1
ఎందుకో అంత భయం నాకు
ఎందుకో అంత ఉత్కంఠ నీకు
ఎందుకో అంత ఆసక్తి మీకు
అట్లా నడుస్తున్నప్పుడు మన పక్కన
మన ఎదురుగా, మన వెనుక ఉన్న
ఆ పొడువాటి గోడల వెనుక ఏముందో ?
ఆ గోడలకు అటు పక్క నీవు
ఇటు పక్కన నేనూ, రెండు లోకాలుగా
ఉశ్వాస, నిశ్వాసాల ఒకే శ్వాసగా జీవిస్తాం
ఆ గోడల వెనుక ఒక పూల తోట ఉందా
చీక్కటి, చిమ్మ చీకటి పాతాళ లోకం ఉందా
ఈ గోడల వెనుక అగాధాల లోయలలో విసిరేసిన
మానవుల తీరని కాంక్షల హృదయపు వజ్రాలు
మనం ఎన్నటికీ ఎక్కజాలని ఉన్నత శిఖరాలున్నాయా?
2
ఆ గోడల వెనుక
ఆ గోడల వెనుక ఏముంది ?
గరుకు, గరుకు గోడలను తడిమి చూస్తాం
దాని సన్నటి పగుళ్ల గుండా అటు, ఇటు
విస్తరించే కాసిన్ని కిరణాల కోసం ఆశగా చేతులు చాస్తాం
అక్కడ ఆ గోడలకి
ఒక చిన్న కిటికీనో, ఒక తలుపో
చెవులో, పెదవులో, భయంలేని హృదయమో
ఉంటే ఎంత బాగుండేదో అనుకుని వగచి
దిగులు, దిగులుగా గోడలకు తలలు ఆనించి
అవి ఏ రహస్యాలు చెబుతాయో శ్రధ్ధగా వినబోతాం
గోడలు ఆకాశం దాటి, అనంతం దాకా ఉన్నాయి
ఎగిరి దూకేందుకు వీలుకాదు, రెక్కలు విరిగిపోయాయి
గోడలు పడగొట్టే శక్తి లేని అశక్తులం మనం
ఇప్పుడు, ఎప్పుడైనా
ఏముంది? ఏముంది ?
ఆ దాటజాలని ఆ గోడల వెనుక?
ఏముంది? ఏముంది?
మానవులే నిర్మించిన ఆ గోడల వెనుక
ఏ విరహపు నీటి జాడల కన్నీటి చెలిమెలున్నాయో ?
అక్కడ ఎన్నెన్ని మోహపు దేహాల సమాధులున్నాయో?
కోర్కెలను, కలలను కాల్చివేసిన బూడిద రాసులున్నాయో?
మనం ఉన్నాయని అనుకున్నవన్నీ ఎగిరి పోయి
మన లోలోని గుప్త యోచనల, వాంఛల భయాలు
మనకే తెలియని గందరగోళపు తపనలు
వెతుకులాటలు, పెనుగులాటలు, ఏకాకితనాలు
ఆ గోడల వెనుక గింగిర్లు కొడుతూ, సుడులు తిరుగుతూ
ఎన్నడూ పగలని ఆ గోడలకేసి
తలలుబాదుకు విలపిస్తున్నాయా?
3
నిత్య సంశయం వీడని పగిలిన మనసులు
అశాంతితో అల్లాడే, ఆత్మల సమాధులు
దుఃఖ, దుఃఖపు దిగులు భయాల నీడలు
విశ్వాస, శ్వాసరాహిత్య ప్రేమలు
కలియకనే విరిగిన హస్తాలు
పగిలిన నెత్తుటి పెదవుల చుంబనాలు
దేహపు ఎడారుల పై మాయ చేసే మరీచికలు
ఏమున్నాయి ఆ గోడల వెనుక ?
ఏమున్నాయి ? ఏమున్నాయి ?
నా నిశ్చింతలు, వదిలివేసిన జ్ఞాపకాలు
నీ నరక యాతనల వదలని మరణపు నీడలు
శాశ్వతంగా తుడిపేసిన మన నీటి మీద రాతలు
నా కాశీ యాత్రల వదిలివేతల భయోన్మత్త కాలాలు
ఏమున్నాయి ఆ గోడల వెనుక?
ఏమున్నాయి ? ఏమున్నాయి ?
నా సూర్యోదయాలు, వెన్నెల రాత్రులు
మన మొగలిపూల తోటల దారులు
సముద్రపు అలలపై వాలే సీతాకోకచిలుకలు
అలసిన మనసుకు పాడే జోల పాటలు
హృదయపు సౌగంధిక పుష్పాన్ని కానుక చేసి
ఇచ్చే చందమామ, తారకలు
ఎవరున్నారా గోడల వెనుక ?
నువ్వు అటు, నేను ఇటూ…
ఏవో రెండు చేతులు, అవి నీ చేతులేనేమో
ఆ గోడలను అటు, ఇటు నెడుతున్నాయి
ఇటువైపు సరిగ్గా నీ చేతుల వెనక, నా చేతులే
ఈ మసక వెలుతురులో ఎవరెవరివో
అనేక చేతి ముద్రల చూపు లేని కళ్ళు
గోడల నిండా తడి, తడిగా తాకుతున్నాయి
గోడల్ని కూల్చలేక విలపించిన విషాద గీతాలను
సారంగా, సారంగా ఏ వర్షపు రాత్రి
అట్లా దుఃఖ, దుఃఖ రాగాలై
మంచు శిఖరాల పై మంటల్ని వెలిగిస్తూ, నువు పాడకు
4
సారంగా! సారంగా!
కన్నీళ్ళతో నిన్ను వేడుకుంటాను
నా కోసం నువ్వెన్నడూ పాడకు
హృదయం ఫేటీల్న వేయి వక్కలై
నేనట్లా మంచులా కరిగి నీరై, కన్నీళ్ళయి
నన్ను నేను కోల్పోయి ప్రవహిస్తాను
వర్షపు నీటితో పాటూ
నీ చేతులు, నా చేతులు గోడలకు
అటూ, ఇటూ కౌగిలించుకున్నాయి
కలిసాయి, విడిపోయాయి, విలపించాయి
రెండు పెదవుల చుంబనాల చెరగని గుర్తులు
కలియని దేహాల నడుమ మొలచిన
బ్రహ్మజముళ్ళు, ఇనుప కంచెలు
రెండు గోడలకి అటు, ఇటూ
ఏమున్నది? ఏమున్నది?
ఒక సముద్రము, ఆకాశము
ఆకుపచ్చ నేల, కురిసే నక్షత్రాల విత్తనాలు
అటు, ఇటు ఆ గోడల వెనుక ?
రాలని రెండు కన్నీటి బొట్లు ?
ఏమున్నాయి? ఏమున్నాయి?
ఆ గోడల వెనుక?
ఏమున్నాయి? ఏమున్నాయి?
గోడలు మన మనోవికారాల, ఉల్లాసాల
ఊహల, అగోచర స్వప్నాలా?
అసలు అవి లేనే లేవా? ఎప్పుడూ? ఎక్కడా?
ఇది ఒక ఆత్మలోక సంచారుల, పరాజితుల
పలాయనుల నిట్టూర్పుల
ఎడతెగని సంశయాలా ??
*
చిత్రం: సృజన్ రాజ్
Add comment