“బారెడు పొద్దెక్కింది. లెగు నాయనా. మా తండ్రి కదూ” అమ్మ మాటలతో దేవుడికి మెలకువొచ్చింది.
అయిష్టంగా లేచి కూచోని కళ్లు నులుముకుంటూ “కాసేపాగి లేస్తాలేవే” అని మళ్లీ పడుకున్నాడు.
“రోజూ యిదే తంతు. పొద్దున్నే లేపు. చాలా ముఖ్యమైన పనుంది అంటాడు. తీరా లేపబోతే గంటా రెండు గంటలపాటు పక్క మీద మెసులుతానే వుంటాడు” ముద్దుగా విసుక్కుంది అమ్మ. “అవున్లే పాపం. వాడు మాత్రం ఎంతని సుడిపడతాడు. ఒకళ్లా యిద్దరా ఎనిమిదొందల కోట్ల మంది. అందరి బాగోగులూ వొక్కడే చూసుకోవాలి. రాత్రి ఎన్నింటికి పడుకున్నాడో ఏవిటో” అంతలోనే వుసూరుమంది తల్లి మనసు.
మళ్లీ నిద్రలోకి జారుకుంటూ అప్పటివరకూ కంటున్న కలని కంటిన్యూ చేశాడు దేవుడు. కలలో మనుషులంతా ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. పక్కవాళ్లకి యిబ్బంది కలిగించడం లేదు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడడం లేదు. ‘చెట్టు నుండీ యిప్పుడే కోసి తెచ్చిన కాయలండోయ్’ అని నమ్మబలుకుతూ వర్షానికి రాలిపోయిన మామిడికాయల్ని అమ్మడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఏ కష్టాలూ లేకపోయినా జనాలు దేవుణ్ని తలుచుకోవడం మానడం లేదు. ఆహా, జీవితం ఎంత సుఖంగా వుందీ అనుకున్నాడు దేవుడు. అంతలోకి మళ్లీ అమ్మ పిలుపు వినబడింది.
“లేపకపోతే ఎందుకు లేపలేదని గోల గోల చేస్తావ్. ఆ మనుషుల్ని చూడు చక్కగా అలారం పెట్టుకోని ఎప్పుడు అవసరం అయితే అప్పుడు టక్కున లేచి కూచుంటున్నారు. ఎందుకొచ్చిన బాధ, నేనూ అక్కడికే పోతా” అమ్మ మాటలకి అంత నిద్రలోనూ నవ్వొచ్చింది దేవుడికి. భూమ్మీద అయినా పిల్లల్ని లేపగలిగే ఫైనల్ అలారం అమ్మ మాత్రమేననీ చెపుదామనుకున్నాడు. “అసలిదంతా కాదు. నీకు పెళ్లి చేస్తే కానీ నా ప్రాణానికి సుఖముండదు. మొన్నామధ్య ఆల్ఫాసెంటారీ నక్షత్ర కుటుంబం వాళ్లు అడిగినప్పుడే ఊ కొట్టి వుండాల్సింది. నాదే పొరపాటు.” మాట్లాడుతూనే వుంది అమ్మ.
పెళ్లి అన్నమాట వినగానే వులిక్కిపడి లేచి కూచున్నాడు దేవుడు. దెబ్బకి మత్తు వదిలిపోయింది. దిండు కింద వున్న నోట్ పాడ్ తీసి “ఆల్ఫా సెంటారీ నక్షత్రాన్ని బ్లాక్ హోల్ లో కలిపేయాలి” అని రాసి, అమ్మ కంట్లో పడకుండా మళ్లీ దిండు కింద పెట్టేశాడు. అయినా యింకా గుండె దడ తగ్గలేదు. అమ్మ అవతలికి పోయేవరకూ ఆగి, మళ్లీ నోట్ పాడ్ తీసి, యిందాక రాసిన వాక్యానికి ఎర్రపెన్నుతో అండర్‌లైన్ చేశాడు. అప్పుడు గానీ దేవుడి మనసు కుదుటపడలేదు.
బద్ధకంగా ఆవులిస్తూ కంప్యూటర్ ముందుకొచ్చి కూలబడ్డాడు. రోజు మొత్తంలో తనకి ఎక్కువ అయిష్టమైన పని యిదే. పొద్దుపొద్దున్నే కొన్ని కోట్ల మెయిల్స్ చెక్ చేసుకోవాలి. లక్కీగా మనుషుల లెక్కలో వొక క్షణం తనకి వంద సంవత్సరాలు అయ్యేట్లు సాఫ్ట్వేర్ సెట్ చేసుకున్నాడు కాబట్టీ సరిపోయింది. లేకపోతే భూమ్మీద జనాలు తనని బతకనిచ్చేవాళ్లా?
“గాడ్ ఎట్ ద రేట్ ఎవ్విరీ మెయిల్ డాట్ ఎవ్విరీ డొమైన్” అనే తన మెయిల్ ఐడీ వోపెన్ చేయాలని ట్రై చేశాడు. ‘పాస్ వర్డ్ తప్పు’ అంటూ గదమాయింపు కనబడింది. పాస్ వర్డ్ ఏం పెట్టిందీ దివ్యదృష్టితో గుర్తు చేసుకుందాం అనుకున్నాడు గానీ అది చాలా చిన్నతనంగా అనిపించింది. రాన్రానూ మెమరీ పవర్ తగ్గిపోతోందని తానే కావాలని దివ్యదృష్టిని టర్న్ ఆఫ్ చేశాడు. కానీ రేపటి వరకూ ఆగితే యింకొన్ని కొత్త మెయిల్స్ వచ్చి పడతాయి. ఏం చేయడం చెప్మా? అప్పుడు తట్టిందొక దివ్యమైన ఆలోచన. ఒక్కో క్షణం వంద సంవత్సరాలు అనే లైన్ ఎడిట్ చేసి, ‘రెండొందల సంవత్సరాలు’ అని టైప్ చేశాడు. పీడా వదిలింది. ఇప్పట్లో మెయిల్స్ జోలికి పోనక్కర్లేదు.
*****
“ఈ పూట నాన్ వెజ్ వొండట్లేదు. ‘లాటిన్ అమెరికా క్వీజీన్ విత్ ఆఫ్రికన్ వైన్’ ఓకేగా నీకు?” అడిగింది అమ్మ. “అదేంటి. ఈ రోజు వంట డ్యూటీ నాది కదా? నువ్వెలా డిసైడ్ చేస్తావ్?” కోపం నటించాడు దేవుడు. “నిన్ను నమ్ముకుంటే పని తెమిలినట్టే. చటుక్కున రెండు ముద్దలు తినేసి, హాయిగా ఏదో వొక పుస్తకం చదువుతా వొక కునుకు తీయాలని వుంటుంది నాకు. నిన్ను వంటింట్లో వదిలిపెడితే వో పట్టాన బయటకి రావు. అయినా నీ వంట నాకు నచ్చట్లేదు. కుకింగ్ సెక్షన్ మొత్తం నాకు వదిలెయ్యి. లేదంటే, ఎవరిది వాళ్లే వండుకుందాం” మేండేట్ పాస్ చేసింది. “అసలీ గోలంతా ఎందుకు? ఏది కావాలంటే అది ఠకీమని సృష్టిస్తాగా నేను” అందామనుకున్నాడు. కానీ, ‘ఆర్గానిక్ లైఫ్ స్టయిల్ – ఉపయోగాలు, పరిమితులు’ అనే విషయం మీద అమ్మ మళ్లీ వుపన్యాసం యిస్తుందనే భయంతో ఆగిపోయాడు. మరీ తప్పనిసరైతే తప్ప దేవుడు తన మహిమల్ని సొంతానికి వాడుకోగూడదనేది ఆమె సిద్ధాంతం.
“ఒకసారి ఆ ఆల్ఫాసెంటారీ వాళ్ల సంబంధం కదలేసి చూద్దామా?” సందేహిస్తూనే అడిగింది అమ్మ. “ఆ సంగతి తర్వాత మాట్లాడదాంలే గానీ, నేనెళ్లి వొక చిన్న మెయిల్ పెట్టొస్తా. నువ్వీలోపు గిన్నెలు రెడీ చెయ్యి. తినేసి సినిమా చూద్దాం” చెప్పాడు దేవుడు.
“ఏం సినిమా?” భయంగా అడిగింది.
“నీ ఇష్టం. కేజీయఫ్ ఛాప్టర్ త్రీ చూస్తావా?”
“ఒద్దు. అది రిలీజయ్యాక రివ్యూలు చదివి గానీ దాని జోలికెళ్లను. అదిరిపోద్దని వూదరగొట్టి మొన్నిలాగే యింకా షూటింగు కూడా మొదలవ్వని అదేదో దిక్కుమాలిన సినిమా చూపించావ్. అయినా ఫిక్షన్ సినిమాలు నా వల్ల కాదు. ఏదో వొక రియల్ స్టోరీ చూద్దాం” అనుకుంటూ వంటింట్లోకి వెళ్లింది అమ్మ.
దేవుడు హడావుడిగా బెడ్రూంలోకెళ్లి, తలుపు దగ్గరగా వేసి.. “ఆల్ఫా సెంటారీ గోస్ యింటూ బ్లాక్ హోల్” అని టైప్ చేసి, ఎంటర్ బటన్ నొక్కాడు. “నక్షత్రాన్ని కృష్ణబిలంలోకి పంపే ఆప్షన్ ని మీరు యుగానికి వొక్కసారే వుపయోగించుకోగలరు. కొనసాగించమంటారా?” అడిగింది కంప్యూటర్. కసిగా నవ్వుతూ ఓకే ప్రెస్ చేశాడు దేవుడు.
“ఎక్కడా?” హాల్లోంచీ అమ్మ గొంతు వినబడింది. “వస్తున్నా” అని వొక కేక పెట్టి, ‘ఆల్ఫా సెంటారీ స్టేటస్’ అని గూగూల్లోకొట్టి చూశాడు. “డజ్ నాట్ ఎగ్జిస్ట్” అనే మూడు ఇంగ్లిష్ పదాలు చూడగానే దేవుడికి చాలా ముచ్చటేసింది. ఇకనుండీ కిరుండీ, టిగ్రిన్యా, న్యాంజా, అరబిక్ భాషలు మానేసి ఇంగ్లిష్ లాంగ్వేజ్ మీదే ఫోకస్ చేయాలి అనుకున్నాడు. కంప్యూటర్ షట్ డౌన్ చేసి హాల్లోకొచ్చి అమ్మ పక్కన కూలబడి, టీవీ రిమోట్ ఆమె చేతికిచ్చాడు. “తెలుగు ఫ్యామిలీ డ్రామా రియల్” అని వాయిస్ కమాండ్ యిచ్చింది అమ్మ. వీడియో మొదలైంది. రెండు నిముషాలు గడిచేసరికి యిద్దరూ పరిసరాలు మర్చిపోయి అందులో లీనమైపోయారు.
*****
“ఐదెకరాల పొలం, రెండు లక్షల క్యాషూ, పదిహేను కాసుల బంగారం అందరికీ సమ్మతమేగా” అడిగాడు మధ్యవర్తి. పెళ్లికూతురి తల్లిదండ్రులు కృష్ణారావు, లక్ష్మి యిబ్బందిగా తలూపారు. “ఇవాళ నిద్ర లేచిన వేళావిశేషం. ఎవరి మొహం చూశారో ఏంటో. నక్క తోక తొక్కినట్టే వుంది మీ యోగం. బంగారం లాంటి అమెరికా సంబంధం చవకలో కొట్టేశారు. టైమూ” దీర్ఘాలు తీస్తున్నాడు మధ్యవర్తి. నిజానికి అతగాణ్ని మధ్యవర్తి అని పిలవడం కరెక్ట్ కాదు. అతనెవరో కాదు, పెళ్లికొడుకు మావయ్యే. ఇరు పక్షాలకీ ఆమోదయోగ్యమైన నిర్ణయం చేస్తున్నట్టు నటిస్తున్నాడులే కానీ, ఫైనల్ గా ప్రతిదీ బావగారికి అనుకూలంగా వుండేట్లు సర్దుబాటు చేస్తున్నాడు. అదేమంటే మాటకి ముందొకసారి వెనకొకసారి అమెరికా వెళ్లాక అమ్మాయి ఎంత సుఖపడుద్దో గుర్తు చేస్తుంటాడు.
ఆ అబ్బాయికి ఏడాది బట్టీ సంబంధాలు చూస్తున్నారు. ఏ అమ్మాయి జాతకమూ సూటవ్వలేదంట. పైగా అమ్మాయి పల్లెటూరి మొద్దులా వుంటే కుదరదనీ, అమెరికాలో అందరికీ గర్వంగా చూపించుకునేట్లు వుండాలనీ అబ్బాయి పట్టుబట్టాడు. పెళ్లిచూపుల్లో మొత్తం ఇంగ్లిషే మాట్లాడాడు కూడానూ. చివరికీ అమ్మాయి నచ్చింది. నిర్ణయం చెప్పడానికి పట్టుమని నాలుగురోజులు టైమ్ కూడా తీసుకోలేదు. నెల తిరక్కముందే పెళ్లి అయిపోవాలని డిసైడయ్యారు అబ్బాయి వాళ్లు.
కూతురి జాతకం గొప్పదని మురిసిపోతున్నాడు కృష్ణారావు. మధ్యవర్తి మాట్లాడిన ప్రతిమాటకీ అవునన్నట్టు తలాడిస్తున్నాడు. కానీ లక్ష్మికి మాత్రం అతని వాలకం ఏమంత రుచించడం లేదు. అబ్బాయి తరపువాళ్లు ఏదో తమని వుద్దరిస్తున్నట్టు పోజు కొట్టడం ఆమెకి నచ్చలేదు. అనుకున్న దానికన్నా ఎక్కువ కట్నమే రాబట్టారు. “పోన్లే ఎంతకాలం. ఇంకొక్క నెల. ఆ తర్వాత నా కూతురు ఆడింది ఆటా పాడింది పాటా” అని సరిపెట్టుకుంటోంది.
“సరె, మరి సారె సంగతేంటి?” అడిగింది అబ్బాయి మేనత్త విజయ.
“ఇంతా అంతా అనేం లేదు. తర్వాత ఆలోచించుకొని, మా తాహతు బట్టి ఏదో పంపుతాం” అంది లక్ష్మి.
“తాహతుదేముంది లేండీ. ఉందనుకుంటే వుంటది. ఒద్దనుకుంటే వుండదు. అసలు మాకు కట్నం కంటే సారె ముఖ్యం. ఇదేమంత పెద్ద వూరు కూడా కాదు. తిప్పికొడితే నాలుగొందల గడప. అందరికీ పంపాల్సిందే” షాకిచ్చింది విజయ.
“కట్నం కన్నా సారె ముఖ్యం అనుకున్నవాళ్లు” అనుకున్నవాళ్లు ఐదెకరాలు పొలం కావాల్సిందే అని ఎందుకు పట్టుబట్టారు’ అడుగుదామనుకుంది లక్ష్మి. భర్త తన వైపు సీరియస్ గా చూడడం గమనించి ఆవేశం కంట్రోల్ చేసుకుంది. అప్పటివరకూ సైలెంటుగా కూర్చున్న పెళ్లికొడుకు బాబాయి మొదటిసారి నోరిప్పాడు. “నువ్వు చెప్పాల్సింది చెప్పావుగా. వాళ్లని ఆలోచించుకోనివ్వు. ఇంటికెళ్లాక ఫోన్లో అయినా మాట్లాడుకోవొచ్చుగా” చెల్లెలికి సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. ఆయన సత్తెకాలపు మనిషి. ఈ సంబంధం ఆయనకి బాగా నచ్చింది. చిన్న చిన్న విషయాల దగ్గర పట్టింపుకి పోతే పెళ్లయ్యాక మళ్లీ వొకళ్ల మొహాలు వొకళ్లు ఎలా చూసుకుంటాం అని ఆలోచిస్తున్నాడు ఆయన.
“నీకు తెలియదు. నువ్వూరుకో అన్నయ్యా. ఇలాంటి విషయాల్లో ముసుగులో గుద్దులాట పనికిరాదు. మనం మాత్రం ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయలేదా? ఎక్కడా లేనిదా ఏంటి? నాలుగొందల గడపకీ సారె పంపాల్సిందే. అందులో గిఫ్టు కనీసం రెండొందలకి తగ్గకూడదు. పసుపు, కుంకం, జాకెట్టు ముక్క ఎలాగూ వుండేవే. స్వీట్లు కనీసం మూడు రకాలుండాలి..” చెప్పుకుపోతోంది విజయ.
లక్ష్మికి కళ్లు తిరిగిపోతున్నాయి. ఈ లెక్కన సారె వొక్కటే రెండు లక్షలు దాటేట్టుంది. ఇంకా పెళ్లి ఖర్చులు?
*****
అక్కడివరకూ చూడగానే దేవుడికి చిర్రెత్తుకొచ్చింది. ఇక్కడ కూడా పెళ్లి గోలేనా? అసలు యీ వీడియో రేండమ్ గా సెలెక్ట్ చేసిందా, వ్యూహాత్మకంగా ముందే ప్లాన్ చేసి రెడీగా వుంచిందా? అమ్మ వైపు అనుమానంగా చూశాడు. ఆవిడ మొహంలో ఏ భావాలూ పలకడం లేదు. వీడియో పాజ్ లో పెట్టి, “ఇక చాల్లే, తర్వాత చూద్దాం. నాక్కొంచెం పనుంది” అంటూ లేచి నిలబడ్డాడు. అమ్మ ఏమీ మాట్లాడకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. మామూలుగా అయితే స్టోరీ మొత్తం అవ్వాల్సిందే అని పట్టుబడుతుంది. దేవుడికి జాలేసింది. అమ్మ పక్కన జారగిలబడి “ఏమైందే” ప్రేమగా అడిగాడు. “పాపం లక్ష్మి. ఆ మొగుణ్ని చూడబోతే అతగాడికి ఏమీ పట్టనట్టుంది. ఎలా సమర్థించుకొస్తుందో ఏంటో పిచ్చి తల్లి” అమ్మ కళ్లలో నీటి పొర చూడగానే దేవుడికి మనసు వికలమైంది.
“అది కాదే అమ్మా. తప్పు అబ్బాయి తరపు వాళ్లది మాత్రమే కాదు. మనుషులు చాలామంది అలాగే వుంటారు” అంటూ సర్ది చెప్పబోయాడు. తన మాటలు ఆమెని సంతృప్తి పరచడం లేదని దేవుడికి అర్థమవుతోంది.
“అసలీ మాయదారి సంత కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకోవడం దండగ. మొత్తాన్నీలేపేసి మళ్లీ ఫ్రెష్షుగా మొదలెట్టు. బిగినింగులో అదేదో అంటావుగా ‘లైట్ బి దేర్ లెట్’ అని. అదేనా? ఆ మాట అను” కోపంగా చెప్పింది అమ్మ.
“లైట్ బి దేర్ లెట్ ఏంటే?” అయోమయంగా చూశాడు దేవుడు. ఆమె అంటున్నదేంటో అర్థం కాడానికి రెండు క్షణాలు పట్టింది. “అది లైట్ బి దేర్ లెట్ కాదు. లెట్ దేర్ బి లైట్! అయినా, నువ్వు యీ మధ్య ఇంగ్లిష్ సినిమాలు బాగా చూస్తున్నట్టున్నావ్. లేపేయడం ఏంటి వయొలెంట్ గా” పగలబడి నవ్వాడు దేవుడు. అమ్మకి కూడా నవ్వొచ్చింది. కానీ బుంగమూతి భంగిమలో నుండీ బయటకి రాలేదు.
“నీతో కన్నీళ్లు పెట్టించిన లక్ష్మి ఐదేళ్ల తర్వాత ఏం చేయబోతోందో చూడు” అని వీడియో రెజ్యూమ్ చేసి, ఫార్వర్డ్ కొట్టాడు దేవుడు. అంతకుముందు సీన్లో “ఈ లెక్కన సారె వొక్కటే రెండు లక్షలు దాటేట్టుంది. ఇంకా పెళ్లి ఖర్చులు?” అని మనాది పెట్టుకున్న లక్ష్మి ఫోన్లో అమెరికాలో వున్న కూతురితో మాట్లాడుతోంది.
****
“తమ్ముడి పెళ్లి సంబంధం ఫైనల్ చేయడానికి రేపు వెళుతున్నాం. బ్రోకర్ చెప్పిందాన్నిబట్టి చూస్తే కాస్త పీనాసి మనుషుల్లాగే వున్నారు. సారెలోకి ముష్టి మూడొందల గిఫ్టు పెట్టడానికి తెగ నీలుగుతున్నారట. ఈ వేషాలు నా దగ్గర కాదు. నేను మాత్రం ఆడపిల్లకి పెళ్లి చేయలేదా ఏంటి?”
“ఒద్దులేమ్మా. పాపం వాళ్లకేం యిబ్బందులున్నాయో” ఫ్లాష్ బ్యాక్ యింకా మర్చిపోలేదు అమెరికా పిల్ల.
“నీకేం తెలీదు, నువ్వూరుకో. మంచికి పోతే సంచి పోయిందని శాస్త్రం. ఐదొందల గడపకీ మూడొందల గిఫ్టు చొప్పున ముక్కు పిండి వసూలు చేయకపోతే నా పేరు లక్ష్మే కాదు..”
*****
వీడియో పాజ్ లో పెట్టి, “ఇప్పుడర్థమైందా” అడిగాడు దేవుడు.
“నిజమేరోయ్. ఎవరూ తక్కువ తిన్లేదు. ఈళ్ల సంగతి యిట్టా కాదు. భూగోళం మొత్తాన్నీ ఏ బ్లాక్ హోల్లోకో నెట్టెయ్యి” అంది అమ్మ. బ్లాక్ హోల్ అనగానే దేవుడు గతుక్కుమన్నాడు. తాను చేసిన చిలిపి పని అమ్మకి తెలిసిపోయిందా? తెలిస్తే తన పని గోవిందా. “సర్లే, నాక్కాస్త పనుంది. ఒక గంట వరకూ నన్ను డిస్టర్బ్ చేయబాకు” అంటూ అక్కణ్నించీ బెడ్రూంలోకి జారుకున్నాడు. సిస్టమ్ ముందు కూచోని, మెయిల్ పేజ్ వోపెన్ చేసి “ఫర్‌గాట్ పాస్ వర్డ్” అని కొట్టి, కొత్త పాస్ వర్డ్ ఏం పెట్టుకుందామా అని ఆలోచించాడు. ఇందాక వీడియోలో లక్ష్మి అన్న మాటలు గుర్తొచ్చాయి. “మంచికి పోతే సంచి పోయింది” అని టైప్ చేశాడు. ‘స్ట్రాంగెస్ట్ పాస్‌వర్డ్ యు హేవ్ ఎవర్ యూజ్డ్’ అని మెచ్చుకుంది కంప్యూటర్. అమ్మ కూడా యిలాంటివే ఏవేవో పిచ్చి సామెతలు చెపుతుంది గుర్తు చేసుకున్నాడు దేవుడు. అలా తలుచుకున్నాడో లేదో యిలా ప్రత్యక్షమైంది అమ్మ.
“ఒక గంట వరకూ డిస్టర్బ్ చేయొద్దన్నానా. బోలెడంత వర్క్ పెండింగులో వుంది నాకు. ఇంతలోకే ఏమొచ్చింది” విసుక్కున్నాడు దేవుడు.
“ఏడిశావ్ లే వెర్రి నాగన్నా. నీకు అంత ముంచుకుపోయే పనేమీ వుండదని నాకు తెలుసులే గానీ, మళ్లీ మర్చిపోతా, విను. నీకు సంబంధం వచ్చింది ఆల్ఫాసెంటారీ నుండీ కాదు. ప్రాగ్జిమా సెంటారీ నక్షత్రం నుండీ. పొద్దున ఎందుకో కన్ఫ్యూజ్ అయ్యాను. ఇదిగో వాళ్లే లైన్లో వున్నారు. రేపే రమ్మని చెపుతున్నా” అంది అమ్మ.
“పేంపరిగ్ ఎక్కువైపోయింది నీకు. ఎంత అమ్మవైతే మాత్రం దేవుడంటే బొత్తిగా భయం లేకుండా పోవచ్చా. అయినా, వాళ్లు లైన్లో వుండగానే నువ్వు నన్ను పిచ్చినాగన్నా అంటే వాళ్లు నా గురించి ఏమనుకుంటారు?”
“మ్యూట్ లో పెట్టాను లేరా. నువ్వు పిచ్చినాగన్నవి కాదు వెర్రినాగన్నవి. అయినా ఏంటి అనుకునేది వాళ్ల బొంద. నాతో ఎక్కువ తక్కువ మాట్లాడారంటే పాలపుంతలో వున్న ప్రతి నక్షత్రానికీ సారె పంపాలని చెపుతా” తన జోకుకి తానే విరగబడి నవ్వుతూ వెళ్లిపోయింది అమ్మ.
తనకి సంబంధం వచ్చింది ఆల్ఫా సెంటారీ నుండీ కాదా? ప్రాగ్జిమా సెంటారీ నుండీనా? “నక్షత్రాన్ని కృష్ణబిలంలోకి పంపే ఆప్షన్ ని మీరు యుగానికి వొక్కసారే వుపయోగించుకోగలరు. కొనసాగించమంటారా?” అనే మాటలు రకరకాల ఫాంట్స్ లో డాన్సు చేస్తూ తనని చూసి నవ్వుతున్నట్టు అనిపించింది దేవుడికి. కంప్యూటర్ ఎత్తి నేలకేసి కొట్టడానికి రెడీ అవుతూ “లైట్ దేర్ బి లెట్” అని కోపంగా అరిచాడు. “లైట్ దేర్ బి లెట్ కాదు. లెట్ దేర్ బి లైట్ అనాలి. అయినా ఈ రోజు సాయంత్రం ఏడింటి నుండీ తొమ్మిదింటి వరకూ పవర్ కట్. నువ్వెంత అరిచినా లైట్లు రావు, పోవు. అన్నట్టు, యీసారి రంజాన్ పండక్కి లక్షవొత్తుల నోము నోచుకుందామనుకుంటున్నాను. కిందటిసారి మాదిరిగా సింథటిక్ దూది నా మొహాన పడెయ్యకుండా ఆర్గానిక్ దొరుకుద్దేమో ట్రై చెయ్యి” హాల్లోంచీ అమ్మ గొంతు నింపాదిగా వినబడుతోంది.
*
Hilarious.. enjoyed thoroughly 🤣
దేవుడు, దేవుడమ్మ మధ్య ఆర్గానిక్ సంభాషణ బాగుంది.
Best of your stories. ఇది మీరు మాత్రమే రాయగల ప్రత్యేకమైన కథ. కథ ఏదైనా దానికి మీరు జోడించే sense of humour readability పెంచుతుంది. మొదటి నుండి చివరి వరకు ఆసక్తిగా చదివించిన కథ. Loved that phrase ‘మంచికి పోతే సంచి పోయింది’ ☺️
wonderful experiment. Enjoyed it well. Awesome story Sridhar ji. Congratulations.
New thought and successfully narrated