చాలా ఏళ్ల క్రితం మా ఊరు మాలతీచందూర్ వస్తే ఆమెను కలిసి మీ రచనలు నాకు ఇష్టం అని చెప్పేను. ఆవిడ వెంటనే ఇష్టమైన రచయితని అస్సలు కలవకండి. మిమ్మల్ని నిరాశపరుస్తారు అన్నారు. అలాంటిదే ఒక పోస్టు ఈ మధ్య చదివేను. శ్రీశ్రీ ఒక పాశ్చాత్యకవిని ఎంతో ఇష్టపడి కలవబోతే అతను శ్రీ శ్రీ ని ఎంత నిరాశపరచేడో చెప్తూ.
వీటికి వ్యతిరేకమైన కథ నేనిప్పుడు చెప్పబోతున్నాను.
ఒక కవిని ఇష్టంగా చదువుకుని ఆయనను ఆరాధిస్తూ ఆ కవితాత్మని ప్రత్యక్షం చేసుకున్న గొప్ప సహృదయ పాఠకుడు ఆయనను చూడాలని తపించేడు. ఆయనను చూడాలని ఎవరికీ చెప్పకుండా, ఎవరినీ అడగకుండా వెళ్లాలి. తనకు ఆయన కావ్యాల ద్వారా ప్రత్యక్షమైన రసాత్మను నింపుకున్న ఆయన శరీరగృహం తెలుసు. వారిని ఆ విధంగా గుర్తుపట్టగలను అనుకుని బయలుదేరాడు.
ఆ కవి దగ్గరకు తాను అభిసారిక వలె పయనమయ్యానంటాడు. అలా వెళ్లిన రసహృదయుడు పన్నెండేళ్ల బాలుడు. ఆ సమాగమం ఒళ్లు గగుర్పొడిచి పులకింజేసేగాధ. దానిపేరు సహృదయాభిసరణం. అది మళ్లీ నిన్న చదువుకున్నాను. ఇప్పటికి ఎన్నోసారో. మళ్లీ అదే గగుర్పాటు
వారి మాటల్లోంచి ముందుకు సాగుదాం.
“ప్రాణాధికుడైన కవికై నిర్వ్యాజ రస ముగ్ధమైన సహృదయాభిసరణం అది. మహాశ్వేత చేసిన పుండరీకాభిసరణము కన్న, పురూరవునికై ఊర్వశిచేసినదాని కన్న ఇది దివ్యము అపార్ధివము”
“ఎవ్వరితోనూ చెప్పలేదు. ఆ యూహలోని మాధుర్యమెవ్వరికినీ చెప్పనీయలేదు.”
ఈ పన్నెండేండ్ల బాలుడు మా మాష్టారు మల్లంపల్లి శరభయ్య గారు. ఆయనపేరు శరభేశ్వరశర్మ అయినా ఆయనకు శరభయ్య అన్న తెలుగుపేరే ఇష్టమట.
వారు వారి నాన్నగారు మల్లిరార్జునారాధ్యులవారి వద్ద అప్పటికే సాహిత్యమంతా చదివేసుకున్నారు. కవితా విద్య అప్పటికే వారిని అనుగ్రహించిందిట. చెళ్ళపిళ్ళ వారికి ఏకలవ్యశిష్యులుట. సంస్కృతాంధ్రసాహిత్యములలో కొన్నివేల పద్యములు అప్పటికే కంఠస్థం.
అలాంటి వయసులో తనకంటె అయిదేళ్లు పెద్దవాడైన తన మేనల్లుడిని కలవడం తటస్థించింది.
మేనల్లుడు, వారి మిత్రుడు అప్పటికే గొప్ప సాహితీ వేత్తలు. సంసృతాంధ్రాలే కాక ఆంగ్లసాహిత్యాన్ని కూడా మధించినవారు. ఆ మేనల్లుడు తన పద్యముల బాగోగులు విమర్శించి తనను తీర్చిదిద్దేవాడట.
అతని మిత్రుని దగ్గర విశ్వనాథ వారి గ్రంధాలన్నీ ఉన్నాయి. వాళ్ళిద్దరూ అవన్నీ చదివి ప్రసంగించుకుంటూ తనని కుర్రవాడిలా చూసేవారట.
వాళ్లు ఆ బాల కవి రసజ్ఞుడికి విశ్వనాథ పద్యాలు వినిపిస్తే అవి ఈయనకు నచ్చేవి కావు. బహుశా ఆయన పేరు పక్కనున్న M.A అనే అక్షరాలు చూసి ఈయనకు సంస్కృతం సుష్టుగా వచ్చి ఉండదని అనుకున్నారట.
కానీ ఆ మేనల్లుడు ఆ కవిత్వం లోని అందాలు చెప్తుంటే ఇవి మనకెందుకు తెలియకపోవాలి అని పట్టుదల వచ్చింది
అప్పటికే ఆయన తన కావ్యరసజ్ణత ఏమిటో ఇలా చెప్తారు.
“ఒక కావ్యమును చదివి అందలి ప్రాణస్పందము తెలిసికొని అతని మనోధర్మమును అందుకొని ఆ కవితో తాదాత్మ్యము పొంది కొన్నిదినములు అదియే లోకముగా నుండుట నాకు జన్మసిద్ధమైన లక్షణము. అప్పటికే నా చిత్తసద్మమున కాళిదాసు భవభూతులు, బాణ మయూరాదులగు సంస్కతకవులూ, నన్నయ తిక్కనలు శ్రీనాధ పోతనలూ మొదలైన ఆంధ్రకవులూ చిత్రీకృతులై ఉండిరి. “
ఇదీ పన్నెండేళ్ల బాలుడి సాహిత్యవేతృత్వం, దానితోపాటు అలవరచుకున్న గాఢరసజ్ఞత.
ఇటువంటివానికి విశ్వనాథ కవితా ప్రతిభ తెలియకపోవడం అవమానం గానూ, పట్టుదలగానూ అనిపించి మేనల్లుడి దగ్గరనుంచి పుస్తకాలు తీసుకుని చదవడం మొదలుపెట్టారు.
మొదటనచ్చినవి కిన్నెరసానిపాటలు వాటిలోని తెలుగుల తనము. తర్వాత అనార్కలీ నాటకము, మా స్వామికావ్యం, నర్తనశాల నాటకం.
దీనిగురించి భాసుడు తెలుగులో రాసినట్టు ఉందంటారు మాష్టారు. (నాకూ అనుభవమే. నేనూ భాషాప్రవీణ విద్యార్ధులకు పాఠం చెప్పేను. పాశ్చాత్యనాటక ధోరణిలో కూడా ఉంటుంది.)
ఇలా వరుసగా ఒక్కనెలలో వేయిపడగలు, ఆంధ్ర ప్రశస్తి తో సహా అన్నీ చదివేసారు.
అప్పుడు ఇలా అయిందట.
“నా మనోధర్మమే మారినట్లయ్యెను. భూమియు ఆకాశము గాలియు కొత్తవి ఐనట్లు తోచెను. ఏదియో కొత్తజన్మ ఎత్తినట్లు తోచెను.”
“పూర్వకవులెట్లుండిరో తెలియదు. వారి ప్రతిభలన్నియు రాశీభావము నందినట్లున్న ఈ కవి నేనున్న కాలములోనే ఈ ఆకాశముకింద ఈ భూమిపై నడయాడుచున్నాడు. ఈ కవి ఎట్లుండునో?? ఈ కవిని నేను చూచి తీరవలయును. నా అంతట నేనే చూడవలయును. “
ఇది విశ్వనాథ సత్యనారాయణ గారిని చూడడం కోసం. మాష్టారు తాను రసాత్మకంగా తాదాత్మ్యం చెందిన కవికోసం సహృదయుడిగా చేసిన అభిసరణం.
ఆ పన్నెండేళ్ల పిల్లవాడు బెజవాడ వెళ్లాడు. బంధువుల ఇంటినుంచి ఎవరితోనూ చెప్పకుండా కవి గారు ఉద్యోగం చేసే కళాశాలకు వెళ్లాడు. ఉయ్యూరురాజా వారి కళాశాల గవర్నర్ పేటలో మేడమీద ఉండేది. ఆయన అక్కడ పనిచేసేవారు.
ఆ ఇంగ్లీషు విద్యార్ధులను చూసి బిడియంగా ఒక మూలకీ నిలబడ్డాడు. అతని వేషధారణ వల్ల ఎవరూ అతన్ని లక్ష్య పెట్టడం లేదు. విద్యార్ధులూ, ఉపాధ్యాయులూ వస్తూనేఉన్నారు. ఇలా పదిహేను నిముషాలు గడిచాయి. రావలసినవారంతా వచ్చారు కానీ తనకు కావలసినవాడు రాలేదని అర్ధమైంది.
ఏమైనా పనిఉండి సెలవుపెట్టారా అన్న ఆలోచన రాగానే అతని హృదయం శూన్యమైపోయింది. కానీ అక్కణ్నుంచి కదలాలనిలేదు
ఇంతలో తోకమీద లేచి,ఎతైన పడగలతో ముందుకు దూకుతున్నట్టున్న ఒక ఆకృతి ద్వారం లోంచి ప్రవేశించి లోపలికి వెళ్లి మరో రెండు నిమిషాల్లో బయటికి వీధిలోకి వెళ్లిపోయింది. ఆ ఆకారం అంతః సంగీతంతో కదులుతూన్నట్టుందట. బాలుడు తన గుండె చప్పుడు ద్వారా గుర్తు పట్టి నిశ్చేష్టుడై ఆయన వెంట కొన్ని అడుగుల వ్యవధానంలో నడవడం మొదలుపెట్టాడు. అప్పటి ఆ బాలుడి మనస్థితి గురించి మాష్టారు మన గుండె పట్టు తప్పేలా రాస్తారు.
పిల్లవాడు వారిని గుర్తుపట్టాడు. వారు నడచినడచి రెండు మూడు వీధులు దాటి ఒక ఇంట్లో ప్రవేశించారు. అది వారి ఇల్లు కాక మిత్రుని ఇల్లు. వెళ్లి కుర్చీలో కూర్చోగానే ఈ శిశువు గబగబావెళ్లి అశ్రునయనాలతో వారిపాదాలమీద పడ్డాడు.
పిల్లవాడు బికారిలాగ ఉన్మత్తుడి లాగ ఉన్నాడు. మాసినలాగూ, చొక్కా, మెడలో గౌడ రుద్రాక్ష, ఉత్కంఠవల్ల నిద్రలేమి తో ఎర్రబడిన కళ్లు.
వెంఠనే ఆయన భిక్షుక శిశువనుకుని ” ఛీఛీ నన్ను తాకకు. నీకు కావలసిందేదో దూరం నుంచే అడుగు” అని గద్దించేరు.
ఉద్విగ్నతవల్ల కంఠం రుద్ధం కాగా నోటి నుండి కొన్ని ఛందోమయాక్షరాలు బయటికి వచ్చేయి. అంటే కొన్ని పద్యాలు. వాటితో వశంలోలేని ఏడుపు
ఆ పద్యాలకి ఆయన దిగ్భాంతుడై లేచి వచ్చి దగ్గరకు తీసుకుని ఒళ్లో కూర్చోపెట్టుకుని ఏడుపు మాన్పించి వివరములు అడిగి తెలుసుకుని నీ పరిచయం లేకుండా ఎవరికీ ఇలా నమస్కరించవద్దని మందలించారు. గద్గదమైన స్వరంతో ఇలా అనుకున్నారు. “ఏవమవిజ్ఞాతాని దైవతాన్యపి అవధూయంతే” అని. ఎవరో తెలియకపోతే లేకపోతే దైవాలను కూడా దూరంగానే ఉంచుతాం అని.
ఇక తనకూడా తన ఇంటికి తీసుకుపోయారు. తన వారందరితోనూ కలిపారు.
అప్పుడు”వానలో తడిసిన అడవి వలే కన్నీరోడ్చి నా హృదయము తేలికపడి ప్రహ్లాదభావమునందినది.” అంటారు మాష్టారు.
అప్పటికి మధ్యాహ్నం రెండయింది.హృదయమూ కడుపూ సేద తీరేయి. అప్పటికి పిల్లవాడికి ఇంట్లోవాళ్లు కంగారు పడతారనే విషయం గుర్తుకువచ్చి వెడతానంటే సరే సాయంత్రం మళ్లీ రమ్మన్నారు.
సాయంత్రం మళ్లీ వెళ్లేసరికి వ్యాహ్యాళికి వెళ్లేరు.
” ఉద్విగ్నమైన పొద్దుటి నిరీక్షకి స్థిమితమైన ఆ సాయంతన నిరీక్షకు ఎంతటి భేదం ” అంటారు
ఆయన వ్యాహ్యాళినుంచి వచ్చారు. రాగానే ఈ అబ్బాయి వచ్చాడే అంటూ లోపలికి వచ్చి ఏం చదువుకుంటున్నావని అడిగారు. ఆ సాయంసంధ్య లో పిల్లవాడు తాను రాసిన దేవీస్తుతులు చదువుకుంటున్నాడు. వినిపించమని విన్నారు. నేను రాసిన దేవీస్తుతులు కూడా వినమని వినిపించారు.
రాత్రి పిల్లవాడితో కలిసి భోజనం చేసి తిరిగి మళ్లీ సాహిత్యచర్చకు కూర్చున్నారు. తన “మా స్వామి” కావ్యాన్ని ఆశీర్వచనములు రాసి ఇచ్చారు.
బయట శ్రావణ మేఘాల గర్జన లతో, మెరుపుల తో ధారాపాతంగా వర్షం. లోపల తాను ఆరాధించిన కవి కంఠసీమ నుంచి కవితావర్షం.
ఈ కింది వాక్యాల తో పూర్తిచేస్తాడు మాష్టారు వ్యాసాన్ని.
“ఇట్టులు ఒకరిలోఒకరు లీనమగుచున్న కవి సహృదయులను తనలో విలీనమొనరించుకొన్న ఆ ప్రధమ నభో నిశా క్షణముల స్మృతి మాధుర్యమే నేటికీ నన్ను నిలిపి ఈ కథ నాచే ఇట్లు చెప్పించినది.”
కవిని సహృదయపాఠకుడిని ఒకరిలో ఒకరిని లీనం చేసిన ఆమొదటిరాత్రి తాలూకు స్మృతి మనని కూడా కస్తూరి పరిమళం లా గాఢంగా అలుముకు పోతుంది ఫలశ్రుతి లాగ.
పన్నెండేళ్ల బాలపాఠకుడికి నలభయ్యేళ్లు దాటిన కవి తనతో సమాన స్థాయీ, గౌరవమూ ఇచ్చి సాహిత్యచర్చకు సిద్ధం కావడం మనకూ మరపురాని గాధే.
ఇదంతా సాహిత్య నిబధ్ధులైన ఆరాధకుల కథ. ఇవాళ వారిరువురూ ఈ పార్ధివజగత్తు మీద లేరు. అయినా వారి కథ రసజ్ఞుల కథ. రసజ్ఞులైన వారందరి కథ.
మనము రసజ్ఞులమైతే ఈ కథ మనది కూడా.
*
Great Mam
ఇప్పుడే చదివాను కాఫీ తాగుతూ!
పులకించింది మనసు! వినిపించింది కథను!
కనిపించాయి ఆశలు!
మనసును మరిపించాయి!
మీరు రాసే విషయాలు మనసును మరిపించాయి!!!ఇవే నా 🙏🙏🙏
మైసూరు కు వచ్చిన కొత్తలో certificate course in kannada కు చేరాను. మాకు శారదా ప్రసాద్ గారు అనువాదం తరగతులు తీసుకునేవారు. వారి పెళ్ళి రిసెప్షన్ కు జిక్కి ,ఏ. ఎం రాజాను పిలిపించారు(.విజయ నరసింహ ,సినెమా పాటలు రాసేవారు.వారు రాసిన ” విరహా నూరు నూరు తరహా” చాలా ఫేమస్! వారి కూతురి తో.పెళ్ళి.శారదాప్రసాద్ గారి మామగారు)
ఆ సింగర్సును చూసి ఆ పాటలు విని ,నేను ఏదో ట్రాన్స్ లో ఉన్నాను 8 రోజులు.నాకు నిద్ర కూడా రాదు. ఇది గుర్తుకొచ్చింది.
చూసారా అందరి జ్ఞాపకాలూ కదులుతాయి ఇలాగ
థాంక్యూ వెరీమచ్
రసజ్ఞుడైన బుల్లి పాఠకుడు అభిమానిగా మారి ,తన అభిమాన కవిని, రచయితని దర్శించాటానికి వెళ్లటం. రచయిత అంతే అభిమానంతో ఆదరంతో చూడటం.అది ఆ ఇద్దరికీ లభించిన అదృష్టం అయితే. ఆ అభిమాని అయిన గురువుకు మీరు శిష్యురాలయి ఆ అనుభూతిని మాకు అందించటం మా అదృష్టం.కొన్ని కొందరు చెపితేనే బాగుంటాయి.మీరు ఏది చెప్పినా బాగుంటుంది. అభినందనలు మీకు,గురువుగారికి,విశ్వనాధవారికి 🙏🙏💐💐
థాంక్యూ వెరీమచ్
మీరు చెప్పిన సందర్భంలో విశ్వనాధ వారు, శరభయ్యగారు పొందిన తాదాత్మ్యత ఎంత గొప్పదో ! మీ గురువుగారి మధుర స్మృతి శిష్యురాలిగా విన్న మీదెంత భాగ్యమో ! మీ ద్వారా ఈ గాధ చదివిన మేమూ అంతటి అదృష్టవంతులమే ! కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
ఫిబ్రవరి లో కాకినాడలో నాకిష్టమైన ఓ రచయిత్రిని కలిసినపుడు ఆమె రచనలని మించిన ఆదర్శ ప్రేమమూర్తి ఆమె అనిపించింది. ఆమెతో గడిపిన కొన్ని గంటలు అటువంటి అనుభూతి, ఆనందం నేనూ పొందాను.
ఓహోఏమి ఆనందం గౌరీ జీ
ఎంత గొప్ప గాథ. తెలిపినందుకు ధన్యవాదాలండీ..