ఆ రాయలసీమ ముదిగారమంతా కవితలో…!

కొత్త కవిత్వం కొత్త వాక్యమే రాస్తుంది. ఆ వాక్య విన్యాసాన్ని పరిచయం చేసే శీర్షిక ఇది. నిర్వహణ: బండారి రాజ్ కుమార్

ల్లిపట్టు నాగరాజు చిత్తూరు ప్రాంతపు నుడికారం, పలుకుబడులను కవిత్వం చేస్తున్న యువకవి. ఏ ప్రాంతపు  పలుకుబడులనైనా సాహిత్యంలోకి తీసుకు రావడం వల్ల ఆ భాషకు గౌరవాన్ని, ఔన్నత్యాన్ని తీసుకువచ్చిన వాళ్లమవుతాము. రాయలసీమలో చిత్తూరు ప్రాంతపు భాష భిన్నమైనది. దీన్ని సమర్థవంతంగా కవిత్వంలో ప్రవేశపెడుతున్న కవి అభినందనీయుడు. కవి రాసిన “దూడ మూతి వాసన” కవిత నన్ను బాగా ఆకట్టుకుంది. మూగజీవాలతో మనుషులకు ఉన్న అనుబంధాన్ని చెప్పిన కవిత . అది తల్లికి, బిడ్డకు ఉన్న ప్రేమలాంటిది. చెల్లికి, అన్నతో ఉన్న అనురాగం వంటిది. అందుకే “చెల్లెను సంకనెత్తుకున్నంత సంబరం” అంటడు. ముందు ఈ కవిత చదవండి. తరవాత నా మాటలు నాలుగు పంచుకుంటాను.

దూడమూతి వాసన

~

చిన్నప్పుడు తమ్ముడితో కలిసి

కొట్టంలో లేగలతో ఆడుకున్నట్టు

ఇప్పటికీ దూడలతో ఆడుకోవడమంటే

బాల్యం మళ్లీ మా వీదంత పొడుగై పిలుస్తాది.

 

దూడలు…

పందిట్లో కూకోని సద్దో,సంగటో తాగేటపుడు

భుజంపై మెడపెట్టో వీపుకు రుద్దుతూనో

ముదిగారంగా పిడికెడు ప్రేమను పూస్తావుంటే

చెల్లెని సంకనెత్తుకున్నంత సంబరంగానో

అవ్వ గోనుగోను ఆడించినంత ఆనందంగానో

గుండె కుశాలతో కువకువలాడిన దినాలు ఎంతబాగుంటాయో.!

 

పొద్దన్నే బడికి పోతా పోతానో

సందకాడ సేదబావిలో నీళ్లు తెస్తానో

అడ్డొల్లోబిడ్డనేసుకుని

పాలిస్తూ పొయ్యూదే

తల్లి ఒడిలో పాలబుగ్గల్ని ముద్దుపెట్టుకున్నట్టు

దొడ్లో పేడెత్తుతూనో

గొడ్లకాడ గెడ్డివూడుస్తూనో

ఏ దూడమూతిని ముద్దుపెట్టుకున్నా

మధురమైన వాసనేదో ముక్కుకొసల్ని తాకుతాది

 

అది కుర్రదూడో ,పెయ్యదూడో

అది బర్రెమ్మకు పుట్టిందో ,ఆవుతల్లి కనిందో

పేరేదైనాగావచ్చుగానీ

మూతిదగ్గర తీసుకుంటే చాలు

అమ్మపొదుగులో పాలుతాగిన కమ్మటి వాసనతో

మనసంతా పచ్చిక పూలై పరిమళిస్తాది.

 

మనలా మనుషులైతే

కులం వాసనో మతం వాసనో వచ్చేదేమో

కసువుతినే పశువుబిడ్డలు కదా ఒకటే వాసన

కవుడూ కుచ్చడం తెలీని మూగజీవాల ప్రేమ వాసన.!

*

‘దూడమూతి’ పాల వాసనొత్తది. అయితే అవి సుత మనుషులైతే పాల వాసనకు బదులు కులం, మతం వాసన వచ్చేదని ఛటాల్ తో వీపుమీద చరిచినట్టు చెప్పడం కవితకి ఇచ్చిన అసాధారణ ముగింపు. ఎమోషనల్ టచ్ ఉండే అంశాలను ప్రస్తావించినప్పుడు సాధారణంగా సామాజిక రుగ్మతలకు అన్వయించి చెప్పడం అన్ని సందర్భాల్లో కుదరదు. ఇక్కడ అది జరిగింది.  కవిత ఆసాంతం ఏకబిగిన చదివించే గుణం ఉండటం, చదువుతున్నప్పుడు ఒక దృశ్యంగా మన కళ్ల ముందు కదలాడుతున్నట్టు అనిపించడం, కవి పొందుతున్న అనుభూతిని బదిలీ చేయడం, శతాబ్దాలుగా నలుగుతున్న కులం, మతం వంటివి జోడించి మనసు కలుక్కుమనేట్టు చేయడం, ఒక పరివర్తన దిశగా కదిలించడం, కవుడూ కుచ్చడం తెలీని, మాయామర్మం తెలియని మూగజీవాల్లా బతకమనడం, వాటి స్వచ్ఛమైన ప్రేమను మనుషులు కలిగి ఉండాలని కోరుకోవడం కవితను నిలబెట్టే అంశాలు.

చిన్నపిల్లల్ని మోకాళ్ళపై పడుకోబెట్టుకుని ఆడించే “గోను గోను” ఆట ప్రస్తావన భలే నచ్చింది. ఒక్కో ప్రాంతంలో  ఒక్కోరకంగా పాటపాడుతూ ఆటలు ఆడిస్తూ వుంటారు. తెలంగాణ ప్రాంతంలో  “ఊడుగు చెట్టుకు ఉయ్యాల గట్టి /ఊగుమని మీ అవ్వ ఊళ్లకు బోయొచ్చే” అనుకుంట ఉయ్యాల పాట పాడుతూ పిల్లల్ని ఆడిత్తరు.

ఇక్కడ “గోను గోను” ఆటలో ఎలా పాడుకుంట ఆడిత్తరో సూద్దం.

“గోనుగోను  గొలారి బందా/ పరిగి చేన్లో పండు పండే/ ఏం పండు?/ జాంపండు /ఎవరు తిన్నా పండు?/ చిలక తిన్నా పండు – తీపి పండు /మీ అమ్మ తిన్నా పండు – మంచి పండు /మీ నాయన తిన్నా పండు – చేదు పండు…” ఇలా ఒక్కొక్కరిని ప్రస్తావిస్తూ పాట పాడుతూ కొనసాగిస్తారు.

చివర్లో పిల్లల్ని ఆట పట్టించడానికి “నువ్వు తిన్నా పండు – పీతి  పండు” అని పెద్దలు అనంగనే పిల్లలందరూ  గొల్లు గొల్లున నవ్వుతారు. పెద్దలకు, పిల్లలకు మధ్య సంభాషణ మళ్లీ మొదలవుతుంది. అదెలా వుంటుందో సూద్దం.

పెద్దలు :  ముందు పోయే ముదికాకా ఇటు రా

పిల్లలు  : నేను రాలేను. బిడ్డ  ఉంది

పెద్దలు  : అయితే మీ అమ్మ కిచ్చిరా

పిల్లలు  : మా అమ్మ లేదు

పెద్దలు   : మీ నాయనకిిచ్చిరా

పిల్లలు   : మా నాయనా లేడు

పెద్దలు   : అయితే నీ బిడ్డను గంప కింద పెట్టిరా

(పిల్లలు విరగబడి నవ్వుతారు )

దీన్ని వీలైనన్ని మార్పులు చేసుకుని ఎలాగైనా ఆడుకొనే వెసులుబాటు ఉంటుంది.

ఇలా కవి అంతరించిపోతున్న దేశీయ ఆటల్ని, జనపదాల్ని సుత కవిత్వంలోకి తీసుకు రావడం, అవి ఔచిత్యంగా అనిపించడం, ఆటలాడుతున్నప్పుడు, పిల్లలతో మెలిగినప్పుడు ఏర్పడే చొరవ, చనువును ‘దూడ’కు ఆపాదించడం, ఆ ముదిగారమంతా కవితలో దర్శింపచేయడం ప్రశంసనీయం.

మొక్కుబడిగా కవిత్వం రాసే వాళ్ళకి ఒక్కోకవిత ఎంత ఆర్తిగా, తపనతో, ప్రాణం పెట్టి రాయాలో కవి అర్థం చేయిస్తాడు. కవిత్వం రాయడాన్ని జీవన విధానంలో భాగంగా చేసుకున్న నేటి కవుల్లో పల్లిపట్టు నాగరాజును ప్రత్యేకమైనవాడిగా చెప్పవచ్చు.

*

బండారి రాజ్ కుమార్

26 comments

Leave a Reply to Giriprasad Chelamallu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుతమైన విశ్లేషణ చేసిన బండారి రాజ్ కుమార్ గారికి ముందుగా అభినందనలు.ఇక కవి పల్లిపట్టు గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్తూరు మాండలికాన్ని తన కవిత్వంలో ప్రయోగించే తీరు అనన్యసామాన్యం. ఈ యువ కవి తన రచనల్లో సామాజిక రుగ్మతలే కవితా వస్తువులుగా ఎంచుకొంటాడు. సమాజంలో వేళ్లూనుకున్న అసమానతలపైనే సునిశిత దృష్టి నిలిపి తనదైన శైలిలో ఎండగట్టడం తన కవిత్వాన్ని చదివే ప్రతి కవి పొందే కవిత్వానుభూతి.ఇక మానవ సంబంధాలని తనుచూసేకోణంభిన్నంగాఉంటుంది.మృగ్యమౌతున్న మానవ విలువల కోసం తను ఎంతగా తపిస్తాడో వేరే చెప్పనక్కర్లేదు.ఇక వర్తమాన విషయాలను కవితా వస్తువుగా తీసుకుని వ్యంగాస్త్రాలతో విరుచుకుపడే తీరు ఆస్వాదించే పాఠక హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారంటే అతిశయోక్తి కాదు..ఈ నాలుగు మాటలు పల్లిపట్టు నాగరాజు గురించి నా స్పందనుగా చెప్పుకునే అవకాశం కల్పించిన బండారు గారికి ‘పల్లిపట్టు’ గారికి హృదయపూర్వక అభినందనలు.

    • హృదయ పూర్వక ధన్యవాదాలు సర్…

    • మీ హృదయగత ఆత్మీయ స్పందనకు శనార్తులు తిప్పేస్వామి అన్న.

      మీ అక్షరమక్షరంలో పల్లిపట్టు కవిత్వంపై ఆరాధనాభావం కనిపించింది.

  • అభినందనలు ఇద్దరు తమ్ముళ్లకు..

  • గొప్పగా రాశారు రాజన్నా

    పల్లిపట్టు నవతరం ఉత్తుంగ తరంగం

    • thank u metta anna

      పల్లిపట్టు తన poetic diction తో పాఠకుల్ని మెస్మరైజ్ చేయగలడు. అమాంతం అయస్కాంతంలా హత్తుకోగలడు.

      పుస్తక రూపంగా వస్తే అది సంచలనం కాగలదు.

  • చాలా బాగుంది కవిత మనిషి అయితే కులం వాసన వస్తుంది… అనటం ఇంకా…నచ్చింది

    • మీ స్పందనకు శనార్తులు శ్రీధర్ గారు.

  • తమాముడు పల్లిపట్టునాగరాజుకీ…బండారి రాజ్ కి అభినందనలు

  • పల్లిపట్డు తమ్ముని కవిత ఎప్పటి లాగే అద్బతంగా ఉంది. తమ్ముని కవిత్వంలో మాండలికంను ప్రేమగా ఎత్తుకుంటడు…లాలిస్తడు…జీవితాన్ని కండ్లముందు నిలబెడ్తడు.ఇక విశ్లేషణ కొస్తె రాజ్ కుమార్ తమ్ముడెప్పుడూ తన రాతలతో ప్ర త్యేకంగా నిలుస్తాడు.ఈ కవితపై చేసిన విశ్లేషణ బాగుంది. కానీ చదువుతున్నప్పుడు కొంచెం ఏదో లోపించినట్టనిపించింది.ఆటల మీద ఫోకస్ ఎక్కువయ్యేసరికి కవిత మీద తగ్గినట్టనిపించింది.ఆటలను పరిచయం చేయాలనే తాపత్రయం వల్ల కవిత మీద విశ్లేషణ గాఢత తగ్గిందేమో…ఇదొక్కటి తప్పితే అంతా బాగుంది. తమ్ముల్లిద్దరికీ హృదయపూర్వక అభినందనలు….💐💐

    • మీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటాను. కవిత్వపరంగా ఎక్కువ విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. స్థూలంగా కవిత్వం వెనుక దాగున్న దాని మూలాల్ని పట్టుకోవడానికి కొంత కృషి చేస్తున్నాను.

      మీ విలువైన స్పందనకు శనార్తులు అక్క.

  • ఎంతటి ఆర్ద్రత తో కవితను మలిచాడో పల్లిపట్టు అంతే తపనతో కవితను పరిచయం చేశాడు మిత్రుడు రాజ్ కుమార్

  • మంచి కవితకు మంచి విశ్లేషణ . దేశికవిత్వానికి తమ్ముడు పల్లిపట్టు కొనసాగింపు…అభినందనలు

    • thank u స్వామినాయుడు గారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు