ఆరోజు నేను బడినుంచి తిన్నగా ఇంటికి వచ్చాను. మా అమ్మ పొయ్యి ముట్టించి రాత్రిపూటకి వంట వండుతోంది. నేను రావడంతోటే లేచి హడావుడిగా బయటకు బయలు దేరింది.
“కుష్ణా! అలాగ చూస్తుండు నాయనా! ఇప్పుడే వస్తాను.” అని చెప్పింది.
“ఎక్కడికి నేనూ వస్తాను” అని అడుగు ముందుకేసి ద్వారం దాటపోయాను.
“రేయ్ ఎక్కడికిరా!” గట్టిగా కేకవేసి గసిరింది. నేను ఒకక్షణం అక్కడే నిలబడిపోయాను.
“ఇప్పుడే వచ్చేస్తాను. నేను ఎక్కడికీ వెళిపోలేదు. ఇక్కడే అమ్మతల్లి గుడివరకే…కుక్కలు దూరిపోతాయి చూడు.” అంతే తీవ్రంగా అంది.
నేను అక్కడే నిలబడి చూడసాగాను. అమ్మతల్లి గుడి మా ఇంటికి వందగజాల దూరమే. మా మండవాలోకి కనిపిస్తుంది. నేను అటే చూస్తున్నాను.
అమ్మ గుడి దగ్గరికి వెళ్లి, గుడి దగ్గర కూర్చున్న ఎవరితోనో మాట్లాడుతోంది. గుడికి ఆనుకొని రెండు వైపులా గోడలు ఉండగా మిగతా రెండువైపులా మంటపము ఉంటుంది. అది ఇంగ్లీసు అక్షరం ‘ఎల్ ‘ ఆకారంలో ఎత్తుగా గచ్చు చేసి ఉంటుంది. పెంకులతో నేసిన పైకప్పే అయినా, ఆ మంటపము విశ్రాంతిగా కూర్చోవటానికి అన్ని వేళలా బాగుంటుంది.
సాయంత్రం పూట మా వీధిలోని మగవాళ్ళు చాలామంది అక్కడ కూర్చుని తీరుబడిగా కబుర్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్లి ఎవరితోనో మాట్లాడుతోంది మాఅమ్మ. రోడ్డు మీద నిలబడి మంటపము మీద కూర్చున్న ఎవరినో బతిమి లాడుతున్నట్టు కనబడు తోంది. నేను లోపలికి వెళ్లిపోయాను. మరి కాసేపట్లోనే మాఅమ్మ వచ్చేసింది.
“చూడు నాయనా! పై గడుపలో తాడు ఉంటాది పట్టుకురా” అంది వస్తూనే.
నేను గడపలోకి వెళ్లి చూశాను. పెద్ద తాప్మానిలో ఒక పారా పలుపుతాడు లాంటి తాడు ఉన్నాయి. తాడు తీసుకొని వెళ్ళాను. మాఅమ్మ చిన్న సల్లంది తపేలా తీసి శుభ్రంగా కడిగి కాసిన నీళ్లు అందులోపోసి ఓ పక్కన ఉంచింది. పొయ్యి దగ్గర కూర్చొని అగ్గి ఎగేస్తోంది. కాసేపు గడిచింది.
మా అమ్మ గుడి కాసి మళ్ళీ చూసింది. మరి కాసేపు పోయాక మళ్ళీ చూసింది. అలా మళ్ళీ మళ్ళీ అటే చూస్తోంది. ఎవరికోసమో నాకు అర్థం కావడం లేదు. లేచి ఒక చాట్లో కొంత చిట్టు (తౌడు) తెచ్చి కుడితి గోళంలో ఒంపింది.
ఇలోగా మా సీతప్ప ఇంటికొచ్చింది.
“సీత… పొయ్యి కాసి చూడూ..” అంటూ మళ్ళీ బయలుదేరింది. ఈసారి నేను మా అమ్మ వెనకనే వెళ్లాను. ఒకతన్ని చూసి
“ తాతా.. రావా!” అని పిలిచింది. అమ్మ పిలవడంతోటే ఒక ముసలతను లేచి నిలబడ్డా డు. ఆరడుగుల దాటి పొడుగ్గా ఉన్నాడు. సన్నగా తెల్లగా ఉన్నాడు. పంచెలా తెల్లనిది ఒక ఐదుమూళ్ళు గావంచా పంచెలా కట్టుకున్నాడు.పైన తెల్లటి సైను బనీను వేసుకున్నాడు. తల మీద జుట్టు కూడా తెల్లగా పండిపోయివున్నా, నూనెరాసి నున్నగా దువ్వి వెనక సిగ వేసుకున్నాడు. పాతకాలపు మనిషిలాగా ఉన్నాడు.
“పదమ్మా వస్తాను” అన్నాడు.
“పొద్దు పోతుందని” నసగుతోంది అమ్మ.
“లేదు..పదా! ఆవుకు కుడితెట్టు” అన్నాడు.
అమ్మ అక్కడినుంచి కదిలింది.
“ఎవులమ్మ ఆ తాత!?” అని అడిగాను.
“రేజేటి అచ్చన్న తాతని” ఇక్కడే మూడడ్ల దాలెమ్మ అమ్మమ్మ ఉందా! వాళ్ళ ఇంటికి తూర్పు పక్కన ఉంటాది ఆలిల్లు.” చెప్పింది.
“ఎందుకు పిలిచావా తాతని!?” అడిగాను. సందేహంగా.
“ఆవు పాలు తీయడానికి. మన ఆవుపెయ్యి సచ్చిపోయి పాలు తీయనివ్వడం లేదు. ఎవరిని పొదుము దగ్గరకు చేరనీయడం లేదు. ఎవరు దగ్గరికి వెళ్ళా తన్నేస్తోంది.
ఈ తాత ఎలాటి తిరకాసు పశువునైనా లొంగదీసి పాలు తీయగలడు. ఊర్లో అతనిలాగ ఎవరూ పాలు తియ్యలేరు. అతనికి మంచి పేరు ఉంది.” అంది.
“పోనీ పాలు తియ్యకపోతే ఏటవుద్ది.ఒదిలేయొచ్చుకదా!” అడిగాను.
“పోనీలే.. అని అలాగే వదిలేద్దాం అంటే, పాలు ఎక్కువయి ఆవుకి బాధ పెట్టేస్తున్నాయి. అది రాత్రి పగలు ఒకటే అరుపు. మన పాలమాట దేవుడెరుగు దాని బాధ అన్నా తీరాలి కదా!” చెప్పింది.
మాదగ్గర ఎర్రావు ఉంది. ఈ ఆవు తల్లి కూడా అంతకు ముందు మా దగ్గరే ఉండేది. అది చాలా మంచిది. ఎవరు పాలు తీసినపల్లక ఉండేది. అది మా దగ్గరే ఐదు ఈతలు ఈనిం దని మావాళ్ళు అమ్మేశారు.(మేము కొనకముందే ఆ ఆవు మూడు ఈత లీనిందట.) బాగా ముసిలిది ఐపోయిందని అమ్మేశారుట.
కానీ ఆ ఆవు వెళ్లిపోతుంటే నాకు చాలా బాధనిపించింది. అది నాకు బాగామచ్చికైన ఆవు.
నేను అప్పుడప్పుడు కుడితి పెట్టడం,కల్లములో వున్నపుడు గడ్డి వేయడం చేసేవాన్ని.
ఆవుకు గంగడోలు దువ్వితే దానికి ఎంత ఆనందమో చెప్పలేము. అలా పైకి మోరెత్తి మయిమరసిపోయేది .
కొనుక్కున్న వాళ్లు కన్న పట్టుకు తీసుకుపోతుంటే ఆవు కూడా అంబా! అని ఎంతో బాధగా అరిచింది. ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అప్పుడు అక్కడే ఉన్న మా అమ్మ కాసి చూశాను. మా అమ్మ కూడా చాలా బాధపడుతోందని తెలిసింది. కొంగుతో కళ్ళు తుడుచు కుంది.
“దాన్ని ఎందుకు అమ్మడం మన దగ్గరే ఉంచుకోవచ్చుకదా!” అడిగాను బాధగా.
“అది బాగా ముసలైపోయింది నాయనా! మన కళ్ళముందే చచ్చిపోతుంది. అప్పుడు అసలే చూడలేం ఇవాల్టితో దానికి మనకి రుణానుబంధం తీరిపోయింది.. అంతే” అనేసింది.
గుడి దగ్గరినుంచి ఇంటికి వచ్చాము. అప్పుడు చూశాను గోలిగోడ అంచున కుడితిగోలేము దగ్గర వున్నఆవును. ఈ ఆవు ఆపాత ఆవు తాలూకు దూడే.
ఆవు, కొయ్య దగ్గర అటు ఇటు తిరుగుతూ నులుసుకుపోతోంది.
అమ్మ చేటతో చిట్టుతెచ్చి(ధాన్యపు తౌడు) కుడితి గోలెంలో పోసింది. ఆవును కట్టు తప్పించి గోలెం దగ్గరకు తీసుకువెళ్లి కుడితి తాగించింది. అది ఏదో తాగాను అని పించింది తప్ప, ఎప్పటిలాగా శుభ్రంగా తాగలేదు. చిట్టూ తినలేదు.
తాత వచ్చాడు. తాతను చూసి తపేలా తాడు తెచ్చి అందించింది అమ్మ.
అమ్మీ! తొలిసూరు పడ్డలాగా ఉంది!? అన్నాడు.
“అవును తాతా.. దొడ్డిల పుట్టిందే. చిన్నప్పటినుంచి మచ్చికయిందే ఇప్పుడు ఈనిన దగ్గరనుంచే దీనికి ఇకారం పట్టుకుంది. ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు.” అంది
“పెయ్యి లేకపోతే అంతేనమ్మీ ఏ పశువు అయినా” అన్నాడు తాత.
“ఆ తాడు ఇలాగియ్యమ్మా!” అని తాడును అందుకొని ఆవుదగ్గరికి వెళ్ళాడు.
“ఓహో..” అని దాని వెన్నుమీద, చేత్తో ఒక దరువు గట్టిగా వేస్తూ మెడకింద వేరే చేత్తో దువ్వసాగాడు. నన్ను చూసి
“ఒరే తాతా! ఇలాగనరా..” అని ఆవుగంగడోలు చేత్తో దువ్వమని నాకు చెప్పి
,“అమ్మీ ఆ మెడకశింత గట్టిగా పట్టుకో” అని మా అమ్మకి చెప్పి, వెనక్కివెళ్లి తాడుతో ఆవు వెనకకాళ్లు రెండింటికి జోడాలేశాడు,(రెండుకాళ్ళు దగ్గరగాచేసి కట్టాడు) కొంచెం దూరంగా నిలబడి. ఆవు ఒక్కసారే తుళ్ళిపడ్డట్టు గెంతింది.
“ఓహో!” అని మళ్లీ వెన్నుమీద మరో దరువేశాడు. అంతే మంత్రం వేసినట్టు ఆవు మరి కదల్లేదు.
తపేలా తీసుకొని పొదుగును నీళ్లతో కడిగి సిరాలను పట్టుకుని ఒకటికి నాలుగుసార్లు లాగేసరికి పాలు చేపింది. సిరాలు ఉబ్బిపోయాయి. తాతకి నమ్మకం కుదిరినట్టుంది. రెండు కాళ్ళ మధ్యన తపేలా పెట్టి, కాలివేళ్ళ మీద కూర్చొని రెండు చేతులతో సుయ్.. సుయ్..మని పాలు పిండాడు.
పాలుతపేలా అందుకునేసరికి మా అమ్మమొఖం పాలకొంగులా పొంగింది. తాత ఆవు కట్లు విప్పేస్తూ “పెయ్యి ఉండాలమ్మీ..” అన్నాడు.
“వాళ్లకు చెప్పావా మరి!?” అడిగాడు.
“చెప్పేను తాతా! పదిరోజులు పడతాది అన్నారు. చర్మం బాగా ఆరాలట ఆరితే గాని పనిఅవ్వదు అన్నారు.” చెప్పింది
“అంతేలే..ఇత్తార్లే, మరేటి లేదు. అదిఉంటే అంత ఇబ్బంది ఉండదు. ఇదిగూడ తల్లే కదా! పిల్ల మీద ప్రేమ ఉంటాది.” అనేసి
“వస్తాను మరి” అన్నాడు తాత.
“నాలుగు పూటలు రావా! నాయన్నాయనా!” అని బతిమిలాడింది.
“అలాగేలే” అనేసి వెళ్ళిపోయాడు. అన్నాడే గాని ప్రతిరోజు ఒకటికి నాలుగు సార్లు, పిలిస్తే గాని వచ్చేవాడు కాదు ఆ తాత.
ఈ ఆవు ఈనిన తర్వాత సరిగా పాలు తియ్యనివ్వలేదు. పోన్నే అనేసి వదిలేశారు. ముర్రుపాలు కూడా నిండార తియ్యలేదు. దాంతో పెయ్యి ఎక్కువ తాగేసి పుర్రుగా పారేసేది. దాని వల్లనో లేక మరే జబ్బువల్లనో గాని నెలరోజులు దాటగానే పెయ్యి చచ్చిపోయింది. చేసేది ఏమీలేక హరిజన పేటకి కబురు పెట్టిందమ్మ. అక్కడి నుంచి వచ్చిన ఇద్దరు మనుషులు దాని నాలుగు కాళ్లు కలిపి కర్రకు వేలాడేసి కట్టి భుజాలపై మోసుకెల్లారు. వాళ్లతో మాట్లాడి కొన్ని డబ్బులు కూడా ఇచ్చింది అమ్మ. ఇది జరిగి నాలుగైదు రోజులే అయింది.
తెల్లారి నాలుగు గంటలకు లెగిసి మజ్జిగ తిప్పడం మా అమ్మకు అలవాటు. తాత పాలు తీసిన మరునాడు తెల్లవారి కూడా అలాగే తిప్పింది. బాగా తెల్లారినాక ఒక ముంతనిండా మజ్జిగ పోసి
“ కుష్ణా! ఇదిపట్టుకెల్లి, నిన్న వచ్చాడుకదా తాత! ఆతాత ఆల ఇంట్లో ఇచ్చేసి రా…” అంది.
నాకు వెళ్ళడానికి సిగ్గు, మొహమాటం. నిన్నే ఆతాతను చూశాను. వాళ్ళ ఇంట్లో మిగతావాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆమాటే అన్నాను.
“వాళ్ళ ఇంట్లో ఎవరూ ఉండరు. ఈ తాత, ఆ అయ్యమ్మ ఇద్దరే ఉంటారు” అంది.
“ఏం..!?” అంటే
“ఆలకి పిల్లల్లేరు” అంది.
“ఒక్కరోజు పాలు తీసినదానికే మజ్జికి ఇవ్వాలా!?” అన్నాను. నాకు వెళ్లడానికి ఇబ్బందిగా అనిపించి.
మాఅమ్మకు కోపం వచ్చింది.
“ఆ పెద్దకబుర్లు మానేసి తిన్నగ పట్టుకెళ్లు. వచ్చీ పోతేనే సుట్టరికం, ఇచ్చీ పుచ్చు కుంటేనే బందరికం అని, ఒకలు మనకు సాయం చేసినప్పుడు మనకు సేతనైన సాయం మనమూ సెయ్యాలి.” అంది కొంచెం గట్టిగా.
చివరికి ఎలాగైతేనే వెళ్లక తప్పలేదు నాకు. అలా నాలుగైదు రోజులు వెళ్ళాను. ఓరోజు మా సీతప్ప పట్టుకెళ్ళింది. అలా ఒక వారం గడిచింది.
ఓ రోజు ఎప్పుడు లాగే పట్టుకెళ్తున్నాను. ఓ కుర్రాడు రోడ్డుకి అడ్డంగా పరుగెత్తుకొస్తూ నన్ను గుద్దేశాడు. దెబ్బకు నా చేతిలో ముంత జారిపడి పోయింది. మజ్జిగ అంతా నేలపాలు అయింది. నా గుండె గుభేల్మంది. మా అమ్మ తిడతాదో కొడతాదో అని.
నేను చూసుకోలేదు. ఆ కుర్రాడు నన్ను చూడలేదు. ఆడి గాభరాలో ఆడు పరుగెడు తున్నాడు. ఆకుర్రాడు అసలు ఆగలేదు. తనెవరో కూడ నేను చూడలేదు. నేనేమి అనలేదు. ఆకుర్రాడు నాకంటే కొంచెం పెద్దోడులా ఉన్నాడు.
ముఖం వేలాడేసుకుని ఇంటికి వచ్చాను. విషయం చెప్పేసరికి మా అమ్మ అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది.
“ఎందుకూ పనికిరావు. పిసరంత గడుసుతనం లేదు. ఇప్పుడు ఎలా సవ్వడం. నిన్న పాలు విరిగిపోయి మజ్జిగలేక ఇవ్వలేదు. ఈవేళ ఇవ్వకపోతే ఆ తాత రేపు రమ్మంటే వస్తాడా!” అంది. అని మా కోసం ఉంచిన మజ్జిగలోనే, మరిన్ని నీళ్లు పోసి తొరిపింది.
ఈసారి మళ్లీ ఎత్తేసిరా! నీ కాళ్లు రెండూ ఇరగ్గొడతాను అంది. నేను భయపడుతూనే వెళ్లాను. వెళ్లి వచ్చాను. నా కాళ్ళకి ఏమీ అవ్వలేదు.
అయితే ఆ సాయంత్రమే హరిజన పేట నుంచి వచ్చినవారు బొమ్మ పెయ్యిని తెచ్చి ఇచ్చారు. చచ్చిపోయిన పెయ్యి చర్మంతో చేశారు బొమ్మ. దాని లోపల వరిగడ్డి కుక్కి కుట్లు వేసినట్టు ఉన్నారు. నాలుగు కాళ్లకు బదులు నాలుగు కర్రలు దూర్చి కట్టి అచ్చం ఆవుపెయ్యిలాగే తయారుచేశారు.
బొమ్మనుచూసి ఆవు ఆనంద పడింది. అది చూసి మాఅమ్మ సంతోష పడింది.
“అన్నా! బతికించారు” అంది. ఆ బొమ్మ తెచ్చిన వాళ్లను చూసి. వాళ్లకి ఇవ్వవలసిన మిగతా డబ్బులు ఇచ్చింది.
ఆ మర్నాడు నుంచి మా సూరన్నయ్య(సూర్యనారాయణ, మా రెండో అన్నయ్య) పాలు తీయడానికి ప్రయత్నించి సఫలం అయ్యాడు.)
అంతే…
మేము మరి తాతను పిలవలేదు. ఆతాత రావడం మానేశాడు. మా అమ్మ మజ్జిగ ఇవ్వడం మానేసింది.
***
కాకతాళీయ బంధాలు వస్తు మార్పిడి… చివరి ముగింపులో అవసరార్థం బంధాల ని తేల్చేసారు
గిరిప్రసాద్ గారు మీ స్పందనకు ధన్యవాదాలు సార్. లోకమంతా అంతేకదాసార్,ఇచ్చి పుచ్చుకోవడమన్న సూత్రమ్మీదే నడుస్తోంది. కొన్ని సంబంధాలలో ప్రస్ఫుటంగా బయటకు కనిపిస్తాయి.కొన్నిచోట్ల బయటకు కనపడవు అంతే తేడా.ఏదీ ఒకవైపు ఉండదు.