“డోలో ఒక షీట్, అజిత్రోమైసిన్ ఆరు టాబ్లెట్స్, జింకోవిట్ ఓ షీట్ ఇవ్వండి!” అంది ఆ అమ్మాయి, మొఖంమీద మాస్క్ సరిచేసుకొంటూ. పేటలో ఈ కొత్త మెడికల్ షాపు పెట్టి ఇంకా నెలరోజులు కూడా కాలేదు. ఈ అమ్మాయిని వెంకట్ ఎప్పుడూ చూడలేదు.
వెంకట్ వాళ్ళ నాన్న సుబ్బయ్య కు ఊర్లో పచారి సరుకులు అమ్మే షాపు ఉంది. అతను వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు.
ఇరవై ఏళ్ల క్రితమే ఊళ్లో కొన్ని పొలాలు చేపల చెరువులుగా చేశారు. అప్పటి నుంచి తన వ్యాపారం పెరిగింది. ఇప్పుడు రొయ్యల చెరువులు వచ్చాక, ఊరు కళ కళలాడుతోంది. సుబ్బయ్య వ్యాపారం రెండింతలు అయ్యింది. వడ్డీ వ్యాపారం అయితే చెప్పనక్కర్లేదు. జట్ స్పీడ్ లో పరిగెడుతోంది. అర్జెంటు అవసరాల కోసం రొయ్యల రైతులు ఎక్కువ వడ్డీలతో అప్పులు తీసుకునేవారు. కట్టుబట్టలతో అత్తవారి ఊరు వచ్చిన సుబ్బయ్య వ్యాపారం కోట్లలో చేరుకుంది. ఒకే ఒక్క కొడుకు వెంకట్ భీమవరంలో ఇంజనీరింగ్ చదివాడు. పూర్తి అవడానికి ఆరేళ్లు పట్టింది. ఇక క్యాంపస్ ఇంటర్వ్యూలు లేవు, ఉద్యోగాలు లేవు. ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబు లో పెడదామని హైదరాబాదు చాలాసార్లు తిరిగారు. కానీ ఫలితం లేదు. ” మనకు జాబులెందుకు? సుబ్బరంగా వ్యాపారం చేసుకోక” అంటూ సతాయించేవాడు సుబ్బయ్య. ఎక్కడికో ఎగిరిపోవాలని ఉండేది వెంకట్ కు కానీ శక్తి సరిపోలేదు. ఇంతలో కరోనా ఫస్ట్వేవ్ వచ్చింది. మెడికల్ షాపులలో వ్యాపారం ఊపు అందుకొంది. వెంటనే సుబ్బయ్య ఊరికి అనుకొని ఉన్న పేట లో మెడికల్ షాపు పెట్టి, కొడుక్కి అప్పగించేశాడు. కొద్దిరోజుల్లోనే అమ్మకాలు ఊపు అందుకున్నాయి.
తేజశ్విని నారాయణపురం లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. వాళ్లది చిన్న కుటుంబం. రెండెకరాల పొలం, ఎప్పటి నుంచో వ్యవసాయమే. కానీ ఇప్పుడు అందరితోపాటు రొయ్యల చెరువు తవ్వి లీజుకు ఇచ్చేయాల్సి వచ్చింది. కొంచెం ఆదాయం కూడా పెరిగింది. ఇంక చదువు అక్కర్లేదని, పెళ్ళి చేసేద్దామని తల్లి, ఏమైనా చదువుతానని తేజూ పట్టు పట్టారు. సరే పెళ్ళి సంబంధంవచ్చే వరకూ చదువు కోవచ్చని రాజీ కుదిరింది. ఓ సంవత్సరం బస్సులపైన ఆటోల పైన తిరిగింది. కానీ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ స్కూటీ తీసుకొంది. తేజూ హుషారైన మనిషి, అందరిలోనూ ఇట్టే కలిసిపోతుంది. పేటలోనూ అంతే, కాలేజీలోనూ అంతే చాలా మంది ఫ్రెండ్స్. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. వాలీ బాల్ బాగా ఆడుతుంది. పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కంటోంది. ఇప్పుడు చిన్న హెల్మెట్ పెట్టుకొని బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని రైయ్యి మంటూ స్కూటీ మీద కాలేజికి వెళ్ళిపోతోంది. ఇలా వారం వెళ్లిందో లేదో కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది.
ఊళ్ళో అడపా తడపా కేసులు వస్తున్నాయి. అందరిలో భయం ఆవహించింది. కర్ ఫ్యూ కూడా పెట్టారు. వాలంటీర్లు ఊరి చివర కాపలా కాస్తున్నారు. రోజులు కష్టంగా గడుస్తున్నాయి. ఇంతలో అమ్మకు తుమ్ములు వచ్చాయి. జలుబు కూడా చేసింది. అందరికీ భయం వేసింది.
ఆర్.ఎం.పి మూర్తి వచ్చి మందులు రాసిచ్చాడు. అమ్మ తో పాటు మిగిలిన వాళ్లు కూడా విటమిన్ ట్యాబ్లెట్లు వాడమని చెప్పాడు. ఈ కొత్త మెడికల్ షాపుకి తేజు రావడం ఇదే మొదటిసారి.
వెంకట్ అందరికీ మందులు ఇవ్వడంలో బిజీగా ఉన్నాడు. మాస్కులు ఉండటం వల్ల అందరి మొఖాలు సగమే కనిపిస్తున్నాయి. తేజు మందుల చీటీ అతనికి ఇచ్చింది. ఈ అమ్మాయి కొత్తగా కనిపించింది. ” ఇంట్లో ఎవరికైనా కోవిడ్ వచ్చిందా” అని అడిగాడు. ” ఇంకా లేదు, అమ్మకు తుమ్ములు వస్తున్నాయి. ఎందుకైనా మంచిది అని మందులు వాడమని మూర్తి చెప్పాడు”. అంది. “బయటకు వస్తే ఈ శానిటైజర్ కూడా తప్పనిసరిగా వాడండి” ఆని చెప్పి, మందులు తో పాటు అది కూడా ఇచ్చాడు. వెంకట్ చక్కగా ముక్తసరిగా జాగ్రత్తలు చెప్పడం తేజు కి నచ్చింది. బోర్డు మీద చూసి ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంది.
బాబ్జి కి పది ఎకరాలు ఏక చెరువు వుంది. ఈమధ్యనే రొయ్యల చెరువు గా మార్చేశాడు. మొదటి ఏడాది మంచి క్రాప్ లు వచ్చాయి. షెడ్, ఏరియేటర్స్, బోరు, కరెంటు ట్రాన్స్ ఫార్మర్ లు వేయించేసాడు. చాలా ఖర్చయ్యింది. అయినా పరవాలేదు, మొత్తానికి లాభసాటి గానే సాగుతోంది. కానీ ఈ చెరువు వెనకాల రెండు కాలవల మధ్య ఉన్న అసలు మినహా భూమి రెండెకరాలను, గవర్నమెంట్ పట్టా మాజీ సైనిక ఉద్యోగి ఇమాన్యుయేల్ కు ఇచ్చింది. అతను కూడా చెరువు తవ్వి రొయ్యలు వేసాడు. ఎప్పుడూ పంట సరిగా రాలేదు. ఇప్పుడేమో వైరస్ వచ్చింది. పక్కనున్న బాబ్జి చెరువుకు కూడా సోకింది. బోల్డంత లాస్!.
బాబ్జీకి వొళ్ళు మండిపోయింది. “ప్రతీ ఎదవా రొయ్యలేసెయడమే, జబ్బులొస్తే పక్కోడికి అంటించేయడమే..” తెగ ఇసుక్కున్నాడు. మనసారా పచ్చిబూతులు తిట్టాడు. సాయంత్రం షెడ్డు కాడ సిట్టింగ్ లో ” ఆడి పొలం కూడా లీజుకు తీసేసుకో బావా, గొడవొదిలిపోద్ది!” అని సలహా ఇచ్చాడు పొట్టి రాము. ” సరే అడిగి చూద్దాం ” అన్నాడు బాబ్జి ఫైనల్ రౌండ్ పెగ్ నోట్లో పోసుకొంటూ.
ఊళ్ళో అందరిదగ్గరా ఎంతోకొంత డబ్బులు ఆడతానే వున్నాయి. గతంలో పాత శివాలయం, వైష్ణవాలయాలకు భూములిచ్చిన రాజులు పెత్తనం చేసేవారు. కానీ అవి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ క్రిందకు వెళ్ళిపోయాక, ఏ రాజకీయ పార్టీ అధికారం లో ఉందో వాళ్ళకు చెందిన వాళ్ళకే చైర్మన్, కమిటీ పదవులు దక్కేవి. వాళ్ళ ఆధ్వర్యం లోనే తీర్థాలు, పుణ్యకార్యాలు జరిగేవి. ఇక నడీది లోని రామాలయం, సాయిబాబా గుడి అక్కడి కాపులు నడుపుతున్నారు. ఊళ్ళో కొత్తగా సంపాదించిన కమ్మోరు, కొల్లేటి రోడ్డులో పెద్దింట్లమ్మ గుడి కట్టించారు. అక్కడ, కోళ్లు, వేట పోతుల తో బలి పూజలు, భోజనాలు బాగా జరుగుతున్నాయి. వెలమ పేటలో దుర్గాలయం వెలిగిపోతోంది. పందికోడు వంతెన దగ్గర గణేష్ ఆలయం కొత్తగా వెలిసింది. ఇక తూర్పున ఆంజనేయ స్వామి ఆలయం ఉండనే వుంది. మరోపక్క పెద హరిజనపేట, చిన హరిజనపేటలలో పాత చర్చిలు బాగుచేసి రంగులు వేశారు. మరో మూడు కొత్త చర్చిలు వెలిసాయి. ప్రతీ శని, ఆదివారాలు ప్రార్థనలు, క్రిస్టమస్, కొత్త సంవత్సరం పండగలు మైక్ లలో హోరు.మార్చిలో వచ్చే భీమేశ్వరస్వామి తీర్థం పెద్దపండగే. ఏడురోజులు అర్భాటంగా సాగుతుంది. రికార్డింగ్ డ్యాన్సులు, సినిమాలు, గుండాటలతో ఊరు ఊగి పోతుంది. ఎప్పుడూ జరిగే పండగలే ఇప్పుడు ఇంకా కలర్ ఫుల్ గా సాగుతున్నాయి. మైక్ లు హోరెత్తి పోతున్నాయి. ఉదయం భక్తి పాటలు, సాయంత్రం రక్తి పాటలు..ఇలా ఎలిగిపోతున్న రోజుల్లో కోవిడ్ గొప్ప దెబ్బ కొట్టేసింది. ఊళ్ళో ఓ పది మంది పోయేటప్పటికి జనం వణికి పోయారు. ప్రభుత్వం కూడా ఆంక్షలు పెట్టేసింది. అరునెలలు ఊరు ఎడారిలా మారిపోయింది. కొన్నిరోజులకు కోవిడ్ నెమ్మదించింది . జనం గాలి పీల్చు కొన్నారు. మరల పూజలు, భజనలు, స్తోత్రాలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి.
తేజు, వెంకట్ ల పరిచయం చిగురించింది.
మందుల షాపు దగ్గర నాలుగైదు సార్లు కళ్ళు కలిసాయి. చేతులు టచ్ అయ్యాయి. తరువాత శానిటైజ్ చేసుకున్నారనుకోండి. ఇక ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఫోటోల మార్పిడి, ఇంట్రెస్టులు తెలుసుకోవడం, ఇది ఒక ప్రవాహం. ఆ ప్రేమ మొక్క పూలు కూడా పూస్తోంది. వెంకట్ అప్పుడప్పుడూ నారాయణపురం వెళ్లి, తేజు ని కాలేజీ వెనక కలిసి కబుర్లు చెప్పేవాడు.
వెంకట్ భయపడుతూనే సుబ్బయ్య కు విషయం చెప్పాడు. ఇల్లు భగ్గుమంది. ఎవ్వరూ ఒప్పుకోలేదు. పైగా వాళ్ళు చిన్నకులస్తులనీ, ఆస్తి కోసం గేలం వేశారని, ఇంకా ఏవో మాట్లన్నారు. తేజు ఇంట్లోకూడా ఇలాంటి పరిస్థితే. కొన్నిరోజుల్లోనే తేజుకి వేరే సంబంధం ఖాయం చేశారు. రేపే పెళ్ళి. కానీ ఈరాత్రే వీరిద్దరూ జంప్. ఎక్కడకు వెళ్లారో క్లూ కూడా లేదు. పోలీసులు ఏమీ
చేయలేమని చెప్పేసారు. అసలే కోవిడ్ డ్యూటీలు, పైగా వాళ్లిద్దరూ మేజర్లు. ఇప్పుడేం చెయ్యగలం?అన్నారు. ఊరు గుప్పుమంది. ప్రతిరోజూ ఈ న్యూస్ అప్డేట్లు కోసం సాయంత్రం అక్కడక్కడా జనం గుంపులుగా చేరుతున్నారు.
రెండో వేవ్ కోవిడ్ తొంగి చూసింది. ప్రజలు లైట్ తీసుకొన్నారు. కోవిడ్ నెమ్మదిగా పెరుగుతోంది.. ఒకళ్లిద్దరు అక్కడక్కడా పోతున్నారు. సుబ్బయ్య కు అనుమానం వచ్చింది.. తను కూడా పోతే! కుటుంబం ఏమై పోతుంది? ఆస్తులు ఎక్కడికి పోతాయి, వడ్డీవ్యాపారం సంగతేమిటి? ఆ ఆలోచనే భయం వేసింది. రకరకాల ఆలోచనలు..కొంచెం మెత్త బడ్డాడు. నారాయణపురంలో ఉన్న తన అపార్ట్మెంట్ లో కాపరం పెట్టుకోమని వెంకట్ కు కబురు పంపాడు. వాళ్ళు కూడా నెమ్మదిగా అక్కడకు చేరుకొన్నారు.
బాబ్జి, ఇమ్మాన్యూయేల్ను పిలిచి “నీకు ఎక్కువ లీజు ఇస్తాను నీ చిన్న చెరువు లీజుకు ఇచ్చేయ్”అన్నాడు. ఇమ్మాన్యూయేల్ కు ఇప్పటికే లాసులు వచ్చాయి. ఇంక వేరే మార్గం లేక ఒప్పేసుకొన్నాడు. నైట్ షిఫ్ట్ చేస్తే జీతం కూడా ఇస్తా అన్నాడు. రాత్రి మందు కొట్టి పడుకోవచ్చు అనే ఊహ తో ఆనందం గా ఒప్పసుకొన్నాడు.
శివాలయం పూజారి గారికి మరల ఆదాయం పుంజుకొంది. ప్రజలకు భక్తి పెరుగుతున్నందుకు ఆనందంగా వుంది. కానీ రెండో వేవ్ వార్తలు ఆందోళన పెడుతున్నాయి. కొత్త విషాద వార్తలు విన్నప్పుడల్లా “శివ.. శివ” అంటూ లెంపలు వేసుకొంటున్నాడు.
మండువా లోగిలి, పెద సుబ్బరాజు గారికి కూడా ఆందోళన పెరుగుతోంది. జమిందారీలు క్రుంగి పోయాయి. పొలాలు హరించుకుపోయాయి. కానీ కొడుకు మాత్రం బాగానే చదువుకొని హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. అమెరికా ఆఫర్ వచ్చింది. తండ్రికి ఇష్టం లేదని వెళ్ళలేదు. అందుకనే అయన మీద కోడలికి గుర్రు. ఇక్కడ ఉన్నపొలాలు లీజు కు ఇచ్చేసి కాళీ గా కాలం గడుపుతున్నారు. మొన్న సంక్రాంతి కే కొడుకు పిల్లలతో వచ్చి వెళ్ళాడు. ఆ రోజులు ఆనందం గా గడిచి పోయాయి. మొదటి వేవ్ నుంచి ఎలాగో గట్టెక్కారు. ఇప్పుడు మరల దుర్వార్తలు. మనసులో ఆందోళన.. లోగిల్లో అటు ఇటు తిరుగుతూనే వున్నారు.
తేజూ కి ఫ్రెండ్స్ ఎక్కువ. ఎప్పుడూ కాల్స్ లోనూ, చాటింగ్ లోనూ ఉంటుంది. తన ప్రవర్తన వెంకట్ కు చిరాకు వేస్తోంది. వెంకట్ వాళ్ళ నాన్నతో టచ్ లోనే వున్నాడు. ఓ రోజు వెంకట్, సుబ్బయ్య తో అనేశాడు “నాన్నా నేను తప్పు చేసానేమో అనిపిస్తోంది. మీ మాట కాదని తనని చేసుకున్నాను. తన ప్రవర్తన నచ్చడం లేదు” అన్నాడు. ఇంకేముంది సుబ్బయ్య పథకం పారింది. ప్రేమికుల మధ్య అగాధం పెరిగింది.
ఓ రోజు ఉదయమే అతను ఇంటికి వచ్చేసాడు. తేజు ఫోన్ కాల్స్ చేసి విసిగి పోయింది. తనుకూడా తన ఇంటికి చేరింది. పేటలో మీటింగ్. విడిపోవాలంటే భరణం చెల్లించాల్సిందే అని తీర్మానం. వీళ్ళు కుదరదన్నారు. గొడవ ఇంకా రాజుకొంటోంది.
ఇంతలో మాజీ ప్రెసిడెంట్ గారి ఆరోగ్యం బాగోక ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ లో చేర్పించారు. కోవిడ్ అని తేలింది. ఎవ్వరూ ఉండొద్దని మేమే చెబుతాం అని మిగిలిన వారిని పంపించి వేశారు. పదిరోజులు గడిచాయి. ఫోను రాలేదని పిల్లలు వెళితే అయిదు రోజుల క్రితమే పోయారని, ఫోన్ నెంబర్ తప్పుయిచ్చారని అందుకే కాల్ చేయలేక పోయామని చెప్పారు. బంధువులు గొల్లుమన్నారు. ఈ వార్త ఊళ్ళో దావానలం గా పాకింది. పాత ప్రెసిడెంట్ గారి శవమే అనాధ అయిపోతే మామూలోళ్ల సంగతేంటని ప్రజలు గగ్గోలు పెట్టారు. ఇంతలో పెద్ద పూజారి గారు సిక్ అయ్యారు. సాయంత్రం పూట ఓ గంట తీసే గుడి పూర్తి గా మూసేసారు. పెద్ద చర్చి ఫాదర్ గారు, ఏలూరులో కూతురు ఇంటికాడే ఉండిపోయారు. ఊళ్ళో అడపా తడపా చావు వార్తలు వస్తున్నాయ్.
మండువా లోగిలి సుబ్బరాజు గారు, కొడుక్కి ఫోన్ చేసి తనను హైదరాబాద్ తీసుకు పొమ్మన్నారు. “నాన్నా ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ బోర్డర్లు మూసేసారు. కొన్ని రోజులు జాగ్రత్తగా గడపండి , తరువాత నేనే వచ్చి మిమ్మల్ని, అమ్మని తీసుకు వెళతా” అన్నాడు.
సుబ్బరాజు గారు దిగులు పడ్డారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పార్వతమ్మ గారు కొంచెం ఓదార్చారు. ‘అప్పటి దాకా ఉండాలిగా’ అనుకొంటూ నిట్టూర్చారు.
కోవిడ్ నెమ్మదిగా ఊపందుకొంది. గతంలో లా ఎక్కువ ఆంక్షలు లేకపోయినా, చావులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయి. స్థోమత వున్నవారు భీమవరం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అక్కడ రోజుకు లక్షలలో ఫీజులు. దోపిడీ యధేచ్ఛగా సాగిపోతోంది.
మరో అయిదు రోజుల్లో ఊళ్ళో ఇరవై మంది పైగా చనిపోయారు. సాధారణంగా జరిపే ఏ క్రతువులు జరుపలేక పోతున్నారు. దగ్గర వారినే శవాల వద్దకు కూడా రానివ్వడం లేదు.
ఇంతలో ఆరోజు రానే వచ్చింది. ఆకాశం లో ప్రళయ రుద్రుడు వికటాట్టహాసం చేసినట్లుగా ఉంది. ఉదయం నుంచి వందమంది పైగా చనిపోయారు. ఇళ్ళదగ్గరే కూలిపోతున్నారు.
రాత్రికి చావులు మూడువందలకు చేరుకున్నాయి. ప్రాణాలకు తెగించిన కుర్రాళ్ళు కొంత మంది పోగయ్యారు. ఊరు చివర ఒకేచోట సామూహిక ఖననానికి ఏర్పాట్లు ప్రారంభించారు. పెద్ద వెడల్పాటి గొయ్యి తవ్వారు. చుట్టుపక్కల కొంచెం ఎండిన చెట్లు కొట్టుకు వచ్చారు. ఊరునుంచి ఆటోలలో, ట్రాక్టర్ తొట్టిలలో శవాలు వస్తున్నాయి. ఓ రెండువందలమంది పైగా జనం అక్కడకు చేరారు. ఆ గొయ్యిలోనే పుల్లలు పేర్చి, కిరోసిన్ పోసి నిప్పంటించారు.
ఓ పెద్ద మహా ఖననం ప్రారంభమైయ్యింది. విషాదం తలుపు తట్టని కుటుంబమే లేదు. మధ్య వయస్సు నుండి పెద్ద వయస్సుదాకా, ఆడా మగా, కులం, మతం తేడాలు లేకుండా శవాలు వస్తూనే వున్నాయి. రాత్రంతా ఈ మహా కాష్టం తగులబడుతూనే వుంది. వాళ్ళు దేముడి దూతల్లాగా, యమభటుల్లాగ కనిపిస్తున్నారు. మరమనుషుల్లా పనిచేస్తున్నారు ఆ కుర్రాళ్ళు . అక్కడ ప్రక్కనే అలసిపోయి సొమ్మసిల్లిపోయారు. ఆ కాళరాత్రిని దాటించమని అందరూ దేవుళ్ళకు మొక్కుకొన్నారు. ఆరాత్రి నెమ్మదిగా కష్టంగా భయంకరంగా, పీడకల లాగా సాగింది. నెమ్మదిగా ఏమీ తెలియనట్లు సూర్యుడు తరువాతి రోజు ఉదయించాడు.
తేజు ఈకష్టకాలం లో నలుగురికి సాయంచేసి అలిసిపోయింది. ఆరాత్రే ఈ విషాద ప్రవాహం లో వాళ్ళమ్మ కూడా కొట్టుకు పోయింది. వెంకట్ వాళ్ళ నాన్నకు జ్వరం వస్తే భీమవరం తీసుకు వెళ్ళాడు. ఎక్కడా చేర్చుకోలేదు. ఇంటికి తిరిగి వచ్చేస్తుంటే ఊపిరి ఆడక ఎనక సీటు లో పక్కకు ఒరిగిపోయాడు. అతనికీ కూడా ఆ సామూహిక చితే దిక్కయ్యింది. పూజారి గారు తరువాతి రోజే గుడ్లు తేలేసారు. ఊరు వెళ్లిన కొడుకు రాలేదు. తీసుకుపోవడానికి వాలంటీర్లు వస్తే, శవాన్ని ముట్టుకోడానికి వీల్లేదని గొడవ చేసింది వాళ్ళావిడ. కోవిడ్ రూల్స్ ఒప్పుకోవని, పంచాయతీ స్టాఫ్ నచ్చ చెప్పారు. ఆయన్ను కూడా అక్కడికే చేర్చారు. రెండు రోజుల్లో చావులు నిమ్మదించాయి.
రొయ్యల రైతు బాబ్జి, ఈ కరోనా కాలం లో కూడా బాగానే సంపాదించాడు. ఈ నాలుగు రోజులూ టెన్షన్ భరించలేక తెగ తాగేసాడు. కానీ చివరిరోజు నరక ద్వారం తట్టి వచ్చాడు. ఇక తాగనని, దాన ధర్మాలు చేస్తానని ఒట్టు వేసుకొన్నాడు.
మరో నాలుగు రోజులకి వెంకట్ మందుల కొట్టు తెరిచాడు. తేజు మందులకోసం వచ్చింది. అతను దీనం గా చూసాడు. ఆమె చెయ్యి చాపింది. అతను చేతిని ముద్దు పెట్టుకొన్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు, ఏడుపొచ్చేసింది.
కొన్ని రోజులకు సామూహిక ఖననం చేసిన చోటున ఓ స్థూపం కట్టారు. దానిపై ఇలారాశారు.
” మేము ఈ ఊళ్లోనే పుట్టాం.
ఈ మట్టిలోనే ఐక్యమయ్యాం!”
*
కరోనా కరాళ కాలాన్ని కళ్ళముందుంచారు. రాజు, పేద, ,శ్రీమంతుడు , తక్కువ ,ఎక్కువ అందరూ చావులొ కలిసిపోయారు.కరోనా కాలం కథను చాలా చక్కగా చెప్పారు.
కథ బాగుంది సర్ ఆసక్తికరంగా సాగింది.