ఆ గది

చాలా వ్యవధి తర్వాత

ఈ గది తలుపులు తీస్తుండగానే

వెచ్చటి కిరణాలు లోపల నిండుకున్నాయి

 

చెమ్మగిల్లిన కళ్ళతో

పసిదాన్ని ముద్దాడినట్లు

తడుముతూ ఏదో నింపుకుంటున్న అనుభూతి

 

ప్రేమగా కొట్టుకున్న మేకుల వలన

తడి అంటని తామరల్లాంటి గాయాలు

కొనలకు వ్రేలాడుతూ కొన్ని జ్ఞాపకాలు

 

దుమ్ముపట్టిన ఫోటో ఫ్రేముల్లో మరకల్లేని పసితనం

అల్మారాలలో దాచుకున్నవాటికి దొరికిన నేను

చిన్న కుక్కపిల్లలా గదంతా తిరుగాడుతూ మనస్సు

 

గదంతా వెలిసిన రంగులతో వెన్నెలై విరబూస్తుంటే

ప్రతీ అడుగుకీ కొన్ని యుగాలు ఆగిపోతున్నాను

బీటలు నడుమ దాచిన రహస్యాల్లో ఇరుక్కుపోతున్నాను

 

***

అంతలో ఒక కేక

నాన్నా త్వరగా ఖాళీ చేయండి

ఈ గది  బాగుచేయించి రంగులువేయించాలి !

 

నిజమే

ఈ ఇరుకు ప్రపంచంలో

శాశ్వతమైన గదులుండవు మరి

 

ప్రేమ

నిజానికి

ఒక మంచుముద్దనో గాజు బొమ్మనో

దాచుకునే పనిలోనే జీవితం గడిచిపోతుంది

 

కరిగిపోయాకో పగిలిపోయాకో

తిరిగిరాని రాత్రికోసమో ప్రేమ కోసమో

ఎదురుచూసే క్రమంలో ఋతువు మారిపోతుంది

 

పుష్టిపించే కొమ్మలు, పారాల్సిన నదులు, నువ్వు

ఇప్పుడిక ఎడారులుగా పిలువబడతారు

 

 

***

 

ఎప్పటిలాగే

వెన్నెలను నాలో నింపుతూ

మౌనంగానే మరేదో గుర్తుచేస్తావు

 

పసి పాదాలు

నా వెనుకే వస్తూ గుమ్మం వద్ద గువ్వల్లా ఆగిపోతాయి

 

ప్రేమగా పారుతూ నేను

మనమందరం కలవాల్సిన చోటుకి

మిమ్మల్ని దాటిపోతాను

***

ఒకరితర్వాత ఒకరు దేహాలు మార్చుకుంటూ

మొక్కను బ్రతికించుకునే క్రమంలో

అదే కొమ్మకు రోజుకోసారి పూస్తూ ఉంటాము

*

చిత్రం: సత్యా బిరుదరాజు 

చాంద్

7 comments

Leave a Reply to c Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవితకు సరిపోయే మంచి పెయింటింగ్ పెట్టారు .. ధన్యవాదాలు

  • కవితకు సరిపోయే మంచి పెయింటింగ్ పెట్టారు .. సత్య బిరుదురాజు గారికి ధన్యవాదాలు

  • బాగున్నాయి కవితలు రెండూ – ముఖ్యంగా భాష – తేలిక పదాలతో మనసుకు హత్తుకునే తాత్విక భావనలు చెప్పారు – అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు