లయలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని నా అభిప్రాయం.

తెలుగు కవిత్వం అనువాదంలో వాచ్యమైపోయి పలుచబడిపోవడం నేను గమనించాను. రెండు భాషలలో కొత్త కవుల సంఖ్య బాగానే పెరుగుతుంది కానీ మంచి కవిత్వం కొందరే రాస్తున్నారు. రూపకాలని విపరీతంగా వాడితేనే కవిత్వమని కొందరు అనుకుంటున్నారు. ఎవరికీ అర్థం కాకుండా క్లిష్టంగా రాస్తేనే కవిత్వమని కొందరు అనుకుంటున్నారు కానీ తేలిక పదాలతోనే గొప్ప కవిత్వం రాయొచ్చు. అలా రాయటమే ఏ కవికయినా నిజమయిన సవాలు.

విమర్శ సంగతికి వస్తే రెండు భాషలలోనూ ఎంత సృజనాత్మక సాహిత్యం వస్తుందో , దానికి తగినంత విమర్శ రావడం లేదు. కన్నడతో పోలిస్తే తెలుగులో మరీ తక్కువగా విమర్శ వస్తుంది. కొత్త తరం విమర్శకులు రావాల్సిన పరిస్థితి అత్యవసరంగా ఉంది. నిజానికి యూనివర్సిటీలలో ఫ్ద్,పొస్త్ దొచ్ రీసెర్చీలు చేసినవారంతా ఏమైపోతున్నారో తెలియడం లేదు. కొంతమంది రాస్తున్నారు కానీ వారికి సమీక్షకి, విమర్శకి తేడా తెలియడం లేదు. మరికొందరు కేవలం మిత్ర విమర్శకులు. తమ స్నేహితుల పుస్తకాలకి విమర్శ,సమీక్ష తప్ప మరే ఇతరపుస్తకానికి ససేమిరా రాయరు. సాహిత్యపు రాజకీయాలు అన్ని భాషలలో ఉండేవే కానీ   తెలుగు సాహిత్యంలో ఉన్నంత రాజకీయం ఇంకెక్కడా ఉండదని స్పష్టంగా చెపుతున్నాను.

*

 

సత్యోదయ్

13 comments

Leave a Reply to P. V. Chaya Pradeepa Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రాజకీయానికి ఎప్పుడు పెద్ద పీఠ వేసే ఉంచుతాం మనం, కావలసినవి మనకు దొరకకపోయిన . అనువాదాలంటారా అది అయ్యే పని కాదు. గూగుల్ ట్రాన్స్లేషన్స్ ఎక్కువ

  • చక్కటి జవాబులు ఎంతో పరిణితితో ఉన్నాయి. సాహిత్యం పట్ల ఎంత స్పష్టత ఉన్నది ఈ కవికి . చాలా ఆనందంగా ఉంది రేపటి సాహిత్య ప్రపంచం మీద ఆశ కూడా కలుగుతుంది.

  • ఎంతో లోతైన, పరిణితి గల అభిప్రాయాలు. కన్నడ సాహిత్యానికే కాదు అజయ్ తెలుగు సాహిత్యానికి కూడా గొప్ప ఆస్తి వంటి వాడు. ఈ యువకుడి మీద చాలా ఆశ వుంది నాకు.

  • అజయ్! నీ ఇంటర్వూ చదివి చాలా సంతోషమేసింది.చాలా పరిణతి,పరిపక్వంతో కూడిన జవాబులు. ఇది ఆశ్చర్యం, సంతోషం . వయస్సుకన్న ఎక్కవ పక్వంమీలో. మీ అనువాదాలు అనువాదాలనిపించవు. అంత భాషా పటిమ మీలో. భవిష్యత్తులో మీనుంచి ఎన్నో ఆశిస్తున్నాము.. మనఃపూర్వక అభినందనలు అజయ్!!

  • ఈ జనరేషన్ కి కవిత్వమూ, రాజకీయాలూ పట్టవు అనుకునే ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు కూడా ఇది చదివితే బావుండు. లవ్యూ బోత్….

  • సాహిత్యంలో ఉద్దండులమనుకునే పెద్దలు చెప్పలేని ఎన్నో వాస్తవాలను కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. మన తెలుగు సాహిత్యపు దౌర్భాగ్య స్థితిని కళ్ళముందుంచారు. అనుచరగణాలకే ప్రాముఖ్యతనిచ్చే దిక్కుమాలిన తనాన్ని బయటపెట్టారు.. చక్కని వివరణాత్మక సమాధానాలందించారు.. అభినందనలు

  • అజయ్…
    కన్నడ, తెలుగు సాహిత్యం రెండింటిలో మంచి పరిణతి. చాలా ఆనందం కల్గింది చదివి.
    మాళ్ళీ మళ్ళీ కలుద్దాం.

    మీతో కాంటాక్ట్ కోసం నెంబర్ & అడ్రస్ naa mail కు పంపగలరా..
    – ఇక్బాల్.

  • తెలుగుసాహిత్యం లో,ఉన్నంత రాజకీయము ఇక ఎక్కడ ఉండదని స్పష్టంగా చెప్పు తున్నాను…. ఇది మాత్రం, నిజం. ఇంటర్వ్యూబాగుంది.. అభినందనలు.. బాబు!

  • తేలిక పదాలతో గొప్పకవిత్వం రాయడం గురించి సంతోషమనిపించింది అజయ్ .సాహిత్యంపట్ల నీ దృష్టి ప్రత్యేకమైనది.ప్రతీప్రశ్నకు నీవు చెప్పిన సమాధానాలే నీకు సాహిత్యంపట్ల ఎంత లోతైన అవగాహన ఉందో అర్థమైతుంది.ఇంత మంచి ఇంటర్వ్యూ అందించిన సత్యోదయ్ అన్నకు ధన్యవాదాలు.

  • Happy to read your insights Ajay 😍 looking forward to meet and have a conversation..

  • వాస్తవికతకు అద్దం పడుతున్నాయి మీ భావాలు.తెలుగు…కన్నడ సాహిత్యంలో మరిన్ని మంచి రచనలు చేయాలని కోరుకుంటున్నాను! అభినందనలు💐💐💐

  • సాహిత్యం పై మీరు చేసిన ఇంటర్వూ…. అజయ్ వర్మ గారి స్పందన చాలా బాగుంది. ప్రతీ ప్రశ్నకు ముక్కసూటి జవాబులిచ్చినారు.ప్రస్తుతం ఎదుర్కొంటున్న తెలుగు సాహిత్య పరిస్థితిని ఖచ్చితంగా చెప్పడం బాగుంది. ఇరువురుకీ హృదయపూర్వక అభినందనలు 💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు