ఈ సంచిక నుంచి పతంజలి శాస్త్రి గారి రెండవ కథల ప్రుస్తకం “నలుపెరుపు” సంకలనంలోని ‘ఆర్వీచారి కరెంటు బిల్లు’, ‘నెమలి కన్ను’ కథలని చూద్దాం.
ఆర్వీ చారి ఈ పదిరోజుల్లో కాలిఫోర్నియా వెళ్లిరావడం ఇది రెండోసారి. ఆఫీస్ లోపలి రాగానే జి ఎమ్ గారు పిలిపించి అతని భుజాన్ని పిండి కంపెనీ ఆనందాన్ని అతనితో పంచుకున్నాడు. చారి వెంట ఆయన గదిలోకి ఒక డాలర్ ప్రవాహం రావడం చూశాడాయన. ఇద్దరి ముఖాలు ఇంకా ఎవరూ ముట్టుకోని కొత్త వంద డాలర్ నోట్లలా మెరిసిపోయాయి. సంతోషం, వెచ్చటి వెలుతురూ, వలయంలా వాళ్ళిద్దరి చుట్టూ పరుచుకుంది.
మర్నాడు ఆఫీస్ బాయ్ అలీ కరెంటు బిల్లు కట్టిన రసీదు, మిగతా చిల్లర చారికి ఇచ్చాడు.ఇచ్చి ఏమనుకోకండి సార్,
‘బిల్లు చూసిండ్రా సార్?’.
‘చూడకుండా పైసలు ఎలా ఇస్తా?’ అన్న చారి జవాబుకి
‘బిల్లు చాలా అవుతోంది, మీరు నాలుగు నెలలనుంచి చూడకుండా డబ్బులు ఇచ్చేస్తున్నారు’, అని సందేహిస్తూ చారి కి చెప్పాడు. చాలా ఎక్కువబిల్లు ఎన్ని పైసలు ఇస్తారు సార్, ఆ బిల్లు కట్టిన డబ్బులు నాకు మూడు నెలల జీతం తో సమానం, అని వెళుతూ వెళుతూ అలీ అన్న మాటలు వీపుమీద సూదుల్లా గుచ్చుకున్నాయి చారికి.
ఇప్పుడు బిల్లు చూస్తున్న తనకి ఆశ్చర్యంగానే వుంది. ఇంటికి వచ్చి భార్యతో అన్నాడు మూడు నెలల నుంచి చాల ఎక్కువ కరెంటు బిల్లు అవుతోంది, మనకు అందులో సగం కూడా అవ్వదు, పాత బిల్లులు పట్టుకురా చూద్దాం అన్నాడు.
బిల్లులు ఎక్కడా కనబడలేదు. వీపులో సూది మరీ పెరిగింది. ఏ ఖర్చులు ఎంతెంత అవుతున్నాయో పట్టించుకోలేనంత లెక్కలేనితనం.
టీవీలో కరువు, దుర్భిక్షం దృశ్యాలు చూస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక కంట్లో భూతద్దం పెట్టుకుని బంగారపు పని చేసే తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడప్పుడు కంచు గ్లాసు లో సగ్గుబియ్యం పరవాన్నం పెట్టే తల్లి కూడా గుర్తొచ్చింది. ఒక సారి సెలవులకు వచ్చినప్పుడు అమ్మకేమీ బాగోలేదు అని చెప్పాడు నాన్న.
‘బాగా బలం గా వుండే ఆహారం రెండుపూటలా పెడితే, లేచి బాగా తిరుగుద్దంటా’ అన్నాడు తండ్రి. ఆమె లేచి తిరగలేదు.
కూరల ధరలు అమ్మని గుర్తు చేసాయి. ఇంట్లో ఏవీ వండాలనిపించలేదు అంది భార్య. తిండి కోసం లాంగ్ డ్రైవ్ లో చైనీస్ రెస్టారెంటు కి వెళ్లారు. ఎప్పుడూ పట్టించుకోని మెనూలో ధరలు అలీ సూదిని మరింత లోపలికి గుచ్చాయి. మర్నాడు కూరల వాడు తెచ్చిన కూరల ధరలు కూడా ఆశ్చర్యంగా మొదటి సారి చాలా ఎక్కువగా అనిపించాయి. ఏ కూర ధర ఎంతో ఆమెకు తెలీదు తనకూ తెలీదు. ఆలీ సూది అలాగే ఉండిపోయింది. సాయంత్రం ఇంటికి వస్తూ పళ్ళ దుకాణం దగ్గర ఆపి పళ్ళు కొన్నాడు, ఆశ్చర్యంగా కారెక్కుతుంటే తనతో పాటు కొన్న వ్యక్తి కొన్న ధరకి తాను కొన్న ధరకి తేడా ఆలీ సూదిని మరింత గుచ్చింది. కారులోంచి దిగి కొంటే అంతే సార్ అన్న వెక్కిరింత కూడా ఇబ్బంది పెట్టింది.
అందరూ మనని మోసం చేస్తున్నారని రాత్రి భార్యతో అన్నాడు. ప్రతి రోజు మెట్లుక్కుతూ అలీ కోసం చూడ్డం అలవాటైపోయింది. ఆలీ సూది లోపల పెరుగుతోంది. గత ఐదు రోజుల్లో చారి జీవితం అసంకల్పితంగా అలీ చుట్టూ తిరుగుతోంది. సాయంత్రం డిపార్ట్మెంటల్ స్టోర్ నుంచి వచ్చిన నెల సరుకుల బిల్లు కూడా చాలా ఎక్కువైనట్లు అనిపించింది. మెత్తగా నిశ్శబ్దంగా వేగంగా తిరిగే ఫాను హఠాత్తుగా చిన్న శబ్దం చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చారి పరిస్థితి అలా వుంది. శబ్దం ఎక్కడనుంచి వస్తోందో తెలీదు. చెవులు బద్దలయ్యేది కాదు కానీ రాకూడని శబ్దం, ఉపేక్షించి ఊరుకోలేని శబ్దం. గత ఐదేళ్ళలో ఎప్పుడూ లేనిది అమ్మ గుర్తొస్తోంది. ఇంజనీర్ అవ్వకుండానే తల్లి పోతే, ఇంజనీర్ ఐన వెంటనే తండ్రి పోయాడు.
ఓరోజు మధ్యాన్నం పేపర్ పెన్సిల్ తీసుకుని లెక్కలు వేసాడు చారి. తీసేసి, కొట్టేసి, కలిపేసి, మళ్ళీ తీసేసి చాలా ముక్కలైన జీవితాన్ని ఎనిమిది ముఖ్య భాగాలుగా చేసాడు. కొన్ని అంకెల్లో కుదించిన తరువాత రెండు విషయాలు అర్థం అయ్యాయి మొదటిది తనకు పరిచయమైన అంకెలకు వీటికి సంబంధం లేదు. రెండోది మొత్తం, విడిగా ఇతర లెక్కల తో సంబంధం లేకుండా లేదు. అతని కాగితం లో జీవితం కొన్ని అంకెలకు ఒకలాగా మరికొన్ని అంకెలకు ఒకలాగా కనిపించింది. చీకటి పడింది నెక్లెస్ రోడ్డులో కారాపి పల్లీలు కొనుక్కుని బెంచి మీద కూర్చున్నాడు.ఇలా పల్లీలు కొనుక్కుని తిని చాలా ఏళ్లైపోయింది. ఒక్కొక్క పల్లి నోట్లో వేసుకుని చాలాసేపు కూర్చుంది పోయాడు. పల్లీలు బాగున్నాయి కారంగా. పల్లీలు వాడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతూ వాడు, బాగుండడం కూడా తీసుకెళ్లిపోయాడు. రాత్రి భార్యను అడిగాడు చారి, “మామూలుగా సుఖంగా సంతోషంగా ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది?”
***
నెమలి కన్ను
కిటికీ పూల తెర ఒక అరంగుళం తొలగిస్తే ఇంటి ముందు భాగం అంతా కనబడుతుంది. స్థలం కొనుక్కుని ఇంటి ముందూ వెనుక జాగా ఉండాలని, చెట్లు పెంచుకోవాలని అన్నపూర్ణ పట్టుదల. ఆమె అనుకున్నట్లు గానే, రెండు సందుల కూడలిలో, చెట్ల మధ్య ఇల్ల్లు, ఆపక్కనే స్కూలు. కృష్ణ మూర్తి బ్యాంకు లో పని చేస్తూంటాడు. అన్నపూర్ణ తెర కొంచం తప్పించి చూసింది. గోడవతల నవ్వుకుంటూ గొడవ చేస్తున్న పిల్లలు. ప్రహరీ గోడకు దగ్గరగా జామ చెట్టు నిత్యం కాస్తూనే ఉంటుంది. పిల్లలు సైకిల్ ఎక్కి కర్రతో జామకాయలు కొడుతూనే వుంటారు. వాళ్లకు తోడు ఆడపిల్లలు. రాళ్ళేసి మామిడికాయలు కొడుతుంటారు. కాయలు పంచుకునే పిల్లలు కొట్టిన వాడి సాహసానికి కేరింతలతో జై కొడతారు.
అన్నపూర్ణకు నలభై ఏళ్ల నవ్వు వచ్చింది. రోజూ ఇవన్నీ తెర చాటున చూస్తూనే ఉంటుంది. ఆడపిల్లలకి ఎప్పుడైనా పూలు కోసి ఇస్తుంటుంది. అన్నపూర్ణకు వీధిలో పిల్లల మొహాలన్నీ తెలుసు. కొంతమంది మొహాలు మరీ ఎక్కువ ఇష్టంగా తెలుసు. పిల్లల కోసం కాసినట్టు కొమ్మలు ఎప్పుడూ నిండుగా ఉంటాయి. కృష్ణ మూర్తి కి మాత్రం తరచుగా పిల్లల్తో యుద్ధం అవుతూనే ఉంటుంది. పిల్లలు ఆలా కాయలు కోసుకోడం కృష్ణ మూర్తి కి డిసిప్లేన్ లేని తనం గా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇంట్లో ఉంటే కృష్ణ మూర్తి ఆ పిల్లలని చూడగానే మావోయిస్టులను చూసిన పోలీసు అయిపోతాడు. గేటు దగ్గర పుర్రె ఎముకల గుర్తులా నిలబడతాడు.
అన్నపూర్ణకు మాత్రం ఏడాదంతా కొనసాగే ఈ పిల్లల ఋతువంటే ఇష్టం. అల్లరి ఋతువు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. పెద్దాళ్ళయి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళేం చదవాలో, ఎక్కడ చదవాలో, ఏం ఉద్యోగం చెయ్యాలో కృష్ణ మూర్తి నిర్ణయించేవాడు. పిల్లల డిసిప్లేన్ విషయం లో ఇద్దరికీ చాలా వాద వివాదాలు అయ్యేవి కానీ కృష్ణ మూర్తే నెగ్గాడు. ఓ రోజు అనుకోకుండా మధ్యాన్నం ఇంటికి వచ్చిన కృష్ణ మూర్తి కి కాయలు కొడుతున్న పిల్లలు దొరికేసారు. చాక చక్యంగా అన్నపూర్ణ కృష్ణ మూర్తి బారి నుంచి వారిని విడిపించింది.
ఐతే కృష్ణ మూర్తి గోడ మీద ఇనుప కంచె వేయడానికి నిశ్చయించుకున్నాడు. తెలిసున్న మేస్త్రీ ఉంటే వెంటనే పురమాయించాడు కూడా. కాయలు కొట్టుకునే పిల్లలకు ఆ కంచె గుచ్చుకుని సెప్టిక్ అవుతుందేమో అని భయ పడింది అన్నపూర్ణ. అనుకున్నట్లుగానే మర్నాడు ఇద్దరు పనివాళ్ళు వచ్చారు. మేము ఊరెళ్తున్నాం ఊరినుంచి రాగానే చెప్తాం అని చెప్పి పంపించేసింది. మేస్త్రీ మనుషులు వచ్చి పోయిన సంగతి వారం పోయాక యధాలాపంగా అడిగాడు అడిగాడు కృష్ణ మూర్తి, గుర్తులేదు అంది అన్నపూర్ణ. అలా మాట్లాడుకుంటుండగానే పిల్లలు కాయల కోసం విసిరిన రాయి కిటికీ కి వచ్చి తగిలింది.
కృష్ణ మూర్తి బయటకు వెళ్లి చూస్తే ఎవరూ కనబడలేదు,
పారిపోయారు రాస్కెల్స్ అన్నాడు. అమ్మయ్య అనేసింది ఆమె !
‘కుర్రాళ్ళని చంపుతాననుకున్నావా, రెండు తగలనివ్వకపోతే డిసిప్లేన్ ఎలా వస్తుంది, ఏమిటో తలకాయ లేకుండా మాట్లాడతావు’ అన్నాడు.
ఆలోచిస్తూ ఉండిపోయింది అన్నపూర్ణ.
అతను ఎదో అడిగిన దానికి సమాధానంగా ఆమె అంది-
మానాన్న మమ్మల్ని చాలా డిసిప్లేన్ లో పెంచాడు, ఏం తినాలో, తినకూడదో, ఏ బట్టలు వేసుకోవాలో, అన్నీ అయన ఇష్టాలే మా ఇష్టాలు. ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లినా కొన్ని కండిషన్లు ఉండేవి. ఎక్కడి వస్తువులు అక్కడే ఉండాలి. నాకు అన్నయ్యకు పదో ఏడూ వచ్చేసరికే పాతికేళ్ళు నిండాయి. అంటూ చెప్పుకొచ్చింది.
అయినా పిల్లలు కాయలు కొనుక్కోలేక కాదు, ఇంట్లో కొనరని కాదు, ఆ గోడ ఎక్కి మనకు తెలియకుండా కాయల కొట్టుకునే సంతోషం కొంటే రాదు.
మీరు పిల్లలకు ఎప్పుడూ మీకు వచ్చిన ఫస్ట్ రాంక్ గురించే చెప్తుండేవారు కానీ మావయ్యగారి సైకిల్ దొంగతనంగా తీసుకువెళ్లి మోకాలుచిప్పకు దెబ్బ తగిలించుకుని, ఆయనతో రెండు పీకించుకున్న విషయం చెప్తే కలిగే సంతోషం వేరు.
ఆ రాయి విసిరిన కుర్రాడు, ఫ్రెండ్స్ అందరిలో చిన్న హీరో అయిపోతాడు. వాడికి పెళ్లయ్యాక పిల్లలతో కూర్చుని ఓ బ్యాంకు మేనేజర్ గారి చెట్ల కాయలు దొంగతనంగా ఎలా కొట్టాడో, కిటికీ గ్లాస్ ఎలా పగిలిందో, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ చిలవలు పలవలుగా కల్పించి చెప్తాడు. ఇటువంటి జ్ఞాపకాలు లేని చిన్నతనం ముసలి తనం లాంటిది. అందుకే మనం ఎక్కువుగా చిన్నప్పటి సంగతులు చెప్పుకుంటాం. అందుకే కుర్రాళ్ళని నేను ఏమి అనను,వాళ్ళు గోడెక్కడం చూస్తూనే వుంటాను, నవ్వుకుంటుంటాను.
ఆ మేస్త్రీ మనుషుల్ని నేనే వెళ్లి పొమ్మన్నాను.
*
చిన్నచిన్న సంఘటనల వెనుక పెద్దపెద్ద జీవిత సత్యాలు దాగి ఉంటాయని పతంజలి శాస్త్రి కథలు మనకి తెలియజేస్తాయి. వాటిని ఒడుపుగా పట్టుకుని లాఘవంగా ప్రదర్శించగల నేర్పు ఆయనలో మెండుగా ఉంది. అలాగని ఆయన రాసిన ఏ రెండు కథలూ ఒకేలా ఉండవు. మీ పరిచయానికి ధన్యవాదాలు!