ఆ పిలుపులు వుండవింక!

ప్రసిద్ధ కథకులు కేతు విశ్వనాథ రెడ్డి గారి 85 వ జన్మ దినోత్సవం ఇవాళ! ఆయనకి ఆత్మీయులు పాలగిరి విశ్వప్రసాద్ అందిస్తున్న వ్యాసం ఇది!

‘జీవితం దుర్మార్గమైనది చిన్నాయనా!’ – ఇది ఈ మధ్య నేను రాసిన కథలోని చివరి వాక్యం.

నిజానికది కేతు విశ్వనాథరెడ్డి గారు నాతో అన్నమాట. – ‘జీవితం దుర్మార్గమైనది నాయనా! దాన్నొక కంట కనిపెట్టుకునే వుండాలి. ఏ మాత్రం ఆదమరిచినా మనల్ను ఛిన్నాభిన్నం చేస్తుంది.’

నిరంతరమూ జీవనం పోరాటమైన సవాలక్ష మందిలో నేనొకడిని. అది చాలదన్నట్లు యితర అశాంతులు నన్ను ముసురుకున్న ఒకానొక సందర్భంలో ఆయన అన్న మాటలవి. అదొకటే కాదు, జీవితాన్ని కాచి వడపోసిన అటువంటి మాటలు ‘అపేక్ష'(కేతు గారు తమ యింటికి పెట్టుకున్న పేరు) ఆవరణలో మసకచీకటిలో ‘మందు వేళ’ అప్పుడప్పుడు రాలిపడుతుంటాయి. వాటినేరుకొని ఎక్కడో చోట నా ‘రాత’లో పొదువుకుంటుంటాను.

ఆయనతో కూర్చునే ఆ సమయం నాకు అత్యంత యిష్టమైపోయింది గత ఎనిమిదేళ్ళుగా. ఎదురుచూసిన ఆ సమయం పది రోజులకొకసారైనా సాక్షాత్కరిస్తుంది.

ఇక నుండి నా జీవితంలో ఆ సమయాలు వుండవు. రమ్మని పిలిచే ఆ ఆప్యాయ పిలుపు యిక వినిపించదు.
నాకైతే ఆత్మీయులకైనా అప్పుడప్పుడు ఫోన్ చేసి పలుకరించే అలవాటు లేదు. అది నన్నొక అహంభావిగానూ నిర్లక్ష్యపరుడిగానూ యెదుటి వాళ్లలో ముద్ర వేస్తుందని తెలుసు. ఈ లక్షణం కేతుగారిలో కూడా ఉంది. అయితే అది నా విషయంలో కట్టు దప్పింది.

దాదాపు ప్రతిదినమూ, తప్పితే దినం మార్చి దినము ఆయన నుండి నాకు ఫోన్ వచ్చేది. మాటలేమీ ఉండవు – ‘ఏం నాయనా! ఏం చేస్తున్నావ్? ఊరికి పోయినావా? కడపలోనే ఉన్నావా? మనం రెండ్రోజుల్లో కలుద్దాం లే.’ – అంతే. అటువంటి మాటలే.

ఫోన్ చేసి పలకరించే అలవాటు లేని నాకు అనేకమందితో దూరం పెరిగింది. కేతు సర్ తో మాత్రం ఆ దూరం పెరగలేదు. ఆయన కడప చేరినప్పటి నుండి దినదినమూ మరింత దగ్గరయ్యాము. అది ముమ్మాటికి ఆయన గొప్పదనమే.
సాధారణంగా ఆయనకు ఎవరైనా ఫోన్ చేస్తే తప్ప తనకు తాను ఫోన్ చేసి మాట్లాడడం చాలా అరుదు. మరి నా ఒక్కని విషయంలో అది రివర్స్ కావడం నాకు ఆనందం,ఆశ్చర్యం కూడా.

ఇక్కడ 27 -28 యేళ్ల కిందటిది ఒక ముచ్చట చెప్పాలి. నా కథ మనిషి ఆంధ్రజ్యోతి వార పత్రికలో (4-8-1995) అచ్చైనప్పుడు, ఆయన కథ చదివి నాకు జాబు రాసిన సందర్భం.

కథ చాలా బాగా రాశావని చెబుతూనే, యెందుకు నా కథల్లో కథకుడి స్వరం నిరాశగా నిస్తేజంగా వుంటుందని కోప్పడ్డారు. జీవితాల్లో యెదురైన వాటిని తలచుకొని వగచకూడదని యేవో సూచనలు చేసినారు.

షరా మామూలుగా నేను తిరిగి జాబు రాయలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన ఏదో పని ఉండి కడపకు వచ్చినారు. నేను, సొదుం జయరాం మరెవరో ఒకరిద్దరూ ఆయనను హోటల్ రూమ్ లో కలిశాము. అప్పుడు అక్కడ అందరిలోనూ చిన్నవాడిని నేనే. ఆయన రెండో పెగ్గు వేసుకునేటప్పుడు మొదలయింది – నన్ను తిట్టడం.(దండించడం.) ‘కొమ్ములు తిరిగిన మొగోళ్లకు నేను జాబు రాయను. జాబులకు రిప్లై ఇవ్వనని రారా అట్లాటోడు యెప్పుడు నన్ను నిష్టూర మాడేవాడు. ఏదో మన పిల్లోడు పైకొస్తున్నాడని నీకు జాబు రాస్తే తిరుగు రాయవా? అంత సొయ్యమా!’ – అని మొదలుపెట్టి సొదుం జయరాం మీదికి మళ్ళుకున్నారు. మేమిద్దరం మైసూరా రెడ్డికి వూడిగం చేస్తూ (యిక్కడ మా కడప మాట వాడారు) మా సొంత బతుకులను బతకడం మర్చిపోయామని చాలాసేపటి వరకు దండిస్తూనే వున్నారు.

కేతు గారితో నాకు పరిచయమైన దాదాపు యీ 35 యేళ్ల నుండి ఆయనకు నామీద ఒక అభిమానం. దగ్గరదగ్గర వూర్ల వాళ్ళ మైనందువల్ల కలిగిన అభిమానమేమో! మొదలైనది యెక్కడా తునిగి పోలేదు.

ఆంధ్రభూమిలో నేను చేరకముందే ఒకసారి ఆ పత్రిక ఎడిటర్ ఎం.వి.ఆర్ శాస్త్రి గారు, కేతు గారు కడపలో ఒక హోటల్ రూమ్ లో ఉండగా కలిశాను. అప్పుడు నా గురించి కేతుగారు చెప్పగానే ఎంవిఆర్ శాస్త్రి గారు నాకు ఒక ఆసైన్మెంట్ యిచ్చారు. కడపజిల్లా వూర్లలో ఫ్యాక్షన్ గ్రామాల వాస్తవ కథనాలను సీరియల్ గా రాయమన్నారు. వెంటనే రెండు వేల రూపాయలు అడ్వాన్స్ కూడా యిచ్చారు.

మామూలుగానే… నేను రాయలేదు. కొన్ని ఫ్యాక్షన్ గ్రామాల చరిత్రను అప్పట్లో నోట్స్ రాసుకున్నాను గానీ పత్రికకు రాయలేదు(అదే రాసి ఉంటే నాకు గొప్ప పేరు వచ్చి వుండేది.)

ఇలా చాలాసార్లు నామీద ఆయనకున్న నమ్మకాన్ని తునకలు తునకలు చేసినా నన్ను దూరం పెట్టలేదు.

కేతుగారు రిటైర్మెంట్ తర్వాత ఏ ప్రభుత్వ పదవుల కోసం యెవరిని దేబిరించలేదు. ఆయన బంధువులు రాజకీయ కీలక పదవుల్లో వున్నా, వాళ్లకు ఎన్నడూ ఫోన్ చేసిన పాపాన పోలేదు. రిటైర్మెంట్ తర్వాత కొన్నేళ్లు సిసి రెడ్డి గారి ‘ఈ భూమి’ పత్రికకు ఎడిటర్ గా పనిచేశారు. ఆ సమయంలో నేను కడప జిల్లా ఆంధ్రభూమి బ్యూరో యిన్చార్జిగా పనిచేస్తున్నాను. ఆంధ్రభూమిలో నాకు యిస్తున్న జీతం తక్కువని ఆయనకు తెలుసు. అక్కడ పనిచేస్తూనే ‘ఈ భూమి’కి రాయమన్నారు. నాకు కొంత గౌరవ వేతనం ఏర్పాటు చేశారు. ఆంధ్రభూమిలో చేస్తూనే నా కూతురు ‘చైతన్య’ పేరుతో ‘ఈ భూమి’కి రాసేవాన్ని.

రాష్ట్ర విభజన సమయంలో సాహిత్యకారుల్లో వచ్చిన ప్రాంతీయ విద్వేషపు ఉక్కపోతల్లో ఆయన హైదరాబాదులో యిమడలేక పోయారు. అప్పటికే ఆయన సహ సాహిత్య మిత్రులు ‘చేరా’ వంటివారు ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. తన తరువాతి తరం సాహిత్యకారుల్లో పుట్టిన కొత్త పోకడలను జీర్ణించుకోలేక ఒంటరి అయిపోయారు.

2012లో సొంత జిల్లా కడప చేరుకున్నారు. ఆయన కడపలో ఇల్లు కొనాలనుకున్నప్పుడు శశిశ్రీ, నేను చేదోడుగా వున్నాము. వారు ఇల్లు తీసుకున్న సింగపూర్ టౌన్షిప్ కడపకు 7- 8 కిలోమీటర్ల దూరం.

శశిశ్రీ వున్నంతకాలం కేతుగారే తరచూ ఆటో మాట్లాడుకుని టౌన్ కు వచ్చేవారు(ఆయన కడప చేరుకున్న రెండేళ్లకే శశిశ్రీ వెళ్లిపోయారు.)

కేతు గారికి యే భేషజాలు లేవు.

ఆయన చదువు, హోదా, పేరు ప్రఖ్యాతులు… చివరకు వయసు కూడా ఆయనలో యే భేషజాన్ని నాటలేకపోయింది.
మేము అన్ని రకాలా తనకన్నా చిన్నవాళ్ళమనే యోచన యే కోశానాలేని నిఖార్సైన మనిషాయన.

ఓ పది కథలు వచ్చి, నాలుగు సభల్లో యేవో నాలుగు కంఠస్తాలు కూసి, నాలుగుసార్లు పత్రికల్లో ఫోటోలు పడగానే, తాము యితరుల కన్నా భిన్నమైపోయినట్లుగా, అధికులమైపోయినట్లుగా, తాము బజారులో నిలబడితే అందరూ తమను గుర్తించి ప్రత్యేక గౌరవంతో చూస్తున్నట్లుగా భ్రమల్లో మునిగే వాళ్ళు, ఆ అనూచానునితో ఒక దినం గడిపితే సిగ్గుతో చచ్చిపోవాల్సిందే.

ఆయన యే టీ బంకులోనైనా, దుమ్ము కొట్టుకుపోయిన రాతి బండమీద కూర్చుంటాడు. టీ బంకు ఆసామితో పిచ్చాపాటి మొదలు పెడతాడు. అక్కడ బిక్షం కోసం ఎవరైనా చేయి చాస్తే, ‘టీ తాగుతావా! రూపాయి కావాలా!’ అని అడుగుతాడు.

కేతు సర్ దంపతులు కడప చేరిన తర్వాత వారితో యెన్నోసార్లు యెన్నో చోట్లకు కలిసి తిరిగిన అనుభవం నాకు కొత్త పాఠాలు నేర్పింది. నా వ్యక్తిత్వంలో ఏ మూలైనా లేశమాత్రం ‘ఎచ్చులుతనం’ యేమైనా ఉంటే అది వూపిరాడక చచ్చిపోయింది.

ఆచరణాత్మక లోచనాపరుడిగా కనిపించే కేతు గారు ఒక్కోసారి అతి సున్నిత మనస్కునిగా అనిపిస్తారు. మరోసారి అంతర్ముఖునిగా అనిపిస్తారు. సన్నిహితులు చనిపోయినప్పుడు కూడా అదొక సహజ పరిణామం అనుకునేంత ‘ప్రాక్టికల్’ గా వుండే ఆయన బండి గోపాలరెడ్డి విషయంలో ఒకటి రెండు సార్లు కొంత కలత పడ్డారు.

తనను కలవాలని వుందని బంగోరె రెండు మూడు ఉత్తరాలు మీద మీద రాశాడని గుర్తు చేసుకున్నారు. తనకు వెనువెంటనే తిరుగు జాబు రాసే అలవాటు లేకపోవడం వల్ల కొంత ఆలస్యం చేశాననే వేదన ఆయన మాటల్లో తొంగి చూసిందప్పుడు. తను పోయి కలిసి వుంటే బంగోరే ఆత్మహత్య చేసుకోక పోయుండే వారేమోననే బాధ ఆయన మాటల్లో తొంగిచూసిందా క్షణం.

కేతు సర్ దంపతులు కడపకు చేరిన కొత్తలో ఆయన మనవడు (పెద్ద కుమార్తె మాధవి కొడుకు) చనిపోయినప్పుడు కూడా ఆయన కొన్నాళ్లు మనిషిలో మనిషి లేడు. పద్మావతమ్మ గారి వేదన చూసి ఈయన మరింత దిగులుగా కనిపించే వారప్పట్లో.

అటువంటి ఒకటిరెండు సందర్భాల్లో మినహా ఆయన ఆచరణాత్మకంగానే వుండేవారు.

నాలుగేళ్ళ కిందట కేతు సర్ యింటి పక్కనే చేరిన వై.ప్రభాకరరెడ్డి (కేతు గారి స్నేహితుడు వై.సి.వి.రెడ్డి కుమారుడు)దంపతులు కూడా చివరి సంవత్సరాల్లో చేదోడువాదోడయ్యారు.

ఇటీవల నాలుగేళ్ళుగా ఆయనకు కుడి కంటిచూపు కొంత మందగించి చదవనూ రాయనూ యిబ్బంది పడేవారు. నాలుగేళ్ళుగా ఆయన రాసిన ముందుమాటలకు లేఖకున్నయినా.  ఆయన డిక్టేట్ చేస్తుంటే నేను రాసేవాన్ని.
నా చేతిరాత అంటే ఆయనకు ముచ్చట.

నన్నెప్పుడూ పొగడలేదుగానీ, ఎంవిఆర్ గురించి నేను రాసిన వ్యాసం చదివాక – ‘చెడిపోతావని పొగడలేదు గానీ, నీ వాక్యం బాగుంటుంది నాయనా! ఏమంటే నువు రాయవు. రాస్తే బాగా రాస్తావు’ అన్నారా నడుమ.

కేతు సర్ జీవితంలో యెంతమంది స్నేహితులున్నారో, యెంతమంది సన్నిహితులున్నారో తెలీదు. ఒక ‘మహా మనిషి’తో… అదీ, ఆయన చివరి సంవత్సరాల్లో… ఆ దంపతులు ఒంటరిగా వున్న కాలంలో వారితో గాఢంగా గడపగలిగిన అద్భుతం నా జీవితంలో వున్నందుకు నేనెప్పుడూ పులకిస్తూనే వుంటాను. నా సన్నిహితం ఆయనతో మాత్రమే అయితే, అది ఒక పాక్షిక సారమే అయిన ‘సాహిత్య అనుబంధం’ గానే మిగిలి పోయేదేమో! ఆయన సతీమణి పద్మావతమ్మ గారు నన్ను ‘పెద్ద కొడుకు’ అనుకునేంత ఆత్మీయం యేర్పడడం నన్ను వారి యింట్లో మనిషిని చేసింది. నా భార్య పార్వతి కూడా వారిద్దరికీ యింట్లోమనిషంత దగ్గరవడం, నా మీద వారికున్న వాత్సల్యాన్ని మరింత పెంచిందేమో!

ఎంతమంది వున్నా, తాను యెంత మందితో ప్రేమగా మాట్లాడినా, కేతు సర్ తనలో తాను ఒంటరి. ఇదీ నేను చదివిన కేతు సర్.

తన బాధలు కష్టాలు యెప్పుడూ యెవరికీ చెప్పలేదు. ఎవరికైనా యే చిన్న పని చెప్పాలన్నా మొహమాటం. నేనొక్కన్నే ఆయనను మొహమాటం నుండి దాటించిన వాన్ని.

పద్మావతమ్మ గారి సమక్షంలో మాత్రమే ఆయన యిమడగలరు. మరెవ్వరి వద్దా యిమడలేరు. తన చివరిదినాన, ‘అమ్మ’కు యేవో గుండె సంబంధ పరీక్షలు చేయాలని డాక్టర్లు చెప్పడం, గుండె పరీక్షల పరిశీలనలో వుంచడం ఆ ‘తనలో తాను ఒంటరి’ ని వత్తిడికి గురిచేసిందేమో!

‘నాయనా! డబ్బు పంపుతున్నా. మందు తీసుకుని రా! రోంతసేపు మాట్లాడుకుంటూ గడుపుదాం’ – అనే ఆత్మీయమైన పిలుపైతే నాకు వుండదిక.

*

పాలగిరి విశ్వప్రసాద్

24 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కీ.శే.‌శ్రీ కేతు విశ్వనాథరెడ్డి రెడ్డి గారి గురించి చాలా విషయాలు తెలిసాయి ఈ వ్యాసంలో. కేతు విశ్వనాథరెడ్డి గారితో పాలగిరి విశ్వ ప్రసాద్ గారి అనుభవాలు, సన్నిహితం, సంభాషణలు అపురూపమైన జ్ఞాపకాలు. కేతు విశ్వనాథరెడ్డి గారికి నివాళులు🙏🙏

  • వ్యాసం లోని ప్రతి పదం లో ఆయానపట్ల మీకున్న ప్రేమ..ఆరాధన..గురుభావన..అన్నిటికీ మించి అంతులేని సాహిత్య బంధం కొట్టొచ్చినట్లు కనిపించింది.. మీరు నేనూ ఆంధ్ర భూమి లో పని చేసే సమయం లో చాలా సార్లు మీరు ఆయన ప్రస్తావన తెచ్చేవారు…చాలా బాగా రాసారు..ఆయన గురించి..

  • జీవితం ఎప్పుడూ మాయ చేస్తూనే ఉంది. మంచి మనుషులే ఏమార్చి వెళ్ళిపోతున్నారు. మనిషి లేని దుఃఖాలు మనసు ఉన్నంతవరకు అట్లాగే మిగిలిపోతాయి. ఇందరూ ఉన్నా కొందరు లేకపోవటం ఎంతో వెలితి

  • జీవితం ఎప్పుడూ మాయ చేస్తూనే ఉంది. మంచి మనుషులే ఏమార్చి వెళ్ళిపోతున్నారు. . ఇందరూ ఉన్నా కొందరు లేకపోవటం ఎంతో వెలితి

    • ఉన్న ఆ ఒక్కరూ వెళ్ళిపోయారు. తెలుగు సాహిత్యం విలువగలిగిన మనుషులను కోల్పోతోంది.

  • కేతు సర్ అస్సలు అహంలేని మనిషి. మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతులో ధ్వనించే ప్రేమ మనల్ని కట్టిపడేస్తుంది. ‘కడపతనానికి’ ఆయన నిలువెత్తు ప్రతీక !

    విశ్వ ప్రసాద్ రెడ్డి అన్న చాలా రాయగలిగినా చాలా తక్కువగా రాసిన రచయిత ! ఇప్పుడైనా సమయం మించి పోయింది లేదు.

    మీ ఆత్మీయ జ్ఞాపకాలు చదివి సంతోషమైంది!

    • ధన్యవాదాలు.
      రాయలనే వుంటుంది గానీ రాయలేని పరిస్థితులు. పరిస్థితులు అనడం కన్నా రాయలేని తనం యేదో ఆవహించింది.
      ఇది కూడా – అఫ్సర్ గారు ‘మీ కలం మొద్దు పోయింది, యింక కదలదు’ అనేసరికి బయటికొచ్చింది.
      రాస్తాను. రాయాల్సినవి చాలా వున్నాయి. రాస్తాను.

  • లోతైన వ్యక్తిత్వ నివాళి సర్

  • కేవలం రాతల్లో మాత్రమే కాదు, మనసుల్లో కూడా తడి ఉన్న మనుషులు. అందరూ వెళ్లిపోతున్నారు. కేతు గారితో సాన్నిహిత్యం మీ అదృష్టం సార్.

    • ఔను చందూ!
      ఇప్పటికే, నేను రాయడం మొదలు పెట్టాక మేమంతా ఆరాధనగా చూసిన చాలామంది ఒక్కొక్కరూ వెళ్ళిపోయారు.

  • కేతు గారితో నాకు సన్నిహిత సంబంధం లేకపోయినా ఆయనతో కలిసి కూచొని మాట్లాడుతున్నట్లే ఉంది, వ్యాసం చదువుతున్నంత సేపూ.
    అది కూడా, అరుదైన పాలగిరి గారి శైలిలో చదవటం మరింత గాఢంగా అనిపించింది.
    కథా రచయితగా కేతు గారి గురించి అందరికీ తెలుసు. తెలియని విలువైన విషయాలతో ఇంత మంచి వ్యాసం అందించినందుకు సారంగకు, విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు.

  • ప్రసాద్ గారు మీకు కేతు విశ్వనాథరెడ్డి గారికి వున్న అనుభందం ఎంత గొప్పదో బాగా చెప్పారు. మీరన్నట్లు కేతుగారికీ ఆత్మాభిమానం
    ఎక్కువ మొహమాటం మరీ ఎక్కువ. తనకు నచ్చనవిషయాలు నచ్చని మనుషులు గురించి రచనల్లోనే చెప్పాడే గాని మరొక వ్యక్తి ని కించపరచే మాటలు ఎక్కడా అన్నట్లు లేదు.

    తన రచనల్లో ఎంత విస్తృతంగా జీవితాన్ని చిత్రీకరించాడు. నాతోపాటి అఫ్సర్ గారిని కల్పనగారిని అమెరికాలో కలిసినపుడు వామికొండ కథలు రాస్తానని మాటయిచ్చాడు. పోన్ లో అడిగినపుడు గుర్తుందనే చెప్పేవాడు. కానీ తనకు కళ్లెదుటే జరిగే మార్పులు రచనకు ప్రేరేపించివి గా లేవనే భావంలోకి వెళ్ళిపోయాడు.
    ఆయన జయంతిని జ్ఞాపకం చేసినందుకు కృతజ్ఞతలు

    • ధన్యవాదాలు సర్!
      వామికొండ కథలే కాదు, 150 యేళ్ళ రాయలసీమ గ్రామీణ పరిణామాలను నవలగా రాయాలని కూడా చెప్పారు. సబ్జక్ట్ వుందన్నారు.
      ‘డిక్టేట్ చేయండి, నేను రాస్తా’ నని కూడా అన్నాను ఒకట్రెండుసార్లు.

      • prasaad gaaru, meeru raayaali kEtu saar vadali vellina baakI rachanlau poorti chEse bhadyata tIsukOMDi

  • విశ్వప్రసాద్ గారి వ్యాసం ఆత్మీయతతో నిండిన గుండెలా ఉంది. చివరిదశలో అమూల్యక్షణాలని కేతు గారితో గడపడం అదృష్ఠం ఎంతమందికి వస్తుంది. అందులో రచయితలకి అలాటి అవకాశం దొరికితే డాక్టర్లకి స్టెతస్కోప్ దొరికినట్టే కదా. పాలగిరిగారికి కృతజ్ఞతలు. కేతు గారిని దిల్లీలో రెండుసార్లు (దిల్లీ మిత్రుల బృందం) కలిసాము. వారి కథల పుస్తకాలని చదివాము. కథల్ని చెక్కిన శిల్పి మరుగైనా మనకి కథల్ని వదిలారు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు