ఆ రాత్రి

వృధాగా రాలిపడుతున్న

వీధి దీపపు కాంతి లో ఆడుకుంటూ

చెట్ల ఆకుల నీడలు

ఈ రాత్రికి 

నా పాదాల కింద చీకటి

 

ప్రయాణాన్ని మోసిన రోడ్డు

తీరిక క్షణాల్ని 

లెక్కలేసుకుంటుంది

 

ఒంటరిగా నడుస్తున్న 

నా చుట్టూ భయం పొద

మెల్లగా కురుస్తున్న రాత్రిలో

గుర్తుకొస్తున్న స్వర్గీయ క్షణాలు

 

సముద్రంలో 

చేపల్ని పట్టడాని కెళ్లిన వాళ్ళు

అడవిలో

స్వేచ్ఛ కోసం చూస్తున్న వాళ్ళు

నది నీటిలో

నావ పరచి నిద్రిస్తున్న వాళ్ళు

ఆసుపత్రిలో వస్తూ పోతున్న శ్వాస

అర్థరాత్రి అడ్డం తిరిగిన బిడ్డ

పేవ్ మెంట్ల పై దొర్లుతున్న నిద్ర

ఎక్కడి నుంచో వినిపిస్తున్న

విషాద వినోద విస్మయ సంగీతం

 

నేనేమి

నిషేధించలేని 

ఎగుడు దిగుడు ఆలోచనలు

 

ఈ రాత్రిని

అలా పోనివ్వు

ఎదో ఒక తీరం లో

ఓడ ఆగుతుంది.

*

సుంకర గోపాలయ్య

పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల లో తెలుగు అధ్యాపకులు. సొంత ఊరు నెల్లూరు.
సంపాదకుడిగా పిల్లల కవిత్వం రెండు పుస్తకాలు తెచ్చారు.రంజని కుందుర్తి,తానా, ఎక్సరే ,పాటూరి మాణిక్యమ్మ మొదలైన పురస్కారాలు అందుకున్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాకులలో ఒకరు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సముద్రం కాణ్ణించి సంగీతం వరకూ, ప్రతి పదచిత్రం కాసేపు నిలబెట్టి సిలమాసూపిచ్చింది ఫ్రెండూ..బలేరాసినవ్ అనడానికి నేనింకా బైటికిరాలా. నావ యాడ ఆగిద్దోనని తెడ్లకాడ గొంతుక్కూర్చోనున్నా..

  • కురుస్తున్న రాత్రిలోకి
    రాలిపడుతున్న దృశ్య కాంతి
    ఎన్ని చిక్కని చిత్రాలను చూపించిందో..
    గొప్ప అనుభూతి కలిగింది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు