ఆ రెండు దీపాలే!

ర్రటి బొట్టు బిళ్ళ లాంటి టపాసను నట్టులో పెట్టి

నేలకేసి కొడితే పట్ మని పేలే నేలటపాసా నా బాల్యం

 

పక్కింటి భవంతి వాళ్ళు చిచ్చుబుడ్లు కాలిస్తే

చార్మినార్ సిగరెట్టు పెట్టిలోని తగరపు వెండి  కాగితాన్ని కాల్చి

చిరచిరలాడే  శబ్దంతో మండే ఎర్రటి వెలుగే  నా దీపావళి  చిచ్చుబుడ్డి

 

ఏడాదంతా  చింతకాయలు పగలగొట్టి పుల్లలేరిన అమ్మ చెమట చుక్కలే

రంగయ్య టైలర్  కుట్టించిన నా నూలు గౌనుమీది మెరుపుల  చెమ్కీలు

 

దోటీ రాయితో సూటిగా కొడితే రాలిపడిన నెల్లికాయలే

నేను అందుకున్న   ఎర్రెర్రని  తియ్యతియ్యని  ఆపిలు పండ్లు

 

పది పైసలు ఇస్తే  చాలు కరీమ్ సాయిబు ప్రేమగా

నా చేతికి చుట్టే గులాబీ మిఠాయే నా ఖరీదైన రిస్టు వాచీ

 

ఏడాదికి ఒకసారి నాయిన సగ్గుబియ్యం తెస్తే

అమ్మ చేసిన పాయసం ఐదు వేళ్ళ చేతి గిన్నలో జుర్రుకుంటుంటే

పటుక్కున పంటికింద  నలిగిన ముంతమామిడి పప్పే

నా కమ్మటి స్వర్గం కాజు బర్పీ

 

బడి దగ్గర పోటీలుపడి  ఏరుకుని దారంతో గుచ్చి

మెడలో వేసుకుని మురిసిన  పొగడపూల మాలే నా సువర్ణ కంఠాభరణం

 

ముదురాకుపచ్చరంగులో   పాచి పట్టిన చేపట్టు గోడలమీద

నూనె పోసి వత్తులేసి వెలిగించిన రెండు దీపాలే

మా ఇంటినిండా  కాంతులు చిమ్మే వెలుగు పూల జల్లులు.

*

చిత్రం: బీబీజీ తిలక్

వంజారి రోహిణి

43 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సహజత్వం ఉట్టిపడేలా చిన్నారుల చిలిపి పలుకులచిద్విలాసాలు కమనీయకబుర్లతో వారిచేతలన్నీవిలాసాలకుఅన్వర్తించుకొనేమరోప్రపంచంలోతేలియాడేపారవశ్యాన్నికన్నులకింపుగామలచినకవితాచిత్రణలోఅందెవేసినచేయి రోహిణి గారిది..అదిఆమెహస్తలాఘవం అంతేమరి…..అందుకేఅభినంధించకుండానాఅంతరాత్మ ఉండదు మరిఏంచేయను?…

  • కళ్ళు చెమర్చే అక్షరాల పూమాల..
    బాల్యాన్ని కలం కన్నీటిసిరాతో రాస్తూ
    ఆనందభాష్పాలుగా రాల్చిన
    అద్భుతమైన కవితా ధారా!
    🙏💐🙏🌹💐🙏💐
    చాలా బాగా రాసారక్కా..ఇంచుమించుగా మనందరి బాల్యాలు(ప్రాంతాలు వేరైనా)ఒకేరకమైన (ఆర్థిక)పరిస్థితులలోనే గడిచాయనపిస్తుంది,!మీ కవిత చదువుతుంటే..!🙏
    లక్ష్మీకిరణ్ జబర్థస్త్(LKJ)

  • కవయిత్రి తన బాల్యపు అనుభవాలు గుదిగుచ్చి మనకు అందించిన సంపంగెల సౌరభాలు ఈ కవితా పంక్తులు

    అందంగా సారంగి పత్రికపై వాలిన బారులు తీరిన అరుదైన సైబీరియన్ కొంగలు కవయిత్రి అనుభవాలు

    చక్కని పడమాధుర్యంతో తయారు చేసిన సగ్గుబియ్యపు పాయసంలాంటి కవనం జుర్రుకుంటుంటే పటుక్కున పంటికింద నలిగిన ముంతమామిడి పప్పులు ఈ తీయని కాజూ పలుకులు.

    గొప్ప కథలతో సాహితీ లోకంలో ప్రత్యేక స్థానం పొంది ఇంతటి చక్కని కవితను అందించిన వంజారి రోహిణి గారికి ఆత్మీయ అభినందనలు.

  • మీ రచన నా బాల్యాన్ని గుర్తు చేసింది మేడం. రాబోయే దీపావళిని చిన్నతనానికి వెళ్లి ఈరోజే జర్పుకున్నట్టు అనిపించింది. అభినందనలు మేడం

  • చెమట చుక్కలే నా నూలు గౌను మీది చెమ్కీలు

    • we could see the excellence of words which were used in this poetry, which takes this poetry to next level

      feeling very happy After reading..

  • చిన్న నాటి సంగతులు అన్నీ గుర్తుకు తెచ్చారు మాం
    గులాబీ మిఠాయి చేతికి చుట్టినట్టు ఉంధి మీ కవిత్వం

  • బాల్యం ఆనందాన్ని దొరికిన దానిలో వెతుక్కుంటుంది. అదే బాల్యం.
    అదే పెద్దయ్యాకా మనకు ఎన్ని ఉన్నా, మనసేప్పుడూ లేని దాని మీదే ఉంటుంది. అదే దౌర్భాగ్యం.
    అభినందనలు 🙏

  • బాల్యాన్ని చక్కగ, తమాషాగా, లోపల కొద్దిగానైనా

    ఉన్న అసంతృప్తి పైకి ఎంతమాత్రం

    కనిపించకుండా, చదువుకోడానికి హాయిగా చిన్న

    విషయాన్ని బాగా వ్రాశారు. అభినందనలు

  • బాల్యానికి బీదరికం లేదు…లేమిలో తీరని కోరికలు కూడా ఎంత అనుకూల దృక్పథం తో ఆనాడు తీసుకునే వాళ్ళమో చెప్పే చక్కని కవిత..అమూల్యమైన బాల్యాన్ని గుర్తు చేసిన రోహిణి గారికి ధన్యవాదాలు…అభినందనలు.

  • దొరికిన దానిలో అంతటి ఆనందాన్ని వెతుక్కుని సర్దుకు పోయిన ఆ చిన్నారి నిజంగా చిరంజీవే

  • అభంశుభం తెలియని పసి మొలక ఆలోచనల అందాన్ని అద్దంలోను, నేరుగాను చూసిన ఆనందం.
    అభినందనలు రోహిణి గారు

  • Beautiful narration..what a wonderful script it is…can remember our childhood days..and can also remember our parents..keep posting the stories like these rohini garu..I will be very happy to read your valuable stories..

  • దీపావళి మాటున దాగిన నిర్ధనుల చీకట్లు కవయిత్రి గారి కలాన్ని ఆశ్రయించి నిరుపేదల భాగ్యరేఖలను గురించి ఆలోచింప చేస్తున్నాయి.

  • అవి పేదరిక జీవనంలో అప్పటి అందమైన బాల్యం తాలూకూ జ్ఞాపకాలే అయినా… నాటి మన కోరికలు.. దక్కించుకున్న మేరకు హాయిగా ఆనందించిన మధుర క్షణాలు అవి. దొరికిన దానితోనే కొండను జయించి నంతటి సంతృప్తి. ఇంటి బాధలు తెలియక పోయినా ఇంట, బడిలో ఆనందాన్ని సృష్టించుకోవడం, కల్లా కపటం తెలియని మనసుతో.. అమాయకంగా.. అందరితో కలిసి చదువుకోవడం.. వంటి ఆ సుమధుర బాల్య జ్ఞాపకాలను ఒక్కసారి స్ఫురణకు తెచ్చారు.
    నేటి పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఖర్చుపెట్టిన ఆ ఆనందం మన దరిదాపుల్లో కనిపించదు. కారణం..ఆ ఆనందం మన ఇంటికే పరిమితం అయ్యింది. నాడు ఇతర పిల్లలతో కలిసి జాలీగా గడిపేవారు. ఇప్పుడు సంతోషాల కలయిక ఎక్కడున్నది?.

  • అవి పేదరిక జీవనంలో అప్పటి అందమైన బాల్యం తాలూకూ జ్ఞాపకాలే అయినా… నాటి మన కోరికలు.. దక్కించుకున్న మేరకు హాయిగా ఆనందించిన మధుర క్షణాలు అవి. దొరికిన దానితోనే కొండను జయించి నంతటి సంతృప్తి. ఇంటి బాధలు తెలియక పోయినా ఇంట, బడిలో ఆనందాన్ని సృష్టించుకోవడం, కల్లా కపటం తెలియని మనసుతో.. అమాయకంగా.. అందరితో కలిసి చదువుకోవడం.. వంటి ఆ సుమధుర బాల్య జ్ఞాపకాలను ఒక్కసారి స్ఫురణకు తెచ్చారు.
    నేటి పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఖర్చుపెట్టిన ఆ ఆనందం మన దరిదాపుల్లో కనిపించదు. కారణం..ఆ ఆనందం మన ఇంటికే పరిమితం అయ్యింది. నాడు ఇతర పిల్లలతో కలిసి జాలీగా గడిపేవారు. ఇప్పుడు సంతోషాల కలయిక ఎక్కడున్నది?.
    అలనాటి అందమైన బాల్యాన్ని గుర్తు చేసిన రోహిణి గారికి కృతజ్ఞతలు

  • మీ దీపావళి బాల్యం ముచ్చట్లు బాగున్నాయి

  • బాల్యం లోని అద్భుతమైన జ్ఞాపకాలను ఓ చిన్న కవితలో చక్కగా అక్షరబద్ధం చేసావు.
    అభినందనలమ్మా

  • మధ్య తరగతి ఆనందాలకు మంచి కవితా రూపం కల్పించారు. చాలా బాగుంది. అభినందనలు. మరిన్ని రచనలు మీనుంచి ఆశిస్తున్నాను.

  • మధ్యతరగతి కుటుంబంలో కనిపించని దీపావళిని
    వారి మానసిక సంఘర్షణను.ప్రతి వాక్యంలో ను
    పొందుపరిచి.
    పేదరికంతో జరుపుకునే దీపావళి కి అక్షర రూపం వేసారు సోదరి అద్భుతమైన.బాల్యస్మృతులను పదిలంగా అందించారు.

  • Asalaina santoshaanni khareedaina vastuvullo kaakunda, manam chende trupti lo, anubhavam lo untundi ani chaala chakkaga raasaaru. Oka 10-20 yella jeevitham gadichaaka venakki tirigi chusukunte, oka sampannudu pondina trupti, anubhavaala kanna oka pedavaadu pondinavi chaala ekkuva untundi. Trupti, santoshaanni koliche yantraalu (calories, walking steps chupinche vaacheela maadiriga) unte, nuvvu pondina trupti brahmaandamga telipevi.

  • కుల మతాలు బీద ధనిక అడ్డుపడవు బాల్యం లో
    తమరి బాల్యం ఆధ్బుతం
    నిన్నటిది గుర్తు రాదు
    బాల్యం మరువదు

  • కరిగి పోయిన బాల్యం…
    వెంటాడుతున్న స్మృతుల చిరు జల్లులు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు