ఇంతకీ కవిత్వమంటే ఏమిటి ?

ఎందరిని అడిగానో
కవిత్వమంటే ఏమిటని

ఓ చలి చీకటి రాత్రివేళ
తల్లిలేని ఆ పదేళ్ల పాప
నా చేయిపట్టుకుని ఆకాశంకేసి చూస్తూ
ఆ చందమామ అచ్చం మా అమ్మలా
ఆ నక్షత్రాలు ఆమె నవ్వుల్లా ఉన్నాయి
ఈ మేఘాలు  రెక్కల గుర్రాలై
నన్ను ఎగరేసుకు పోతే
అమ్మ ఒడిలో పడుకోవాలనుంది అంది

అప్పుడెప్పుడో మా అమ్మ కూడా
అడుగేలేని చేదబావిలో
నీటిజల ఊరినట్లు
ఈ దుఃఖం నా కడుపు నుండి అట్లా వూరుతూనే ఉంది
ఇక  చేదలేను అలసిపోయాను
కన్నీటి సముద్రాలు ఇంకిపోయే
రహస్యం నీకు తెలుసునా అంది

ఇంతకీ కవిత్వం అంటే ఏమిటో చెప్పు?

గోర్లలో మట్టి నిండిన పగిలిన అరచేతుల్ని చూసుకుంటూ తోటమాలి ఆశ్చర్యంగా
అనుదినం పువ్వులు పసిపిల్లల్లా
నాకేసి చూసి నవ్వుతాయి
పక్షులు రాగాలు తీస్తూ,
హొయలు పోతూ వాలగానే
గాలి నడుంచుట్టూ చేతులేసి
కొమ్మలు పరవశంతో  తలలుపుతూ
నాట్యం చేస్తాఎందుకన్నాడు

సరేగానీ కవిత్వం అంటే ఏమిటో చెప్పవూ?

అందాకా ఎందుకు
నా బతుకు పుస్తకం పుటలన్నీ
పక్షులై నా జ్ఞాపకాల్ని మోసుకు ఎగిరిపోయాక
నన్నావరించిన శబ్దరాహిత్య మౌనం
పలికే గానంలో లీనమై నేను
సముద్రం ఒడ్డున పడుకున్నప్పుడు
అది నాలోకి ప్రవహించినట్లుగానో
లేదూ దాని గర్భంలో వెచ్చగా నిదురించినట్లుగానో ఉంటుంది నాకు
అలల సంగీతం అమ్మ పాడిన జోలపాటలానో
నా గుండె చెప్పుడులానో ఉంటుంది
సముద్రమూ,నేనూ ఒకేసారి
కలిసి జన్మించిన కమలపిల్లలమేమో

పోనీ ఇప్పుడున్న చెప్పు, కవిత్వమంటే ఏమిటి?

ఇక ముగిసి పోతుందను కున్నప్పుడల్లా
ఏదో పురాస్పర్శ నన్ను చుట్టుకుని
సంపెంగల,లిల్లీ పూల పరిమళంలా
నన్ను కమ్ముకుంటుంది
సమస్త చరాచర ప్రపంచమంతా
నాలో ఆదమరచి నిదురించినంత
పరమ శాంతంగా
హాయిగా ఉంటుందెందుకో

అవునూ, ఇంతకీ కవిత్వం అంటే ఏమిటి?
అది ఎక్కడ దొరుకుతుంది?

ధర్మాగ్రహాల తుపానుల్లోనా
మృదువైన పిల్ల తెమ్మెరల్లోనా
ఎడతెగని దుఃఖం లోనా
మధుర ప్రేమ ల్లోనా
ఎగసిన తిరుగుబాటు పతాకాల్లోనా
చెదరని విశ్వాసాల్లోనా
ఏకాంత క్షణాల్లోనా
సన్మోహక జన సందోహాల్లోనా
మన కోసం మరణించిన
అమరుల కళ్లల్లోనా
లోకమే ఎరుగని అర్ధనీలిమి
నిదుర కళ్ళ పాపాయి
లేత చిరునవ్వు లోనా

కవిత్వం ఎక్కడ దొరుకుతుంది ?
ఇంతకీ కవిత్వం అంటే ఏమిటి?

*

విమల

6 comments

Leave a Reply to Subbarao Mandava Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుంది.. కవిత్వమంటే ఇదే కదా..

  • ఎగసిన తిరుగుబాటు పతాకాల్లోనా… మన కోసం మరణించిన అమరుల కళ్లల్లోనా… అంటున్న యీ విమలక్క ఓరు ? సారంగ సారధ్య సామే !

    1 మే 1960న పుట్టిన విమల కవిగా ప్రసిద్ధురాలు. 15వ ఏటనే కధలు రాయటం ప్రారంభించినా, తొలికధ 1978లో నూతన మాసపత్రికలో అచ్చయింది. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు కధలు రాస్తున్నారు. ఇప్పటివరకూ తొమ్మిది కధలు అచ్చయ్యాయి. రెండు కవితా సంపుటాలు ప్రచురించారు. గతంలో విప్లవ రచయితల సంఘం, ప్రగతిశీల మహిళా సమాఖ్య ( పిఓడబ్యూ ) లలో పనిచేసి, ప్రస్థుతం వివిధ రంగాలలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు.

  • ” ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం ద్వారా కవితా ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతి తక్కువమంది స్త్రీవాద కవయిత్రుల్లో విమల ప్రముఖులు.

    1980లో తన జీవితాచరణ నుండి రాజకీయ కవిత్వం రాయటం ప్రారంభించి …..
    1990లో ‘అడవి ఉప్పొంగిన రాత్రి’కవితా సంకలనం ప్రచురించి అటు విప్లవ కవిత్వ శిబిరంలోనూ, ఇటు సీ్త్రవాద కవిత్వ శిబిరంలోనూ తనదైన ప్రభావ ముద్ర వేసిన విమల 2009లో రెండవ కవితా సంకలనం ‘మృగన’ ప్రచురించింది.

    ఆవేశాన్నీ ఆలోచననూ ఏకకాలంలో కలిగించగలిగే విలక్షణతత్వం.. విమల గారి స్త్రీవాద కవిత్వానికున్న ప్రత్యేక లక్షణం!

    2011 నుండి 2015మధ్య అయిదేళ్ళ కాలం మీద రాసిన పదమూడు కథలతో ‘కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్లు’ కథల సంకలనం ప్రచురించింది.

    న్యాయవాదిగా కొంతకాలం కార్మికుల హక్కుల కోసం కృషి చేసిన విమల, ప్రస్తుతం వీధిబాలలుగా, అనాథలుగా మారిన పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రెయిన్ బో చిల్డ్రన్స్ హోమ్ లో కన్సల్టంట్ గా పనిచేస్తున్నారు. ”

    ~ కాత్యాయనీ విద్మహే

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు