ఆ సినిమాల మాటల రచయిత రెంటాలే!

 (రెంటాల గోపాలకృష్ణకు ఆత్మీయ మిత్రులైన నాటకకర్త, ప్రముఖ సినీ దర్శక – నిర్మాత స్వర్గీయ గిడుతూరి సూర్యం 1996 జూలై 15న రాసిన నివాళి యథాతథంగా…)

-గిడుతూరి సూర్యం బి.ఏ,

ప్రముఖ దర్శక నిర్మాత

“విజయవాడలో రచనా వ్యాసంగంలో రెంటాల గోపాలకృష్ణ, అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, ప్రయాగ కోదండరామశాస్త్రి, బెల్లంకొండ రామదాసు, నార్ల చిరంజీవి, తుమ్మల వెంకట్రామయ్య, నేను 40 సంవత్సరాల ప్రాణస్నేహితులం అని చెప్పాలి. మేమంతా అభ్యుదయవాదులం, సాహితీ ప్రియులం.

మిత్రుడు రెంటాల నిగర్వి. సౌమ్యస్వభావి. ఎప్పుడూ చిరునవ్వు మోముతో ఉండేవాడు. ఆయన స్థితప్రజ్ఞుడు. కష్టాన్నీ, సుఖాన్నీ సమానంగా స్వీకరించే వ్యక్తి. మేమంతా జన్మతః వివిధ కులాలకు చెందినవారమైనా, మా అందరిదీ ఒకటే కులం… కవి కులం! సమాజంలో పాతాళానికి అణగ త్రొక్కబడి, పేదరికంలో మ్రగ్గుతున్న కూలీల కులం మాది. మార్క్స్ సిద్ధాంత పునాదులపై దరిద్ర నారాయణుల కోసం కవితలు, నాటికలు, నాటకాలు, చిత్రకళ మొదలైనవి వ్రాసి, ఆచరణలో పెట్టిన మిత్రులం. బ్రతుకుతెరువు కోసం భిన్నవృత్తులను చేపట్టి, తలో దిక్కుకు వెళ్ళినా మా అందరి ఆత్మ ఒక్కచోటే ఉండేది.

రెంటాల గొప్ప కవి, నాటకకర్త, జర్నలిస్టు. అతనికి తెలియని శాస్త్రం లేదు. జ్యోతిశ్శాస్త్రం, కామశాస్త్రం, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రలు, షేక్ స్పియర్, బెర్నార్డ్ షా, ఆడెన్, గొగోల్, పుష్కిన్, ఎర్నెస్ట్ టాలర్, మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, షొంకోవ్ వంటి మహారచయితల గ్రంథాలను అవపోశన పట్టిన మేధావి. సంస్కృతాంధ్ర భాషల్లో నిష్ణాత. ఆయన అచ్చయిన రచనలు అసంఖ్యాకం.

1950లో నేను సినిమా రంగంలో చేరే ముందు మొదట ఏల్చూరి సుబ్రహ్మణ్యాన్ని – నేను హైదరాబాద్‌లో భాగస్థులతో నడుపుతున్న పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్‌కు మేనేజరుగా నియమించాను. అనిసెట్టిని మద్రాసుకు పిలిపించుకొని, చిత్రాలకు నాతో పాటు రచనలు చేయడానికి ఏర్పాటు చేశాను. నేను సొంతంగా చిత్ర నిర్మాణానికి పూనుకున్నప్పుడు రెంటాలతో నా సినిమాలకు మాటలు వ్రాయించాను. పేదలను దోచుకొనేవారిని చీల్చిచెండాడిన పంచకల్యాణి – దొంగల రాణి, ట్రేడ్ యూనియన్ ఇతివృత్తం గల కథానాయకురాలు చిత్రాలకు రెంటాలే మాటల రచయిత. రెంటాల మాటలు, శ్రీశ్రీ, ఏల్చూరి, అనిసెట్టి వ్రాసిన పాటలు నా చిత్రాలకు కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. అలాంటిది మా స్నేహం.

నేను రష్యాకు 1957లో వెళ్ళే ముందూ, అలాగే అక్కడ నాలుగు సంవత్సరాలు ఉండి 1961లో తిరిగి వచ్చాకా… నాకు సన్మానాలు జరిగినప్పుడు రెంటాల ఆనందానికి మేర లేదు. నన్ను కౌగిలించుకొని, శరీరాలు రెండైనా హృదయాలు ఒక్కటిగా భావించిన క్షణాన్ని జీవితంలో మరచిపోలేను.

అప్పుడే నా ప్రాణస్నేహితుడు ఆకాశంలో అమరజ్యోతిగా వెలుగొంది, సంవత్సరం (1996 నాటికి) గడిచిపోయింది. ఆయన మరణించడం అసంభవం. తెలుగు సాహితీ క్షేత్రంలో ఆయన చిరంజీవి. ఆయన కీర్తి అజరామరం. ఆయనకు నా జోహార్లు. శ్రీమతి రెంటాల గారికి, పిల్లలకు నా దీవెనలు.

  • హైదరాబాద్, 1996 జూలై 15

 

రెంటాల

2 comments

Leave a Reply to G. Janardhan Reddy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు