ఆ పుస్తకం నన్ను చాలా సేద తీర్చింది!

సామాజిక సంబంధాలు లేదా సోషల్ రిలేషన్స్ అన్నమాట నన్ను కలవరపెడుతూ ఉంటుంది ఎప్పుడూ. ఆందోళనలో కూడా పడేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు దానినుంచి నాకు స్పష్టత కోసం’ కిటికీ బయటి వెన్నెల’ అనే కథ రాసుకున్నాను.
కానీ బయటపడలేదు. లేను కూడా. కారణం నాకు మనుషులంటే ఇష్టం. పనులకోసం మనుషులు అని ఎక్కువగా నమ్మే ప్రజలమధ్య నేను మనుషుల కోసం పనులు అని నమ్మడమే కారణం. అందుకే మనుషులుంటే అన్ని పనులూ పక్కన పెట్టేసాను.
 ఐతే ఇది నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసింది.
మనుషులను ఇష్టపడుతూనే కాస్త ఎడంగా బతకడం ఎలాగా అన్న తరుణంలో పాత కథ ఒకటి, మరొక ఉత్తరాల పుస్తకమూ మదిలో మెదిలేయి.
అవి చాలా ఏళ్లకిందటే చదివేను. కథైతే చాలామంది చదివినదే. అప్పుడు ఏదో తెలిసినట్టే అనిపించింది. ఆ స్పృహ తో మళ్లీ గుర్తుచేసుకోవాలని అనిపిస్తోంది.
వడ్డెర చండీదాస్ గారు అడ్లూరు రఘురామరాజు గారికి(సెంట్రల్ యూనివర్సిటీ తత్వశాస్త్రఆచార్యులు) రాసిన ఉత్తరాలు. ప్రేమతో అన్న శీర్షిక తో2007 లో రఘురామరాజు గారు పుస్తకం గా తెచ్చారు. వెంటనే నా దగ్గరకు వచ్చింది. వెంటనే చదివిన గుర్తు.
ఆ పుస్తకం నన్ను చాలా సేద తీర్చింది.
కారణం చెప్తాను.
చండీదాస్ గారు 1984 నుంచి2005 వరకూ రాజు గారికి రాసిన ఉత్తరాలవి. వంద పేజీల పుస్తకం అనుకోవచ్చును. వంద ఉత్తరాలు ఉండవు. కానీ అవి నాకు కలిగించిన ఎరుక ను నేను మరవలేదు
చండీదాస్ గారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో పనిచేసి బహుశా ఐచ్చికంగా పదవీవిరమణ చేసేరనుకుంటా. తిరుపతి లో కిరణ్ కుమార్  చౌదరి అనే అభిమాని ఇంట్లో మేడమీద చాలా చిన్న గదిలో ఉండేవారు.
చలం శతజయంతి సభ కు1994 లో వెళ్లినప్పుడు కుప్పిలి పద్మ నన్ను ఆయన దగ్గరకు తీసుకువెళ్లింది. అందుకని అదెంత చిన్న గదో నేను చూశాను.
ఈ ఇరవైయ్యేళ్లపాటు రాసిన ఉత్తరాలూ ఆ గదిలో నివసిస్తూనే రాసినవి.
 ఒంటరిగా ఉండేవారు. మనుషులతో ఇంచుమించు సంబంధాలు లేవు. ఎందుకంటే ఆ ఉత్తరాల్లో ఎవరి ప్రసక్తీ ఉండదు. కానీ ఉత్తరాల నిండా గాయకీ గాయకులు, సంగీతజ్ఞులు, సంగీతాలు, ఇష్టమైన సంగీతాలు ఇవే, వీటిగురించే. కాస్త కవులూ, రచయితల రచనల ప్రసక్తి. అంతే రోజు ఎలా గడిపేవారో రాస్తారు
“వేకువ ఐదు కి లేస్తాను. 5.30 కి కేరళ ఏషియా నెట్వర్క్ టీవీ లో కర్ణాటక సంగీతం వస్తుంది. ఆరుగంటలకి డిడి చెన్నయ్ లో కర్ణాటక సంగీతం వస్తుంది గంటసేపు. ప్రొగ్రాం బాగులేకపోతే రేడియో శ్రీలంక పెట్టి వింటాను. 6 గంటలకి వంటపూర్తి చేస్తాను.
స్నానిస్తాను. బ్రూ కాఫీ కాంప్లాన్ కలుపుకుంటాను. రోజుకి నాలుగు సార్లు చక్కెర పాలూ లేకుండా బ్లాక్ కాఫీ తాగుతాను. రోజువిడిచి రోజు టమాటా పప్పు అన్నం లోకి. “
ఐతే పడుకునే దాకా సంగీతం వినడమే పని.
ఉదయం దూరదర్శన్, ఆపైన రేడియో అక్కడ అయిపోయాక టేప్ రికార్డర్.
అంతా నాదమయం.
అలా అని సమాజానికి దూరంగా లేరు.
ప్రతి రోజూ వార్తలు చూస్తూ దేశ పరిస్థితులగురించి చెప్పిన అభిప్రాయాలు కూడా ఉత్తరాల్లో ఉన్నాయి.
ఆయన మనుషుల రొద కి చాలా ఎడంగా ఉంటూ తనదైన ప్రపంచానికి చేరువ అవుతున్నా కూడా సమాజానికి దూరంగా లేకపోవడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది.
ఇలా అంటారు
“నాకోరకం చెవుడు ఉంది. దగ్గర్నుంచి ఎంత చిన్న సవ్వడి ఐనా స్పష్టంగా వినిపిస్తుంది. ముగ్గురునలుగురు గలాభాగా మాట్లాడితే మోత గా తప్ప విభజన గా తెలియదు.”
ఇది ఆయన గడిపిన అన్ని ఏళ్ల స్థితి.
“వీణానాదం చాలా ఇష్టం. సితార్ ది తంత్రీ నాదం, వీణది మానవ కంఠస్వరం. సితార్ ఇటీవల శతాబ్దాలలోనిది. వీణచరిత్రకందనంతటి పురాతనం”
ఇలాంటి అనేక ఇంప్రెషన్లు ఉత్తరాల నిండా.
” చలం పురూరవ నాలుగు దశాబ్దాలకిందట రేడియో లో విన్నాను. తర్వాత చదివాను. చదివాక విన్న అనుభూతి తగ్గలేదు. “అంటూనే అదే ఉత్తరంలో
” ఘర్షణ సినిమా లో వాణీజయరాం పాడిన  ఒక బృందావనం  పాట వినండి.” అంటారు
చీర మిస్టిక్  బ్యూటీ అని మరో కామెంట్
ఈపూట మనసు రీతిగౌళ రాగం లా పాకుతూ మగతగా ఉంది. అంబ నిన్ను వినా అని వెనక ఎప్పుడో రేడియో కి బాలమురళి కృష్ణ అద్భుతంగా పాడిందిలా ఉంది అంటారు
మరోచోట ఈ పూట మనసు మధుబాల మందస్మిత మంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే పాపనాశం శివన్ హిందోళకృతి సామగానలోలమే గాయత్రి గారు వీణమీద పలికించింది విన్నాను. అంటారు
గాయత్రి అనే వైణికురాలి వీణావాదనం గురించి చాలా రాస్తారు. ఆమె చిన్నదైనా పాద నమస్కారం చేస్తానంటాడు. ఆమె సంగీతం వింటూ ఉంటే ఇక ఏమీ అవసరం లేదంటాడు. ఆమెలో ఆయన వాగ్దేవి ని దర్శించేడేమో అనిపిస్తుంది.
వొకే ఒక స్ర్రీ లోలుణ్ని ఒకే ఒక వీణాలోలుణ్ని అంటూనే లాల్గుడి జయరామన్ వయోలిన్ ఇష్టం లేదు. బిస్మిల్లాఖాన్ అనితరసాధ్య, అసాధారణప్రతిభావంతుడు అంటాడు. మళ్లీ సైగల్ కష్టం. ఒకటే ధోరణి అంటాడు. ఇంత చిత్రాతిచిత్రమైన అభిరుచులు.
 “పువ్వుల ఇష్టం. మోహమోహనంగా అనిపిస్తాయి. పూలపరిమళం స్ర్తీని గుర్తుకు తెస్తుందెందుకో. పూల పరిమళం ఎక్కువగా స్ర్రీనుంచి రావడం వల్లనేమో. పువ్వులు కృష్ణశాస్త్రి లాలిత్యమంత లౌల్యలలితంగా అనిపిస్తాయి.”
ఇలాంటి సున్నితాలు.
“చాలామందికి మల్లీశ్వరి పాటలంటే అయిదారు మాత్రమే తెలుసు. కానీ అన్నీ వినాలంటే గంట పడుతుంది. సాంప్రదాయపు సినిమా పాటలు. తెలుగేతరులకు తెలుగు సినిమా పాటలు వినిపించాలంటే మల్లీశ్వరి పాటలు వినిపించాలి. మళ్లీ మళ్లీ అలాంటిపాటలుండవు “
సంజయ్ లీలా భన్సాలీ దేవదాసు సినిమా ని ఆయన ఒక ఉత్తరం నిండా ఉతికి ఆరేసాడు
కానీ ఈ మనిషి చిన్న 6×4 గదిలో ఏళ్లతరబడి వొంటరిగా ఉంటూ(పైగా నడుం నొప్పి. ఎక్కువ సేపు పడుకుని) ఇంత సుకుమార సునిశిత చైతన్యంతో ఉన్నాడంటే అప్పుడూ ఇప్పుడూ కూడా నాకు ఎంతో ఆశావహంగా అనిపించింది. మనుషుల్ని ప్రేమిస్తూనే ఇంత ఎడంగా ఉండడం ఇంతగా కాకపోయినా ఎప్పటికైనా సాధ్యపడేదేనని అనిపించింది. ఈ ఏకాంతం లోకి ఒంటరితనం చేరే ప్రసక్తి లేదనిపించింది.
“మొన్న ఆదివారం రాత్రి డిడి1 అద్భుతం. ఒక గంటసేపు మహానుభావుడు నౌషాద్ తో ఆయన పాటలు చూస్తూ విన్నాను.” మనకైతే మధ్యలో ఎన్ని అవాంతరాలో..
మనలో చాలా మందికి ఈ సంగీతం విని ఆనందించే తాదాత్మ్యం చెందే అభిరుచీ అలవాటూ ఉంటాయి. కానీ ఆయన అది తప్ప మరోపని చెయ్యలేదు. రాత ఎప్పుడో ఆపేసాడు. చదవడం కూడా ఆగిపోయింది. ఆ గది నాలుగుగోడల ప్రపంచం లోంచి మిగిలిన మహాప్రపంచంతో అనుసంధానం పెట్టుకున్నాడు.
ఇది కాదా సామాజిక సంబంధం!!
ఇక కథ అన్నాను గా శంకరమంచి సత్యం గారి అమరావతి కథల్లోది. ‘ఓ రోజెళ్లిపోయింది’ కథ.
నిజానికి ఇది గొప్పకథ అన్న భావనైతే నా మనసులో ఉంది కానీ ఎందుకన్నది మర్చిపోయాను. పైగా అలా అనామకంగా బతకడమే గొప్ప అని సత్యం గారు ఎందుకన్నారా అని అనిపించింది కూడా ఈ మధ్య.
 కానీ ఇప్పుడు మళ్లీ చదివితే చండీదాస్ నుంచి అన్ని ఉత్తరాల ద్వారా పొందిన జ్ఞానం మూడు పేజీల అతిచిన్న కథలో ఇమిడ్చిపెట్టడం అత్యాశ్చర్యమే కలిగించింది
కథ లో పిచ్చయ్య గారిది కూడా క్రమం తప్పని దినచర్యే. కానీ సాధారణంగా కనిపించే అసాధారణమైనది దినచర్య అది
మనుషులతో కలుస్తూనే వారికి చాలా ఎడంగా ఉంటూ, ప్రకృతి కి మరింత బాగా దగ్గరగా ఉండగల జీవనచర్య ఆయనది.
ఉదయం లేచి కచికతో దంతధావనం అవగానే చలికాలంలేదు వానాకాలం లేదు కృష్ణ లో కంఠదఘ్నంగా ములిగి స్నానం చెయ్యవలసిందే. సంధ్యావందనం సరే. చిన్నచెంబుతో కృష్ణ నీళ్లు తీసికెడుతూ గట్టున ఆడుకుంటున్న పిల్లల మీద కాసిని చిలకరిస్తాడట. వాళ్లు చలిచలి అని ముడుచుపోతుంటే నవ్వుకుంటాడట.
ఇక్కడ పిచ్చయ్య గారి లోని చైతన్యం రెండుకోణాల్లో చూపించాడు రచయిత.
అటు తర్వాత దేవాలయం రెండోప్రాకారంలో ప్రవేశించి గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్లి పూలుకోసుకుంటూ ఇక్కడ నిన్న రెండుమొగ్గలుండాలే అనుకుంటాడట.
ఆ చెట్టుతో పెట్టుకున్న అనుబంధం
గుప్పెడు లేత మారేడు దళాలూ, అభిషేకం, నోరు మెదపని మౌనపూజ అయ్యేక అక్కడే అరుగు మీద కాసేపు కూచునే వాడు.
అక్కడ చేరిన ఊరి భక్తులు అనేక విషయాలమీద మాట్లాడుకుంటూ ఉంటే వింటూ కూచుంటాడు మధ్యలో ఎవరేనా ఆయన అభిప్రాయం అడిగినా నవ్వి ఊరుకుంటాడు.
మధ్య మధ్యలో గాలిగోపురం మీద వాలే పావురాళ్ళను లెక్కపెట్టేవాడు.
ఇంటికి రాగానే వీధిలోంచే పచ్చడేం చేసావు ఇవాళ అని భార్యను అడుగుతాడు. మరికాస్త కారం వేసేవా అంటాడు ఆయనకి రోజూ ఏదో పచ్చడి కారంకారంగా కావాలి.
భోజనం తర్వాత కాసేపు నిద్ర. సాయంత్రం మళ్లీ ఊరుచుట్టివచ్చి పాండురంగస్వామి వారి గుడిలో ఆచార్యులు గారి యోగక్షేమాలు కనుక్కుంటాడు.
అక్కణ్నుంచి పెద్దబజారులో రాములవారి గుడిమెట్లమీద కాసేపు కూచుని అక్కడ పిల్లలు ఆడే గోలీలాట చూస్తూ వాళ్ళతో పాటు గోలీలు లెక్కపెట్టేవాడు. చీకటి పడగానే వడపప్పు ప్రసాదంతో ఇంటికి చేరి ప్రసాదం ఆవిడకి పెట్టి భోజనం చేసి ప్రసాదం ఒకోగింజే నములుతూ నిద్రలోకి వెళ్లేవాడు.
అలా వెళ్లినవాడు ఒకరోజు తిరిగి లేవలేదని కథ పూర్తిచేస్తూ శంకరమంచి వారు ఇలా అంటారు
“పిచ్చయ్య గారు ఏమీ సాధించలేదు. తగాదాలు తీర్చలేదు.సమస్యలు చర్చించలేదు కానీ బతికినంతకాలం కాలానికి తెలీకుండా కాలంతో పాటు కలిసి బతికాడు. అది చాలదా” అని చివరి మాటలో లోకరీతి ఇమిడ్చి ఇలా ముగిస్తారు.
“చాలడం లేదు చాలా మందికి” అంటూ
ఆయన పోయేక ఆయన భార్య దుఃఖించలేదట. ఇంతకాలం ఎదురుగా ఉండేవారు. ఇప్పుడు నాలోనే కలిసిపోయారు అనుకుంది ట. అదీ ఆయన అస్థిత్వలక్షణమనమాట.
ఈ కథను ఎంతోమంది ఇష్టపడడం చూశాను. కారణం ఏమిటా అని ఆలోచించాను.
 మనుషులకి సమాజంలో ముఖ్యవ్యక్తి గా, ప్రధాన వ్యక్తి గా ఇప్పటిభాష లో సెలిబ్రిటీల గా బతకాలని ఉంటుంది కదా. దానికోసం పిచ్చివో, మంచివో పనికొచ్చేవో పనికి రానివో ఏవో ఒకటి చేస్తుంటాం నాతో సహా.
అలాంటప్పుడు ఈ పిచ్చయ్య గారి కథ ఎందుకు నచ్చుతుంది అంటే మనకి నిజంగా కావాల్సిందేదో ఇందులో ఉందనమాట. నిజమైన జీవనానంద రహస్యమేదో రచయిత ఈ కథ లో పొదిగి కనీకనపడకుండా దాచిఉంచాడనమాట.
ఇలా మనుషుల మధ్యనే ఉంటూ ఆ అనవసరపు గొడవలేవీ అంటకుండా పిల్లలకీ, పూలకీ, నీళ్లకూ ఆకాశానికీ కాస్త కాస్త చేరువవుతూ జీవించగలగడం అంత సులువేమీ కాదు.
ఈ కథకు ప్రత్యక్ష ఉదాహరణ చండీదాస్ గారు అనిపిస్తుంది. ఆయన రెండుపూటలా టీవీ లో వార్తలు చూసేవాడు. దేశవిదేశ రాజకీయాలు తెలుసుకునేవాడు. అంత వరకే.
“దేశవిభజన లో లాహోర్ ని వదులుకోవడం పరమ అసమర్ధత
ఈ యాభై ఏళ్లలో నలభై కోట్ల నుంచి వందకోట్ల కి జనాభా పెరగడం ప్రగతి కాదు అసమర్ధత, అజ్జానం”
లాంటి మాటలు ఆ ఉత్తరాలలో మధ్యమధ్య కనిపిస్తాయి. కాబట్టి మనుషులమధ్య సమాజంలోనే ఉన్నాడు చండీదాస్ .కానీ మేలుకుని ఉన్నంతసేపూ ఆహత, అనాహత రాగాలలోనే గడిపాడు. మౌనంగానే సెలవుతీసుకున్నాడు. చివరిదాకా ఏదో రాయాలనిగానీ రాయకపోతే రచయిత గా ఏమౌతానో అనే స్పృహే లేదు.
చాలా చిన్నప్పుడు’ వంతెన’ అని ఒక కథ చదివాను. అందులోని విషయం చిన్న పరిధిలో జీవిస్తూ, పెద్ద ప్రపంచం తో అనుసంధానం పెట్టుకోవాలని.
మనం జీవించే పరిధి ఇంకా చిన్నది గానూ, గమనించే ప్రపంచం ఇంకా విశాలం గానూ ఉండాలని ఈ ఉత్తరాల, కథా చెప్తున్నాయి.
ఇంకా ఇంకా పెరిగిపోతున్న మన సామాజిక, సామాజిక మాధ్యమ సంబంధాలమధ్యా , ఎక్కడ ఏది కోల్పోతామో అనే భయం తో రకరకాల వ్యవహారాల మధ్యా  తెలీకుండానే ఉక్కిరిబిక్కిరి అవుతున్నామనిపిస్తుంది. వ్యాపకాలు అనుకున్నవి కూడా వ్యవహారాలుగా మారిపోతున్నాయి.
మనం ఏమరుపాటుతో ఉంటే ఇవి పెరిగేవే గానీ తగ్గేవి కావు. ఇలాంటి దశ లో
‘ఈ ప్రేమతో’ అన్న పుస్తకమూ ఈ ‘ఒకరోజెళ్లిపోయింది’ అన్న కథా లాంటివి అవసరం అనిపిస్తుంది
ఇలాంటి వాటిని ఆలోచనాత్మకంగా చదువుకోవడం కన్న పెద్ద ఆధ్యాత్మిక సాధన వేరే లేదనుకుంటాను
(ప్రేమతో…. వడ్డెర చండీదాస్ అన్న పుస్తకం ఎమెస్కో వారు 2007 లో వేశారు. వెల 60 రూపాయలు ఇప్పటికీ దొరకొచ్చు)

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

12 comments

Leave a Reply to alluri gouri lakshmi Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బరువు పెరగటం వల్ల అనుబంధం , ఆ పైన మనసుకు ఓ రకంగా స్వయం శిక్ష ….ఈ సారి శేఫాలికలు ఎదో సుదూర దీవుల పూల తావిని మోసుకొచ్చాయండీ….

    • మనుషులతో కలుస్తూనే వారికి చాలా ఎడంగా ఉంటూ, ప్రకృతి కి మరింత దగ్గరగాఉండమని ప్రశాంత సందేశం ఉన్న ఈ శేఫాలిక మరీ మరీ బావుంది నాకు. లక్ష్మి గారూ ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ

  • “ఇంకా ఇంకా పెరిగిపోతున్న మన సామాజిక, సామాజిక మాధ్యమ సంబంధాలమధ్యా , ఎక్కడ ఏది కోల్పోతామో అనే భయం తో రకరకాల వ్యవహారాల మధ్యా తెలీకుండానే ఉక్కిరిబిక్కిరి అవుతున్నామనిపిస్తుంది. వ్యాపకాలు అనుకున్నవి కూడా వ్యవహారాలుగా మారిపోతున్నాయి….. ”

    దురదృష్టవశాత్తు ఇది చాలా నిజమండి.. బాగా చదువుకున్నవారు కూడా ఈ సుడిగుండంలో పడి పోతున్నారు..

  • ఇది ప్రస్తుతం నేను సాగిస్తున్న యానంలానే వుంది ,అంత లోతుగా ఆలోచించి ఏమైనా చేస్తున్నానా అంటే లేదనే సమాధానం .ఎవరితోనైనా ,ఫోన్లో కూడా కొంచెం ఎక్కువ సేపు మాట్లాడితే మనసు అలిసిపోతుంది .న్యూస్ పేపర్ చాలా శ్రద్ధగా చదవకపోతే మాత్రం తోచదు .పుస్తకాలు ,సంగీతం చాలనిపిస్తుంది .థ్యాంక్యూ ,నేను వింత జంతువునేమో అన్న అపోహను తొలగించారు.

  • ఈ, book వెంటనే చదవాలనే, కోరిక,ఆసక్తి, కలిగించారు!…మేడం ధన్యవాదాలు ముందుగా, మీకు.చండీ దాస్ గారి,సాహిత్యం, చదివాను కానీ,ఈ book గురించి అంతగా తెలియదు, మీరు రాసింది చదివిన వరకు!…మాకు బాగాఉపకరించేఈపుస్తకం ని కొనుకొంటాను త్వరలో .!

  • Live in this world but don’t let the world live in you…. లాగా దొరికిన ప్రపంచాన్ని ఆనందిస్తూనే మనసులో నిస్సంగిగా ఉండగలగడం గొప్ప అదృష్టమండి. సత్యం గారి కధ నేను కూడా ఎన్నిసార్లు చదివానోనండి. అది మనలో నిక్షిప్తమైన, నిజమైన ఆకాంక్ష. మన పరుగుల జీవితంపై మనసులో ఉండే విరక్తికి అది లేపనంలా పనిచేస్తుంది. ఎంత హాయి ఈ రకమైన జీవనశైలి అన్నట్టు. ఇంత గొప్ప విషయాలు మాకు పంచుతున్న మీకు ధన్యవాదాలండి.

  • ” ప్రేమతో …. ” ~ వడ్డెర చండీదాస్

    http://www.teluguone.com/grandalayam/mobile/novels/%E0%B0%8E%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8B%E0%B0%A1%E0%B1%8D—1-827-13737.html

    కాకినాడ అక్కయ్య ( డా. వాడ్రేవు వీరలక్ష్మిదేవి ) గారూ !

    త్రిపుర తండ్రి పేరుచెప్పుకుని సెంట్రల్ యూనివర్సిటీ త్వశాస్త్రఆచార్యులు అడ్లూరు రఘురామరాజు గారి నుండి వారికి వడ్డెర చండీదాస్ గారు 1984 నుంచి 2005 వరకూ రాసిన ఉత్తరాలు ” ప్రేమతో …. ” పుస్తకం బహుమతిగా, వారి ఆత్మీయ పలకరింపుగా పొందాను.

    మీరు చెప్పాక ఆలోచనాత్మకంగా, ఓ ఆధ్యాత్మిక సాధనగా చండీదాస్ గారు ” ప్రేమతో …. ” రాసిన ఉత్తరాలు మళ్లీ చదవాలని ఉంది. సేద తీరాలని ఉంది.

    మందస్మిత మధుబాల, మనసున మల్లెల మాలలూగిన మల్లీశ్వరి పాట, జబ్ దిల్ హీ టూట్ గయా సైగల్ పాట, నౌషాద్ పాట రఫీ సాబ్ నోట ( మన్ తరపత్ హరి దరిశన్ కో ఆజ్ …. సున్ మోరే వ్యాకుల్ మన్ కా బాజ్ … బిన్ గురు గ్యాన్ కహాసే పావూ ), శంకరమంచి సత్యం గారి అమరావతి కథలు ఇచ్చే సాంత్వన వైపు మనసు మళ్లిస్తాను.

    వడ్డెర చండీదాస్ గారి “ ప్రేమతో …. ” పుస్తకం ఎమెస్కో వారివద్దనే కాక, అమెజాన్ లో కూడా లభ్యం :

    https://www.amazon.in/Prematho-Vaddera-Chandidas/dp/9380409427/ref=pd_sim_14_3/262-9630147-5964802?_encoding=UTF8&pd_rd_i=9380409427&pd_rd_r=e5be8762-560e-4e92-b9cf-d4194ef6b62f&pd_rd_w=NtKvs&pd_rd_wg=te1vB&pf_rd_p=64901ac7-e7c5-4bfc-9580-c94746a1fc53&pf_rd_r=5X8JRQZ5P8W82N2BEDMX&psc=1&refRID=5X8JRQZ5P8W82N2BEDMX

    నాలుగు దశాబ్దాల కిందట, 1974లో ఆకాశవాణి లో ప్రసారితమైన చలం “ పురూరవ “ శ్రవ్యనాటిక ( పురూరవుడుగా కె. చిరంజీవి గారు, ఊర్వశిగా శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు గాత్రదానం చేసి పాత్రలకు ప్రాణం పోసిన రేడియో నాటిక ) క్రింది లింకులో చూడవచ్చు, వినవచ్చు ( పరుచూరి శ్రీనివాస్ గారి సౌజన్యంతో ). నాలంటి నేలక్లాసు ప్రేక్షకుడికే కాక గజయీతరాలు గొరుసన్నకు కూడా “ పురూరవ “ అన్నా శారదా శ్రీనివాసన్ గారి అలౌకిక గాత్రం అన్నా సానా సానా ఇట్టం.

    https://eemaata.com/em/issues/200811/1350.html

    • రామయ్య గారూ
      పురూరవ నాటిక కు నేనూ శారదాశ్రీనివాసన్ గారు చెప్పిన వ్యాఖ్యలతో చలం ఫౌండేషన్ వారు ఆడియో సిడిలు తెచ్చారు. అవి మీకు కావాలంటే పంపుతాను

  • బాగుంది. ఆ పుస్తకం ఇపుడు దొరుకుతుందా? వీలుంటే దొరికే అడ్రస్ చెప్పండి.

    • పైన చూడండి రామయ్య గారు లింక్ ఇచ్చారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు