ఆ కొండల మీద నాయన నడిచిన పాదాలు

ఇప్పటి తరానికి తండా తెలియదు. దానిని దృశ్యమానం చేయాలని చూశాను. అక్కడ గోచీతాతలు అల్లిన తాటినారమంచాలను బొమ్మకట్టించాను.

ప్రతి కవితదీ ఓ నేపథ్యం. నేపథ్యం అందమైన, స్వచ్ఛమైన మూలాల వైభవం కావచ్చు. గాట్లు పడిన అనుభవగాయాల తలపోత కావచ్చు. సత్యాలదర్శనం కావచ్చు. నేపథ్యమున్న కవితలు బలంగా తాకుతాయి. నా కవితలన్నీ నా జీవిత నేపథ్యాన్ని ఒరుసుకుంటాయి.
“తండా” అనే కవితను నా సిరా రాసింది. ఊరికి దూరంగా వున్న తండా వూరిలో వున్న నాకు ఎలా కవితావస్తువు అయిందీ!?, ఇలా కదిలిస్తే చాలు, నా నేపథ్యం జలపొంగుతుంది. మా తాత, నాయన, మా చాకలి వృత్తి జీవితం వున్నవాళ్లు అందరికీ, రేవుపొయ్యి పుల్లలు నరకాల్సిన పనివుంటుంది. ఆ పుల్లలకోసం మా తాత, నాయన రాత్రిపూట దూరాన వున్న కొండల్లోకి ఎడ్లబండిపై వెళ్లేవాళ్లు. లాంతరు వెలుగులో రాత్రంతా పుల్లలు నరికి, తెల్లారగానే చద్దిమూట తినేసి, ఇంటికి తెచ్చేవాళ్లు. అలా వెళ్లిన ప్రాంతంలో గిరిజన తండాలుండేవీ. ఆ తండా వాసులతో మా వాళ్లకు స్నేహముండేది. అక్కడి నుంచి చింతపండో, రోకలిబండలో, వెదురుతడికలో తెచ్చి, మా మిరపకాయలో, చుట్టపొగాకో వినిమయపద్ధతిలో పట్టుకెళ్లేవారు. ఆ దృశ్యాలన్నీ నా బాల్యపుతెరమీద ముద్రితమయ్యాయి.
కాలం ముందుకు జరిగిపోయింది. తాత మాయమయ్యాడు. నాయన కూడా మట్టికిందకు చేరాడు. కాలమప్పటినుంచీ చప్పగా మారిపోయింది. మనుషులంతా డబ్బువేటలో పడిపోయారు. మోసాలు పెరిగాయి. కూలదోయడమే తప్ప నిలబెట్టే మానవసంస్కృతి అడుగంటుతున్నది. కాలం కలతగా మారింది. పరాయికరణ మొదలైంది నాలో. వర్తమాన విషాదం నుండి స్వచ్ఛమైన అంతరంగాల శుభ్రమానవుల తండాకు వెళ్లడం మొదలు పెట్టాను. తరచుగా పచ్చని కొండలు, వాగు సమీపాన వున్న తండాకు వెళ్లడం, మాయామర్మం లేని గిరిపుత్రులతో మాటామంతీ కలిపి రావడం కోల్పోయినవన్నీ దొరుకుతున్న అనుభూతిని కలిగిస్తాయి. ఆ కొండల మీద నాయన నడిచిన పాదాలను వెతుక్కుంటుంటే, నాయన కనబడినట్టే తోస్తుంది. ఆ క్రమంలోంచీ నా తండా కవిత పురుడోసుకుంది.
కవితను స్వభావోక్తులతోనే నిర్మించాను. తండా మీద మల్లిపురం జగదీశ్ , రమేశ్ కార్తీక్ నాయక్ లాంటి కవులు విరివిగా రాసారు. నాది నాదైన చూపులోంచే వెల్లడైంది. చుట్టూతా తాడిచెట్లే, వెదురుపొదలే,ఎండుకట్టెలే. అవి విరివిగా వుంటాయి గనక తండాలోనివి తాటికిళ్లు,జీనగకంచెలు,ఆ కంచెల మీద పాదులు చిత్రించాను. బతుకుదెరువుకి కోళ్లపెంపకం, మేకలపెంపకం వుంటుంది. వాటిని పొలాల్లో పెంచరు. ఇంటిచుట్టూ దొడ్డేసి లాలిస్తారు. వారిది గొప్పదైన జీవప్రేమ.
ఇప్పటి తరానికి తండా తెలియదు. దానిని దృశ్యమానం చేయాలని చూశాను. అక్కడ గోచీతాతలు అల్లిన తాటినారమంచాలను బొమ్మకట్టించాను. ఇంకా బాలింతలు మంచినూనె వేసి కలుపుకుని తిన్న అన్నంముద్దల్ని ఆవిష్కరించాను. లేమి గలది తండా. యిలాంటి వెతలెన్నో వాళ్ల గుడిసెలనిండా.
అప్పటివన్నీ ఆముదపుదీపాలు. వాటిని తిల్లికలంటారు. వాటి వెలుగులో కాలిలో దిగిన ముళ్లు తీయడాన్ని వాళ్ల చెప్పుల్లేని పాదాలుగా  ధ్వనించాను. ఎంత చెమటోడ్చిన వాడికైనా ఊరగాయనంజు, కల్లూ పెద్ద వూరట. వెన్నెలకంచం అనడంలో ఆరుబయటి బువ్వలు తినడాన్ని పోలిక వుంది.
తండాలో కొట్టుడుపంపులుంటాయి. మన వూర్లల్లో లాగా తండాజనం నీటిపంపుల దగ్గర తగాదా పడరు. కమ్మని వూసులాడుకుంటూ బిందెలు నింపుకుంటారు. కలసిమెలసి వుండే గుణానికి తండా ప్రతీక. ఎవరూ ఎవరితో పోల్చుకోరు. అసూయపడరు. రచ్చబండ మామిడిచెట్టు వూరందరికీ పంపకమవడంలో జీవనమాధుర్యపు రహస్యముంది. మనం తండా నుంచీ చాలా నేర్చుకోవాల్సివుంది.
అక్కడ వున్న బయనేరు వాగు. దాన్ని దాటుకుంటూ ఆసుపత్రికో, సంతలకో వచ్చేవాళ్లు.అలా ఈత నిత్యావసరమైంది. అందుకే పొంగేవాగులో పిల్లలు కూడా ఈతలు నేర్చేవాళ్లు. ఆ వాగులో చేపలు పట్టేవాళ్లు తాతలు. కూరలకి కంచెమీద పాదులు, వాగులోని చేపలు వాళ్లనెంతో ఆదుకుంటాయి. పేదరికాన్ని పేదరికంగా భావించరు. రోజుల్ని హాయిగా నడుపుకోవడంలో వాళ్లు ఆరితేరినవాళ్లు. కవితలో ప్రతీవాక్యం తండా జీవనసంబురమే.
తండాపండుగ మనుషులంతా ఏకమయ్యే సందర్భం. ఆడామగా తేడాలేదు. సారా తాగి చిందేస్తారు. వూరివాళ్లం స్వార్థంతో బతుకుతాం. మనుషుల్ని కల్మషం లేకుండా తాకనే తాకం. తండాలోని శుభ్రమానవులు వూరికెంతో ఆదర్శం. అందుకే నా కవిత ప్రాధాన్యమైంది.
కవిగా నేను కల్మషరహితంగా వుండాలి గనక తండాకు వెళ్తున్నాను. ఇచ్చిపుచ్చుకునే మనస్థితిని పెంచుకుంటున్నాను.
కవిత నిర్మాణమంతా సహజశైలిలోనే సాగింది. కవిత ఫలశ్రుతి ఆధునిక జీవితాల విశృంఖలతను పోగొట్టే మెలకువ తండా. అక్కడి మనుషుల కరచాలనం అంతర్లోకాల వ్యవసాయం. పూర్తి కవితపాఠాన్ని చదవండి.

తండా

అన్నీ తాటాకు గుడిసెలు
వాటిచుట్టూ జీనగముళ్ల కంచెలు
వాటి మీద పచ్చనిపాదులు
పెంటదువ్వుతూ కోళ్లు
కొన్నిళ్ల దగ్గర మేకలదొడ్డు
కట్టెలపొయ్యి మసిగమ్మిన నల్లనితండా
తాటినారనులకతో మంచం నేసే తాత
గొడ్డుకారం దంచీ, మంచినూనె కలిపిన అన్నంముద్ద బాలింత
నిక్కరుజేజుల్నిండా చింతకాయలతో
చింపిరితల పిల్లాళ్లు
చూరుకు వేలాడుతున్న ఆముదపులాంతరు
చుట్టెల్గులో కాలిముల్లు తీసే పెద్దమ్మలు
వెన్నెలకంచంలో ఊరగాయనంజేసుకుంటూ సందకల్లుని
ఆరారగ చప్పరించే చెమటనాల్కలు
తండాదాహానికి కొట్టుడుపంపు
తగాదాలు లేకుండా
ఊసులాడుకుంటూ బిందెలు నిండుతాయి
రచ్చబండ మామిడిచెట్టు
కాసిన కాయలన్నీ తండాకి పంపకాలు
తండా పక్కనే బయనేరు
సాహసయవ్వనం ఈతలు
కొద్ది భయం వాళ్లు
బర్రెతోకలు పట్టుకుని తానాలు
కొన్ని ముడతలదేహాలు
గేలాలై దిగి కొరమీన్లు పడతారు
తెల్లమీసాలపై నమ్మకంతో
ముందే మసాల నూరే కోకలు
తండాలో పండగ
మనుషులంతా ఏకమవడమే
సారా అక్కడ నాట్యమాడుతుంది
అక్కడ తిరిగే గాలిలో
కల్మషమెక్కడా  స్పర్శించదు
అందరివీ శుభ్రమైన శ్వాసలే!
ఇచ్చి పుచ్చుకోవడమే విద్య
పస్తులెవరూ వుండరు
గుండెతుంచి వడ్డించడం నిత్యమచట
తండాలో సూర్యుడు మబ్బులు కప్పుకోడు
తండా నిండా నవ్వులు స్వచ్ఛ నక్షత్రాలు!
నాకు తండాలో మిత్రులున్నారు
వాళ్ల దగ్గరకెళ్లినపుడల్లా
జీవనవైభవాన్ని యెరుకగా ఇచ్చి పంపుతారు!
నేలమీద కల్తీకాని జాగా తండా
దాని మెడలో నా కవిత్వపుదండ!
*

మెట్టా నాగేశ్వరరావు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు